[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 5” వ్యాసంలో కె. బసవనపల్లి లోని ‘శివాలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
కె.బసవనపల్లి
[dropcap]అ[/dropcap]నంతపురం జిల్లా, హిందూపురం సమీపంలోనే, లేపాక్షికి వెళ్ళే దోవలో వుంది కె.బసవనపల్లిలో శివాలయం. ఇది గూగుల్ సెర్చిలో దొరికింది కాదు. అసలు కొన్ని ఊళ్ళల్లో ఆలయాల గురించి మనకి తెలియదండీ. వాటిలో కొన్ని ఆ ప్రాంతాల ఇతర ఆలయాలలోనో, ముఖ్యంగా టాక్సీ డ్రైవర్ల ద్వారానో తెలుస్తుంటాయి. కొన్నేమో మనం వెళ్ళే దోవలోనే కనబడి రా రమ్మని పిలుస్తాయి. ఇలా అనుకోకుండా ఎక్కువగా చూసిన వాటిని మేము ముద్దుగా బోనస్ అని పిల్చుకుంటాము. ప్రతి ట్రిప్‌లో కనీసం ఒకటి రెండన్నా బోనస్‌లు లేకపోతే ఏమిటో బోసిగా వుంటుంది.
ఈ ట్రిప్‌లో బోనస్ మొదటి రోజే తగిలింది. విదురాశ్వధ్ధంలో సాయంకాలం 5 గంటలకి లేపాక్షికని బయల్దేరామా. లేపాక్షి ఆలయం అంతా చూడటానికి వెలుతురు వుంటుందో లేదోనని ఒకపక్క ఆందోళనగా వుంది. మరోపక్క 15 నిమిషాలు ప్రయాణం చేశామో లేదో, కుడి పక్క ఆలయం లోపలనుంచి పెద్ద శివుడి విగ్రహం… మమ్మల్ని రా రమ్మని పిల్చింది. దోవలో కనబడిన అంత పెద్ద శివుణ్ణి కాదని ముందుకేం వెళ్తాం? ఇంక మా కారు అంగుళం కూడా ముందుకు కదలనని మొరాయించింది. సమయం తక్కువ వుంది కనుక అర్జంటుగా చూసి రావాలని కారు దిగి గబగబా ఆలయం లోపలకెళ్ళాము.
లోపల పెద్ద శివుడి విగ్రహమేకాకుండా అనేక శివలింగాలు ప్రతిష్ఠించబడి వున్నాయి. 60 ఏళ్ళ క్రితం ఇక్కడ చిన్న శివాలయం వుండేదిట. చాలామందికి దాని గురించి తెలియదుట. 5 సంవత్సరాల క్రితం నుంచీ దానిని అభివృధ్ధి చేస్తున్నారు. దానిలో భాగమే ఇదంతా. ఇప్పుడు దోవన పోయేవాళ్ళకి ఎవరూ చెప్పకుండానే తెలుస్తోంది.
5-15కి కె.బసవనపల్లిలో ఆగిన మేము 5-25 కల్లా మళ్ళీ బయల్దేరాము. సమయంతో పరిగెత్తాలికదా మరి. అసలు ఆకర్షణ లేపాక్షి ముందు వుంది.