మనస్సాక్షి

39
3

[dropcap]ర[/dropcap]మ్య ఎంతో ఉత్కంటభరితంగా స్టేజీ వంక చూస్తోంది. ఆమె గుండె చప్పుళ్ళ రణగొణ ధ్వని ఆమె చెవులను హోరెత్తిoచేస్తోంది. గత రెండేళ్ళుగా తన రచనలకు ఆత్మీయంగా సూచనలిస్తున్న, తనను అవిరామంగా ప్రోత్సహిస్తున్న, రిమోట్‌గా వుంటూనే వెన్నంటి భుజం తడుతూ సాహిత్యపు బాటలో ముందుకు నడిపిస్తున్న, తన కలానికి ఇంధనమై తనకు స్ఫూర్తినిస్తున్న అతనిని ఆమె తొలిసారిగా చూడబోతోంది. క్షణక్షణం ఉద్విగ్నంగా మారుతున్న ఆమె మానసిక స్థితి ఆమెకే అంతు పట్టడం లేదు.

ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న జీవితం తనది. ఆమె కాలప్రవాహానికి ఎదురీదిన జీవననౌక. ఖేదపుటంచులపై నర్తిస్తూ సమ్మోహనంగా సవాళ్ళని ఎదిరించిన ధైర్యం ఆమెది. దేముడు నా అనుకున్న ఒక్కో ఆప్తులను తన దరికి చేర్చుకుని ఒoటరియైన ఆమె వైపు చిద్విలాసంగా చూసిన చూపులకు నిర్వేదమైన నవ్వుతో బదులిచ్చిన వేదాంతo ఆమె సొంతం. ఇంత పరిపక్వత చెందిన వ్యక్తిత్వం గల ఆమె ఇన్ఫాచ్యుయేషన్ స్థాయికి దిగజారిపోయి ఆ ఆడిటోరియంలో అతని కోసం పడిగాపులు కాస్తోంది. తాయిలం కోసం తడుముకుంటున్న పసిపిల్లలా కనిపించినంత మేరా వెతుకుతోంది.

వ్యక్తిత్వ వికాసంతో మనసుకి సంబంధముండదు. మనసుకి వయసుతో సంబంధముండదు. మనస్సెంత చిత్రమైనది. దాదాపు యాభయికి చేరువవుతున్న ఆమె మనసిప్పుడు పదిహేనేళ్ళ ప్రాయపు స్థితిననుభవిస్తోంది.

ఇంతలో మైకులో ‘ఇప్పుడు ఈ సభకు విచ్చేసిన గౌరవ అతిథి, లబ్దప్రతిష్ఠుడు, సాహితీవేత్త అయిన శ్రీ చలం గారిని వేదిక మీదకు వచ్చి మాట్లాడవలిసిందిగా కోరుతున్నాము’ అని ప్రకటన వినిపించింది. రమ్య ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వేదిక వైపు చూడసాగింది. మూర్తీభవించిన మనీషిలా అతను వేదికనలంకరించాడు. అతనిని చూస్తుంటే మనిషికి ఎక్కువగాను, దేవునికి తక్కువగాను అనిపించింది రమ్య కళ్ళకు. రెండేళ్ళుగా పొరలు పొరలుగా పేరుకుపోయిన తీవ్ర ఆరాధనా భావ సాంద్రతలో మునిగి సర్వం మరిచి రమ్య అతని ఉపన్యాసం వింటోంది. ఉపన్యాసం వింటోంది అనటం కన్నా అతనిని చూస్తోంది అనటం సబబేమో. కొన్ని జన్మలుగా వేచి వేచి కనులు కాయలు కాచి పోయినంతగా, కంటి రెప్పలార్పితే ఆ చిత్రం కనుమరుగవుతుందేమో నన్నంత ఆర్తిగా, తపనగా రమ్య అతనికేసి చూస్తోంది.

