[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 23వ భాగం. [/box]
34
[dropcap]ఆ[/dropcap]దివారం రాత్రి భోజనాలయిన తరువాత వాళ్ళు ముగ్గురు టెంట్లకు ముందున్న ఆవరణలో కూర్చున్నారు.
నాగార్జున కొండలోయకు మూడు వేపుల నల్లమల శ్రేణి ఉంది. పడమట కృష్ణానది ప్రవహిస్తున్నది. తూర్పున కొండలు, ఉత్తర దక్షిణాలలో కొండలు, తూర్పు నుండి రావలసిన చలిగాలిని కొండలు అడ్డుతున్నాయి. ఉత్తరం నుంచి కూడా చలిగాలి అంతగా రావడం లేదు.
ముగ్గురూ మూడు వాలు కుర్చీల మీద కూర్చున్నారు. ఫిరంగి మోటు వెనక వెన్నెల తచ్చాడుతున్నది. చీకటిలో వంటలు వండుకుంటున్న కర్రమంటలు లంబాడీ గూడెం గుడిసెలలో కనిపిస్తున్నాయి.
“మీరు, ఏ విధంగా సంఘం, క్రమంగా అభివృద్ధి చెందిందో చెప్పారు. భిక్షువుల దైనందిన జీవితం గురించి, ఆహార విహారాల గురించి చెప్పలేదు. సంఘంలో భిక్షువులే కాకుండా భిక్షుణులు కూడా ఉండేవారని చెప్పారు. వారి విధులేవో కొంచెం విపులంగా చెప్తే సంతోషిస్తాను” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.
“నాకు కూడా భిక్షుణుల గురించి తెలుసుకోవాలని ఉంది” అంది
“మహావర్గంలో భిక్షువుల దుస్తుల గురించి ఉంది. క్షుల్లవర్గంలో భిక్షుణుల విధుల గురించి ఉంది. భిక్షువుల దుస్తుల గురించి మహావర్గంలో చెప్పడానికి ముందు జీవక కుమారభృత్యుడి గురించి వివరించాలి. అతని వృత్తాంతం చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది” అన్నాడు మోహన్.
“సావధానులమై వింటాం” అన్నారు మిగిలిన ఇద్దరూ.
మోహన్ చెప్పటం ప్రారంభించాడు:
అప్పుడు పూజనీయుడైన బుద్ధుడు రాజగృహంలో, వేలువనంలో, కలందక నివాసంలో ఉండేవాడు. ఆ సమయంలో వేశాలి సంపన్నమైన, వర్థిల్లుతున్న పట్టణంగా ఉండేది, ప్రజలు కిక్కిరిసి ఉండేవారు. ఆహారం
సమృద్ధిగా లభించేది. అక్కడ ఏడు వేల ఏడు వందల ఏడు, అంతస్తులు గల భవనాలుండేవి, గోపురాలు గల భవనాలు ఆ సంఖ్యలోనే ఉండేవి,
అదే సంఖ్యలో ఆరామాలు, తామర కొలనులు ఉండేవి. ఆమ్రపాలి అన్న గణిక ఉండేది. ఆమె సుందరమైనది, విలాసవతి, మనోజ్ఞమైనది, ఆమె దేహచ్చాయ అత్యంత మనోహరమైనది. ఆమె బాగా నాట్యం చేస్తుంది, పాడుతుంది, వీణ వాయిస్తుంది. ఆమెను వాంఛించేవారు ఒక రాత్రికి ఏభై కహాపణాములు సమర్పించేవారు. ఆ యువతి వలన వేశాలి మరింతగా అభ్యుదయం చెందింది.
ఏదో వ్యాపారం మీద వర్తకుడొకడు వేశాలి వెళ్లాడు. ఆ సంపన్నమైన పట్టణాన్ని అతను దర్శించాడు. వేశాలికి శిరోభూషణమైన ఆమ్రపాలిని గురించి ఆకర్షించాడు. అతడు తన వ్యాపారం ముగించుకొని రాజగృహానికి మరలిపోయాడు. మగధరాజు సేనియ బింబిసారుడిని, రాజభవనంలో దర్శించాడు. “ఓ ప్రభువా! వేశాలి సంపన్నమైన పట్టణం. అక్కడ ఆమ్రపాలి అన్న గణిక ఉంది. ఆమె వలన మరింతగా ఆ పట్టనం అభ్యుదయం పొందుతున్నది. ప్రభువువారు అనుగ్రహిస్తే, మనం కూడా అటువంటి గణికను ప్రతిష్ఠించుదాం”.
“మంచిది. ఓయి ఉత్తముడా! గణికగా ప్రతిష్ఠించడానికి యోగ్యమైన అమ్మాయి కోసం చూడవలసింది” అన్నాడు రాజు.
ఆ సమయానికి రాజగృహంలో సాలవతి అన్న పేరుగల అమ్మాయి ఉండేది. ఆమె అందమైనది, విలాసవతి, మనోజ్ఞమైనది. ఆమె శరీరచ్చాయ మనోహరమైనది. సాలవతిని, ఆ వర్తకుడు, గణికగా ప్రతిష్ఠించాడు.
కొద్దికాలంలోనే, గణిక సాలవతి ఆట, పాట, వీణ వాయించడం నేర్చుకుంది. ఆమెను కోరినవాళ్ళు రావడం మొదలు పెట్టారు. ఆమె ఒక రాత్రికి నూరు కహాపణాలను తీసుకునేది. కొద్దికాలంలోనే ఆమె గర్భం ధరించింది ఆమె అనుకొంది:
“గర్భం ధరించిన వనితను పురుషులు ఆమోదించరు. ‘గణిక సాలవతి గర్భం ధరించింది’ అని వారికి తెలిస్తే నా పరిస్థితి తారుమారవుతుంది. ప్రజలలో నేను అనారోగ్యంగా ఉన్నానని చెప్తే ఏమవుతుంది?”
ఆమె ద్వారపాలకుడిని పిలిచి చెప్పింది. “ఓ ఉత్తముడా! ఎవరిని లోపలకి రానీయవద్దు. ఎవరేనా నా గురించి అడిగితే నా ఆరోగ్యం బాగులేదని చెప్పు.”
ద్వారపాలకుడు ఆమె ఆజ్ఞను శిరసావహించాడు.
తొమ్మిది నెలల నిండిన తరువాత సాలవతి ఒక మగ పిల్లాడిని కన్నది. ఆమె తన పరిచారికను పిలిచి ఆ పురిటి బిడ్డను గంపలో పెట్టి చెత్తకుప్పమీద పారేయమంది. ఆ పరిచారిక ఆ విధంగానే చేసింది.
అపుడు రాజకుమారుడు అభయుడు, బింబిసారుని పుత్రుడు, రాజు దగ్గిరికి ఆ పక్కనుంచి వెళ్తున్నాడు. ఆ చంటి పిల్లాడి చుట్టూ కాకులు మూగి ఉండడం చూశాడు. ఆ సంగతి తన మనుషులను అడిగాడు.
“ప్రభువా! ఆ శిశువు ఒక మగబిడ్డడు” అన్నారు వాళ్ళు.
“వాడు బ్రతికే ఉన్నాడా?”
“ప్రభువా! వాడు బ్రతికే ఉన్నాడు”.
“అయితే వాడిని మన రాజభవనానికి తీసుకుపోయి దాదుల కిచ్చి పెంచమని చెప్పండి.”
