ఎం.హెచ్‌.కె.-2

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ రచయిత సన్నిహిత్ వ్రాసిన “ఎం.హెచ్.కె.” అనే మినీ నవలని పాఠకులకు అందిస్తున్నాము. పల్లెటూరి రాజకీయాలు, అంతరిక్షపు కుట్రలతో ఆసక్తి చదివించే కథనంతో నడిచే సీరియల్‍లో ఇది రెండవ భాగం. [/box]

[dropcap]ఆ[/dropcap]ర్టీసీ బస్సు దడ దడ సౌండ్‌చేసుకుంటూ ఆ పల్లెటూరి రోడ్డు మీద ఆగింది. అందులో నుండి లగేజ్‌ బేగ్‌తో దిగాడు ఒక అందమైన యువకుడు. పొలాల్లో పని చేసుకుంటున్న ఆడ కూలీలు అతడి వైపు కళ్ళప్పగించి చూడసాగారు. అతడు నెమ్మదిగా ఊరి వైపు నడవసాగాడు.

“ఏంటో అసలే ఈ ఊరికి కొత్త తను. ఎక్కడ ఉండాలో ఏమిటో ” అని గొణుక్కుంటూ నడుస్తున్నాడు.

“ఎవరింటికి బాబూ తమరెళుతోంది? ” అంటూ ఒక పల్లెటూరి ఆసామి పరామర్శించాడు.

“నేను ఈ ఊరికి కొత్త. ఒక చిన్న పని మీద వచ్చాను. కొన్ని రోజులు ఉండటానికి ఏదైనా ఇల్లు అద్దెకు దొరుకుతుందా బాబాయ్‌?” అడిగాడు ఆ యువకుడు. పక పకా నవ్వాడు ఆ పల్లెటూరి ఆసామి. భుజం మీది తుండు గుడ్డను దులిపి –

“ఆ… ఇల్లంటే చెప్పలేను గానండీ… మీరు తిన్నగా ఎల్లి రఘురామయ్య గారిని కలవండి. ఆయనే ఏదో ఒక దారి చూపెడతారు” అంటూ సలహా ఇచ్చాడు.

“ఎవరబ్బా ఈ రఘురామయ్య. బహుశా చాలా గొప్పవాడేమో” అనుకుంటూముందుకు కదిలాడు ఆ యువకుడు.

***

“చెప్పు బాబూ… ఎవరు నువ్వు? ఈ ఊరు ఏ పని మీద వచ్చావు? ” సావధానంగా అడిగారు రఘురామయ్య తన ముందు వినయంగా నిలుచున్న యువకుడిని చూసి.

“నా పేరు కళ్యాణ్‌ అండి. మాది ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక సిటీ! పీజీ దాకా చదువుకున్నాను. ఒక రీసెర్చ్‌ పని మీద ఈ ఊరు వచ్చాను. కొన్ని రోజులు ఇక్కడ నేను ఉండాల్సిన పరిస్థితి. నాకు తలదాచుకోవడానికి మీరే ఒక చోటు చూపించాలి” అన్నాడు.

“దానికేముంది బాబూ. నాది లంకంత ఇల్లు. ఉండేది మేం ముగ్గురమే! మాతో పాటూ నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు. మొహమాట పడకు” అంటూ సెలవిచ్చారు.

“అలాగేనండీ! చాలా థేంక్స్‌! ” అంటూ తన లగేజ్‌ లోపల గదిలో పెట్టుకున్నాడు కళ్యాణ్‌. ఈ వ్యవహారం అంతా జనని గమనిస్తోంది. ఎందుకో కళ్యాణ్‌ని నమ్మబుద్ధి కాలేదామెకి. ‘ఇతడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి’ అనుకొంది.

రాత్రి భోజనాల దగ్గర అందరూ కూర్చున్నారు.

“ఆ అబ్బాయిని కూడా పిలవండి” అన్నారు రఘురామయ్య. పనివాడు రామయ్య వెళ్ళి కళ్యాణ్‌ని భోజనానికి రమ్మన్నాడు.

“అయ్యో… పర్వాలేదని చెప్పండి ” అన్నాడు కళ్యాణ్‌.