మైకులో మాట్లాడుతూ సభ వైపు సాలోచనగా దృష్టి సారించి తేరిపారగా గమనిస్తున్న అతని చూపు అకస్మాత్తుగా ఒకచోట చిక్కుబడి పోయింది. రెండు జతల కళ్ళు ముడి పడ్డాయి. ఆ పైన అతనేమి ఉపన్యసిస్తున్నాడో అతనికి తెలియటం లేదు.

రెండేళ్ళుగా ఆమె కలం చిలకరిస్తున్న లేలేత అక్షర చిగుళ్ళను మంద్ర వాయువులా అతను స్పృశించాడు. ఆమె తేనెలూరే తెలుగు పదాలకు పదనిసలు నేర్పాడు. ఆమె అల్లిన అక్షర నక్షత్ర మాలలకు పరిమళాలు అద్దాడు. ఆమె అమావాస్యపుటాలోచనలకు ఇంద్రధనుస్సులద్దాడు. దిగులు పడ్డ ప్రతి వేళా ఆమె గుబులుని కూకటి వేళ్ళతో పెకిలించి వేసాడు. వెలిసిపోయి వెలవెల పోతున్న ఆమె కలలకు పసిడి మెరుగులు దిద్దాడు. తానెవరో ఆమెకు, ఆమెవరో తనకు తెలియకుండానే ఆమె ఉనికికి తానో పెద్ద భరోసా అయ్యాడు.

రమ్య భర్తను కోల్పోయి ఒంటరితనంతో పోరాడుతూ సాహిత్యావలోకనంలో నిశ్శబ్దంగా జీవితాన్ని వెళ్ళదీస్తూ ప్రేమరాహిత్యoలో మగ్గుతున్నఓ మధ్య తరగతి స్త్రీ. యుక్త వయసుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లల తల్లి. పిల్లలిద్దరూ ఒకరు డిగ్రీ మరొకరు ఇంటర్ చదువుతున్నారు. పదిహేను సంవత్సరాలుగా ఒక తపస్సులా ఒంటరితనoతో జత కట్టి నిండయిన ఆత్మస్థైర్యoతో బెరుకు, బేలతనాన్ని వదిలి ధీటుగా జీవితానికి ఎదురీత చేస్తూ పిల్లలను పెంచుకొచ్చిన ధీశాలి. అయితే అలిసిన మనసును ఏదో వెలితి తొలిచేస్తుంటే మనసంతా శూన్యమై వంటరితనంతో విసిగి గత రెండేళ్ళుగా సాహిత్యాన్ని ఆశ్రయించిoది. నిస్సారమైన జీవితానికి పుస్తకాలు కొంత ఊరటనిచ్చాయి.

సాహిత్యంలో సేద తీరుతున్న వేళ ఒక రోజున చలం రాసిన కవిత్వానికి అబ్బురపడి అతనిని అభినందించకుండా మనసును కట్టడి చేయలేకపోయింది. ఆమె వడగాడ్పు జీవితంలో చల్లని మలయమారుతంలా అలా ప్రారంభమయ్యింది చలం పరిచయం. ఫోనులో వీనుల విందైన ఆమె కంఠం, వినసొంపైన ఆమె తెలుగు ఉచ్చారణ, మాటల్లో తొణికిసలాడే ఆమె వ్యక్తిత్వం చలంను మంత్రముగ్ధుణ్ణి చేశాయి.

రమ్య కూడా తనకు తెలియకుండానే అతని స్వాంతనపరిచే మంత్రాల మాటలకు దాసోహమైపోయింది. ఒకరిని ఒకరు చూడకుండానే మానసికంగా ఒకటయ్యారు. ఒకరిలో ఒకరు ఎంతగా లీనమైపోయారంటే రాను రాను అతనికి ఆమెతో మాటాడని రోజు ఏదో తెలియని వెలితి. పిల్లలతో తీరిక చిక్కక అతనితో మాటాడని రోజున ఆమెకు నిద్ర పట్టేది కాదు.

