“యుగయుగాల నింకా బూమ్మీద జనాలని పట్టి పీడిస్తా, ఆడిస్తా పాడిస్తా, పరవసింపచేస్తా వుండే మాట ఏదినా?”
“దేవుడు అనే మాటరా”
“దేవుడా?”
“ఊరా”
“ఈ మాట మంచి మాట కదనా?”
“చెడ్డ మాటని నేను అంటినారా?”
“అట్లని కాదునా, మడి (మరి) బూలోక జనాలు ఈ మంచి మాట గురించి ఏచన చేసి ఏమైనా చెప్పిండారానా?”
“దానికేం బాగ్యం శానా జనాలు శానా మాటలు చెప్పిండారు ఈ మంచి మాట గుట్టు యిప్పిండారురా”
“అవునా…. నా.. అదేమో రవంత బిర్నా (తొందరగా) చెప్పునా?”
“మన దేశములా, ప్రపంచములా శానా మంది గురువులు ఈ మాటని పట్టుకొని మాటల మూట పేర్సిండారు, మూటల కోటలు కట్టిండారురా”
“అబ్బా అబ్బబ్బా”
“చెప్పేది యినరా”
“ కా నీనా”
“మన దేశముల అయితే ఆది గురువు శంకరాచార్యులు ఈ మాటకి తనమాటగా… నేను సత్యం, నాలా దేవుడుండాడు, మిగతా అంతా మిత్య అనె. ఆ మీట వచ్చిన మద్వాచార్యులు నేను వేరే (మనిషి) ఆ మాట వేరే (దేవుడు) అనె. ఇదేమాట సాయిబుల ఖురానులాను వుంది అదేమంటే దేవుడు ఒకడే……. మనిషి వేరే – దేవుడు వేరే అని. ఇంగ కిరస్తానము వాళ్ల ఏసు సామి ఆ మాటని (దేవుడు) నేనే, అంతా నేనే అని చెప్పే. ఒగ బుద్దబగవానుడు మాత్రము ఈ మాట తంటకి పోలే మనిషిని మనిషిగా బతకమని చెప్పెరా”
“ఏమినా ఇది ఒగ మాటని పట్టుకొని ఇంద్రు ఇన్ని యిదాలుగా మాట్లాడిండారు ఏవరి మాట యినేదినా?”
“రేయ్! నువ్వు ఈ బూలోకానికి మనిషిగా బతకేకి వచ్చిండావు. నీ బతుకు నువ్వు బతుకు అట్లే నీ చుట్టు వుండే వాళ్లని బతకనీ అది సాలు. నీ పుట్టుకకి అదే పెద్ద అర్ధము పరమార్ధము. మాటలు, మాటల మూటలు, మూటల కోటల గురించి నీకేమిటికిరా”
“అట్లంటావానా?”
“ఊరా”
“నీ మాట నిజమేనా కాని నాయన్నము (మనస్సు) ఆ మాట గురించినా అసలు కత తెలుసుకోవాలని బలే బెమ (కోరిక) పుడతా వుందినా.”
“మంచిదిరా నువ్వు మంచి ఎన్నముతో ఆలోచించి ఆ ‘మాట’ గుట్టు యిప్పితే నాకు ఇనాలని వుందిరా”
“సరేనా”
“కానిరా”
***
తంటకి = జోలికి