[box type=’note’ fontsize=’16’] “ట్విన్ సిటీస్ సింగర్స్” శీర్షికన – ‘కీర్తి పాటకు కిరీటం వంటిది. పాట వెనక పరుగెత్తుకుని రావాలి కాని, దాని వెనక పాట పరుగులు పెట్టకూడదు’ అంటున్నమనూష కృష్ణ గారిని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు ఆర్. దమయంతి. [/box]
***
[dropcap]మ[/dropcap]నూష గాత్రం తీగలా సాగుతుంది. పాటలో గమకం మెరుపులా మెరుస్తుంది. రాగం వాగై, భావం పొంగై, పాటంతా వెన్నెలై ప్రవహిస్తుంది. అలనాటి సుశీలమ్మ సోలో అయినా, జానకమ్మ పగలే వెన్నెల పాడినా – స్వర శుద్ధంగా, భావ భరితంగా, మెలొడీ ప్రధానంగా వినొస్తూ ఆమె గానం మనసుని రంజింప చేస్తుంది. చిత్ర పాటలను చిత్రంగా చిత్ర గారిలా ఆలపించడం ఈ గాయని గాన కళా ప్రావీణ్యం! అదొక ప్రత్యేకం!
కర్నాటక, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొంది, సినీ నేపధ్య గాయని కావాలని కోరుకుంటున్న మనూష కృష్ణతో జరిపిన ఇంటర్వ్యూ ఆసక్తికరంగా ఇలా సాగింది…
***
♣ మనూషా! నీ పాట విన్న ప్రతి వారూ అనే మాట ఒకటే. ఈమె సినిమాల్లో పాడుతుందా అని? (నవ్వులు)
* అవునండి. నేనూ ప్లే బాక్ సింగర్నే. వెలుగులోకి రావడం కోసం గట్టి పట్టుదలతో కృషి చేస్తున్నాను.
♣ అసలు ఈ మీ జర్నీ ఎలా మొదలైందీ వివరిస్తారా?
* అసలు నా జర్నీ ఎలా మొదలైందంటే.. స్కూల్‌లో రైమ్స్ కాంపిటీషన్‌లో – మా అక్క చెల్లెళ్ళమిద్దరం పాల్గొని, విజేతలుగా నిలవడం – ఒక గాయనిగా నాకు స్ఫూర్తి నిచ్చిన సంఘటనగా చెప్పాలి. రైమ్స్‌ని శ్రుతి, లయబధ్ధంగా పాడామని, అందరిలా కాకుండా విభిన్నంగా ప్రెజెంట్ చేసామని, స్కూల్ టీచర్స్, జడ్జెస్ ప్రశంసించడంతో.. మా నాన్న గారు రాజా కౌండిన్య గారు.. మాకు సంగీతం నేర్పించాలని అభిలాషపడ్డారు.
♣ ఏ గురువు గారి దగ్గర సంగీతాన్ని నేర్చుకున్నారు?