రాజకుమారుడి ఆజ్ఞను పరిచారకులు పాలించారు. ఆ బాలుడిని రాజకుమారుడి భవనానికి తీసుకుపోయి దాదులకిచ్చి పెంచమన్నారు.
ప్రజలు, ఆ బాలుడు జీవించి ఉన్నాడని చెప్పడం చేత, జీవకుడని పేరు పెట్టారు. కొంతకాలంలో అతడు పెరిగి పెద్దవాడయాడు. ఒక దినాన జీవకుడు రాజపుత్రుడు అభయుని సమీపించి అతనిని అడిగాడు – “నా తల్లి ఎవరు? ఓ ప్రభువా, నా తండ్రి ఎవరు?”
“నాకు నీ తల్లి ఎవరో తెలియదు. కాని, నేను నీ తండ్రిని, నేను నిన్ను పోషిస్తున్నాను.”
జీవకుడు ఈ విధంగా తలంచాడు.
“ఈ రాజకుటుంబాలలో, ఏదేనా కళ తెలియనిదే జీవితం గడపడం కష్టం. నేనొక కళను నేర్చుకుంటే ఎలాగుంటుంది!”
ఆ కాలంలో తక్కసిల (తక్షశిల)లో ఒక ప్రపంచ విఖ్యాతుడైన వైద్యుడొకడు ఉండేవాడు. రాజపుత్రుడు అభయుడి దగ్గర సెలవు తీసుకోకుండా తక్షశిలకు జీవకుడు బయలుదేరాడు. ఒకచోటునుండి మరొక చోటుకి పోతూ అతడు తక్షశిలకు వచ్చాడు, ఆ వైద్యుడిని కలుసుకున్నాడు. వైద్యుని సమీపించి అన్నాడు.
“నేను మీ కళ, వైద్యవిద్యను, నేర్చుకోగోరుతున్నాను”.
“బాగు, స్నేహితుడా, జీవకా! నేర్చుకో”
జీవకుడు ఎంతో నేర్చుకున్నాడు, చాల సులభంగా నేర్చుకున్నాడు, బాగా అర్థం చేసుకున్నాడు, తాను నేర్చుకుననది మరచిపోలేదు. ఆ విధంగా ఏడు సంవత్సరాలు గడిచాయి. అపుడు జీవకుడు అనుకున్నాడు.
“నేను చాలా అధికంగా నేర్చుకున్నాను. నేను బాగా అర్థం చేసుకొంటున్నాను. నేను నేర్చుకున్నది మరచిపోలేదు. నేను ఏడు సంవత్సరాల బట్టి విద్యను అభ్యసిస్తున్నాను. నాకెపుడు ఈ కళకు అంతం కనిపిస్తుంది?”
జీవకుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి కలిశాడు.
“నేను చాలా హెచ్చుగా నేర్చుకుంటున్నాను! నేను ఏడు సంవత్సరాలుగా విద్య నేర్చుకుంటున్నాను. ఈ కళకు అంతేదీ కనిపించడం లేదు. నాకీ అంతం ఎప్పుడు కనిపిస్తుంది?”
“బాగు, ప్రియజీవకా! ఈ గడ్డపార తీసుకో. తక్షశిలకు చుట్టూ ఒక యోజనం దూరంలో వెదకు. మందుకు పనికిరాని మొక్క ఏదైనా ఉంటే, దానిని నా దగ్గరికి తీసుకురా!”
జీవకుడు ఈ ఆజ్ఞను శిరసావహించాడు. తక్షశిల చుట్టూ ఒక యోజనం దూరంలో, గడ్డపార పట్టుకొని వెతికాడు. అతనికి, ముందుకు పనికిరాని మొక్క ఏదీ కనిపించలేదు. అతడు ఆచార్యుని సమీపించి అటువంటి మొక్క ఏదీ తక్షశిలకు యోజనం దూరంలో కనిపించలేదని చెప్పాడు.
ఆచార్యుడు అన్నాడు:
“జీవకా! నీ విద్య పూర్తయింది. నీ జీవితాన్ని సాగించడానికి ఇది సరిపోతుంది.”
ఈ విధంగా చెప్తూ ఆచార్యుడు జీవకుడికి కొద్దిగా, ప్రయాణం కోసమని, డబ్బు ఇచ్చాడు.
ఆ కొద్దిపాటి ధనాన్ని, ప్రయాణం కోసం ఇచ్చిన దానిని, స్వీకరించాడు అతడు. రాజగృహానికి ప్రయాణమయాడు.
దారిలో సాకేతం చేరేసరికి జీవకుని దగ్గిర ఉన్న కొద్దిపాటి ధనం వ్యయమయింది. జీవకుడు ఈ విధంగా ఆలోచించాడు.
“అడవి దారుల వెంట ప్రయాణం చేయాలి. అక్కడ నీళ్లు, ఆహారం దొరకవు ధనం లేకుండా ప్రయాణం చేయడం కష్టం. నా ప్రయాణం కోసమని కొంత ధనం సంపాదిస్తే ఏమవుతుంది?”
ఆ సమయంలో, సాకేతంలో, ఒక శ్రేష్ఠి భార్య, శిరోరోగంతో ఏడు సంవత్సరాలయి బాధపడుతున్నది. చాలా మంది ప్రపంచవిఖ్యాతులైన వైద్యులు వచ్చారు. కాని వారు ఆమె రోగాన్ని కుదర్చలేకపోయారు. వాళ్ళు చాలా బంగారం గ్రహించి వెళ్ళిపోయారు.
జీవకుడు సాకేతంలో ప్రవేశించి అక్కడి ప్రజలను అడిగాడు:
“ఈ నగరంలో ఎవరు రోగంతో ఉన్నారు? అయ్యలారా, నేను ఎవరికి చికిత్స చేయాలి?”
“వైద్యుడా! ఆ శ్రేష్ఠిగారి భార్య, ఏడు సంవత్సరాల నుండి శిరోరోగంతో బాధపడుతున్నది. నువ్వు ఆమె దగ్గరికి పోయి చికిత్స చేయవలసింది.”
ఆ గృహస్థుడి ఇంటికి జీవకుడు వెళ్లి, ద్వారపాలకుడితో అన్నాడు: “మంచి ద్వారపాలకుడా, శ్రేష్ఠిగారి భార్యతో ఈ విధంగా చెప్పవలసింది – యజమానురాలా! ఒక వైద్యుడు నిన్ను చూడాలని వచ్చాడు!”
ద్వారపాలకుడు జీవకుడి మాటలను శ్రేష్ఠిగారి భార్యతో చెప్పాడు. “ఆ వైద్యుడు ఎటువంటివాడు?”
“అతడు యువకుడు”
“వద్దు, యువకుడైన వైద్యుడు నాకేమి సహాయం చెయ్యగలడు? చాలా గొప్ప వైద్యులు, ప్రపంచ విఖ్యాతి గాంచినవాళ్లు, వచ్చి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించలేకపోయారు, చాలా బంగారం స్వీకరించి వెళ్లిపోయారు.”
ఆ ప్రతీహారి శ్రేష్ఠిగారి భార్య చెప్పినది జీవకుడికి నివేదించాడు. జీవకుడన్నాడు.
