దృశ్యం

0
3

[dropcap](ల[/dropcap]ఘు) నాటిక

(నాటికలోని పాత్రలు : రాజేష్, యామిని: రాజేష్ భార్య, బాబి- (6 సంవత్సరముల వయసు), మానస (8 సంవత్సరముల వయసు) : రాజేష్ యామినిల పిల్లలు.

నాంది : రాజేష్ ఒక ప్రవేట్ కంపెనీలో పని చేస్తుంటాడు. ఒకరోజు ఆఫీసునుంచి అలసిపోయి ఇంటికి వచ్చి సోఫాలో విశ్రాంతిగా కూర్చుంటాడు……. ఇక

(ప్రదేశం : రాజేష్ ఇల్లు ) ; (ప్రవేశం : రాజేష్)

ప్రథమ అంకం : 1 వ రంగం

రాజేష్ : ఏవోయ్ ! కాస్త వేడి వేడి కాఫీ ఇవ్వు ( భార్యని సంభోదిస్తూ చెప్తాడు)

యామిని : ఇదిగో తెస్తున్నానండీ (లోపలి నుంచే జవాబిస్తుంది)

(సోఫాలో వెనక్కి వాలి కాలు మీద కాలు వేసుకుని కూర్చుని జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి గుండెలనిండా పొగ పీల్చి రింగులు రింగులుగా పొగ వదుల్తుంటాడు రాజేష్. ఇంతలో అతడి ఆరేళ్ళ కొడుకు బాబి వస్తాడు.)

బాబి : నాన్నా! నాన్నా! (అరుస్తూ పిలుస్తాడు)

రాజేష్ : అబ్బబ్బ! ఏంట్రా ? (చిరాకు పడతాడు)

బాబి : నాన్నా నాతో రా నాన్నా… (చేయి పట్టి లాగుతూ అంటాడు)

రాజేష్ : అబ్బ ఉండరా…. ఈ పిల్లలు కొంచం సేపైనా విశ్రాంతిగా ఉండనివ్వరు కదా (విసుక్కుంటాడు) యామినీ! ఓ యామినీ! వీడిని కాస్త తీసుకెళ్ళు (భార్యని పిలుస్తాడు)

యామిని : (లోపలినుంచే) ప్లీజ్ కాసేపు చూసుకుందురూ, మీకు కాఫీ ఇచ్చి వాడిని తీసుకుంటాను.

బాబి : నాన్నా ఒక్కసారి రా నాన్నా చూడు అక్క ఏం చేస్తోందో ? (బాబి పట్టువదలని విక్రమార్కుడిలా తండ్రి చేయిపట్టి గుంజుతూ అంటాడు)

రాజేష్ : అబ్బబ్బ! ఏం గోలరా? ఏం చేస్తోందీ మీ అక్క? (విసుక్కుంటూ లేచి సిగరెట్టూ కాలుస్తూనే చెయ్యిపట్టి గుంజుతున్న బాబి వెనకాలే వెళతాడు)

ప్రథమ అంకం : 2వ రంగం

బాబి : చూడు నాన్నా అక్క ఏం చేస్తోందో?

రాజేష్ : ‘ఏమై….’…..(ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూడగానే రాజేష్ నోట్లో మాట నోట్లోనే ఆగిపోతుంది )

(రాజేష్ 8 సంవత్సరాల కూతురు మానస, కుర్చీలో వెనక్కి వాలి, కాలు మీద కాలేసుకుని కూర్చుని సగం అరిగిపోయిన పెన్సిల్‌ని చూపుడు వ్రేలు మధ్యవ్రేలు మధ్య పట్టుకుని నోట్లో పెట్టుకుని పొగ పీల్చి వదులుతున్నట్లుగా …. అచ్చం సిగరెట్టు కాలుస్తున్నట్లుగా చేస్తుంటుంది)

రాజేష్ : మానసా(ఆ దృశ్యం చూసిన రాజేష్ కోపం పట్టలేక ఇంటి కప్పు అదిరేలా అరుస్తాడు)

(మానస ఉలిక్కిపడుతుంది ఆ అరుపుకి. అప్రయత్నంగా చేతిలోంచి పెన్సిల్ క్రిందపడిపోతుంది. రాజేష్ ఒక్క అంగలో వెళ్ళి, లాగి పెట్టి కూతురి చెంప పగిలేలా కొడతాడు )

మానస : అమ్మా! (బాధతో చెంప పట్టుకుని ఏడుపు లంకించుకుంటుంది)

బాబి : అమ్మా! అమ్మా! నాన్న అక్కని కొట్టాడే (అని తల్లిని పిలుస్తూ తానూ ఏడుపు లంకించుకుంటాడు)

యామిని: ఏంటర్రా ఏమైందీ? (కాఫీ చేతిలో పట్టుకుని అక్కడికి వచ్చిన యామిని పిల్లలు ఏడవడం రాజేష్ కోపంగా ఉండడం చూసి గభాలున చేతిలోని కాఫీ ప్రక్కన చిన్న స్టూలు మీద పెట్టేసి కూతుర్ని దగ్గరికి తీసుకుంటుంది) మానసా ఏమైందమ్మా?