“అంతమాట అనకండీ.. అయ్యగారికి కోపమొస్తుంది.. తమరు రండి” అని మొహమాటపెట్టేసాడు రామయ్య. ఇక తప్పక వచ్చి కూర్చున్నాడు కళ్యాణ్‌.

రఘురామయ్య గారు “ఇప్పుడు నువ్వు మా ఇంటి సభ్యుడివే బాబూ.. మొహమాటం లేకుండా చక్కగా భోంచెయ్‌” అన్నారు.

“అలాగేనండీ..” అని తలవంచుకుని తినసాగాడు కళ్యాణ్‌.

అతడు తింటున్నంతసేపూ గమనించసాగింది జనని. ఆమె తనని గమనిస్తోందని కళ్యాణ్‌ కూడా పసిగట్టాడు. భోజనం అవగానే కొంచెం బ్రీత్‌ తీసుకోవడానికి బయటకు వచ్చాడు. కొత్త ఊరు.. కొత్త వాతావరణం.. ప్రతీదీ క్యూరియస్‌గా అనిపించసాగింది అతనికి. మెట్లెక్కి మేడ మీదకి వెళ్ళాడు. చుట్టూ చూసాడు.

చీకటి దుప్పటి కప్పుకున్న వృద్ధుడిలా ఉంది ఊరు. అక్కడక్కడ మిణుకు మిణుకుమని దీపాలు వెలుగుతున్నాయి. ఊరకుక్కల అరుపులు దూరం నుండి వినిపిస్తున్నాయి. ఊరి చుట్టూ పరుచుకున్న పొలాలు… వాటి గట్ల మీద ఠీవిగా నిలబడ్డ పొడుగాటి చెట్లు. పొలాల మీద దట్టంగా పరుచుకున్న చీకటి…. మనిషి మనసులోని అసందిగ్ధతలా ఉంది దృశ్యం.

ఆలోచిస్తున్నాడు కళ్యాణ్‌. ‘ఏదో రకంగా ఇక్కడ పాగా వెయ్యగలిగాను. ఇక చెయ్యాల్సిన పని చాలా ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా పని పూర్తి చెయ్యాలి’ మనసులో స్థిరంగా అనుకున్నాడు.

ఇంతలో.. ఆకాశాన్ని చీల్చుకుని కిందికి దిగుతున్నట్టు ఒక సన్నని వెలుగు రేఖ నేల వైపు వచ్చి పొలాల్లో మాయమైంది. ఇదంతా క్షణ కాలంలో జరిగింది. మొదట తన భ్రమేమో అనుకున్నాడు.. కానీ అది నిజం అని తెలియడానికి కాసేపటి తర్వాత ఒక సంఘటన జరిగింది.

పొలాల మీద వృత్తాకారంలో పెద్ద వెలుగు వ్యాపించింది. ఆ వెలుగులో ఏవేవో నీడలు. అంత స్పష్టంగా లేవు కానీ… ఏదో అసంబద్ధత! ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి ఆ వెలుగు మాయమైంది. బలంగా నిశ్వసించాడు కళ్యాణ్‌. వెనక్కి తిరిగి తన రూముకి వచ్చేసాడు. తలుపేసుకోబోతూ చూస్తే – దూరం నుండి జనని తననే గమనించడం కనిపించింది. క్షణం సేపు ఆమెను సూటిగా చూసి తలుపు మూసేసాడు.

***

బెడ్‌మీద బోర్లా పడుకుని… పిల్లోని హత్తుకుంది జనని. మనసులో ఏదో కదలిక.. ఇదీ అని చెప్పలేని భావం. ఒంటి మీద కొచ్చిన వయసు కొత్త కొత్త అనుభూతులని పరిచయం చేస్తోంది. ‘ఈ వయసులో ఎవరిని చూసినా అందంగా కనిపిస్తారు’ అని అంటూ ఉంటారు అనుభవజ్ఞులు.. కానీ జనని మరీ అంత వీక్‌ కాదు. కళ్యాణ్‌ తొలిచూపులోనే ఆమెకి నచ్చాడు. కానీ.. ఇంకా అతని గురించి ఏమీ తెలియదు కదా! తొలిచూపు ప్రేమ గొప్పదే.. అయితే అతని నిజ వ్యక్తిత్వం తెలియకుండా ప్రేమించడం మూర్ఖత్వం కాక మరేమిటి ? ఇలా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు!