“వైద్యుడు ఇలా అన్నాడని అమ్మగారితో చెప్పు, ‘మీరు నాకు ముందుగా ఏమీ ఇవ్వవద్దు. ఆరోగ్యవంతులైన తరువాత, మీరు కోరినది ఇవ్వవచ్చు'”.
ద్వారపాలకుడు జీవకుడి మాటలను యజమానురాలికి చెప్పాడు. ఆమె జీవకుని చూడడానికి అంగీకరించింది.
జీవకుడు ఇంటిలోకి పోయి, చాలా జాగ్రత్తగా ఆమె శరీరంలో వచ్చిన మార్పును గమనించాడు. ఆమెతో ఇలా అన్నాడు.
“యజమానురాలా! నాకొక పురిషెడు నెయ్యి కావాలి.”
శ్రేష్ఠి భార్య ఒక పురిషెడు నెయ్యి తెప్పించి జీవకుడికి ఇచ్చింది. జీవకుడు ఆ నేతిని, వేరు వేరు మందులతో మేళవించి, మరిగించాడు. తరువాత ఆమెను వెల్లకిల పడుక్కోబెట్టి, ఆ మందును ఆమె ముక్కులో వేశాడు. ఆమె ముక్కులో వేసిన మందు, నోటి నుండి పైకి వచ్చింది. ఆమె దానిని ఉమ్మివేసే పాత్రలోకి ఉమ్మివేసి, పరిచారికతో అంది :
“ఈ నేతిని గుడ్డతో తడపవలసింది.”
అపుడు జీవకుడు అనుకున్నాడు: “ఈమె ఎంత లోభియో అని ఆశ్చర్యం కలుగుతున్నది. ఈ గృహిణి, పారవేయవలసిన నేతిని, గుడ్డతో ఒత్తిస్తున్నది. ఈమెకు చాలా విలువైన మందులు నేనిచ్చాను. నాకేమి ప్రతిఫలం ఆమె ఇవ్వగలదు?”
జీవకుని ముఖంలో వచ్చిన మార్పును శ్రేష్ఠిగారి భార్య గమనించి పలికింది.
“వైద్యుడా! నువ్వెందుకు సందేహిస్తున్నావు?”
జీవకుడు తాను అనుకున్నది ఆమెకు తెలియజేశాడు.
“మా వంటి గృహస్థులు ఎందుకు ఆ విధంగా పొదుపు చేయాలని తలుస్తారో తెలుసుకోవలసింది. ఈ నేతిని సేవకులుగాని, పనివాళ్లుగాని పాదాలకు రాసుకుంటారు. లేకపోతే దీనిని దీపాలకు వినియోగించవచ్చు. వైద్యుడా! నువ్వు కలవరపడకు. నువ్వు పొందవలసినది తగ్గించడం చేయను.”
జీవకుడు, శ్రేష్ఠి గారి భార్య ఏడు సంవత్సరాలై అనుభవిస్తున్న శిరోరోగాన్ని, ఒకసారి ముక్కులో మందు వేసి తరిమి వేశాడు. ఆరోగ్యాన్ని పొందిన శ్రేష్టి భార్య నాలుగు వేల కహాపణాలను జీవకుడికి సమర్పించింది. తల్లి రోగం నుండి విమోచనం పొందినందుకు తనయుడు సంతోషించి నాలుగు వేలు ఇచ్చాడు. ఆమె కోడలు ఒక నాలుగు వేలు ఇచ్చింది. ఆమె భర్త అయిన శ్రేష్ఠి నాలుగు వేలు ఇవ్వడమే కాకుండా ఒక పరిచారకుడిని, పరిచారికని, గుర్రాలతో ఒక బగ్గీని ఇచ్చాడు.
జీవకుడు, పదహారు వేల కహాపణాలను, పరిచారకుడిని, పరిచారికను, గుర్రాలతో బగ్గీని తీసుకొని రాజగృహానికి బయలు దేరాడు. కొంతకాలం ప్రయాణం చేసి రాజగృహం చేరుకొని, రాజపుత్రుడు అభయుని సమీపించి, అతనితో అన్నాడు.
“ప్రభువా! నా తొలి ప్రయత్నానికి ప్రతిఫలంగా ఈ పదహారు వేలు, పరిచారకుడు పరిచారిక, గుర్రాలతో బడ్డీ లభించాయి. నన్ను పెంచి పెద్దవాడిగా చేసినందుకు వీటిని ప్రభువులు స్వీకరించెదరుగాక!”
“నా ప్రియమైన జీవకా! వీటిని నువ్వే ఉంచుకో. మా రాజభవనంలోనే నువ్వు ఉండవలసింది, వేరో చోట వద్దు.”
రాజుపుత్రుడైన అభయుని ఈ ఆజ్ఞను జీవకుడు స్వీకరించాడు. రాజపుత్రుడు భవనంలో నివసించాడు.
ఆ సమయంలో మగధరాజైన సేనియ బింబిసారుడు భగందర వ్యాధితో బాధపడుతుండేవాడు. అతని దుస్తులు నెత్తుటితో మరకలు కట్టేవి. అతని రాణులు వాటిని చూచి, గేలి చేస్తూ అన్నారు:
“ప్రభువులు, ఋతుక్రమంలో ఉన్నారు, ప్రసవిస్తారా!”
రాజు ఈ మాటలు విని క్రుద్ధుడయాడు. సేవియ బింబిసారుడు, రాజపుత్రుడు అభయునితో అన్నారు.
“ప్రియమైన అభయ! రోగంతో నా దుస్తులు నెత్తుటితో మరకులు కడుతున్నాయి. రాణులు వాటిని చూసి ఎగతాళి చేస్తున్నారు. ఈ రోగానికి చికిత్స చేసే వైద్యుడిని చూడవలసింది”.
“మన జీవకుడు శ్రేష్ఠమైన వైద్యుడు. అతడు రాజగారికి చికిత్స చేస్తాడు”.
రాజపుత్రడు రాజుగారికి చికిత్స చేయమని జీవకుని ఆజ్ఞాపించాడు. జీవకుడు రాజపుత్రుని ఆజ్ఞని శిరసావహించాడు.
గోరుకొనను లేపనం గ్రహించి బింబిసారుడిని సమీపించాడు. అతనితో అన్నాడు: “ప్రభువా! మీ రోగాన్ని మాకు చూపించండి” జీవకుడు లేపనం ఒక పూతతో రాజుగారి భగందర వ్యాధిని మాన్పాడు. అపుడు సేనియ బింబిసారుడు తన అయిదువందల మంది రాణులను వారి ఆభరణాలను సంపూర్ణంగా ధరించమన్నాడు. తరువాత వాటినన్నిటిని తీసివేసి కుప్పగా వెయ్యమన్నాడు. అతడు జీవకుడితో అన్నాడు:
“ప్రియమైన జీవకా! నా అయిదువందల భార్యల అభరణాలన్నీ నీకే చెందుతాయి.”
“ప్రభువా! నాకివేమి వద్దు. నా ఉద్యోగం గురించి ఆలోచించండి.”
“సరే! నువ్వు, నాకు, నా రాజభవనంలోని వారికి, బుద్ధుని ఆధిపత్యంలోని భిక్షు సంఘానికి సేవ చేయవలసింది.”
జీవకుడు మగధరాజైన సేనియ బింబిసారుని ఆజ్ఞను స్వీకరించి, “రాజా! ఆ విధంగానే చేస్తాను” అన్నాడు.
