[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 20వ భాగం. [/box]
[dropcap]అ[/dropcap]దే పెద్దగా చదువుకోని నేరస్థుడైతే శివ సిల్క్స్‌ను తగలబెట్టడానికి దహనశీల పదార్థం, కొంత యాసిడ్ లేదా భాస్వరం విసిరివేసేవాడు.
అప్పుడు వాటి ప్రభావం పూర్తిగా ఉండకపోవచ్చు. కొంతకాలం తర్వాత ఆ మంటల ద్వారా నేరస్థుడి ఆచూకీ దొరికే అవకాశం ఉంది.
వెల్డింగ్ కుమార్ మొదటగా “ways for burning down a building” అంటూ గూగుల్‌లో వెతికాడు. ఈ అంశంపై రెండు పూర్తి స్థాయి యూట్యూబ్ వీడియోలతో సహా అసంఖ్యాకమైన లింక్‍లని పొందాడు.
అప్పుడు అతను శోధనా పదబంధాన్ని “incendiary device” గా మార్చాడు. రష్యన్ పద్ధతి అయిన ‘మోలోటోవ్ కాక్టెయిల్’ గురించి అన్ని వివరాలను పొందాడు.
గతంలో కుమార్ ఆ పద్ధతిలో నిపుణుడు. అయితే ఈ చిన్న పనికి ఆ పరికరం కొద్దిగా ముతకగా ఉంటుంది.
అతను తన శోధనను “time-delay incendiary device” కు మెరుగుపరిచాడు. అత్యంత వేగంగా ఎన్నెన్నో వెబ్‌సైట్‌లను జాబితా చేయగలిగాడు, ఇవన్నీ ఓ భవనాన్ని అగ్ని ద్వారా నాశనం చేయడానికి అవసరమైన పదార్థాల జాబితా కలిగి ఉన్నాయి.
పైగా అవి ఎంత నిశ్చింతంగా పేర్కొనబడ్డాయంటే – మహిళల వంటకాల వెబ్‌సైట్‌లో ఉండే పదార్థాల వలె పేర్కొనబడ్డాయి.
నెట్‌లో ఒక రోజు పరిశోధన తరువాత ఇబ్బంది లేని ‘లా బొంబా’ పద్ధతిని ఎంచుకున్నాడు వెల్డింగ్ కుమార్. అతను ఆ వెబ్ సైట్ నుండి నిర్దేశాలను కూడా ప్రింట్ చేసుకున్నాడు.
ఈ పద్ధతి చాలా సులభం, వాస్తవానికి మోసపూరితంగా ఉంది. ఇంకా, అది చాలా ప్రభావవంతం కూడా.
కుమార్ జిప్-లాక్ ఉన్న ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొని దానిని తన బైక్ నుండి తీసిన పెట్రోల్‌తో నింపాడు. అతను ఆ ప్లాస్టిక్ సంచిని టిష్యూ పేపర్లతో నింపిన పెద్ద కాగితపు సంచిలో ఉంచాడు.
వెలిగించిన సిగరెట్ అగ్గిపెట్టె ద్వారా సాగుతుంది, అది టైమ్-డిలే ఫ్యూజ్ వలె పనిచేస్తుంది. ఈ పని ‘చేయబోయే’ వ్యక్తి సిగరెట్ వెలిగించి, దాన్ని అగ్గిపెట్టెలో వేయాలి.
ఇప్పుడు అతను, లేదా ఈ సందర్భంలో, ఆమె అక్కడ్నించి తప్పించుకోవడానికి తగినంత సమయం – సిగరెట్ పూర్తిగా కాలిపోవడానికి తీసుకునేంత సమయం ఉంటుంది. మంట అప్పుడు అగ్గిపెట్టెనూ, అగ్గిపెట్టె టిష్యూ పేపర్లను కాలుస్తుంది.
మండే టిష్యూ పేపర్లు అప్పుడు ప్లాస్టిక్ సంచిని కరిగించి, ఇంధనాన్ని విడుదల చేస్తాయి. అది మంటను ప్రారంభించడానికి సరిపోతుంది.
పైగా ఈ పరికరాన్ని ఎలక్ట్రికల్ మెయిన్స్ దగ్గర ఉంచితే అగ్ని మరింత వినాశకరమైన ప్రభావాలతో వేగంగా వ్యాపిస్తుంది. భవనం మొత్తం నిమిషాల వ్యవధిలో కాలిపోతుంది.
పోలీసులు లేదా ఫైర్ సర్వీస్ నిపుణులు ప్రమాద కారణాన్ని ఎప్పటికీ గుర్తించలేరు. “ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్” అనే పడికట్టు పదాలతో కేసు మూసివేయబడుతుంది, చాలావరకు అగ్ని ప్రమాదాలకు కారణం ఇదే అంటూంటారు.
వెల్డింగ్ కుమార్ ‘లా బొంబా’ పరికరాన్ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నందున, వారానికి రెండుసార్లు షాపుకి వెళ్ళాల్సిందిగా లతను కోరాడు. ఆమె అక్కడికి వెళ్ళినప్పుడల్లా చీరలు కొనేలా చేశాడు.
సంజనతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఆమె మరికొన్ని చీరలను కొంది.