తనలోని ప్రేమరాహిత్యాన్ని, భావ సంచలనాన్ని, ఒంటరి పోరాటాన్ని అడపా దడపా కాగితం పైన పెట్టి మనోభారాన్ని దించుకుంటూ వుండేది. అతను వాటికి మరింత సొబగులద్ది, వాటిలో లోటుపాట్లను తెలియచెప్పి ఆమెను అద్భుతమైన కవయిత్రిగా తీర్చిదిద్దాడు.

రెండేళ్ళుగా సాగుతున్న కవిత్వ ప్రయాణంలో అతను మనసుకు మరింత సన్నిహితమయ్యాడు. పదిహేను సంవత్సరాలుగా ఎందరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా చెక్కుచెదరని మనసు, తనకు తాను గీసుకున్న గిరిలో ఏ ఆలంబన లేకుండా సబలనంటూ నిటారుగా నిలిచిన ఆమె ఈరోజున ఆమెకే అంతుపట్టని భావ చాపల్యంతో అంతః సంఘర్షణకు లోనయ్యింది. తనకేం కావాలో తనకే ఇదమిత్థంగా తెలియని ఆమె మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చిగురుటాకులా కంపించిపోతోంది.

పదిహేను సంవత్సరాలుగా ప్రేమతాపంలో తానెంతగా సలసల రగిలిపోయిందో, రగిలి రగిలి ఆవిరై పోయిందో ఆమెకే తెలుసు. వెన్నెల కురిపించి మంచై మురిపించే చంద్రుని ఊహకైనా ఆమె వణికిపోయేది. లేని తోడుని తలుచుకుని బేలగా ఎన్ని నిద్ర లేని రాత్రులు కన్నీరు మున్నీరయ్యిందో ఆమెకే తెలుసు. కాని ఆ విషయాన్ని బాహాటంగా అంగీకరించే సాహసం చేయదు. పుట్టుకతో ఆ శరీరం కొన్ని సాంప్రదాయాలకు కట్టుబడిపోయింది. గుడిపాటి చలం సాహిత్యం చదివి మనసు చలించినా దానిని ఆమె నెగ్గనీయటం లేదు. పెళ్ళి కావలిసిన ఇద్దరమ్మాయిల తల్లి తను అని ఆమె నిత్యం తన మనసును హెచ్చరిస్తూంటుంది. కాని ఈ మాటల మాంత్రికుడైన చలం మాయలో పడిపోయింది.

ప్రేమోల్లాసమంతా ఊహలకే పరిమితం చేసి వాస్తవంలో ఒంటరితనంతో జతకట్టింది. ఆమె కలల్లో కళాత్మకంగా జీవించగల నటి. స్వప్నాల నౌకపై విహరించగల కళాకారిణి. ఊహల రెక్కలతో ఎగిరే విహంగం. ప్రేమతత్వంతో మమేకమై నర్తించే మయూరo. ఒక మైకంలో జీవిస్తూ మత్తులో జోగుతూ ప్రేమ కైతలు రాసుకుంటూ ఈనాటి వెన్నెల మజిలీలో అక్షరాలతో గారడీ చేసే చలంను తొలిసారిగా చూసింది.

ఇంతకాలంగా కొన్ని వేల మైళ్ళ దూరంలో వుంటూనే సాహిత్య ప్రేమాయణం సాగిస్తూ ఆత్మీయంగా అచ్చులతో మొదలై పొల్లుపోని హల్లులతో కొనసాగి ప్రయాస లేని ప్రాసలు, అందమైన కందాలు, ఆటవిడుపులో ఆటవెలదులు, తేనెలూరే తేటగీతులు, ఉత్పల చంపక మాలలు, యశస్వి, కవిరాజవిరాజిత, శృంగార, రాజహంసలు, ఒక్కొక్కటిగా సాహిత్య నిచ్చెనలు ఆమెను ఎక్కిస్తూ తానొక్కoడై, వన్ టు వన్ గా, ఒకరు ఇద్దరై, ఇద్దరు ఒకరయ్యారు.