ఆ కాలంలో రాజగృహంలో ఉన్న ఒక శ్రేష్ఠి ఏడు సంవత్సరాలుగా శిరస్సులో ఒక రోగంతో బాధపడుతున్నాడు. చాల గొప్పవారు, ప్రపంచ విఖ్యాతులు అయిన వైద్యుల వచ్చారు, అతని రోగం కుదర్చలేకపోయారు, చాలా బంగారం తీసుకొని వెళ్లిపోయారు. వారు అతనికి భవిష్యత్తులో జరగబోయేది సూచించారు.
కొంత మంది వైద్యులు ఈ విధంగా అన్నారు: “గృహస్థు అయిన ఈ శ్రేష్ఠి నేటికి అయిదవ దినాన్న మరణిస్తాడు.”
మిగిలిన వైద్యులన్నారు: “ఈ శ్రేష్టి నేటికి ఏడవదినాన్న చనిపోతాడు.”
అపుడు రాజగృహానికి చెందిన వర్తకుడు అనుకున్నాడు.
“ఈ శ్రేష్ఠి రాజుగారికి, వర్తక సంఘానికి, మంచి సేవ చేశాడు. వైద్యులు ఇతనికి జరుగబోయే ఆపద గురించి చెప్పారు. రాజవైద్యుడైన జీవకుడున్నాడు. అత్యుత్తమమైన యువ వైద్యుడతడు. రాజుగారిని, గృహస్థు అయిన శ్రేష్ఠికి చికిత్స చేయడానికి, అతని వైద్యుడైన జీవకుని అడిగితేనో?”
వర్తకుడు మగధరాజైన సేనియ బింబిసారుని సమీపించి ఆ శ్రేష్ఠి గురించి చెప్పాడు:
“ఆ గృహస్థుడైన శ్రేష్ఠి ప్రభువు వారికి వర్తక సంఘానికి మంచి సేవ చేశాడు. వైద్యులు అతని మరణం గురించి సూచించారు. ప్రభువుల వైద్యుడు జీవకుని ఆ శ్రేష్ఠి చికిత్స కోసం ఆజ్ఞాపించవలసిందని కోరుతున్నాను.”
సేనియ బింబిసారుడు జీవకుని ఆజ్ఞాపించాడు.
జీవకుడు ఆజ్ఞను పాలించాడు. గృహస్తుడైన శ్రేష్ఠిని సమీపించి, అతని పరిస్థితిని గమనించి అన్నాడు:
“నిన్ను ఆరోగ్యవంతునిగా చేసినందుకు నాకేమి ఇస్తావు?”
“నాకున్నదంతా నీకు చెందుతుంది. వైద్యుడా! నేను నీకు సేవకుడినవుతాను.”
“మంచిది. ఓ గృహస్థా. నువ్వు ఒక పక్కకకు తిరిగి ఏడు నెలలు పడుక్కోగలవా?”
“నేను ఏడు నెలలు ఒక పక్కకు తిరిగి పడుక్కోగలను.”
“నువ్వు రెండో పక్కకు తిరిగి ఏడు నెలలు పడుక్కోగలవా?”
“ఏడు నెలలు నేను రెండో పక్కకి తిరిగి పడుక్కోగలను.”
“నువ్వు వెల్లకిల, వీపు మీద ఏడు నెలలు పడుక్కోగలవా?”
“ఏడు నెలలు వెల్లకిల, వీపు మీద పడుక్కోగలను.”
తరువాత జీవకుడు ఆ శ్రేష్ఠిని మంచం మీద పడుక్కోబెట్టాడు. అతనిని తాళ్లతో గట్టిగా మంచానికి వేసి బంధించాడు. తలపై ఉన్న చర్మాన్ని కోసి వేశాడు. కోతకు ఇటు పక్క, అటు పక్క మాంసాన్ని తొలగించాడు. గాయం నుండి రెండు పురుగులను పైకి తీశాడు. వాటిని ప్రజలకు చూపించి అన్నాడు:
“అయ్యలారా! చూడండి ఈ గృహస్థు, నేటికి అయిదవరోజున చనిపోతాడని కొంతమంది చెప్పారు. వాళ్లు ఈ పెద్ద పురుగును చూశారు. ఏ విధంగా ఈ పురుగు అయిదవరోజు సరికి శ్రేష్ఠి మెదడులో ప్రవేశించగానే అతడు చచ్చిపోతాడు. మరికొంత మంది ఈ చిన్న పురుగును చూశారు. అది శ్రేష్ఠి మెదడును దొలచడం మొదలు పెట్టగానే అతడు నేటి కేడవరోజున మరణిస్తాడు. ఈ వైద్యులు చాలా వాస్తవంగా చెప్పారు.”
ఆ విధంగా చెప్పి అతడు గాయాన్ని రెండుపక్కల మూసివేసి, చర్మాన్ని కుట్టి దానిపై లేపనాన్ని పూశాడు.
ఏడు రోజులు కాగానే శ్రేష్ఠి జీవకుడితో అన్నాడు: “వైద్యుడా! నేను ఒక పక్కకు తిరిగి పడుక్కోలేకుండా ఉన్నాను.”
జీవకుడన్నాడు: “నువ్వే దీనికి అంగీకరించావు కదా!”
“అది నిజమే! కాని ఏడు నెలలు పక్కకి పడుక్కుంటే నేను చచ్చిపోతనా.”
“అయితే రెండవ పక్కకు తిరిగి ఏడు నెలలు పడుక్కోవలసింది.”
శ్రేష్ఠి ఏడు రోజుల తరువాత ఆ విధంగానే చయలేకపోయాడు. అపుడు జీవకుడు అతనిని వెల్లకిల, వీపు మీద పడుక్కోబెట్టాడు. శ్రేష్ఠి ఆ విధంగా ఏడు రోజుల కన్నా హెచ్చుగా పడుక్కోలేకపోయాడు. అపుడు జీవకుడన్నాడు:
“ఓ గృహస్థా! నేనీ విధంగా నీతో చెప్పి ఉండకపోతే అంత హెచ్చుకాలం పడుక్కొని ఉండలేకపోయేవాడివి. మూడుసార్లు ఏడు ఏడు దినాలకు శ్రేష్ఠి ఆరోగ్యవంతుడవుతాడని…
“వైద్యుడా! నా సర్వస్వం నీకు సమర్పిస్తున్నాను.నేను నీ బానిసను అవుతాను.”
“ఓయి గృహస్థా! నీకున్నదంతా నాకు ఇవ్వవద్దు. నువ్వు నా బానిసవు కూడా కానక్కరలేదు. రాజుగారికి ఒక లక్ష కహాపణాలను ఇవ్వవలసింది, నాకొక లక్ష.”
ఆరోగ్యం తిరిగి పొందిన తరువాత, శ్రేష్ఠి, రాజుగారికి లక్షకహాపణాలను, జీవకుడికి లక్ష సమర్పించాడు.
ఆ కాలంలో వారణాసిలో ఒక శ్రేష్ఠి కుమారుడు తలక్రిందులుగా మొగ్గలు వేసి ఆనందించేవాడు. ఒకసారి ఈ విధంగా మొగ్గలు వేస్తుంటే అతని పేగులు చుట్టుకుపోయాయి. అందుచేత అతడు తాను తాగిన పాయసాన్ని కాని తాను తిన్న ఆహారాన్ని కాని అరిగించుకోలేకపోయాడు. సహజరీతిలో మల విసర్జన కూడా చేయలేకపోయాడు. తత్ఫలితంగా అతడు శుష్కించి పోయాడు. అతని ఆకారం వికారంగా మారిపోయింది. అతని శరీరాచ్చాయ ఇంకా పసుపు పచ్చగా మారింది, అతని చర్మం మీద నరాలు పైకి తేలాయి.