బాబి : అమ్మా! నేచెప్తాను మరేమో మరేమో నాన్న అక్కని గట్టిగా చెంప మీద కొట్టాడు (వెక్కిళ్ళ మధ్య చెప్తాడు)

యామిని : ఏమైందండీ?

రాజేష్ : ఏమైందా? అసలు నువ్వు ఇంట్లో ఉండి ఏంచేస్తున్నావు? పిల్లలు ఏంచేస్తున్నారో బయటకి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారో ఏమైనా పట్టించుకుంటున్నావా?

యామిని : మానసా ఏం చేసావు?

(మానస వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ చెంపని తడుముకుంటుంది కానీ తల్లికి జవాబు చెప్పదు)

బాబి : (ఏడుపు ఆపి చొక్కా అంచుతో కళ్ళు ముక్కు తుడుచుకుని) అమ్మ మరేమో అక్క పెన్సిల్ నోట్లో పెట్టుకునీ సిగరెట్టులా కాలుస్తోందీ అది చూసి నాన్న అక్కని కొట్టాడు

యామిని: మానసా తప్పు కదా అలా చెయ్యొచ్చా?

బాబి : మరీ నాన్న కూడా అలాగే చేస్తాడు కదా? మరీ అక్కా అదే చేసిందిగా మరి అక్కనెందుకు కొట్టాడమ్మా నాన్న? (మరీ అనే తన ఊతపదాన్ని పదే పదే వాడుతూ అమాయకంగా ముఖం పెట్టి తల్లిని ప్రశ్నించాడు బాబి)

రాజేష్ : నోర్ముయ్! వ్రేలెడంత లేవు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావురా? (కొడుకు మీదకి చెయ్యెత్తి వస్తాడు)

బాబి : (ఏడుస్తూనే) అమ్మా!( అంటూ తల్లి వెనక్కి వెళ్ళి నక్కుతాడు)

యామిని : ఆగండి ఎందుకు వాడి మీదకి ఒంటికాలిపై లేస్తారు?

రాజేష్ : వాడిని కాదు అసలు నిన్ననాలి. గారాబం చేసి చెడగొడుతున్నావు పిల్లల్ని (భార్యని కోపంగా చూసి అంటాడు)

యామిని : (పిల్లలని దగ్గరకి తీసుకుని కళ్ళు తుడిచి) బాబీ మానసా ఏడుపు ఆపేయండి మా మంచి పిల్లలు కదూ. బాబీ నాన్నతో అలా మాట్లాడకూడదు. సరేనా? ఇద్దరూ కాసేపు బయటకి వెళ్ళి ఆడుకోండి

(బాబి, మానస కళ్ళు తుడుచుకుంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వెళ్ళిపోతారు)

రాజేష్ : పిల్లలెంత తప్పు చేసినా వాళ్ళనేమైనా అంటే ఈవిడగారికి కిట్టదు మళ్ళీ! (గునుస్తాడు)

యామిని : అసలు వాళ్ళేం తప్పు చేసారని? (పదునుగా అడుగుతుంది)

రాజేష్ : అంటే మానస అలా చెయ్యడం తప్పు కాదా?

యామిని : పిల్లల్ని అనే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. రోజూ ఆఫీసునుంచి రాగానే వాళ్ళకి మీరు చూపిస్తున్న దృశ్యం ఏమిటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి.

ఎవరికైనా ఏవిషయం గురించైనా చదివినదానికంటే విన్నదీ, విన్నదాని కంటే చూసినదీ త్వరగా వంటపడుతుంది. ముఖ్యంగా పిల్లలకు. వాళ్ళు పెద్దలను చూసే మంచీ చేడూ అన్నీ నేర్చుకుంటారు అందునా ముందు ఇంట్లో అమ్మానాన్నలను చూసి. పైపెచ్చు మంచీ చెడూ రెండిటిలోనూ చెడువైపుకే త్వరగా ఆకర్షింపబడతారు. నా పెంపకం ఎలా ఉందని ప్రశ్నించే ముందర మీ ప్రవర్తన ఎలా ఉన్నదని ఆత్మావలోకనం చేసుకుంటే మీకే అర్థమవుతుంది. పిల్లలకు మార్గదర్శకాలుగా ఉండవలసిన మనమే తప్పుదోవలో పయనిస్తే వాళ్ళని ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగే అర్హతను కోల్పోతాము.