* మా మొదటి గురువు.. మా అమ్మ గారనే చెప్పాలి. రైమ్స్ పోటీలో పాల్గొన్నప్పుడు నా వయసు ఏడేళ్ళు. అప్పుడు నాకు సంగీతం అంటే ఏమిటో తెలీకున్నా, పాటల మీద నాకు తెలీకుండానే ఆసక్తి కలగడం విచిత్రంగానే అనిపిస్తుంది. నా ఆసక్తిని గమనించి అమ్మ, ఇంట్లోనే పాటలు నేర్పడం ప్రారంభించారు. దేశ భక్తి గీతాలు, చిన్నారుల చిట్టి చిట్టి పాటలు, భక్తి గీతాలు, సంక్రాంతి స్పెషల్ గొబ్బెమ్మల పాటలు, సినిమా -ఓల్డ్ మెలొడీస్ సోలోస్.. నేర్పే వారు. ముందుగా సాహిత్యాన్ని రాసి మాకిచ్చేవారు. లైన్ బై లైన్.. నోటికి వచ్చే దాకా వూరుకునే వారు కాదు. ఆ సాహిత్య సారాన్ని వివరిస్తూ.. మాకు బోధపడేంత వరకు వివరిస్తూ.. పాటలు నేర్పారు. ఇలా నేర్చుకున్న పాటల్ని పెళ్లిళ్ళప్పుడు, పేరంటాలప్పుడు, ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీస్‌కి వెళ్ళినప్పుడు, కిట్టీ పార్టీస్, పిక్నిక్ టైమ్స్, స్కూల్ కాంప్స్ కెళ్ళినప్పుడు, స్కూల్‌లో ప్రత్యేక దినోత్సవాలప్పుడు.. ఇలా అన్ని సందర్భాలలో పాటలు పాడుతుండేదాన్ని. స్నేహితులు, బంధువులు, చుట్టు పక్కల వారు.. నా పాట విని ఆనందంగా అభినందిస్తున్నప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా వుండేది. అలా అలా నాలో కాన్ఫిడెన్స్ పెరిగిన మాట వాస్తవం. అంత్యాక్షరిలో ఎప్పుడూ నేనే విన్ అయ్యేదాన్ని. (నవ్వులు)
♣ శాస్త్రీయ సంగీతం కూడా చెప్పేవారా మీ అమ్మగారు?
* లేదండి. అందుకు మా స్కూల్ టీచర్ దగ్గరే జాయిన్ చేసారు. అక్కడ మా టీచర్ సంగీతంతో బాటు అన్నమాచార్య కీర్తనలు నేర్పారు. అప్పుడు రాజాంలో వున్నాం. అక్కడే నా సంకీర్తన కార్యక్రమాలు మొదలైపోయాయి. పండగలకీ, పబ్బాలకీ దేవాలయాలలో, పందిళ్లల్లో.. మా అక్కా చెల్లెళ్ళం కలిసి పాడే కీర్తనలకు మంచి గుర్తింపుతో బాటు ఎంకరేజ్మెంట్ లభించడంతో.. సంగీతంలో నా వేగం పెరిగింది. ఇదంతా నా సెవెంత్ క్లాస్‌లో మొదలైన సంగీత ప్రయాణం. ఆ తర్వాత నాన్నగారికి విజయనగరానికి బదిలీ కావడంతో ఒక మంచి మలుపుకి దారితీసిందని చెప్పాలి.
* విజయనగరంలో పేరు మోసిన సంగీత గురువు ఉషా కామేశ్వరి గారి గురించి మంచి టాక్ వుంది. అది విని మా అమ్మగారు నన్నెలాగైనా వారి దగ్గర చేర్చి, శిష్యరికం చేయించాలని అనుకున్నారు. దైవానుగ్రహంతో, గురువు గారి ఆశీస్సులతో.. అక్కడ కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని కంటిన్యూ చేసాను.
♣ శాస్త్రీయ సంగీత కచేరీలు చేస్తుండేవారా?
* కచేరీలు కాదు కాని, ప్రతి శుక్రవారం ఒక అన్నమాచార్య కీర్తన తప్పని సరిగా నేర్పేవారు. సంగీత పరంగా నేర్చుకోవడం వల్ల కీర్తనలకి ఒక అందమైన మెరుపు వస్తుంది. అది సహజం కదా! అలా – అన్నమాచార్య కీర్తనలలో కొంత మేర ప్రావీణ్యతని సాధించడం గురువు గారి వల్లే సాధ్యమైంది. వారే – విజయనగరం నించి హైదరాబాద్‌కి మమ్మల్ని తీసుకొచ్చి, త్యాగరాయ గాన సభలో మా చేత సంగీత కార్యక్రమాలను చేయించారు. అన్నమాచార్య, రామదాసు కీర్తనలు పాడించే వారు. ప్రేక్షకుల నించి మంచి స్పందన లభించింది.
♣ విజయనగరం నించి హైదరాబాద్ కి రావడం ఎలా జరిగింది?