వారణాసి వర్తకుడు రాజగృహానికి పోయి సేనియ బింబిసారుడిని అర్థించాడు. తన కొడుకుకు చికిత్స చేయడానకి జీవకుని పంపమన్నాడు. రాజు అందుకు అనుమతించాడు.
జీవకుడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం వారణాసి వెళ్లాడు. శ్రేష్ఠి గృహాన్ని చేరుకున్నాడు. రోగిని పరీక్ష చేశాడు. గదిలో ఉన్నవారిని పైకి వెళ్లమన్నాడు. తెరలు కిందికి దించాడు. రోగిని ఒక స్తంభానికి వేసి బంధించాడు. అతని భార్యను ఎదురుగా నిలబెట్టాడు. కడుపు చర్మాన్ని కోసి, మెలికలు పడిన ప్రేగులను పైకి తీసి అతని భార్యకు చూపించాడు. ఆమెతో అన్నాడు:
“నీ భర్త ఏ రోగంతో బాధపడుతున్నాడో చూడవలసింది. ఈ కారణం చేత అతడు ఆహారం అరగించుకోలేకపోతున్నాడు, మల విసర్జన సరిగా చేయలేకపోతున్నాడు, వికార రూపం ధరించాడు, అతను పచ్చబారిపోయి చర్మం పైన నరాలు తేలాయి.”
జీవకుడు ఆమెతో ఇలా చెప్తూ, ఆ ప్రేగులను సరిచేసి, కడుపులోకి తోసి, చర్మం కుట్టి వేశాడు. దాని పైన మలాము పూశాడు. కొద్దికాలంలో వారణాసి వర్తకుని కొడుకు ఆరోగ్యాన్ని పొందాడు.
తన పుత్రుడు రోగ విముక్తుడైనందుకు వారణాసి శ్రేష్ఠి, జీవకునికి పదహారువేల కహాపణానలు ఇచ్చాడు. వీటిని స్వీకరించి అతడు రాజగృహానికి మరలిపోయాడు.
ఆ కాలంలో ఉజ్జయిని రాజు ప్రద్యోతుడు కామెర్ల రోగంతో బాధపడుతున్నాడు. చాలా మంది వైద్యులు రోగం కుదర్చలేకపోయారు. బంగారం తీసుకొని వెళ్లిపోయాడు. అపుడు సేనియ బింబిసారుని దగ్గరికి ఈ విధంగా సందేశం పంపించాడు.
“ఇటువంటి రోగంతో నేను బాధపడుతున్నాను. దేవర జీవకుని ఆజ్ఞాపించవలసింది. అతడు నాకు చికిత్స చేస్తాడు.”
ఉజ్జయినీ రాజు ప్రద్యోతునికి చికిత్స చేయమని సేనియ బింబిసారుడు జీవకుని ఆజ్ఞాపించాడు.
జీవకుడు ఈ ఆజ్ఞానుసారం ఉజ్జయిని పోయి, రాజు ప్రద్యోతుని కలిశాడు. అతనిని జాగ్రత్తగా పరీక్ష చేసి అన్నాడు:
“అయ్యా! ప్రభువు వారికి నేను కొంత నేతిని మరిగించి ఇస్తాను. మీరు దానిని తాగాలి.”
“జీవకా! నాకు నేతిని ఇవ్వకుండా చికిత్స చేయవలసింది. నాకు నేయి సహించదు. అది నాకు అరుచిని కలిగిస్తుంది”.
జీవకుడు ఈ విధంగా తలంచాడు :
“ఈ రాజుగారి రోగం నేతిని తాగించకుండా నయం కాదు. నేను నేతిని మరిగించి, రంగు, వాసన, రచి కల గాఢమైన కషాయంగా తయారుచేస్తే ఏమౌతుంది.”
జీవకుడు కొంత నేతిని వివిధములైన ఔషధాలతో కలిపి మరిగించి గాఢమైన కషాయంగా తయారుచేశాడు. అతడు అనుకున్నాడు:
“ఈ రాజు నేతిని తాగి, అరిగించుకోడానికి ప్రయత్నం చేసినపుడు, అది వాంతి అవుతుంది. ఈ రాజు క్రూరుడు. నన్ను చంపించగలడు. ముందుగనే నేను సెలవు తీసుకొని వెళ్ళిపోతేనో!”
జీవకుడు రాజు ప్రద్యోతుడిని కలిసి అతనితో అన్నాడు.
“ఆర్యా! ఇటువంటి సమయంలో, మేము వైద్యులం, మూలికలు తవ్వి ఔషధులను సమకూర్చుకుంటాం. ప్రభువు వారు మీ హయశాలలకు నగర ద్వారపాలకులకు ఆదేశించవలసింది. ‘జీవకుడు ఏ వేళకైనను ఏ ద్వారం నుండి అయినా బయటికిపోవడానికి, తిరిగి నగరంలోకి రావడానికి వీలు కల్పించవలసింది.”
తరువాత హయశాలకు, నగర ద్వారపాలకులకు రాజు ఈ విధంగా ఆదేశించాడు:
“జీవకుడు తాను కోరిన అశ్వం పైగాని, ఏనుగు పైన గాని స్వారి చేసి బయటికి పోవచ్చు.”
ఆ కాలంలో, దినానికి ఏభై యోజనాలు ప్రయాణం చేసే భద్రవటిక అన్న ఏనుగు ఒకటి ప్రద్యోతుడి దగ్గర ఉంది. పిమ్మట ప్రద్యోతుడికి నేతినిచ్చి, జీవకుడన్నాడు : “ప్రభువు వారు ఈ కషాయాన్ని తాగవలసింది”.
రాజు చేత నేతిని తాగించి, జీవకుడు గజశాలకు పోయి, ఆడ ఏనుగు భద్రవటిక మీద తొందరగా నగరం విడిచి వెళ్ళిపోయాడు.
ప్రద్యోతుడు ఆ నేతిని తాగి, ఆరగించుకుంటున్న సమయంలో అది వాంతి అయింది. అపుడు రాజు పరిచారకులను పిలిచి అన్నాడు:
“తుంటరి అయిన జీవకుడు నా చేత నేయి తాగించాడు. మీరు వెళ్లి జీవకుని వెదకవలసింది.”
అపుడు పరిచారకులన్నారు:
“అతడు, ఆడ ఏనుగు భద్రవటికను ఎక్కి నగరం విడిచి పారిపోయాడు.”
ప్రద్యోతుడి దగ్గర ఒక బానిస ఉన్నాడు. వాడి పేరు కాక. వాడు దినానికి అరవై యోజనాలు ప్రయాణం చేయగలడు. వాడు మానవునికి పుట్టినవాడు కాదు. ఈ కాకను ప్రద్యోతుడు ఆజ్ఞాపించాడు. రాజు గారు జీవకుని వెనక్కురమ్మన్న సంగతి అందజేయమని రాజు ఇంకా ఆ బానిసతో అన్నాడు:
“ఆ వైద్యులు మోసకాళ్లు. వారి నుండి ఏవీ స్వీకరించవద్దు”.
