కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 32

0
3

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

కాశీలో అన్నదానము:

కాశీ మహా క్షేత్రము మహాశక్తివంతము. కాశీ క్రేంద్రంగానే కాక దగ్గరగా కూడా ఎన్నో శక్తి దేవాలయాలు వున్నాయి. అందునా మనము దక్షిణభారతము నుంచి కాశీకి వెడితే, ఆ చుట్టుప్రక్కల తప్పక చూడవలసిన కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ‘గయ’ ఒకటి.

గయలో ముఖ్యమైనవి చూడటానికి ముచ్చటగా మూడు. అమ్మవారి దేవాలయము, విష్ణుగయ/పాదగయ, బోధగయ.

అమ్మవారు ‘సతి’గా అవతారము దాల్చి దక్షయజ్ఞములో తన అవతార పరిసమాప్తి చేశాక, శివుడు సతి శరీరమును భుజముపై వేసుకు తిరుగుతుంటాడు. మహావిష్ణువు సతి శరీరమును సుదర్శనముతో ఖండించాడని, ఆ శరీర భాగాలు భారతావని అంతటా పడి శక్తి క్షేత్రాలయినవని మనకు ‘దేవి భాగవతము’ చెబుతుంది. కాశీలో అమ్మవారి అక్షులు పడ్డాయి. అందుకే అమ్మవారు విశాలాక్షి. అలాగే గయలో అమ్మవారి పాలిండ్లు పడ్డాయి. అక్కడ అమ్మవారు “మంగళగౌరి”.

మంగళకరమైన గౌరిగా, లోకాన్నీ పోషించి, పాలించు జగదంబ శక్తి క్షేత్రం ‘గయ’.  గయ వారణాసికి 250 కి.మీ. దూరములో వుంది. ఒకరోజులో వెళ్ళిరావచ్చును.

మంగళగౌరిగా అమ్మవారిని మనము నోచుకుంటాము. ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్ళికాగానే మంగళగౌరి నోములు నోస్తారు. అటువంటి తల్లి అంత దగ్గరగా వెలిసివుంటే, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటై వున్న ఆ తల్లి దర్శనము చేసుకోవాలని మనసులో కోరిక నిలువనీయలేదు. అప్పటికే నే వారణాశి వచ్చి ఇరవై రోజులయ్యింది. కాశీ చుట్టు ప్రక్కల ఎన్నో వున్నా నేను కేవలము గయకు మాత్రమే వెళ్ళాలనుకోవటానికి కారణము వుంది. అమ్మవారి దర్శనముతో పాటు, ప్రపంచానికి శాంతిని, అహింసనూ బోధించి, మరొక శాంతి మతం పుట్టుటకు కారణమైన బోధి వృక్షాన్ని దర్శించాలనుకోవటము.  అందుకని ఒక కారు పట్టుకు ముందుగా మంగళగౌరి దర్శనానికి ఉదయము 4 గంటలకు బయలుదేరాను.

“శ్రీ మంగళే సకల మంగళ జన్మభూమే
శ్రీ మంగళే సకలకల్మషతూలవహ్నే।
శ్రీ మంగళే సకలదానవ దర్పహన్త్రి
శ్రీ మంగళేఽఖిల మిదం పరిపాహి విశ్వమ్॥”

ఐదుగంటల రోడ్డు ప్రయాణము. రోడ్డు హైవే అయినా కొంత మేర మాత్రం చాలా పాడయివుంది. మిగిలిన ప్రయాణము పర్వాలేదనిపించింది. అమ్మవారి దేవాలయము ఒక చిన్నగుట్ట మీద వుంది. రోడ్డు దేవాలయానికి చాలా దగ్గర వరకూ వుంది. మనము అర కిలోమీటరు దూరము మెట్లు మీదుగా ఎక్కాలి. పైకి వెళ్ళాక దేవాలయ ప్రాంగణము, యాగశాల, పెద్ద అశ్వర్థవృక్షముల మధ్య అమ్మవారి దేవాలయము. చండీహోమము జరుగుతోంది. సప్తశతీ పారాయణము చేస్తూ వేదబ్రాహ్మణులు కనిపించారు. వారు దాదాపు ఒక పది మంది సప్తశతీ చదువుతూ వుంటే మధ్యలో చండీ హోమము జరుగుతోంది.