తన రూములో.. సీరియస్‌గా డైరీ వ్రాస్తున్నాడు కళ్యాణ్‌. ఈ రోజు ఎదురైన అనుభవాలని పొందు పరుస్తున్నాడు.

“ఆకాశం నుండి నేలకు దిగిన వెలుగు రేఖ.. దాని వెంబడే కనపడిన నీడలు.. గ్రహాంతర వాసుల కదలికలు కనిపించాయి. అయితే ఈ ప్రాంతాన్నే ఎందుకు సెలెక్ట్‌చేసుకున్నారో తెలియాలి. అసలు ఏ పర్పస్‌ మీద ఇక్కడికి వస్తున్నారో అర్థం కావాలి” అని వ్రాసుకున్నాడు.

డైరీ మూసేసి బెడ్‌మీద వాలిపోయాడు.

కళ్ళు మూసుకోగానే అందమైన ‘జనని’ రూపం సాక్షాత్కరించింది. ముఖ్యంగా ఆమె కళ్ళు. తనలోని ఇంకెవరినో శోధిస్తున్నట్టుగా బలంగా గుచ్చుకుంటున్నాయి. మళ్ళీ మళ్ళీ ఆ కళ్ళను చూడాలని అనిపిస్తోంది. ఆమె గురించి తెలుసుకోవాలని అనిపిస్తోంది. కానీ అది తప్పు కదా! తనను నమ్మి రఘురామయ్య గారు ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు ఆమెను ప్రేమలోకి దించితే తిన్న ఇంటి వాసాలని లెక్కించినట్టువుతుంది. ‘సరే.. జననికి వీలైనంత దూరంగా ఉందాం’ అని నిర్ణయించుకున్నాడు. తర్వాత ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. అయితే జనని అతన్ని అంత ఈజీగా వదలదని తెలిసిన కాలం మాత్రం గమ్మత్తుగా నవ్వుకోసాగింది.

***

తెల్లగా తెలవారింది. బద్దకంగా లేచాడు కళ్యాణ్‌. అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ లేచి తమ తమ పనుల్లో మునిగి పోయారు.

పనివాడు రామయ్య వచ్చి “బాగా నిద్రపట్టిందా అండీ..” అంటూ కాఫీ గ్లాసు అందించాడు.

“ఓ.. బ్రహ్మాండంగా” అని కాఫీ గ్లాసు అందుకుని సిప్‌ చెయ్యసాగాడు కళ్యాణ్‌. రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చుట్టూ చూసాడు కళ్యాణ్‌. జనని దూరంగా వంట గదిలో బిజీగా ఉంది. రఘురామయ్య గారు ఊరి పెద్దలతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. పాలేర్లు.. పని వాళ్ళు ఇంటి పనుల్లో పడి అటూ ఇటూ తిరుగుతున్నారు. తీరిగ్గా బాత్రూములో దూరి ఫ్రెష్ అయ్యాడు. తర్వాత సావిత్రమ్మ గారు వడ్డించిన ఇడ్లీలు కడుపునిండా తిని బయటకు వచ్చి అలా పొలాల వైపు నడవసాగాడు. ‘రఘురామయ్య గారి దయవల్ల తిండికీ, తలదాచుకోవడానికీ కొదవలేకుండా పోయింది. హాయిగా తన రీసెర్చ్‌ వర్క్‌ చేసుకోవచ్చు’ అని నవ్వుకున్నాడు. అలా.. నడుచుకుంటూ నడుచుకుంటూ రాత్రి తను ఏలియన్స్ కదలికలను చూసిన స్పాట్‌కి వచ్చాడు.

