[box type=’note’ fontsize=’16’] ‘అడవి చెప్పింది మిస్’ అనే ఈ కథలో అడవులు ఎందుకు నశిస్తున్నాయో, మానవులు చేస్తున్న తప్పులేంటో వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]
[dropcap]అ[/dropcap]నగనగా ఒక దట్టమైన అడవి. కాకులు దూరని కారడివి. అంటే వెరీ వెరీ థిక్ ఫారెస్ట్.
“ఎక్కడుంది? ఎక్కడుంది?”
“చాల చాల దూరంలో. అల్లంత దూరంలో”
“మనుషులు చేరే దూరమా?”
“కాదు కాదు. వద్దు వద్దు. ఎవ్వరూ చేరలేని దూరంలో”
“మనుషులు చేరలేని దూరమా? విచిత్రం”
“చాలా దూరంగా ఉన్న అడవి. ఎంతో పచ్చగా ఎత్తుగా గొడుగులా ఆకాశం కనపడనంత ఎత్తులో పెరిగిన చెట్లు ఉన్న అడవి.”
“అడవి అంటే?”
“అడవి అంటే చెట్లు, గలగలపారే నదులు, జలపాతాలు, సరస్సులు, వెరైటీ ఫ్లవర్స్, ఫ్రూట్స్, వాటి సువాసనలు, మకరందాలు, తేనెలు… అదే నెక్టర్, హనీ.”
“ఇంతేనా?”
“ఓహ్. ఎన్నో రకాల జంతువులు.”
“జంతువులు. యు మీన్ యానిమల్స్?”
“అవును. జంతువులే కాదు వెరైటీస్ అఫ్ ఇన్‌సెక్ట్స్, క్రీచర్స్, బర్డ్స్, నీటిలో ఉండే జీవులు… ఫిష్ లాంటివి లెక్కపెట్ట లేనన్ని. కొన్ని మీకు తెలిసినవి చెబుతాను. విను.”
“మీకు తెలిసిందే అడవికి రాజు సింహం.”
“కరెక్ట్”
“కుందేళ్లు, పులులు, జింకలు, ఏనుగులు, బర్డ్స్, నెమళ్ళు, అడవి దున్నలు, సీతాకోక చిలుకలు, చిలకలు, పావురాలు, పాములు, చీమలు, కోతులు, ఎలుగుబంట్లు, ఇలా ఎన్నో ఎన్నెన్నో” అంది అడవి తల్లి.
“మరి కోతి పిల్లలు లేవా?”
“ఉన్నాయిగా. నువ్వు ఉన్నవుగా” అని నవ్వింది అడవి
“అవును ఇన్ని ఉంటే అడవికి కష్టం కాదా? అందరికి ఫుడ్ ఎలా?” అని అడిగింది కోతి పిల్ల.
“no worries . అందరికి కావాల్సినంత food చాలా ఉంది. నీకు కావాల్సిన పండ్లు అన్ని ఉన్నాయికదా.”
“అవును. చాలా రకాలు దొరుకుతున్నాయి” అంది పిల్ల కోతి.
“గడ్డి తినే జంతువులకు లెక్కలేనంత గ్రాస్ ల్యాండ్స్… పచ్చ గడ్డి మైదానాలు. చెట్లు చెలమలు… మకరందం తాగే కీటకాలకు బోలెడంత నెక్టర్, లెక్క లేనన్నిసువాసనల పూలు. నీటి లోని చేపలు లాంటివాటికి కావాల్సినంత ఫుడ్, వాటర్. పక్షులకు ఫుడ్ గింజలు, ఇన్సెక్ట్స్. ఇలా ఎవరికీ కావాల్సినంత ఫుడ్ వాళ్లకు దొరుకుతున్నది కదా! అంతే కాదు పక్షులు, జంతువులు తిని పడేసిన గింజలు వానలకు మొలకెత్తి అడవి పెద్దగా అయ్యింది. అవుతుంది” అంది అడవి.
“అవును. ఇది పెద్ద అడవి.”
“నేను అదే అడవి పెద్దగా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా?”
“తెలుసు. థిక్ ఫారెస్ట్ ఉంటే ఎండ ఉండదని, వానలు బాగా పడతాయని, నదులు, జలపాతాలు భలేగా ఉంటాయి. చల్లని వాతావరణం… కూల్ క్లైమేట్ ఉంటుందని అమ్మ చెప్పింది” అంది పిల్ల కోతి.
“అవును… అడవి రూల్స్ పాటిస్తూ నేను, మీరందరు ఆనందంగా ఉన్నప్పుడు, మన హ్యాపీనెస్ చూడలేని మనిషి! మనిషి!” అని కోపంగా అంది అడవి.
“మనిషి? అదెవరు? కొత్త జంతువా?” అని భయంగా చెట్టు వెనక్కి నక్కి అడిగింది పిల్ల కోతి.
నీకు మనిషి తెలీదా ?మొన్న నువ్వు అరటి తోటలోని అరటి పళ్ళు తెంపితే నిన్ను రాళ్ళతో కొట్టి గాయపరిచారు. వాళ్ళే మనుషులు” అంది అడవి.
“ఓహ్! మనుషులంటే వాళ్లేనా? ఇంకెవరో అనుకున్నాను. చాల చెడ్డ వాళ్ళు.”
“అవును. వాళ్ళ గ్రీడ్/స్వార్థం వల్ల మీరు, జంతువులూ, నేను అడవి, గాలి నీరు అందరం చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళు నష్టపోతున్నారు. హమ్! వాళ్లకి తెలిసిన పట్టించుకోవటం లేదు” అంది బాధగా, కోపంగా అడవి.