* హైదరాబాద్‌కి షిఫ్ట్ అవడం.. మరో గొప్ప మలుపు. ‘ఫెసిలిటీ మేనేజ్మెంట్ బిజినెస్’ కోసం అమ్మ ఇక్కడ రావడం, హిందుస్తానీలో ప్రజ్ఞావంతులైన శ్రీ గురురాజ్ గారితో అమ్మకి పరిచయం జరగడం యాదృచ్ఛికంగా జరిగింది. వారి దగ్గర హిందుస్తానీ నేర్చుకోమని అమ్మ, నాన్నలు సలహా ఇచ్చారు. కర్ణాటక సంగీతంతో బాటు హిందుస్తానీలో కూడా నాకు ప్రవేశం వుండాలని అమ్మ కోరిక. ఆయన ఎంత చక్క గా నేర్పేవారో! వారి శిక్షణలో హిందీ సాంగ్స్‌తో పరిచయం కలగింది. పాడటంలో మెలకువలు నేర్పించడంతో ఆ పాటల పట్ల మక్కువ పెరిగింది.
గురు రాజ్ గారి కి రికార్డింగ్ స్టూడియో వుంది. ఆయన బేసిక్‌గా పేరున్న గిటార్ ప్లేయర్. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అందరకీ తెలిసిన కళాకారులు. నా పాటలు విని, మా గురువు గారు ముచ్చట పడి, రెండు సినిమాల్లో ఏకంగా ప్లే బాక్ సింగర్‌గా అవకాశాన్ని కలిగించారు. ఆ సినిమాలింకా రిలీజ్ కాలేదు.. మరో మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
ఇప్పటికీ మా గురువు గారిని కాంటాక్ట్ చేస్తూ, సంగీతంలో కానీ, సినీ గీతంలో కానీ నాకు కలిగే సందేహాలను తీర్చుకుంటూ వుంటాను. ఆయనకి చాలా ఓర్పు, సహనం గలవారు.. నా సందేహాలన్నీ ఇట్టే తీర్చేస్తారు. నన్నెంతగానో ప్రోత్సహిస్తారు. ఈ శుభ సందర్భంగా మా మంచి గురువు గారు శ్రీ గురురాజ్ గారికి హృదయపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటున్నాను.. మన సంచిక ద్వారా!
♣ అటు కర్ణాటక సంగీతంలో ఇటు హిందుస్తానీ కూడా నేర్చుకున్నారు కదా.. మరి ప్రోగ్రాంస్ ముమ్మరం చేసారా?
* ఇక్కడ మళ్ళా గాప్ వచ్చిన మాట వాస్తవం. ఇంటీరియర్ డిజైనర్‌గా జాబ్ రావడం, ఆక్సెప్ట్ చేయడం, ఆ వెనకే వివాహం, తల్లినవడం, పసివాని ఆలనా పాలనా.. ఇలా సంసార బాధ్యతలలో పూర్తిగా మునిగిపోయా..
♣ మరి పాటని మరచిపోగలిగారా?
* లేదండి. అస్సలు మరచిందే లేదు. ఇంత బిజీ అయినా, తెలీని దిగులు.. అసంతృప్తి మనసుని అంటిపెట్టుకునుండేవి. సంగీతాన్ని ప్రేమించేవారు – గానాలకి దూరంగా జరగాల్సి వచ్చినప్పుడు మనసునావరించే ఆ నిరాశ ఎలా వుంటుందో.. ప్రతి గాయనీ గాయకులకీ అనుభవైద్యకమే..’ఇక నేను సంగీతానికి దూరమైపోయినట్టేనేమో..’ అనుకున్న దశలో.. నాన్న గారి సహకారం, ఓదార్పు, ప్రోత్సాహాం నన్ను తిరిగి గాయనిగా నిలబెట్టాయి. నా లోని గాయనికి కొత్త శ్వాస అందినట్టు అనిపించింది.
♣ అదెలా జరిగింది?