ఎటువంటి అనుమానాస్పదమైన ఆనవాళ్ళు కనిపించలేదక్కడ. అంతా మామూలుగానే ఉంది. ‘ఇది ఎలా? కనీసం ఏదో ఒక తేడా కనిపించాలి కదా!’ అని ఆశ్చర్యపోయాడు కళ్యాణ్‌. ‘బహుశా తన చూసింది భ్రమ కాదు కదా!’ అన్న సందేహం కూడా కలిగింది అతనికి. దూరంగా లేడి పిల్లలా ఎగురుకుంటూ పొలాల్లో పడి తన వైపే వస్తున్న జనని కనపడింది. ఆమె దగ్గరకు రాగానే – “ఏంటండీ.. మీరు కూడా మా బాట పట్టారు” టీజింగ్‌ అన్నాడు కళ్యాణ్‌.

“ఆ.. మీరిక్కడ ఏ ఘనకార్యం వెలగబెడుతున్నారో చూద్దాం అని…” అంది. “ఇంతకీ ఎంతవరకు వచ్చింది మీ రీసెర్చ్ పని” అంటూ ఆట పట్టించింది.

‘ఇంట్లో ఉన్నప్పుడు కేర్‌ చెయ్యదు కానీ ఇక్కడ బాగానే మాట్లాడుతోంది’ అనుకుంటూ “ఆ… ఏదో అవుతోంది లెండి” అంటూ నవ్వేసాడు.

“ఆహా.. సరే… మీ రీసెర్చ్‌ దేని మీదన్నారు?”

“ఇప్పటివరకూ నేనేమీ అనలేదండీ… ఇప్పుడు చెబుతాను… ఆంత్రోపాలజీ మీద చేస్తున్నాను.”

“ఓహో… అలాగా” అంది. “సరే… ఈ ఊరు మీకు నచ్చిందా?” అంటూ సంభాషణ పొడిగించింది.

“ఈ ఊరు నచ్చింది. మీ ఇల్లు నచ్చింది.. మీరంతా నాకు నచ్చారు” అంటూ తన్మయంగా చెప్పాడు

“వెరీ గుడ్‌… వెరీ గుడ్‌” అంటూ తనూ నవ్వేసింది జనని. తర్వాత ఇద్దరూ నడుచుకుంటూ అలా పక్కనే ఉన్న మామిడి తోపు లోకి వచ్చేసారు.

“కళ్యాణ్‌… మీరు సిటీలో పుట్టి పెరిగారు.. మా పల్లెటూరి వాళ్ళను చూస్తే చిరాగ్గా ఉంది కదా!” నెమ్మదిగా అంది.

“అయ్యయ్యో.. నేను కూడా పుట్టి పెరిగింది పల్లెటూళ్ళోనే అండి. కాకపోతే చదువు కోసం సిటీకి వచ్చాను. పల్లెలన్నా.. అక్కడి మనుషులన్నా నాకు చెప్పలేనంత అభిమానం” నర్మగర్భంగా అన్నాడు.

“ఆహా.. నిజమా!”

“నిజమే.. అందులోనూ మీ లాంటి అందమైన ఆడపిల్లంటే ఇంకా అభిమానం.”

“అబ్బో… అబ్బాయి గారికి ధైర్యం ఎక్కువవుతోందే” కొంటెగా అంది

“ఆ మాత్రం ధైర్యం చెయ్యకపోతే ఈ మగ జన్మ ఎందుకు!” రోషంగా అన్నాడు.

“ఓకే.. ఓకే.. కూల్‌డౌన్‌!…” అంటూ వెళ్ళిపోతూ “..ఆల్‌ద బెస్ట్‌!” అంది. చిన్నగా నవ్వుకున్నాడు కళ్యాణ్‌.

రెండు భిన్న ధృవాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం ఏ ప్రణయ తీరాలకి దారి తీస్తుందో కాలమే నిర్ణయించాలి.

***

ఊరి మధ్య.. రచ్చ బండ..

శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్టు కింద ఊరి జనమంతా గుమిగూడారు.

“ఏంటి విషయం..?” ఎవరో రైతు అడిగాడు.

పక్కనున్న ఇంకో రైతు “ఎవరో పెద్దాయన వత్తన్నాడట… ఏదో సెపుతాడట….” అన్నాడు గుసగుసగా !