రాజేష్ : అంటే నీ ఉద్దేశం?

యామిని : నా ఉద్దేశం, అభిప్రాయం, భావం, సలహా, హెచ్చరిక….. ఇలా దీనికి ఏ పేరు పెట్టుకున్నా అది మీ ఇష్టం. కానీ ఒక్కసారి గుర్తు చేసుకోండి….. ఎన్నోసార్లు మిమ్మల్ని సిగరెట్ అలవాటు మానుకోమని బ్రతిమిలాడాను కానీ నా మాటలు పెడచెవిని పెట్టారు. ఇవాళ మానస చేసింది రేపు ఇదే పని బాబిగాడు చేసినా ఆశ్చర్యం లేదు. ఎదుటివారికి చెడు అలవాటు మానుకోమని సలహా చెప్పే ముందు మనం పాటించాలి అనే విషయం తెలుసుకోండి.

రాజేష్ : స్వగతం : (యామిని మాటలు తూటాలై తాకినా అందులోని నిజం కళ్ళెదుట ప్రత్యక్షమై పెనుభూతంలా భయపెట్టడంతో ఒక్కసారిగా నీరసం ఆవహించి తల తిరిగినట్లై ధఢాలున కుర్చీలో కూలబడిపోతాడు) అవును యామిని చెప్పింది అక్షరాలా నిజం . అక్కడికీ ఎన్నోసార్లు నన్ను హెచ్చరించినా భార్య చెప్తే వినేదేమిట్లే అనే పురుషాహంకారంతో నిర్లక్ష్యంగా ప్రవర్తించాను. ఇప్పడు మానస కేవలం పెన్సిల్‌తో సరిపెట్టింది. ఇప్పటికైనా నేను కళ్ళు తెరవకపోతే రేపు పిల్లలు నిజం సిగరెట్లు కాల్చినా కాలుస్తారు. అమ్మో! ఆ ఊహే ఎంతో భయంకరంగా ఉంది (గుండెల పై చెయ్యి వేసుకుంటాడు) లేదు అలా జరగడానికి వీల్లేదు.(తప్పుతెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ అప్రయత్నంగా కారుతున్న కన్నీటిని తుడుచుకుంటాడు)

యామిని : (భర్త విలపించడం చూసి గబ గబా రాజేష్ దగ్గరికి వచ్చి) ఏమండీ ఎందుకు కంట తడి పెడుతున్నారు? (ఆందోళనగా అడుగుతుంది)

రాజేష్: నువ్వు చెప్పింది నిజం యామినీ. నాదే తప్పు. నన్ను చూసే మానస నేర్చుకుంది. ఇదిగో ఈ క్షణం నుంచే ఈ పాడు సిగరెట్టు అలవాటు మానుకుంటున్నాను(అంటూ చేతిలో ఇంకా కాలుతున్న సిగరెట్టుని విసిరి క్రిందపడేసి కాలితో బలంగా నులిమేస్తాడు)

యామిని : చాలా మంచి నిర్ణయం. ఇవాళ నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సిగరెట్టు అలవాటు త్రాగేవాళ్ల ఆరోగ్యం నాశనం చేయడమే కాక చుట్టుప్రక్కల వారి ఆరోగ్యం కూడా దెబ్బతీస్తుంది.

రాజేష్ : అవును చదువుకున్నవాడినై ఉండీ ఎంతో మూర్ఖంగా ప్రవర్తించాను. పాపం అనవసరంగా నా చిన్నతల్లి మానసని కొట్టాను. బాబిగాడిని కొట్టబోయాను. ఎంత బాధపడ్డారో! (బాధగా కణతలు రుద్దుకుంటాడు ) నువ్వూ నన్ను క్షమిస్తావు కదూ! (యామిని చేతులు పట్టుకుని అడుగుతాడు)

యామిని : మనలో మనకు క్షమార్పణలు వద్దు. ఇప్పటికీ మించిపోలేదు. ఇది ఒక పీడకలగా మర్చిపోయి ఇకపై పిల్లలకి ఆదర్శంగా నిలుద్దాము. సరేనా! ఇంక మరీ అంత బాధపడకండి. పిల్లలవి వెన్నలాంటి మనసులు. ప్రేమకు ఇట్టే కరుగుతాయి. పదండి అందరం అలా పార్కుకి వెళ్ళి సరదాగా గడుపుదాము.

(ఇద్దరూ చేయీ చేయీ కలుపుకుని ఆనందంగా వెళతారు)

*****నాటిక సమాప్తం*****

(పాత్రలు వేదిక పైకి వచ్చి నమస్కరించి , తమను, తాము పోషించిన పాత్రను పరిచయం చేసుకుంటారు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here