* మెటర్నిటీ లీవ్‌లో వున్నప్పుడే నన్ను సింగర్‌గా మార్చేసారు. స్మూల్ ఆప్‌లో పాడించడం, వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం, యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం.. చేసారు. ఆ రెస్పాన్స్ చూసి.. ప్రశంసల పరంపరలు అందుకుని ఎంతగానో పొంగిపోయాను. ఏదో తెలీని ఉత్సాహం, స్ఫూర్తి, జిజ్ఞాసలు పొంగి పొర్లాయి. కొత్త పాటలు నేర్చుకుంటూ.. పాత పాటలు.. తిరగేసుకుంటూ.. సంగీతాన్ని సాధన చేసుకుంటూ.. తిరిగి గాయనిగా పునర్జన్మనెత్తాను… అనిపించింది. ఈ దశలో నాకు పూర్తి సహకారాన్ని అందించారు మా వారు!
♣ ఇలాటి డిప్రెషెన్ పీరియడ్స్ ప్రతి కళాకారుని జీవితంలో సహజం కదా.. మీరెలా ఎదుర్కొంటారు?
* నేను నిరాశ పడినప్పుడల్లా… దేవుడు నాకు చెపుతున్నట్టు తోచేది. సంగీతంలో నీ జర్నీ అయిపోలేదు.. ఇదింకా ఆరంభం మాత్రమే అని ధైర్యాన్నిస్త్తునట్టు దేవుని మాటలు వినిపించేవి. అవే నాకెంతో పాజిటివ్ ఎనెర్జీని ప్రసాదిస్తాయి. ఆ వెనకే ఎంకరేజింగ్‌గా ఏదో ఒక సంఘటన జరిగేది. నాకు స్టేజ్ పెర్ఫామన్స్‌కి ఆహ్వానం రావడమో, సినీ గీతాల కార్యక్రమాలలో బిజీ అయిపోవడమో జరిగుతుంది. ఇదంతా ఆ దేవునికి నాపై గల కృపగా భావిస్తాను.
♣ సినిమా పాటలు పాడటానికి ప్రత్యేకమైన శిక్షణ ని పొందారా?
* ట్రైన్ అయానండి. నా జర్నీలో కౌసల్య మ్యూజిక్ అకాడెమీతో పరిచయం ఒక మలుపు అని చెప్పాలి. సినీ నేపధ్య గాయని కౌసల్య గారి శిక్షణలో చాలా మెలకువలు నేర్చుకున్నాను. సినిమా పాటలెలా పాడాలి, అందులోని మెళకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన కోర్స్ – ‘ప్లేబాక్ సింగింగ్ కోర్స్’ లో జాయిన్ అవడం జరిగింది. వారు నా గాత్రాన్ని, పాటని, పాడే విధానాన్ని చూసి చాలా మెచ్చుకునేవారు. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్పించారు కూడా. వాయిస్ డైనమిక్స్ ఎలా వుండాలీ, ఎక్కడ బ్రీతింగ్‌ని కంట్రోల్ చేసుకోవాలి.. గాత్రాన్ని ఎప్పుడెప్పుడు.. ఎలా మెరిపించాలి వంటి మెళకువలు, సులువులు నేర్పారు.
♣ ఎన్నాళ్ళ కోర్స్ అది?
* నేను రెండు నెలలు శిక్షణ తీసుకున్నా.
♣ ప్లే బాక్ సింగింగ్‌కి ఇప్పుడు మీరు సిద్ధమేనేమో కదా?
* ఊహు. అక్కణ్ణించి, మళ్ళా తిరిగి కర్ణాటక వింగ్ లోకి వచ్చి చేరాను. సినీ గీతాలను వున్నదున్నట్టుగా ప్రెజెంట్ చేయడంలో శాస్త్రీయ సంగీత శిక్షణా, సాధనల పాత్ర ఎంత ప్రముఖమైనదో గ్రహించాను. శ్రీ బాలకృష్ణ సార్ దగ్గర కర్ణాటక సంగీత శిక్షణలో చేరాను. ఈ సారి విరామం ఇవ్వకుండా – గీతాలు, వర్ణాలు, కృతులు.. నేర్చుకున్నాను.
బాలకృష్ణ గారి దగ్గర నేర్చుకున్న సంగీత శిక్షణ నాకు ఎంతగానో ఉపయోగపడిందని చెప్పాలి. గురువు గారు క్లాసుల నిర్వహణ కూడా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ఒక రోజు క్లాస్.. ఆ మర్నాడు.. నేర్చుకున్న సంగీత పాఠాన్ని వినిపించాలి.. చాలా బావుండేది.
