99 సెకన్ల కథ-3

4
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, కాలమిస్ట్ జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. మొగుడూ, పెళ్ళాం, తాయెత్తు!

నేను వెళ్ళేసరికే, శేషయ్య గారు నేను పంపించిన సాఫ్ట్‌వేర్ కుర్రజంటతో పంచాయతీలో కూర్చున్నారు.

వాళ్లకి పెళ్లయి రెండేళ్ళు కావస్తోంది. కీచులాటలు బాగా ఎక్కువైపోయాయి.

“ఇంటిలో ఒక్క పనిలో హెల్ప్ చేయడు అంకుల్. పైగా, నేను చేసే ప్రతి పనికీ వంకలు పెడతాడు.. … అయినా, నేనూ ఉద్యోగం చేస్తున్నా గదా! ఆ మాత్రం జ్ఞానం…”

“భాష… భాష…” హెచ్చరించారు శేషయ్య గారు.

ఇక, ఆ కుర్రాడు చిట్టా విప్పాడు.

“ఒక్క రోజు నాకు ఇష్టమైన విధంగా వంట చేయదు అంకుల్… సెల్ ఫోన్ పట్టుకుంటే అస్సలు నా మాటే వినదు. …. నా ఇష్టాన్ని ఒక్కసారి కూడా గౌరవించదు. కొంచెమైనా బుద్ధి …”

“భాష … భాష…”

ఏమైనా ఆ ఇద్దరు ‘సాఫ్ట్’లూ మహా ‘హార్డ్’గా – “నా మాటకి విలువ లేదు” అంటే “నా మాటకి విలువ లేదు” అంటూ శేషయ్య గారి ముందు ఆవేశంగా అరిచేసుకున్నారు.

‘ఈయన ఆపడేమిటి?’ అని నేను వెర్రి మొహం వేసుకు చూస్తున్నాను. ఆ ఇద్దరూ బాగా అరిచేసి, ఇంక అరవటానికి ఓపిక లేక కూలబడ్డాక, వాళ్లకి చల్లటి మంచినీళ్ళిచ్చారు శేషయ్య.

“మీ సమస్య చాలా చిన్నదయ్యా…” అన్నారు చిరునవ్వుతో. వాళ్లిద్దరూ మొహాలు చూసుకున్నారు.

“నేను చెప్పినట్లు చేస్తామని నిజాయితీగా నాకు మాట ఇవ్వండి…. మీకు ఓ ‘మహిమగల తాయత్తు’ ఇస్తాను.. నెల రోజులు వాడండి. పనిచేస్తే, అదే వాడేస్తూఉండండి. నెలయ్యాక మీ పెళ్లిరోజు నాటికి మీ ఇంటికి నేనే వచ్చి చూస్తాను.. సరేనా! ”

ఇద్దరూ తలూపారు.

***

నెలయ్యాక పెళ్లిరోజునాడు ఆయనతో నేనూ వెళ్ళా. మళ్ళీ గొడవపడుతున్నారు..

“నాకు చెప్పకుండా నాకు డైమండ్ రింగ్ కోసం 50 వేలు తగలేశాడు అంకుల్…” బాధతో అంటోంది.

“నేను అప్పుడెప్పుడో కావాలను కున్నానని, నాకు తెలీకుండా ఇప్పుడు 40 వేలు పోసి, స్పోర్ట్స్ సైకిల్ కొంటుందా? 40 వేలే!” గుండె బాదుకుంటున్నాడు.

ఈ గొడవలో ఆవేశం లేదు, అలకే వుంది.

“ఇంక మనకి పని లేదు రావయ్యా” అంటూ నన్ను బయటకు లాక్కొచ్చేశారు శేషయ్య.

వెర్రివాడిలా అడిగాను. “మీరు ఇచ్చిన తాయెత్తు ఏంటి సార్?”