“అదెలా?” అంది పిల్ల కోతి.
“ఎలాగంటే అడవిని వ్యవసాయం, మైనింగ్, రిసార్ట్స్, రోడ్స్ లాంటి వాటికోసం నరికి చదును/ఫ్లాట్ చేస్తున్నారు కదా. ఇంకా నీటిలోకి రసాయనాలు/కెమికల్స్ వదిలి తాగటానికి పనికి రాకుండా చేస్తున్నారు. ఆ నీళ్ళే తాగాల్సి వస్తే బోలెడు రోగాలు. అడవులు తగలబెట్టి గాలిని కలుషితం/పొల్యూట్ చేస్తున్నారు. ఆ గాలి వల్లే అనేక రోగాలు వాళ్లకి.”
“అడవి తల్లీ, మనుషులు ఎప్పుడు ఇలాగే ఉన్నారా?” అంది పిల్ల కోతి.
“లేదు. ప్రకృతి సృష్టిలో గాలి, నీరు, అగ్ని, నేల, అడవి, జీవులు ముందు పుట్టాయి. ఆనందంగా ఉన్నాయి. చాలా చాలా సమయం తరువాత మనిషి లాంటి వాళ్ళు పుట్టారు.”
“తరువాత?” అంది పిల్ల కోతి.
“ఏముంది? ముందు మీలాగే అంటే జంతువుల్లా దొరికింది ఏరుకుని తినేవాళ్లు. కొన్నాళ్ల తరువాత వాళ్లకి కావాల్సింది జంతువులను కొట్టి చంపి తిన్నారు.”
“ఆ తరువాత?”
“తిండి కోసం వెతకటం వద్దని తిండిని పండించుట నేర్చుకున్నారు” అంది అడవి.
“అవునా? ఎవరు నేర్పారు?” అడిగింది పిల్ల కోతి.
“ఇంకెవరు, ప్రకృతి. చెట్ల గింజలు మొలిచి అలాంటి పంట ఇవ్వటంతో వాళ్లకి గింజలు నేలలో నాటితే కొన్నాళ్ళకి కావలసినంత తిండి వస్తుందని అని అర్థం అయ్యింది. అలా ఒక చోటే ఉండి వ్యవసాయం మొదలుపెట్టారు. తరువాత ఇంకేముంది మనకి తిండి, ఉండే చోటు దొరకని పరిస్థితి. మన సంఖ్య తగ్గి మనుషులు పెరిగారు” అంది అడవి విచారంగా.
“మేము అదే జంతువులం వాళ్ళు ఉండే చోట్లో ఉండలేమా?” అంది అమాయకంగా పిల్ల కోతి.
“వీలు కాదు. మనిషికి ధైర్యంతో పాటు భయాలు ఎక్కువే. చిన్న క్రిమి నుండి పెద్ద ఏనుగు వరకు ఎవ్వరిని తనకి నష్టం అనుకుంటే బతకనివ్వరు. నిన్ను రానిచ్చారా? పోనిలే అని పండు ఇచ్చారా? లేదే” అంది అడవి.
“అడవులు తగ్గిపోతుంటే వేరే అడవికి వెళ్లలేమా?”
“కొంత మంది వెళ్లారు. కొంత మందిని చంపేశారు. నీకు తెలుసా కొన్ని నెలల క్రిందట ఆస్ట్రేలియా అనే చోట నాలాంటి హ్యాపీ ఫారెస్ట్‌ని తగలబెట్టారు. లక్షల జంతువులూ, క్రిములు చచ్చిపొయ్యాయి. అన్ని అడవుల్లో అన్ని జంతువులూ ఉండలేవు. ఆహరం దొరకదు. వాతావరణం మార్పు వల్ల ఎండలు, వానలు, వరదలు, అడవులు తగలబడిపోవటం, ప్రమాదాలు వస్తున్నాయి” అంది ఏడుస్తూ అడవి.
పిల్ల కోతి కూడా ఏడిచింది. పాపం!
“మనుషులకు మనం చెప్పలేమా?”
“కుదరదు. ఎవ్వరి మాట వినరు. వాళ్లకి కష్టమే అన్నా మానరు. మాకు కష్టం వస్తే అప్పుడు చూద్దాం అనుకుంటారు. మూర్ఖులు” అంది అడవి.
“మరి ఎలా? మనకు మంచి రోజులు రావా?” అని అడిగింది పిల్ల కోతి.
“తప్పక వస్తాయి. మనుషుల ఆలోచన మారితే, మనకి మంచి. కొంతమంది పర్యావరణం మంచి కోసం చెట్లు నాటి అడవులు పెంచుతున్నారు. నీటిని కాపాడటానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు మరోసారి ప్రకృతిలో భాగంగా అనుకోవాలి. నీలాంటి ఒక చిన్నారి పాప అదితి అడవి చెట్ల గురించి ఎంత బాగా చెప్పిందో విను.”
“విన్నావా?”
“విన్నాను.”
“నిరాశ వద్దు. పొద్దుపోతోంది. చీకటి పడితే ఇబ్బంది. త్వరగా ఈ పండ్లు తీసుకుని ఇంటికి వెళ్ళు. అమ్మ ఎదురుచూస్తుంది.”
“ధన్యవాదాలు. మనుషులు మీరు మా దగ్గరకు రావద్దు. మేము హ్యాపీగా ఉన్నాము. రావద్దు రావద్దు” అని గట్టిగా అరుస్తూ చెట్ల కొమ్మలు పట్టుకుని వేలాడుతూ ఇంటికి పరుగెత్తింది పిల్ల కోతి.