♣ స్టేజ్ మీద సినీ విభావరీలలో మీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎప్పట్నించి పాడుతున్నారు సినిమా పాటలని?
* ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలండి. స్టేజ్ మీద సినీ గీతాలకు స్ఫూర్తి మా నాన్నగారనే చెప్పాలి. బేబీ పుట్టాక, నా కెరీర్ మరోమలుపు తిరిగిందని చెప్పాలి. మా నాన్న గారు శ్రీ రాజా కౌండిన్య గారు కూడా పాటలు పాడతారు. స్టేజ్ మీద కార్యక్రమాలకు నన్ను తన కూడా తీసుకెళ్ళేవారు. వారి ద్వారా, శ్రీ శారదా మ్యూజిక్ అకాడెమీ అధినేత్రి శ్రీమతి శారద గారితో పరిచయమవడం, వారు వెంటనే నాకు అవకాశాలను కలిగించడం.. నాతో కలిసి పాడాలని మేల్ సింగర్స్ ఉత్సహాన్ని చూపించడం, వరస కార్యక్రమాలతో బిజీ అవడం, అలా త్యాగరాయ గానసభలో మంచి గుర్తింపుని సంపాదించడం, పాపులర్ అవడం జరిగింది. ఆ సందర్భంలోనే – ‘బృందావనం’ అనే ప్రముఖ సాంస్కృతిక సంస్థ వారు నిర్వహించే సంగీత విభావరిలో పాడే అవకాశం దక్కడం, వారి మర్యాద పూర్వక ఆహ్వానాన్ని అందుకుని పార్టిసిపేట్ చేయడం, అక్కడ నిర్వాహకుల మెప్పుని పొందడం – నా కెరీర్ లోనే మరచిపోలేని సంఘటనగా పేర్కొనాలి. ఈ సందర్భంగా బృందావనం సంస్థ వ్యవస్థాపకులైన శ్రీ సుబ్రహ్మణ్యం గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. కేవలం టాలెంట్‌కి మాత్రమే పెద్ద పీట వేసే – సంస్థ – బృందావనంలో చోటు దొరకడం కోసం చాలా మంది సింగర్స్ ఉవ్విళ్ళూరుతారు.
♣ ఇంత టాలెంట్ వున్న మీరు టివీ ప్రోగ్రామ్స్‌లో ప్రయత్నించలేదా?
* చాల ప్రయత్నించాను. చాలా ఆడిషన్స్‌కి వెళ్ళాను. ఇండియన్ ఐడల్, సూపర్ సింగర్, పాడుతా తీయగా, సరిగమప..జీ టివి.. వెళ్ళాను. థర్డ్, ఫోర్త్ రౌండ్స్ వరకు వెళ్ళేదాన్ని. సూపర్ సింగర్స్‌కి కూడా అదే జరిగింది. ఆడిషన్స్ – లాస్ట్ రౌండ్‌లో కీరవాణి, చిత్ర గారి వంటి ప్రముఖ సమక్షంలో కూడా పాడాను. ఎంత కృషి చేసినా… ఎందుకో చివరి నిముషంలో.. లాస్ట్ రౌండ్‌లో మిస్సైపోతుండేదాన్ని.
♣ ఇలా జరిగినప్పుడు బాధగా వుంటుంది కదూ?
* చాలా..! చాలా నిరాశ వేసేది. నిస్సత్తువ చోటు చేసుకునేది మనసంతా.. తెలీని బాధగా కలతగా వుంటుంది.. ఇక పాటలకు ఫుల్ స్టాప్ పెట్టేయనా.. సక్సెస్ లేనప్పుడు ఎందుకీ సాధనలు, శోధనలు అని కళ్ళెంట నీళ్ళొచ్చేవి. కానీ, మీకు ముందే చెప్పాను కదా! వెంటనే ఏదో శక్తి చల్లని మాటలతో నన్ను ఓదారుస్తుంది. మా నాన్నగారి మాటల్లోనో, అమ్మ మమత లోనో.. లేదా వేదికల మీద పాడే అవకాశాన్ని కలిగిస్తూ అందుకునే ఆహ్వానాల ద్వారానో.. గొప్ప ఊరడింపు దొరికేది. గుడ్ సైన్ కనిపించేది. స్వాంతన అంటారు చూసారా.. నన్ను అలా శాంతింప చేసి, ‘నీకు గొప్ప ఫ్యూచర్ వుందంటూ’ అలా ఎంకరేజ్ చేస్తుంటాయి. నన్ను ఉత్తేజపరుస్తూ, ఉత్సాహాన్ని అందిస్తూ చేయూత నిచ్చే వారిలో మీరు కూడా వున్నారు అని గర్వంగా చెబుతుంటాను (నవ్వులు).
