[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
జాతీయ స్థాయిలో చర్చ:
[dropcap]ము[/dropcap]ఖ్యమంత్రి ప్రసంగాన్ని నిలిపివేయడంపై పార్లమెంటు ఉభయసభలలోనే గాక, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోనూ, ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల లోనూ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. చాలామంది నాకు ఫోన్లు చేసి వివరాలడిగారు.
శిక్షణా సంస్థలలో అదొక పాఠ్యాంశంగా మారింది. ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో వివిధ రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు రావడంలో ఒకసారి ముఖ్యమంత్రి ప్రసంగం విషయం వాదోపవాదాలకు దారితీసి ప్రధానమంత్రి పార్లమెంటులో ప్రసంగిస్తూ – ఆయా సందర్భాలను బట్టి ముఖ్యమంత్రి ఆకాశవాణి ద్వారా రాష్ట్ర ప్రజల నుద్దేశించి ప్రసంగించడానికి ఎలాంటి అభ్యంతరాలు వుండబోవని ఖరాఖండిగా ప్రస్తావించారు. అప్పట్లో నేను దోషిని గాకపోయినా, నన్ను ఈశాన్య రాష్ట్రాలకు బదిలీ చేస్తారని వదంతులు పుట్టించారు. రాజ్యసభలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు చర్చలో పాల్గొంటూ – హైదరాబాదు అసిస్టెంట్ డైరక్టరు అహంకార ధోరణి అంటూ కొందరు మిత్రులు ప్రస్తావించారనీ, ఒక ప్రభుత్వోద్యోగిని బలిపశువును చేయటం తమ పార్టీ ఖండిస్తోందని మాట్లాడారు. మొత్తానికి చిలికి చిలికి గాలివానగా మారిన ఆ ఉదంతం ఆకాశవాణిలో జాతీయ స్థాయిలో సమర్థుడైన అధికారిగా గుర్తింపు తెచ్చింది. ఏ విధమైన బదిలీ గాని, దండన గాని, మెమో గాని లేకుండా హైదరాబాదులోనే మరో నాలుగేళ్ళు పని చేశాను. అదే నెలలో హైదరాబాదు పర్యటనకు వచ్చిన సమాచార ప్రసార శాఖ కార్యదర్శి యస్.యన్. గిల్‍కు విమానాశ్రయంలో స్వాగతం పలికి, లేక్ వ్యూ గెస్ట్ హౌస్‍లో దింపిన తర్వాత నేను ఆ విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే – “You are not at all at fault” అంటూ పార్లమెంటులో చర్చకు సమాధానంగా సమాచార ప్రసార శాఖల మంత్రి హెచ్.కె.ఎల్. భగత్ చెప్పిన వాక్యాలు ఉదహరించారు. “In view of the prevailing circumstances at Hyderabad, the A.S.D. was asked to not to go ahead with the broadcast” (హైదరాబాదులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌తో ప్రసార విషయంలో ముందుకు సాగవద్దని ఆదేశించాము).
ఆ సంఘటన జరిగిన మర్నాడే జూలై 19న బీహార్ గవర్నరు పెండేకంటి వెంకట సుబ్బయ్య హైదరాబాద్ వచ్చి లేక్ వ్యూ గెస్ట్ హౌస్‍లో బస చేశారు. నేను వారిని మర్యాద పూర్వకంగా కలిసినపుడు ఆయన ఆ సంఘటన పూర్వపరాలు తెలుసుకొని నా ముందటే మా శాఖ మంత్రి హెచ్.కె.ఎల్.భగత్‍కు వాస్తవ పరిస్థితులు టెలీఫోన్‍లో వివరించారు. ఫలితంగా పార్లమెంటుకిచ్చే సమాధానంలో నన్ను ఇరికిద్దామనే మంత్రిత్వశాఖ ఆలోచన విరమింపజేయబడింది. అనుభవం లేని ఆ ఎ.ఎస్.డి అలా తొందరపాటు చర్య తీసుకొన్నాడని సమర్థించుకోజూచారు. ఆ వేటు తప్పిపోయింది. పార్లమెంటు సమాధానం రోజు నన్ను స్వయంగా ఢిల్లీ రమ్మన్నా, నేను వెళ్ళలేదు.