అలా ఆమె ఒక ఏక లక్ష్య సాధనతో, ఏకాగ్రతతో, కనిపించకనే వినిపించే గురువుకి ఏకలవ్య శిష్యరికం చేసింది. అతని గొంతులోని మార్దవానికి ఆమె లొంగి పోయింది. అతనిలోని ప్రేమ తత్వానికి ఆమె కైమోడ్పు అయ్యింది. ఆమెకు అతనో గాడ్ ఫాదర్, తండ్రి, స్నేహితుడు, ఆత్మీయుడు, ప్రియుడు, భర్త, అన్న, తమ్ముడు, సర్వం. ఆమె జీవితానికి అసలు పరమార్ధం తెలియపరిచిన ఒక మార్మికుడు. వేదనలో వున్న ఆమెకు అతని బోధన, రోదనను మరిపించి జీవితాన్ని నివేదించింది. ఆమె ప్రేమ గమ్యం అతనే అనుకుంది. కాని ఈ రోజున అతను ఎదురుపడేసరికి మనసు ద్వ్యైదీభావంతో కొట్టుమిట్టాడుతోంది.

చలం గురించి అనేకానేక వార్తలు వున్నాయి. కొందరు అతను అకుంటిత బ్రహ్మచారి అంటే మరికొందరు బంధాలలో చిక్కడకుండా జీవితాన్ని ఆస్వాదించే రసికుడు అంటారు. రమ్యకు అతని సమాచారం అసలు ఏమీ తెలియదు. అతను ఐదు పదులు దాటి ఐదేళ్ళు అయినా చూపరులను ఆకట్టుకునే తేజస్సుతో కూడిన మొహము మంచి పర్చస్సుతో, ప్రేమవాక్కులు పలికే మృదు భాషి. సామాజిక స్పృహతో సాహిత్య సేద్యం చేస్తున్న కరుణామయుడు. పరోపకార చింతనతో పలువురికి ఉపయోగ పడుతూ, నిరాడంబర జీవనం సాగిస్తున్న కవిత్వ కర్షకుడు. కవితా రాహిత్య బంజరు భూములన్నీ సాగు చేసి, కవిత్వ విత్తనాలు నాటుతూ మొలిచిన మొలకలకు మురిసే కావ్య పిపాసి. అతని హస్త స్పర్శ సోకితే కలుపు మొక్కలు సైతం నాణ్యత సంతరించుకుంటాయి. అట్టడుగు వర్గాల, దళితుల, నిమ్న జాతుల బిడ్డలలో కూడా అక్షర జ్యోతిని వెలిగించి మట్టిలో నుండి మాణిక్యాలను, మేధావులను, మహా కవులను వెలికి తీసే మహా యాగం తలపెట్టాడు.

అతని వ్యక్తిగత జీవితం ఎవ్వరికీ తెలియదు. ఈ అఖండ హోమ నిర్వాహణలో తన వైయక్తిక జీవితాన్ని నిర్లక్ష్యం చేసి వంటరిగా మిగిలి పోయిన సాహిత్య ప్రేమికుడని అతని అభిమానుల నమ్మకం. ఏనాడూ యుక్త వయసులో కూడా చెక్కు చెదరని అతని మనసు ఈ ప్రాయంలో రమ్య పరిచయంతో అలజడికి గురయ్యింది. అతనికే కించిత్ ఆశ్చర్యంగా వుంది. రమ్య గొంతు పదే పదే వినాలనిపిస్తుంది. వింటున్నంత సేపూ మనసుకి తెలియని హాయి కలుగుతుంది. అలిసిన మనసు సేద తీరినట్టుంటుంది. గుండె దప్పిక తీరినట్టుంటుంది.

కవిగా మానసికానందాన్నిచ్చిన పనులకు అతనెప్పుడూ వెనుకంజా వేయలేదు. వ్యక్తిగతంగా ఇంతటి మనో సంతుష్టిని కాదనుకోవటం తనను తాను వంచించుకోవటమే. ఆమెనెప్పుడూ కంటితో చూడలేదు. ఆమె మాటలను, మనసును ప్రేమించాడoతే. తనది కామమో, మోహమో కాదు. ఇదొక అనిర్వచనీయ అవినాభావ సంబంధం. మునుపెన్నడూ ఎవరి పైనా కలగని భావన.