♣ గాన సభలో ప్రదర్శనలలో మిమ్మల్ని ఎక్కువగా చూడటం జరిగింది..
* త్యాగరాయ గాన సభలో పాడటం వల్ల సింగర్‌గా నాకొక ప్రత్యేకమైన గుర్తింపు దొరికింది. నాకీ అవకాశాన్ని కలగ చేసిన పెద్దలందరకీ పేరు పేరునా నా వినయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియ చేసుకుంటున్నా.ఈ ఇంటర్వ్యూ చేస్తున్న మీకు కూడా.. (నవ్వులు).
♣ సోషల్ మీడియాస్‌లో పాడటానికి, వేదికల మీద పాడటానికి మధ్యతేడా ఏమైనా వుంటుందంటారా?
* వుంటుందండి. వేదికల మీద లైవ్ ప్రోగ్రామ్స్‌లో పాడటం వల్ల సింగర్స్‌కి స్టేజ్ ఫియర్ పోతుంది.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన పాటని శ్రద్ధగా ఆలకిస్తున్న ప్రేక్షకులని ప్రత్యక్షంగా చూస్తుంటాం.. అందువల్ల పాట మీద ఫుల్ కాన్సెంట్రేషన్ పెట్టాలన్న అంకిత భావం కలుగుతుంది. అలానే, మన ప్రెజెంటేషన్ నచ్చాక, కరతాళ ధ్వనులతో హాల్ మారుమోగుతుంటే.. గాయనీ గాయకులకు కలిగే ఆ మహదానందం మాటలకు అందనంత స్థాయిలో వుంటుంది. తర్వాతి పాట ఎప్పుడెప్పుడా అనే తహ తహగా.. ఉద్వేగభరితంగా వుంటుంది. యుగళ గీతాలైతే కో సింగర్ కి ధీటుగా మేటిగా పాడాలనే ఆరోగ్యకరమైన పోటీ తత్వం అలవడుతుంది. ఏ పాట కా పాటే ఒక పరీక్ష గా, ప్రేక్షక దేవుళ్ళే మన ఉత్తీర్ణత నిర్ణయించే న్యాయ నిర్ణేతలుగా.. చప్పట్ట్లే శాలువాలై సత్కారిస్తుంటే.. ఆ దృశ్యం నాకెంతో కమనీయం! పర్సనల్‌గా నేను స్టేజ్ పెర్ఫామన్సెస్ ని చాలా ఎంజయ్ చేస్తాను.
♣ వేదికల మీద పాడి ప్రేక్షకులను మెప్పించడం కూడా ఒక సక్సెస్ కదా!?
* అవునండి. ఆడిషన్స్ లో పాడి గెలవడం, ఆల్బంస్ చేయడం, సినిమాలలో చాన్స్ రాకపోవడం ..ఇవి మాత్రమే సింగర్ కెరీర్ కి కొలబద్ద కాదు, కాకూడదు. వాటి కోసం ప్రయత్నాలు చేస్తూనే వుండాలి. కానీ ఓటమి కలిగితే నిరాశ పడి..అక్కడితో ప్రాణం లా భావించే పాటనే దూరం చేసుకోకూడదు. పాట పాడి కీర్తి కోసం ఎదురుచూడకూడదు. కీర్తి – పాటకు కిరీటం వంటిది. పాట వెనక పరుగెత్తుకుని రావాలి కాని, దాని వెనక పాట పరుగులు పెట్టకూడదు. మనసంతా పాట మీద, ప్రెజెంటేషన్ మీదే వుండాలి. నా పెద్దలు, తల్లితండ్రులు, గురువులు నేర్పిన మంచి మాటలివి. నేను సదా అనుసరిస్తూనే వుంటాను.