కంచి స్వాముల చాతుర్మాస్యం:
ఎన్.టి.రామారావు ఉదంతం కాగానే ఢిల్లీలో ఆకాశవాణి డైరక్టరేట్‍లో అతి ప్రధానమైన ‘డైరక్టర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, పాలసీ’గా పనిచేసే కేశవ పాండేను హైదరాబాదు డైరక్టర్‍గా మార్చారు. అప్పట్లో ఐ.ఎ.ఎస్. అధికారి యస్.యస్. వర్మ ఆకాశవాణి డైరక్టర్ జనరల్. ఆయనకు, క్రింది అధికారి షిండేకు పోరు కొనసాగేది. అందులో భాగంగా, ఆయనకు మిత్రుడైన సీనియర్ అధికారి పాండేను హఠాత్తుగా హైదరాబాదు మార్చారు. ఆయన అనుభవజ్ఞుడు. నన్ను బాగా ఆదరించాడు.
1983 సెప్టెంబరు నెలలో కంచి పీఠం వారు చాతుర్మాస్య దీక్షను కర్నూలు తుంగభద్రా నదీ తీరంలో మూడు కుటీరాలలో నిర్వహించారు. పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వాములవారు, పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి, అప్పుడే పీఠ ఉత్తరాధికారిగా నియమితులైన ప్రస్తుత పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి రెండు నెలల పాటు కర్నూలులో విడిది చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన మా డైరక్టరు కేశవ పాండే వారిని సందర్శించాలని కోరారు. మేమిద్దరం బయలుదేరి కర్నూలు చేరాము. సెప్టెంబరు 12న ‘పెరియవర్’ అని గౌరవప్రదంగా భక్తులచే కొనియాడబడే శ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ యతీంద్రులను కలిసాను. నేను వ్రాసిన ‘భక్తి సాహిత్యం’ అనే గ్రంథాన్ని వారి పాదాల చెంత వుంచాను. కరుణాసముద్రలైన వారు పుస్తకం దయతో తెరిచారు. ప్రహ్లాదుడు – అనే శీర్షికతో సప్తగిరిలో ప్రచురితమైన వ్యాసం చూశారు. కళ్ళతో ఆశీర్వదించారు. ఆయన చూపులలో ఒక దివ్యాకర్షణ వుంది. కుడి చేయి పైకెత్తి ఆశీర్వదించారు. ఆ ఆశీస్సుల ఫలితంగా 2009లో కంచి పీఠం వారు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాముల పవిత్ర హస్తాలతో నన్ను ఆస్థాన విద్వాంసులుగా సత్కారం పొందే భాగ్యం లభించింది. శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి వారు ఆ సందర్భంగా ప్రత్యేకంగా పిలిచి గ్రామాలలో స్మార్త సంప్రదాయాన్ని పెంచి పోషించే కృషి ఇంకా ఉధృతంగా జరగాలన్నారు. స్మార్త పండితులను తయారు చేసే వ్యవస్థ రూపొందాలన్నారు.
కడప ఆకాశవాణి 100 కిలోవాట్ల శక్తి:
1963లో డా. బెజవాడ గోపాలరెడ్డి కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిగా వుండగా హైదరాబాదుకు రిలే కేంద్రంగా కడపను, విజయవాడకు రిలే కేంద్రంగా విశాఖపట్టణాన్ని ప్రారంభించారు. 1975 జూన్ వరకు అవి ప్యూపా దశలో వుండిపోయాయి. ఆ తర్వాత సీతాకోకచిలుకలయ్యాయి. ఆ కేంద్రాల ప్రసార ట్రాన్స్‌మిటర్ శక్తి 10 x 2 కిలోవాట్లు మాత్రమే. సిలోన్ రేడియో 900 కిలో హెడ్స్‍పై ప్రసారం చేస్తూ కడప కేంద్ర ప్రసారాలకు తరచూ అంతరాయం కలిగేది. ఎట్టకేలకు 1982లో కడప కేంద్ర ట్రాన్స్‌మిటర్ శక్తిని 100 కిలోవాట్ల స్థాయికి పెంచుతూ యంత్ర పరికరాలు అమర్చారు. దాని ప్రారంభోత్సవం జరగాల్సి వుంది.
1983 అక్టోబర్ 10న కడప సమీపంలోని కొప్పర్తిలో 100 కిలోవాట్ల శక్తిగల ట్రాన్స్‌మిటర్ ప్రారంభోత్సవ సభ సంకల్పించారు. హైదరాబాద్ నుండి మా డైరక్టర్ కేశవ్ పాండే, నేను, మదరాసు చీఫ్ ఇంజనీరు యం.ఐ. సూర్యనారాయణ కార్లో బయల్దేరి కడప 8వ తేదీ సాయంకాలనికి చేరుకొన్నాం. కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి హెచ్.కె.ఎల్.భగత్, రాయలసీమ ప్రముఖ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య, స్థానిక రాష్ట్రమంత్రి యస్. రామముని రెడ్డి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పదవ తేదీ ఉదయం పది గంటలకు చేసి ప్రసంగించారు. మధ్యాహ్న భోజనాలు ముగించుకుని మేం ముగ్గురం హుటాహుటిన కార్లో హైదరాబాదు బయలుదేరాం.