బానిస కాక, కౌశాంబి వద్ద జీవకుని కలిశాడు. అప్పుడు జీవకుడు తన ప్రాతఃకాల భోజనం చేస్తున్నాడు. బానిస కాక జీవకునితో అన్నాడు:
“వైద్యుడా! రాజుగారు నిన్ను తిరిగి రమ్మంటున్నారు”.
జీవకుడు బదులు పలికాడు: “కాక! మన బోజనమయే వరకు వేచి ఉండవలసింది. మంచివాడా! తిను.”
కాక అన్నాడు: “వైద్యుడా! వద్దు. ‘ఈ వైద్యుడు వంచకుడు. అతని నుండి వేటిని తీసుకోవద్దు’ అని రాజుగారు నాతో చెప్పారు”.
అపుడు జీవకుడు ఏదో ఔషధాన్ని గోటితో కోసి, ఉసిరి పండు నొకటి తింటూ మంచి నీరు తాగుతున్నాడు. అతడు బానిస కాకతో ఇలా అన్నాడు
“ఈ ఉసిరి పండు తిని నీళ్లు తాగు.”
అపుడు బానిస కాక తనలో అనుకున్నాడు :
“ఈ వైద్యుడు ఉసిరి పండు తిని మించి నీళ్లు తాగుతున్నాడు. దీనిలో ఏ విధమైన హాని లేదు.”
సగం తిని నీళ్లు తాగగానే అతనికి ఉన్న…..
బానిస కాక జీవకునితో అన్నాడు : “వైద్యుడా! నా ప్రాణాలు రక్షింపబడతాయా?”
“కాక! భయపడకు. నువ్వు బాగానే ఉంటావు. కాని, రాజు క్రూరుడు. అతడు నన్ను చంపించుతాడు. అందుచేత నేను తిరిగి అతని దగ్గరికి పోను.”
అతడు ఆడఏనుగు భద్రవటికను కాకకు ఇచ్చివేసి రాజగృహానికి ప్రయాణమయాడు. కొంతకాలం తరువాత రాజగృహం చేరుకొని సేనియ బింబిసారుడిని దర్శించాడు. అతనితో విషయమంతా నివేదించాడు.
“జీవకా! నువ్వు మంచి పనే చేశావు. తిరిగి వెనక్కి వెళ్లలేదు. ఆ రాజ క్రూరుడు. అతడు నిన్ను చంపించి ఉండేవాడు.”
ప్రద్యోతుడి ఆరోగ్యం బాగుపడింది. అతడు జీవకుడికొక సందేశం పంపించాడు:
“జీవకుడు నా దగ్గరికి రావలసింది. అతనికి నేనొక వరం ఇస్తాను.”
జీవకుడు జవాబిచ్చాడు: “ప్రభువా! నా ఉద్యోగం గురించి మీరు జ్ఞాపకం తెచ్చుకోవలసింది.”
అపుడు ప్రద్యోతుడి దగ్గిర జత దుస్తులకు సరిపడే బట్ట ఉంది. దానిని సివి దేశపు స్త్రీలు నేసినది. వేలకొలది, లోల కొలది ఉన్న బట్టలలో దాని సాటి మరొకటి లేదు. ప్రద్యోతుడు ఈ బట్టను జీవకుడికి పంపించాడు. అపుడు జీవకుడు అనుకున్నాడు:
“ప్రద్యోతుడు పంపిన ఈ బట్ట చాలా గొప్పది. చాలా దివ్యమైనది. దీనిని స్వీకరించడానికి భగవానుడు, అర్హతుడైన బుద్ధుడి కంటే వేరొకరు లేరు, లేకపోతే మగధరాజైన సేనియ బింబిసారుడు సరియైనవాడు.
ఆ సమయంలో బుద్ధుడి శరీరంలో రుగ్మతలు తలెత్తాయి. భగవానుడు పూజ్యుడైన ఆనందుని పిలిచి అన్నాడు.
“ఆనందా! తథాగతుని శరీరంలో రుగ్మతలు చోటు చేసుకున్నాయి. కఫవాత పిత్తాలలో చలనం కలిగింది. తథాగతులు భేదికి మందు కోరుతున్నారు.”
ఆనందుడు జీవకుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు :
“జీవకా! తథాగతుల శరీరంలో సంచలనం కలిగింది. తథాగతులు భేదులకు మందు తీసుకోదలచారు.”
జీవకుడు బదులు పలికాడు. “పూజ్యుడైన ఆనందా! భగవానుని శరీరం, కొద్ది రోజులు కొవ్వుతో మర్తించవలసింది”.
ఆనందుడు ఆ విధంగానే చేశాడు.
“భగవానుడికి బలమైన భేది ముందు ఇవ్వడం యుక్తం కాదు”
ఈ విధంగా జీవకుడు బావించి, కొన్ని నీలకమలాలను ఔషధాలతో నింపి, భగవానుడు ఉన్నచోటికి వెళ్ళాడు.
“ప్రభువా! ఈ పిడికెడు నీలకమలాలను భగవానులు ఆఘ్రాణిస్తే పది భేదులవుతాయి”.
అతడు రెండవ పిడికెడు పూవులిచ్చి అన్నాడు:
“భగవానులు రెండవ పిడికెడు పూలు వాసన చేస్తే మరొక పది భేదులవుతాయి. మూడవ పిడికెడు పూలు ఆఘ్రాణిస్తే ఇంకా పది అవుతాయి. ఆ విధంగా భగవానులకు ముఫ్పై భేదులవుతాయి”.
భగవానుడికి ముఫ్పై బేదులకు మందిచ్చి, అతనికి వంగి నమస్కరించి, తన కుడి పక్క బుద్ధుడు ఉన్నట్లు ప్రదక్షణం చేసి జీవకుడు వెళ్ళిపోయాడు.
జీవకుడు వెనకకు మరలిన తరువాత అనుకున్నాడు:
“నేనిచ్చిన మందు భగవానుడు ఇరవై తొమ్మిది భేదులను మాత్రమే అయేటట్లు చేస్తుంది. కాని, భగవానుడు ఇరవై తొమ్మిది భేదుల తరువాత స్నానం చేస్తాడు. అప్పుడు మరొక విరోచనం అవుతుంది. ఈ విధంగా ముఫ్పై భేదులు అవుతాయి.”
జీవకుడు తలచినది భగవానుడు తన దివ్యశక్తి చేత తెలుసుకున్నాడు. ఆనందుని పిలిచి, జీవకుడు మనసులో అనుకున్నది అతనితో చెప్పాడు. ఆనందుడిని స్నానానికి వేడి నీళ్ళు తయారు చేయమన్నాడు.
జీవకుడు తిరిగి బుద్ధుడి దగ్గరికి వచ్చి భక్తితో అతనిని నమస్కరించాడు. అతని సమీపంలో కూర్చున్నాడు. భగవానునితో అన్నాడు:
“ప్రభువా! భగవానులకు భేదులయాయా?”
బుద్ధుడు బదులు పలికాడు. “జీవకా! అయ్యాయి.”
“నేను బయట ఉన్నప్పుడు మీకు ఇరవై తొమ్మిది విరోచనాలు అవుతాయని, స్నానం చేసి తరువాత మరొకటి అవుతుందని అనుకున్నాను. భగవానులు స్నానం చేయవలసింది.”