♣ మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అని కూడా విన్నాను..
* అవునండి. నాకు డబ్బింగ్ చాన్సెస్ కూడా వస్తున్నాయి. చేస్తున్నాను. మొట్ట మొదటి సారిగా – మా బావ గారు నాకీ అవకాశాన్ని కలిగించారు. ఆయన నవలా రచయిత. సినిమా మాటల రచయిత కూడా. ఆయన తన మూవీ కి డబ్బింగ్ చెప్పించడానికి స్టూడియోకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ స్టూడియోలో నా డబ్బింగ్ విన్న నిర్మాత దర్శకులు నాకు షార్ట్ ఫిలింస్‌లో మరిన్ని అవకాశాలను కల్పించారు. అలా బిజీగా అయిపోయా. సం హౌ అ యాం కనెక్టెడ్ విత్ మ్యూజిక్, డబ్బింగ్ అండ్ స్టేజ్ పెర్ఫామన్సెస్.
♣ మరి ప్లే బాక్ సింగింగ్ మాటేమిటీ?
* నా ప్రధాన ఆశయం అదే!
* మ్యూజిక్ డైరెక్టర్ – శ్రీ రాము గారి సంగీత దర్శకత్వం లో సినిమా పాటలు పాడే అవకాశం కలగడం ఒక అపురూపం. నా చేత వేరు వేరు సినిమాలలో ఐదు పాటలు కూడా పాడించారు. కానీ సినిమాలు రిలీజ్ కాలేదు. బాడ్లక్. ఆగిపోయాయి. సాంగ్స్ బయటకి రాలేదు కానీ ప్లే బాక్ సింగర్‌ని ఐతే అయ్యాను.
నేను సినిమా ఇండస్ట్రీ వారికి తెలీకుండా పోతున్నాననే అసంతృప్తి ఐతే మనసుని అంటుకుని వున్న మాట నిజం. దటీజ్ ద ఓన్లీ రీజన్ – కౌసల్య మ్యూజికల్ అకాడెమీలో జేరడం జరిగింది. నా బేబీ వల్ల కొంత గాప్ ఇచ్చినా, నేను మళ్ళా కౌసల్య అకాడెమీలో జేరి, ఇంకా టెక్నిక్స్ నేర్చుకుని.. ఫీల్డ్ లో నా టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను.
♣ మరపురాని జ్ఞాపకమైన అనుభవాలను పంచుకుంటారా?
* రాజమండ్రిలో ఆనం కళా కేంద్రంలో జిల్లా స్థాయి పాటల పోటీలో పాల్గొని మొదటి బహుమతిని గెలుచుకున్న అనుభూతి..మరవలేను.
* సాలూరి వాసూరావు గారు మా డాడీకి పరిచయం. ఆయన ప్రోగ్రామ్స్‌లో పాడే అవకాశం కలగడం ఒక అదృష్టంగా భావిస్తా. శ్రీకాకుళం దేవస్థానంలో, అలానే – మహా శివరాత్రి సందర్భంగా విశాఖ బీచ్ లో నిర్వహించిన ప్రోగ్రాంలో భక్తి గీతాలను ఆలపించడం జరిగింది.
* సప్తగిరి చానెల్ ‘ఆలాపన’ లో మా అక్కా నేనూ ఇద్దరం పాల్గొని ప్రోగ్రామ్స్ ఇచ్చాము. ఇవన్నీ నా మ్యూజిక్ జర్నీలో – మరపురాని జ్ఞాపకాలే!
♣ ఎలాటి పాటలంటే ఇష్టపడతారు?