అనుకున్న ప్రకారం సభానంతరం రవీంద్ర భారతి ఎంట్రన్స్ వద్ద ఆమె అతని కోసం వేచి వుంది. ఎంతో కష్టంతో ఇరవై నిముషాలలో చుట్టూ గుమిగూడిన అభిమాన జన సమూహo నుండి విడివడి అతను బయట పడ్డాడు. తనతో పాటుగా బయటకు వెంట ఎవ్వరూ రాకుండా నియంత్రించటం అతనికి కష్టమే అయ్యింది.

ఆమెను సమీపిస్తూనే ‘రండి’ అంటూ కారు పార్కింగ్ వైపు దారి తీసాడు. అనిర్వచీయానందంలో ఆమె అతని అడుగులో అడుగులేస్తూ మంత్ర ముగ్ధలా అతనిని అనుసరించింది. అతను కారు స్టార్టు చేసాడు. ఇంజినుతో పాటే ఎఫ్.ఎం.లో పాట ప్రారంభమయ్యింది.

“చూసీ చూడంగానే నచ్చేసావే…..అడిగి అడగoగానే వచ్చేసావే…..
నా మనసులోకి హో అందంగా దూకి….
దూరం దూరంగా వుంటూ ఏం చేసావే…
దారం కట్టి గుండె ఎగరేసావే…..
ఊ…మాటల్తోటి….ఊ….చూపుల్తోటి…..
తొలిసారిగా నా లోపల ఏమయ్యిందో తెలిసేదెలా…..”

ఏమిటీ ఎఫ్ ఎం…అచ్చంగా తన మనసు చదివేసినట్టు పాడుతోందేమిటి.

ఈ పదాల కూర్పేమిటి సరిగ్గా తన మనసులో నుండే వచ్చినట్టు.

చలం తన పక్కన కూర్చొన్న రమ్య వైపు తల తిప్పి చూసాడు. కొన్ని వేల ప్రశ్నలతో మధన పడుతోందని ఆమె ముఖకవళికలు చెబుతున్నాయి. అవును సహజమే. ఆ పసి మెదడుకి ఇదొక శస్త్ర పరీక్షే. చలంకి స్టీరింగుని వదిలి ఆమె తలను తన చేతుల్లోకి తీసుకుని నిమరాలని తన హృదయానికి హత్తుకొని ఓదార్చాలని బలంగా అనిపిoచింది. హోటల్ గోల్కొండకి చేరి వాలెట్ పార్కింగులో కారు తాళం ఇచ్చేసాడు. గోల్కొండలో ‘జువెల్ ఆఫ్ నిజాం’ రెస్టారంట్ వైపు దారి తీసాడు. తడబడే అడుగులతో ఆమె అతనిని అనుసరించింది. కోజీగా వున్న ఓ మూలగా ఇరువురు కూర్చున్నారు.

“దేనికి రమ్యా, అంతలా మధన పడుతున్నారు. నాతో మనసు విప్పి మాట్లాడండి. నన్నొక ఆత్మీయుడిగా భావించండి. మిమ్మల్ని చూస్తే నా మనిషి అనే ఆప్యాయ భావన కలుగుతుంది నాలో” అనునయంగా అడిగాడతను.

కంటి రెప్పలు టపటపలాడిస్తూ బితుకు బితుకుగా చూసిందతని వైపు.

ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా స్పృశించాడు. ఆ స్పర్శ ఎంతో భరోసానిస్తుంది. జీవితమంతా అతనా చేతిని వదలకుండా వుంటే చాలనిపిస్తుంది. తనకంటూ అతనున్నాడన్న భావన ఎంత ఊరటనిస్తుందో.