కాసేపటికి అందరూ రావడం జరిగింది. రఘురామయ్య గారు కూడా వచ్చారు. పాలేరు వేసిన కుర్చీలో కూర్చున్నారు.

ఇంతలో ఒక పెద్ద కారు ఊరిలోకి ప్రవేశించి రచ్చబండ దగ్గరికి వచ్చింది. అందులో నుండి ఆజానుబాహుడైన ఒక వయసు మళ్ళిన వ్యక్తి ఠీవిగా దిగాడు. వస్తూనే ఆయన రఘురామయ్య గారికి నమస్కరించాడు.

ఊరి ప్రెసిడెంట్‌ “నమస్కారమండీ.. స్వాగతం” అని మర్యాద చేసాడు అతనికి.

“నమస్కారం..” అని పక్కనే ఉన్న కుర్చీలో ఆసీనుడయ్యాడు ఆ పెద్దాయన! అతని పేరు ‘విష్ణువర్ధనరావు’. సిటీ లోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌! ఆ ఊరికి దగ్గర్లో ఒక ఫేక్టరీ పెట్టాలన్నది అతని ఆలోచన. అయితే ఉన్న ఆటంకమల్లా స్థలం సరిపోకపోవడం. ఇంకొంచెం స్థలం కావాలంటే తప్పని సరిగా ఆ ఊరి రైతుల పొలాలని కొనాలి. ఇప్పుడు ఆ పని మీదే వచ్చాడు. రైతులను ఒప్పించే బాధ్యత ప్రెసిడెంట్‌గారు తీసుకున్నారు. అందుకే ఈ రచ్చబండ సమావేశం! ప్రెసిడెంట్‌గారు చెప్పడం ప్రారంభించారు.

“రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈ విష్ణువర్ధనరావు గారు పెద్ద పారిశ్రామికవేత్త! మన బాగు కోరే మనసున్న మంచి వ్యక్తి. మన ఊళ్ళో నుండి ఎంతో మంది యువకులు ఉపాధికోసం పట్టణాలకి తరలిపోతున్నారు. అది మనందరికీ ఎంతో బాధ కలిగించే విషయం. అందుకే ఈయన మన ఊరి పక్కనే ఒక పరిశ్రమ స్థాపించాలని అనుకుంటున్నారు. దానికి మనందరి సహకారం కావాలి. అయితే ఒక చిన్న సమస్య వచ్చింది. పరిశ్రమ పెట్టడానికి ఆయన తన పొలాలని త్యాగం చేస్తున్నారు. కానీ ఇంకా కొంచెం స్థలం కావాల్సి ఉంది. అందుకే.. అందుకే.. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని… మీ పొలాల్ని ఆయనకు అమ్మితే…” ఆగారు.

జనాల్లో కలకలం… వాళ్ళలో వాళ్ళే ఏదో మాట్లాడుకుంటున్నట్టు అలజడి… ఒక్కొక్కరుగా లేచి వెళ్ళిపోసాగారు. ప్రెసిడెంట్‌గారు “..దయచేసి ఆగండి… ఆగండి” అంటూ ఏదో చెబుతున్నారు. కానీ ఎవ్వరూ ఆగలేదు. అందరూ వెళ్ళిపోయాక విష్ణువర్ధనరావు, ప్రెసిడెంట్‌, రఘురామయ్య గారి దగ్గరకు వచ్చారు.

విష్ణు వర్ధనరావు “రఘురామయ్య గారూ… మీరైనా కొంచెం వాళ్ళకి నచ్చచెప్పండి” అని బ్రతిమాలుకున్నాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆయనకి. కూడు పెట్టే పొలాన్ని ఎవడు అమ్ముకుంటాడు. అందుకే –

“సరే లెండి.. చూద్దాం” అని చెప్పి అక్కడి నుండి ఇంటి వైపు కదిలారు.

విష్ణువర్ధనరావు కూడా “ఏదో రకంగా పని అయ్యేలా చూడండి” అని ప్రెసిడెంట్‌తో చెప్పి అసంతృప్తితో కారెక్కి వెళ్ళిపోయాడు.

అప్పటి దాకా చెట్టు పైన కూర్చున్న పక్షులు టపా టపా శబ్దం చేసుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోయాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here