“ఒక్క నెల రోజులపాటు – తనకి ఇష్టమైన విధంగా నేను ఏం చెయ్యగలను – అని నువ్వూ, తనూ అనుకొని, అదే చేస్తూ వుండండి…”

“అరె, బాగుందే. నా బాల్య స్నేహితులు చాలామందికి ఈ మందు కావాల్సిందే” అన్నాను హుషారుగా.

“వీళ్ళ పెళ్ళయి రెండేళ్ళే కాబట్టి ‘తాయత్తు’ పనిచేసింది. లేదంటే…!”

2. దేవుడి భాష!

పెళ్లిబాజాలు మోగుతున్నాయి.

గౌరీ పూజ పూర్తి కాగానే, వధువుని పీటలమీదకి చేర్చారు.

శేషయ్యగారు తనకి అందరూ కననబడేలా బాగా వెనకాల మధ్యదారికి ప్రక్కగావున్న కుర్చీలో కూర్చున్నారు. అతిథుల్లోకెల్లా 80 ఏళ్ళు దాటిన వాడు ఆయన ఒక్కడే.

కన్యాదానం మొదలైంది.

పెళ్లి మంటపం హాల్లోకి వస్తున్న చాలా మంది ఆయన్ని ఏదో వరుసతో పలకరించి, నమస్కారం చేసి, ముందుకు వెళ్లి కూర్చుంటున్నారు.

అంతలో విడివిడిగా నలుగురు నలుగురు కుర్రాళ్ళు వచ్చారు.

శేషయ్యని చూస్తూనే, ఒకడు “ హాయ్ తాతా” అన్నాడు. ఇంకొకడు “గుడ్ మాణింగ్” అన్నాడు. అలా పలకరిస్తూ.

ఆయనకి ముందు వరుసలో కూర్చున్నారు. క్షణాల్లో వాళ్ళు 20-20 క్రికెట్ గురించీ, మోదీ భవిష్యత్ గురించీ చర్చల్లో మునిగిపోయారు.

జూనియర్ పురోహితుడు వచ్చి అందరికీ అక్షతలు ఇచ్చి వెళ్ళాడు…

వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు.

మంగళవాయిద్యాలు మ్రోగేస్తున్నాయి.

శేషయ్య లేచి వెళ్లి, అక్షతలు వేసి ఆశీర్వదించి వచ్చారు.

ఆ నలుగురూ ఇంకా మోదీ భవిష్యత్ మీద వాదిస్తూనే వున్నారు.

“బాబూ, అక్కడ ముహూర్తం …” అన్నారు శేషయ్య.

“ఔన్రోయ్. లేవండి లేవండి..” అనుకున్నారు.

“అక్కడికెళ్లి ఏం చేస్తార్రా?”

“ఈ అక్షతలు వాళ్ళ తలమీద వేసి రావటమే కదా!” – ఆ మాత్రం మాకు తెలీదా అన్నట్లు నవ్వారు.

“మీ ఇష్ట దైవాన్ని తల్చుకొని, ఆశీర్వదించి రండి.”

“మీరేం చేశారు?”

“పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ… (శ్లోకం చదివి), అని ఆది దంపతుల్ని స్మరించి, ఆశీర్వదించాను.”

“మాకు సంస్కృతం రాదు. వాడికి, నాకూ తెలుగు సరిగ్గా రాదు. వీడికి ఇంగ్లీష్ రాదు. ఆ చివరివాడికి హిందీ మాత్రమే వచ్చు…”

“ఫరవాలేదు. దేవుడికి అన్ని భాషలూ వచ్చు… మనల్ని పెళ్ళివారు ఆహ్వానించింది ముహూర్తం సమయంలో ఆ కొత్త జంటకి మంచి భవిష్యత్ కోసం ఆశీర్వదించమని, మోదీ భవిష్యత్ గురించి ఆలోచించ మని కాదు..”

ఆ నలుగురూ సిగ్గుతో తల దించుకొని వేదిక ఎక్కారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here