వెంటనే ఎదిగిన కూతుర్లిద్దరూ కళ్ళ ముందు కదలాడారు. అతను తనకేమౌతాడు. తనకీ అతనికి మధ్యనున్న బంధం ఏమిటి. స్నేహమా. కాదు స్నేహాన్ని మించినది. ఒక ఆడ మగ మధ్య స్నేహాన్ని మించిన బంధానికి లోకం ఇచ్చే పేరేమిటి? అతను అవివాహితుడే. కాని తను పెళ్ళి కావాల్సిన ఇద్దరాడపిల్లల తల్లి. గబుక్కున అతని చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకుంది.

వణుకుతున్న కంఠంతో “మన మధ్య బంధానికి అర్థం ఏమిటి” అడిగింది రమ్య.

ఆమె మానసిక సంఘర్షణ అర్ధం చేసుకున్నవాడిలా ఆప్యాయంగా ఆమె వంక చూసాడు.

“రెండేళ్ళుగా ఏ బంధంతో మన అనుబంధం బలపడుతూ వచ్చింది. నేను మీ ఒక్కరితో కాదు. మీలాంటి వేల మంది మహిళలతో ప్రత్యక్షంగా సంకర్షిస్తూ వుంటాను. ఎందరో యువతులకు, అమ్మాయిలకు దగ్గరుండి సాహిత్యంలో ఓనమాలు దిద్దించాను. కాని నేనెప్పుడూ చలించలేదు. నాలో ఎటువంటి స్పందనలు కలుగలేదు. మిమ్మల్ని చూడకుండానే, మీ రాతలను చదువుతూ, నాకు తెలియకుండానే, మీతో ఒక అలౌక్యమయిన అనుబంధమేర్పరుచుకున్నాను. మీరు నా అసలు మజిలీ అనిపించింది. మీ కలయికతో నా సాహిత్య ప్రయాణం సఫలీకృతమవుతుందనిపిస్తోంది. మీరు నా జీవితపు డైరీలో ఆయువుపట్టు అయిన పేజీ. మన స్నేహం భగవత్సంకల్పం. భగవతేచ్చ” మృదువుగా అనునయంగా చెప్పాడు.

అతను పలికిన ప్రతి అక్షరం తను నమ్ముతుంది. ఎందుకంటే తనకూ అతనంటే వల్లమాలిన అనురాగం, ఆరాధన. అయినా నిస్సందేహంగా, మనస్ఫూర్తిగా, చాచిన అతని బాహువుల్లో గువ్వలా ఒదగ లేక పోతోంది. తమిద్దరి మధ్య అనుబంధాన్ని తన బిడ్డలు ఎంతవరకు ఆమోదిస్తారన్న ప్రశ్న ఆమెను తొలిచేస్తోంది. బిడ్డల దాకా ఎందుకు తన మనసే తడబడుతోంది.. తనకే తెలియకుండా తిరగబడుతోంది.

అపనమ్మకంగా బేలగా అతని వంక చూసింది.

అతనికి అమాంతం ఆమెను దగ్గరకు తీసుకుని గుండెల్లో పొదువుకోవాలనిపించింది. ఏమి చెప్పి ఆమెను సముదాయించాలో అర్ధం కాలేదు.

“మీరు కావాలంటే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను” అన్నాడు కలలో కూడా అటువంటి కమిట్‌మెంట్ చేయగలనని ఎప్పుడూ అనుకోని అతను.

“నో..నో…అది జరిగే పని కాదు” కంగారుగా అంది ఆమె.

అతను బరువుగా ఒక దీర్ఘ నిట్టూర్పు వదిలాడు.

“సరే, వివాహం లేకుండా మీతో స్నేహాన్ని నా ఊపిరున్నంత వరకు కొనసాగించగలను. మన స్నేహo ఏ రకమైనా నేను జస్టిఫై చేయగలను. నైతిక విలువలంటూ ప్రశ్నించే ఎవరికైనా సమాధానమీయగలను. మన మధ్య స్నేహం అపార్థాలకు తావిస్తుందనుకుంటే మిమ్మల్ని వివాహమాడటానికీ నేను సిద్దమే. మీ అనుమాన నివృత్తి కోసమే ఈ వివాహం. వివాహ ప్రస్తావన లేని బాంధవ్యమైనా నాకు సమ్మతమే. ఇప్పుడు సుప్రీమ్ కోర్ట్ ఆమోదించిన సెక్షన్ 497 ప్రకారం ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో జరిగే ఇష్టపూర్వక స్నేహం నేరం కాదని అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం చెప్పింది. మీరు వితంతువు.. నేను అవివాహితుడను. ఆ విధంగా మనకు చట్టపరంగానూ సమస్యలు వుండవు…”