తరువాత భగవానుడు స్నానం చేశాడు. అపుడు మరొక విరోచనం అతనికి అయింది. ఈ విధంగా బుద్ధుడికి ముఫ్పై సార్లు భేదులయాయి.
“ప్రభువా! మీరు పూర్తిగా ఆరోగ్యవంతులయే వరకు ద్రవ రూపంలో ఆహారాన్ని స్వీకరించవద్దు.”
కొద్దికాలంలో భగవానుడి శరీరం పూర్తిగా ఆరోగ్యాన్ని పొందింది.
తరువాత జీవకుడు సివి వినతలు చేసిన బట్టను పట్టుకొని బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. భక్తితో అతనికి నమస్కరించి సమీపంలో కూర్చుని, జీవకుడు బుద్ధుడితో అన్నాడు:
“ప్రభువా! మీరు నాకొక వరం అనుగ్రహించాలి.”
“జీవకా! తథాగతులు విషయం తెలుసుకోకుండా వరాలు ఇవ్వరు”.
“ఇది యుక్తమైనది, వివాద రహితమైనది అయిన కోరిక.”
“జీవకా! చెప్పవలసింది.”
“ప్రభువా! భగవానులు చెత్తకుప్పల నుండి, శ్మశానాల నుండి ఏరి తెచ్చిన గుడ్డ పీలికలతో తయారయిన దుస్తులనే ధరిస్తున్నారు. ఆ విధంగానే భిక్షు సంఘంలోని వారు కూడా. ప్రభు! సివి దేశపు ఈ బట్ట రాజు ప్రద్యోతుడు నాకు పంపించాడు. ఇది చాలా గొప్పది. చాలా దివ్యమైనది, చాలా విలువైనది, చాలా వస్త్రాల కంటే ప్రశస్తమైనది, లక్షల వస్త్రాలలో దీనిని మించినది వేరొకటి లేదు. ప్రభువా! నా నుండి, ఈ రెండు సిని దేశపు వస్త్రాలను స్వీకరిచవలసింది. సంఘంలోని భిక్షువులను లౌకికులు సమర్పించే దుస్తులను గ్రహించడానికి అనుమతించవలసింది.”
భగవానుడు సివిదేశపు వస్త్రాల జతను స్వీకరించాడు.
(బుద్ధత్వం పొందిననాటి నుండి ఇరవై సంవత్సరాల వరకు అతడు లౌకికుల నుండి వస్త్రాలను స్వీకరించలేదు.)
భగవానుడు ఉత్తేజితుడయాడు, చైతన్యవంతుడయాడు, జీవకుడికి మతపరమైన ప్రసంగం బోధించి, సంతుష్టుడిని చేశాడు. జీవకుడు ఆ ప్రసంగానికి సంతుష్టుడై ఆసనం నుండి లేచి, భగవానుడిని భక్తి పూర్వకంగా నమస్కరించి, అతని వేపు తన కుడి పార్శ్వం ఉన్నట్లు ప్రదక్షిణం చేసి వెళ్లిపోయాడు.
తరువాత బుద్ధుడు భిక్షువులను లౌకికులు సమర్పించే దుస్తులను స్వీకరించడానికి అనుమతించాడు.
రాజగృహంలోని ప్రజలు ఈ సంగతి విని, మంచి పనులు చేసి పుణ్యం సంపాదించడానికి, తాము కూడా భిక్షవులకు దుస్తులను వేలకొలది సంఖ్యలో బహుమతి చేశారు. ఒక దినంలో వేల కొలది దుస్తులు భిక్షువులకు లభించాయి.
దేశంలో ఇతర ప్రాంతాలలోని ప్రజలు ఈ సంగతి విన్నారు. జనులు సంతోషించి, అన్ని ప్రాంతాల వాళ్లు వేలకొలది బట్టలను బహుమతి చేశారు.
అపుడు సంఘానికి ఒకరు కప్పుకునే పచ్చడాన్ని బహుకరించారు. వాళు ఈ సంగతిని భగవానుడికి నివేదించారు.
భిక్షువులు ఆ వచ్చడాన్ని స్వీకరించడానికి భగవానుడు అనుమతించాడు.
ఆ సమయంలో కాశీ రాజు జీవకుడికి ఉన్ని దుస్తునొకటి పంపించాడు. దాని వెల అయిదు వందలు చేస్తుంది. సగం ఊలుతోను, సగం కాశీలో నేసిన బట్టతోను చేసినట్టిది. జీవకుడు భక్తితో బుద్ధుడికి నమస్కారం చేసి, అతనికి సమీపంలో కూర్చొని అన్నాడు:
“ప్రభువా! ఈ దుస్తు సగం వారణాసి వస్త్రంతోను, సగం ఉన్నితోను తయారు చేసినది. కాశీ రాజు నాకు పంపించాడు. ఈ ఉన్ని దుస్తును భగవానులు స్వీకరించుగాక! నాకు చాలాకాలం మీ ఆశీర్వచనాలను అనుగ్రహించండి.”
భగవానుడు ఆ ఉన్ని దుస్తును స్వీకరించాడు. తరువాత బుద్ధుడు ధార్మిక ప్రసంగం చేశాడు. జీవకుడు అటుపిమ్మట వెళ్లిపోయాడు. తరువాత బుద్ధుడు భిక్షువులకు ధర్మ ప్రసంగం చేసి అన్నాడు. “ఓ భిక్షువులారా! ఇక మీద మీరు ఉన్ని దుస్తులను ఉపయోగించవచ్చు.”
ఆ కాలంలో సంఘంలోని భిక్షువులకు పలు రకాలైన అంగీలు దొరికాయి.
“ఏ అంగీలు ధరించవచ్చో, ఏవి ధరించకూడదో, భగవానుడినే అడుగుదాం” అనుకున్నారు భిక్షువులు.
ఈ సంగతి బుద్ధుడితో చెప్పారు.
“భిక్షువులారా! మీరు ఆరు రకాల అంగీలను ధరించవచ్చు. నారతో చేసినవి, నూలుతో చేసినవి, పట్టుతో చేసినవి, ఉన్నితో చేసినవి, ముతక బట్టతో చేసినవి,
జపనారతో చేసినవి. ఈ ఆరు రకాల అంగీలను మీరు ఉ పయోగించవచ్చు.”
ఆ కాలంలో భిక్షువులు లౌకికుల నుండి అంగీలను స్వీకరించారు. వాటిలో మురికివి ఏవీలేవు.
“భగవానుడు లౌకికులు ఇచ్చిన బట్టలను గాని, మురికి బట్టలను కొని ధరించవచ్చునని అన్నాడు. రెండు రకాలను ధరించమనలేదు.”
భిక్షువులు బుద్ధునితో ఈ సంగతి చెప్పారు.
బుద్ధుడు లౌకికులు ఇచ్చిన బట్టలనూ, మురికి వాటిని కూడా స్వీకరించమన్నాడు.
ఒకసారి కొంతమంది భిక్షువులు కోసల దేశం వెళ్తున్నారు. వారిలో కొందరు, మార్గం నుండి పక్కకు పోయి శ్మశానం నుండి మురికి బట్టలను తెచ్చుకోడానికి పోయారు. మిగిలిన వారు ప్రయాణం సాగించారు. శ్మశానానికి పోయినవారు బట్టలు తెచ్చుకొని మిగిలిన వారిని కలుసుకున్నారు. శ్మశానానికి పోకుండా వేచియుండని వాళ్లు, వెళ్ళినవారిని దుస్తులలో కొన్ని తమకు ఇవ్వమన్నారు. రెండవ పక్షం వాళ్ళు ఇవ్వమన్నారు.