యాగశాల బయట వున్న పెద్ద అశ్వర్థ వృక్షము ఎన్ని యుగాలదో అన్నట్లు వుంది. ఆ చెట్టు నీడన చిన్న శివాలయము. ఆ ప్రాంగణములో మధ్యన అమ్మవారి దేవాలయము. అమ్మవారి దేవాలయము రెండు చిన్న గోపురాలతో వుంది. దేవాలయము అంతర, బహిర్‌ దేవాలయాలలా కాకుండా అంతా కలిపి ఒక చిన్నగది తరువాత గర్బాలయం వుంది. లోపలి స్థలము కూడా చాలా తక్కువగా వుండి, ఎత్తుకూడా ఎక్కువగా లేదు. మనము తల వంచుకొని లొపలికివెళ్ళి, నమస్కారము చేసి బయటకు రావాలి. గర్భ గుడిలో కేవలము నలుగురు మాత్రమే పడతారు. అదీ లోపలికి వెళ్ళాక నమస్కారము చేసి బయటకు రావటమే, లోపల నిలబడలేము. లోపల అంటే, గర్భగుడి 6×6 వుంటుంది. మధ్యలో పెద్ద ప్రమిద. జ్యోతి వెలుగుతున్న ఒత్తితో వెలుగులు నింపుతున్నది. ఆ దీపపు పాదాల వద్ద నేలమీద చిన్న దస్తీ పట్టేటంత స్థలములో అమ్మవారి శక్తి పీఠమట. విగ్రహము లేదు, మరేమీ గుర్తులు లేవు. ఆ స్థలము శక్తి క్రేంద్రము. అక్కడ జ్యోతిని పెట్టి, ఆ నేలను పూజిస్తున్నారనిపించింది.

నే తీసుకెళ్ళిన పూలు, చిన్న వస్త్రం అక్కడ ఆ చిన్న చత్రురస్రం పై పరచి, నా గోత్రనామాలతో సంకల్పము చెప్పారు పూజారి. నేను బయటకు వచ్చి ప్రక్కన వున్న చిన్న వరండాలలో ఒక దానిలో దీపము వెలిగించి, జగదంబను ప్రార్థించాను. నా జపము కొంత చేసుకొని, పారాయణం చేసి నాకు కుదిరిన దానము దేవాలయం ఆఫీసులో కట్టి, అక్కడ్నుంచి విష్ణుగయకు బయలుదేరాను.

హిందువులకు విష్ణుగయతో ఎంతో విశిష్టమైన సంబంధముంది. గయాసురుడనే రాక్షసుడు పూర్వం ప్రజారంజకముగా పరిపాలిస్తూ వుండేవాడుట. ఆయన తపస్సుతో ఎంతో శక్తి సంపాదించి, ప్రపంచములో అతి పవిత్రమైన ప్రదేశము తన శరీరమగునట్లు వరము పొందాడు. ఆ వరముచే అష్టదిక్పాలకులను తన చేతులలో పెట్టుకు పాలించటము మొదలెట్టాడట. ఎంత వెతికినా గయాసురుడు చేసిన తప్పులేదు. అలా ఎంత జనరంజకముగా ధర్మాత్మకముగా  పరిపాలిస్తున్నా, ఇంద్రుడు తన పదవి కొల్పోయినందున త్రిమూర్తుల వద్ద మొరపెట్టాడుట. వారు ఇంద్రపదవి తిరిగి ఇంద్రునికి ఇప్పించటానికి గయాసురుని వద్దకు వెళ్ళారు ఋషుల వేషములో.

గయాసురుడు వారికి స్వాగతమని, సేవలు చేసి ఏం కావాలో కోరుకోమన్నారు. వారు ఒక యజ్ఞం తలపెట్టామని పవిత్రమైన ప్రదేశము కావాలని కోరారు. ఆయన ఏ ప్రదేశము కావాలో కోరుకోమంటాడు. వారు గయాసురుని శరీరమే అతి పవిత్రం కాబట్టి ఆయన మీదనే ఏడు దినములు యజ్ఞం చేస్తామని, మధ్యలో కదలకూడదని, కదిలితే వధిస్తామని చెబుతారు. గయాసురుడు వప్పుకుంటాడు. ఆరు రోజులవుతుంది. గయాసురుడు కదలడు. యజ్ణం సాగుతూనే వుంటుంది. ఏడవ రోజున శివుడు కోడి వేషములో వచ్చి సూర్యోదయమునకు ముందే కూస్తాడు. గయాసురుడు ఏడు దినములైనవని తలచి లేస్తాడు. మధ్యలో కదిలాడని ఆయనను వధిస్తారు త్రిమూర్తులు. గయాసురుడు తన పేరు నిలబడేలా వరం కోరుకుంటాడు విష్ణువును. అలాగే అని వరమిస్తాడు మురారి.

గయాసుర పేరున  శిరో గయా( బీహారు) నాభి గయ (ఒరిస్సా) పాదగయలు (పిఠాపురము) ఏర్పడినాయి. విష్ణువు పాదము ముద్రల వద్ద పిండ కత్రువు చేసి, దానము చేసుకుంటే మరణించిన పెద్దలకు ఉపశమనము కలుగుతుందని చెబుతారు. గయలో స్పష్టంగా వున్న విష్ణువు పాదము వద్ద ఈ కార్యక్రమము చేస్తారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here