ఆమె అతని మొహం లోకి చూస్తోంది. అతని ఆలోచనలు చాలా దూరం వెళ్ళిపోయాయి. అతను తన మనోభావాలను సమర్ధించుకోవటాన్ని ఆమె మనస్సు అంగీకరించటం లేదు. తన మనసు సుతారమూ అంగీకరించని ఈ బంధానికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టేయాలి. ఈ వ్యతిరేక లింగాకర్షణ ఎంతదాకానైనా తీసుకెడుతుంది. ఈ ‘ప్రేమ’ అనే మాయ మనిషిని ఎంతకైనా దిగజార్చగలదు. మనుసుని వశం చేసుకుని మనిషిని వివశ పరుస్తుంది. మనసు బలహీన పడక ముందే ఈ మాయ నుండి బయటపడాలి.

కాని అసలు తానేమి ఆశించి స్నేహించిందో అర్ధం కావట్లేదు రమ్యకు. తండ్రిని ఎంతో అభిమానించే తన బిడ్డలు, తన మీద ఎంతో గౌరవభావం వున్న తన బిడ్డల ముందు తల దించుకునే పరిస్థితిని తను తెచ్చుకోకూడదు. పిల్లలకు వరులను వెతకాల్సిన సమయంలో తను ఇలాంటి హేయమైన పని చేసి ప్రాణప్రదమైన పిల్లల దృష్టిలో పడిపోకూడదు. పిల్లలు తన వంక చూసే జుగుప్సాకర చూపును ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది.

ఈ జన్మకు ఆయన వితంతువుగా పిల్లల బాగోగుల ఆలోచనల్లో మిగిలి వుండటమే తన మనోధర్మం. తన మనస్సాక్షి అంగీకరించలేని సంబంధాలను తాను కలుపుకోలేదు. రమ్య మరొక్క క్షణం అక్కడ వుంటే ఎక్కడ తనను తాను నియంత్రించుకోలేక అతని కౌగిట్లో వాలిపోతానేమోననే భయంతో మనసుని చిక్క బట్టుకుని లేచి “మన్నించండి” అంటూ వెనుతిరిగి చూడకుండా విస విసా వెళ్ళిపోయింది. అతను ఆమెలోని కాఠిన్యానికి విస్తుపోయి “రమ్యా, ఒక్క క్షణం, మనసుతో ఆలోచించండి” అంటూ ప్రాధేయపడుతున్నాడు. అప్పటికే అతని మాటలు వినిపించనంత దూరం ఆమె వెళ్ళిపోయింది.

నరనరాన జీర్ణించుకుపోయిన భారతీయ కుటుంబ వ్యవస్థ నుండి హిందూ సనాతన ధర్మాల నుండి వేరుపడి తను మరో పెళ్ళి చేసుకోవటం లేదా పరాయి పురుషునితో సంబంధం పెట్టుకోవటం తన ‘మనస్సాక్షి’ అంగీకరించే విషయం కాదని అర్ధమయిన రమ్య తేలికయిన మనసుతో పిల్లలను ఎప్పుడెప్పుడు చూద్దునా అనుకుంటూ అటుగా వెళ్తున్న ఆటో ఎక్కి వేగంగా ఇంటికి పోనియ్యమంది. తానమేమిటో తెలుసుకున్న రమ్య గత రెండేళ్ళుగా అనుభవిస్తున్న తియ్యని నరకం నుండి విముక్తురాలై పిల్లల భవిష్య ప్రణాళికలు వేసుకుంటూ వాళ్ళతో ఆనందంగా కాలం గడపసాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here