* ఎలాటి పాటలు ఇష్టం అంటే, అన్నీ ఇష్టమే అయినా నా వాయిస్‌కి మెలొడీ సాంగ్స్ ఒప్పుతాయి. అందుకే వాటినే ఎక్కువగా ఎంచుకుంటా. అలానే విభిన్నంగా – వెస్టర్న్ టైప్ ఆఫ్ సాంగ్స్ కూడా నా స్వరానికి ఒప్పుతాయి. బాగా పాడతానని శ్రోతలు కితాబిస్తారు.
♣ చాలెంజింగ్‌గా అనిపించే సాంగ్స్?
* చాలెంజింగ్‌గా అనిపించేవి – ఫాస్ట్ బీట్ సాంగ్స్! ఇది నమ్మరు కొందరు కానీ, ఒప్పుకోవాల్సిన నిజం. (నవ్వులు)
♣ ప్రొఫెషనల్‌గా అన్ని వైవిధ్యభరితమైన పాటలు పాడినా వ్యక్తి ఇష్టాలు వేరుగా వుంటాయి కదూ?
* అవును. పర్సనల్‌గా ఇష్టమైనవి అంటే- ముందుగా మెలొడీస్! ఆ తర్వాత వెస్టర్న్ టైప్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం.
♣ మీకు రాని పాట పాడమని ఎవరైన అడిగినప్పుడు ఏమనిపిస్తుంది..అలాటి అనుభవాలేమైనా ఎదురయ్యాయా?
* వున్నాయండి..నేను ఫేస్ చేసాను. వేదికల మీద పాడుతున్నప్పుడు.. ప్రేక్షకులు స్లిప్స్ మీద రాసి పంపుతుంటారు.. ‘మనూష గారు, మాకు ఈ ఫలాన పాట పాడి వినిపించరూ.. ప్లీజ్!’ అంటూ. నాకు వచ్చినవి అయితే వారి ఛాయిస్‌లో పాడి వినిపిస్తా.
రానివి వదిలేయను. ఆ మర్నాడు ఆ పాటలని ఒక లిస్ట్ గా రాసుకుని, ఒక దాని తర్వాత ఒకటి ఇంట్లో కుర్చుని నేర్చుకుంటాను. అలా నా సాంగ్స్ బాంక్ లో కొత్త పాటలు క్రెడిట్ అయి పోతాయి..సో..నాలో ఆ ‘జీల్..’ ఎప్పుడూ అలానే నూతనంగా వుంటూనే వుంటుంది.. రాని పాట నేర్చుకోవలనే తపన ఎక్కువే! మా ఆర్గనైజర్స్ కూడా అందుకే మెచ్చుకుంటుంటారు.. ఏ పాట అయినా మనూష రాదు అని చెప్పదు, ఈజీగా పాడేస్తుంది అని.
♣ మీ ఫ్యూచర్ ప్లాన్స్?
నా ఫోకస్ ఇప్పటికీ – ప్లే బాక్ సింగర్‍ని కావాలనే! ఆ ఆశయంతోనే ముందడుగు వేస్తున్నాను. ఎప్పటికైనా అవుతాను..అనే అనుకుంటున్నా.
♣ మీ ఆశలు నెరవేరాలని ఆశయ ఫలసిధ్ధి కావాలని.. త్వరలో మీ కలలన్నీ నిజమై, పాపులర్ ప్లే బాక్ సింగర్‌గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ.. సంచిక తరపున మీకు శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను మనూష కృష్ణ గారూ! – ఆల్ ద బెస్ట్.
* థాంక్ యు సో మచ్ అండి, సంచిక మాగజైన్ వారికీ, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. నమస్తే.
***
Songs links;
1. Mohan’s jhum jhum Maya jhum jhum maaya premisthene inthati haaya on 23rd January 2020
2. Mohan’s Priya priyatama raagaloo sakhi kusalama andhalu on 15th January 2020
3. Mohan’s Abba nee theeyani debba entha kammaga vundhiroyabba on 15th January 2020
4. Mohan’s konte gaani kattuko korinantha itchuko vaalu kalla kurra daana on 15th January 2020
5. Mohan’s paruvam vaanaga nedu kurisenu le on 15th January 2020
6. Mohan’s aree yemaindhi oka manasuki rekkalotchi ekkadiko vaalindhi on 18th December 2019