అక్కినేని నాగార్జున వివాహం:
కేశవ పాండే హైదరాబాదుకు వచ్చిన కొత్తల్లో అంటే జూలైలో ఒకసారి మేమిద్దరం కలిసి అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావును కలిశాము. ఆ శుభ ముహూర్తం ఏమో గాని, వాళ్ళిద్దరికీ గాఢమైన బంధం ఏర్పడింది. పూర్వ పరిచయం లేకపోయినా ఆ రోజు నుండి తరచూ కలిసేవారు. 1983 అక్టోబర్ 10న అక్కినేని నాగార్జున వివాహానికి రావల్సిందిగా స్వయంగా అక్కినేని వచ్చి పాండేని ఆహ్వానించారు. కానీ అదే రోజు కడప కార్యక్రమం అనివార్యమైంది. “రాత్రి పది గంటలకైనా రండి!” అని అక్కినేని చెప్పడంతో హుటాహుటిన అన్నపూర్ణ స్టూడియోకి చేరాము. ద్వారతోరణం వద్ద ఇటువైపు అక్కినేని, పక్కనే డి. రామానాయుడు మమ్మల్ని ఆహ్వానించారు. అదొక సినీ ప్రముఖ లోకం. ఆనందంగా గడిపాం.
కేశవ పాండే ఎప్పుడెప్పుడు ఢిల్లీ వెళ్ళిపోదామా? అని ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారు. అదే నెలలో వారి బ్యాచ్ వారికి డిప్యూటీ డైరక్టర్ జనరల్ ప్రమోషన్ మీటింగ్ జరిగింది. పాండేని అనర్హుణ్ణి చేయాలని పై అధికారి ప్రయత్నించి విఫలమయ్యారు. అక్టోబర్ 20 ప్రాంతాలకు ఢిల్లీ పని మీద వెళ్ళిన పాండే ప్రమోషన్ ఆర్డరు తీసుకొని అక్టోబరు 22న డి.జి.జి.గా చేరిపోయారు. ఆకాశవాణి అధికారి కది ఇష్టం లేదు గాబట్టి పాండేను దూరదర్శన్‍కు బదిలీ చేశారు. ఆ విధంగా మూడున్నర నెలల ప్రవాస జీవితానంతరం పాండే మళ్ళీ ఢిల్లీ చేరుకొన్నారు.
హైదరాబాదులో మళ్ళీ డైరక్టరు పోస్టు ఖాళీ అయింది. రాష్ట్ర రాజధానిలో సీనియర్ ఉండవలసిన అవసరం వుంది. లక్నో దూరదర్శన్‍లో పనిచేస్తున్న లీలా బవ్‌డేకర్‌ను డిసెంబరు 1983లో హైదరాబాద్ డైరక్టర్‌గా వేశారు. ఆమె లోగడ జర్నలిస్టుగా పనిచేశారు. యు.పి.యస్.సి. వారి ఎ.యస్.డి. పదవికీ, యస్.డి. పదవికీ అప్లికేషన్లు పంపింది. వయస్సు ఎక్కువ వుందని ఎ.యస్.డి. పోస్టుకు ఇంటర్వ్యూకి పిలవలేదు. అదృష్టం కలిసి వచ్చి నేరుగా డైరక్టర్‌గా సెలక్టు అయ్యింది. ఆమె బ్రహ్మచారిణి.