ఈ సంగతి వాళ్ళు బుద్ధుడికి విన్నవించారు.
“ఎవరైతే మీకోసం వేచియుండలేదో, వారికి మీరు కొంతభాగం ఇవ్వనక్కరలేదు” అని భగవానుడు నిర్దేశించాడు.
ఆ విధంగానే మరొకసారి, కోసల దేశానికి పోతూ, మార్గమధ్యంలో కొంతమంది శ్మశానానికి మురికి బట్టలకోసం వెళ్తే, మిగిలినవారు వారి కోసం వేచి ఉన్నారు. వేచి ఉన్నవారికి బట్టలలో ఒక భాగం ఇవ్వవచ్చునని బుద్ధుడు పలికాడు.
మరొకసారి కొందరు భిక్షువులు కోసల దేశానికి పోతూ, దారిలో ఒక శ్మశానానికి కొంత మంది ముందుగా పోయి బట్టలు సంపాదించుకున్నారు. మిగిలిన వాళ్ళు అటు తరువాత వెళ్తే, వాళ్ళకు బట్టలు లభించలేదు. వెనుక వెళ్ళిన వారికి బట్టల ఇవ్వనక్కరలేదని బుద్ధుడు నిర్ణయించాడు.
ఇంకొకసారి భిక్షువులందరూ శ్మశానానికి పోతే కొంత మందికే బట్టలు దొరికాయి. బట్టలు దొరకని వాళ్లకు ఒక భాగం ఇమ్మని బుద్ధుడు పలికాడు. అటు తరువాత మరొకసారి వెళ్ళిన భిక్షువులు దొరికిన బట్టలను పంచుకుంటామన్నారు. దానికి బుద్ధుడు అంగీకరించాడు.
ఒకసారి భిక్షువులు ఆవు పేడతోను, పచ్చమన్నుతోను బట్టలకు రంగు వేస్తే రంగు బాగా అంటలేదు. అపుడు బుద్ధుడు, చెట్లవేళ్లతో వేసిన రంగును, చెట్ల కాండాలతో తయారు చేసిన రంగును, చెట్ల బెరడుతో చేసిన రంగును, చెట్ల ఆకులతో చేసిన రంగును, పూవులతో చేసిన రంగును, పండ్లతో తయారు చేసిన రంగును ఈ విధమైన ఆరు రంగులను ఉపయోగించమన్నాడు. విశాలమైన తొట్టెలో రంగులు వేయమన్నాడు.
ఒకపుడు దంతపు రంగులో ఉన్న చిరగని బట్టను ఒక భిక్షువు సంపాదించాడు. ఆ బట్టను చూసి ప్రజలు ఏవగించుకున్నారు. అటువంటి బట్టలు ఉపయోగించవద్దని బుద్ధుడు ఆజ్ఞాపించాడు.
ఒకసారి బుద్ధుడు రాజగృహం నుండి దక్షిణగిరి వెళ్తూ, తోవలో మగధ దేశపు పొలాలను చూశాడు. అవి చిన్న ముక్కలుగా విభజించి ఉన్నాయి. వరుసలు తీరి ఉన్నాయి. వాటికి సరిహద్దులుగా అడ్డంగా, బయటను గట్లున్నాయి.
బుద్దుడు ఆనందునితో అన్నాడు :
“ఆనందా! ఈ మగధ దేశపు వరిపోలాలు చిన్నముక్కలుగా విభజింపబడి ఉన్నవి. వాటిని చూడు. వీటికి చుట్టూను, అడ్డుగాను గట్లున్నవి”.
“అవును ప్రభూ!”
“ఆ విధంగా భిక్షువులకు వస్త్రాలను సమకూర్చగలవా?”
“ప్రభువా! ఆ విధంగా చేయగలను.”
తిరిగి భగవానుడు దక్షిణగిరి నుండి రాజగృహానికి మరలి వచ్చాడు.
ఆనందుడు బుద్ధుడు చెప్పిన ప్రకారం భిక్షువులకు దుస్తులు సమకూర్చాడు. వాటిని బుద్ధుడికి చూపించాడు.
బుద్ధుడు భిక్షువులతో అన్నాడు.
“ఓ భిక్షువులారా! ఆనందుడు నేను చెప్పినదానిని గ్రహించి, ఆ విధంగా తొందరగా ఆచరించేవాడు. అడ్డుగా కుట్లను వేసి, మధ్యను కుట్లు వేసి, పెద్ద వృత్తాలతో, చిన్న వృత్తాలతో కుట్టి, లోపలికి మడిచి అంచునుకుట్టి, మెడపై ఉండే భాగాన్ని, ముణుకుల మీద ఉండే భాగాన్ని, మోచేతి మీద ఉండే భాగాన్ని తయారు చేయాలి. చిరిగిన ముక్కలను, రమారమి చేర్చి కుట్టి, శ్రమణునికి తగినట్లు తయారుచేయాలి. అతని శత్రువులు ఆ దుస్తులను చూసి ప్రలోభపడకూడదు. ఓ భిక్షువులారా! మీరు చిరిగిన ముక్కలతో కుట్టిన అథో వస్త్రాన్ని, కటి వస్త్రాన్ని, ఉపరి వస్త్రాన్ని ధరించవచ్చు”.
భగవానుడు రాజగృహం నుండి వైశాలికి ఒకసారి ప్రయాణం చేశాడు. మార్గంలో కొందరు భిక్షువులు ఊపిరి తిరుగనంత దట్టంగా బట్టలు ధరించడమే కాకుండా, తలపైన దుస్తుల చుట్టలను ధరించి, వీపుల మీద పెట్టుకొని, నడుం మీద ఉంచుకొని మోస్తున్నారు. “చాలా శ్రద్ధతో ఈ మూర్ఖమనుష్యులు, చాలా ఆడంబంరంతో, బట్టల విషయంలో ఈ పని చేస్తున్నారు. భిక్షువుల దుస్తులను పరిమితం చేసి, నిర్ధారిస్తే బాగుంటుంది.” ఈ విధంగా భగవానుడు ఆలోచించాడు.
భగవంతుడు వైశాలి చేరుకున్నాడు. గోతమక ఆరామంలో బస చేశాడు. చలికాలపు రాత్రులు – అష్టకోత్సవాల కాలం మంచు కురుస్తున్నది. భగవానుడు రాత్రివేళ బహిరంగ ప్రదేశంలో కూర్చున్నాడు. ఒకే ఒక దుస్తు ధరించాడు. అతనికి చలి వేయలేదు. మొదటి జాము ముగుస్తుండగా అతనికి చలి వేసింది. అతడు రెండవ దుస్తు ధరించాడు. అప్పుడు చలి వెయ్యలేదు. అర్ధరాత్రి వచ్చింది. మళ్ళా చలి వేసింది. అతడు మూడవ దుస్తు ధరించాడు. ఉదయం తెల్లవారుతుంతే, రాత్రి చాలా గడిచిపోయిన తరువాత, భగవానుడికి చలి వేసింది. అతడు నాలుగవ దుస్తు ధరించాడు.
(సశేషం)