లీలా బవ్‌డేకర్ కఠోర పరిపాలన:
కొత్తగా వచ్చిన లీలా బవ్‌డేకర్ 1983 డిసెంబరు నుంచి 1985 జూన్ వరకు హైదరాబాదులో పనిచేసి భోపాల్ డైరక్టరుగా బదిలీపై వెళ్ళారు. 1988లో బొంబాయిలో డి.జి.జి. అయ్యారు. కొంతకాలానికి క్యాన్సర్ వ్యాధితో అకాలమరణం చెందారు. ఆమె ఉద్దేశంలో ఆకాశవాణి అధికారులు సరిగా పనిచేయడం లేదు. వారిపై పర్యవేక్షణ నేను సరిగా చేయడం లేదు. ప్రతి రోజూ జరిగే ప్రోగామ్ మీటింగులలో ఒకరోజు ఆమె రావూరి భరద్వాజను పరుషంగా మాట్లాడింది. హార్ట్ ప్రాబ్లమ్ వున్న ఆయన అక్కడే సోఫాలో సొమ్మసిల్లారు. వెంటనే వి.వి. శాస్త్రి నిజాం ఇన్‌స్టిట్యూట్ డాక్టర్‌కి ఫోన్ చేసి ఆఫీసు కార్లో భరద్వాజను తీసుకెళ్ళారు. 15 నిముషాలు ఆలస్యమయినా ప్రమాదం జరిగి వుండేదని హెచ్చరించారు. మా డైరక్టరు నన్ను తన రూం వద్దకు రమ్మని – “Is it because of me, he fell unconscious” అని గదమాయించింది. “యస్ మేడం!” అన్నాను నిబ్బరంగా. రెండు నెలలు నాతో మాట్లాడడం మానేసింది. ఒక రోజు నేను ఆమెతో మాట్లాడుతూ ఇలా అన్నాను – “నేను విధేయుడైన ఉద్యోగిని. బాస్ ఏది చెప్పినా ‘యస్’ అనడం అలవాటు. ఆ అలవాటు ప్రకారం ‘యస్’ అన్నాను. అంతే. మరోలా కాదు” అన్నాను. ఆమె పగలబడి నవ్వింది.
1984 సంవత్సరమంతా కత్తి మీద సాములో ఆఫీసులో నడక కొనసాగింది. ప్రోగ్రామ్ అధికారులు ఎదురుతిరగలేక ఆమె కఠోర దండనలకు తలఒగ్గారు. ఎలానైనా నేను ఈ బంధనాలు త్రెంచుకోవాలని నా వంతు కృషి చేశాను. అప్పట్లో డైరక్టరేట్‍లో మా ట్రాన్స్‌ఫర్లు చూసే అధికారి హెచ్.సి. జయాల్ ఒకసారి హైదరాబాదు వచ్చారు. నేను సఖ్యత పెంచుకొన్నాను. మా డైరక్టర్ బాధల నుండి విముక్తి కల్పించమన్నాను. ‘త్వరలో కొందరు సీనియర్. ఎ.ఎస్.డి.లకు డైరక్టర్‌గా ప్రమోషన్లు రాబోతున్నాయి. అప్పుడు మీ విషయం గుర్తు పెట్టుకొంటాన’న్నాడు. మాట నిలుపుకుని 1985 జనవరిలో నన్ను హైదరాబాదు వాణిజ్య విభాగం ఇన్‍ఛార్జ్ డైరక్టర్‌గా (ఎ.ఎస్.డి) వేశారు. దానితో బాటు ట్రయినింగ్ సెంటర్ డైరక్టరు పనులు అదనపు బాధ్యతగా ఇచ్చారు.
మిడతంభట్టు జోస్యం:
1984 జనవరిలో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ హైదరాబాదు పర్యటనకు వచ్చారు. అప్పటికే హైదరాబాద్ పర్యటనలో వున్న హెచ్.కె.ఎల్.భగత్ (సమాచార ప్రసార శాఖల మంత్రి), నేను, ఆయన ప్రైవేట్ సెక్రటరీ రామస్వామి బేగంపేట విమానాశ్రయం వెళ్ళాం. విమానం ల్యాండ్ కాబోతోంది. ఆమెకు స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రితో పాటు సమాచార శాఖ కమీషనరు పి.వి.ఆర్.కె. ప్రసాద్ హడావిడిగా వెళుతున్నారు. మంత్రి పి.యస్. రామస్వామి నన్ను పిలిచి – “You call PVRK Prasad” అని అదేశించాడు. నేను పట్టించుకోలేదు. అంత పెద్ద అధికారిని ఆ సమయంలో వెనుకకు పిలవడం భావ్యం కాదు. ప్రధాని దిగారు. స్వాగత సత్కారాలు పూర్తి అయ్యాయి. రామస్వామి నాపై కోపించాడు తన మాట వినలేదు అని. నాకు దిక్కు తోచలేదు. కార్లో ఎక్కగానే – “You will lose your job in six months” అన్నాను. ఆయన కోపం తారాస్థాయి నందుకొంది. భగత్‍పై కోర్టు కేసు తీర్పు వెలువడి ఆయన మంత్రి పదవి పోయింది. రామస్వామి నాకు ఫోన్ చేసి “మళ్ళీ ఎప్పుడు నా పదవి వస్తుంది?” అన్నాడు. నా జోస్యం అలా ఫలించింది. జ్యోతిష ప్రవేశం ఉపయోగపడింది.