***
లత ఇప్పుడు సంజనకి స్నేహితురాలు అయ్యింది. ప్రతిరోజూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, ప్రతిరోజూ కలుసుకుంటున్నారు. సూపర్ స్టార్ కూతురు పెళ్ళి ఆర్డరు గురించి సంజన అన్ని వివరాలను లతకు వెల్లడించింది.
పెళ్లి చీరలు ఎప్పుడు షాపుకి వస్తాయో తెలుసుకోవాలని కుమార్ ఆమెను కోరాడు. లత వెంటనే ఆ ఆదేశాన్ని పాటించింది.
***
అనుకున్న రోజు రానే వచ్చింది. శివ చీరలు, ఇతర దుస్తులు అన్నీ ఒక చోటకి చేర్చాడు. వివిధ వ్యక్తుల పేర్లను రంగు రంగుల కాగితాలపై ప్రింట్ చేసి చీర పెట్టెలపై అతికించాడు.
ఆ పెట్టెలను వ్యక్తి వారీగా ప్యాక్ చేసి, శివ సిల్క్స్ యొక్క డిజైన్ రూమ్ మూలలో చక్కగా పేర్చారు.
“మేడమ్, నేను అన్ని చీరలను చెక్ చేసాను; క్రాస్ చెక్ కూడా చేసాను. వాటిని ప్రతి వ్యక్తికి కలర్ లేబుళ్ళతో బాక్సుల్లో చక్కగా ప్యాక్ చేసాను. రేపు మంచిరోజు.
ఆ బాక్సులను రేపు అందజేద్దాం. నేను చాలా అలసిపోయాను మేడమ్. మనం ఇప్పుడు షాపు మూసేసి ఇంటికి వెళదామా?”
కానీ శివ సూచనకు సంజన ఒప్పుకున్నట్లయితే, అన్నింటినీ నాశనం చేయబోయే ఒక పెద్ద అగ్ని ప్రమాదాన్ని వారు నివారించి ఉండేవారు.
కానీ విధి బలమైన హస్తాల ముందు వాళ్ళు పూర్తి బలహీనులు. మొత్తం విధ్వంసపు ఆట ఆడాలని విధి నిర్ణయించుకుంది.
“శివా ఇప్పుడు ఇంకా 8 గంటలే అయింది. లత ఇప్పుడే ఫోన్ చేసింది. నీకు లత తెలుసుగా.. సూపర్ స్టార్ పెద్ద కూతురు స్నేహితురాలు. తను నిన్ను చూడాలనుకుంటుంది. తనకి నువ్వు డిజైన్ చేసిన చీర కనీసం ఒకటైనా ఉండాలని కోరుకుంటోంది.
కానీ ఇప్పుడు అంత సమయం లేదు. ఆమె దగ్గర నలభై వేల రూపాయలే ఉన్నాయి. ఆ డబ్బుతో చీరలు కొనడానికి ఆమె వస్తోంది. నేను ఆమెను నీకు పరిచయం చేస్తాను.
మంచి చీరను ఎన్నుకోవడంలో ఆమెకు సాయం చెయ్యి. ఆమె సంతోషిస్తుంది. పాపం, చిన్నతనంలోనే, తల్లిదండ్రులను కోల్పోయింది.”
తన భాగస్వామి అభ్యర్థనను శివ కాదనలేకపోయాడు.
***
లత 8.15కి షాప్‍కి వచ్చింది. హ్యాండ్‌బ్యాగ్ కాకుండా ఆమె ఒక పెద్ద గుడ్డ సంచిని తీసుకువచ్చింది.
“నేను నా ఆభరణాలను పాలిషింగ్ కోసం ఇచ్చాను. వాటిని ఈ రోజే తిరిగి ఇచ్చారు. పెద్ద సంచిలో ఆభరణాలు సురక్షితంగా ఉంటాయని భావించాను.”
లత అబద్దం చెప్పింది. ఆమె ఎలా నిజం చెప్పగలదు? దుకాణాన్ని తగలబెట్టే వస్తువుని తన సంచీలో తీసుకువచ్చానని ఆమె సంజనకు ఎలా చెప్పగలదు?
లత రూపంలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేక, సంజన నవ్వుతూ ఆమెను శివకి పరిచయం చేసింది.
“లతా, ఇతనే శివ, డిజైనర్. క్షమించు, శివ నీ కోసం చీరను డిజైన్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడు అతను మా అపురూపమైన పెళ్లి పట్టు చీరల నుండి నీ కోసం ప్రత్యేకమైన చీరను ఎంపిక చేస్తున్నాడు.”
శివ లత యొక్క రంగు, ఆమె ఎత్తు మరియు ఆమె ముఖ లక్షణాలను పరిశీలించాడు.
ఆమెని చూస్తుంటే శివకి ఏదో అసౌకర్యపు భావన కలుగుతోంది. సంజనతో అందామనుకున్నాడు. కానీ అతను ఆమె మానసిక స్థితిని పాడుచేయటానికి ఇష్టపడలేదు.
ఈ మహిళ సంజనకు సన్నిహితురాలు. పైగా, అంతకన్నా ఎక్కువగా ఆమె సూపర్ స్టార్ కుటుంబానికి సన్నిహితురాలు.
శివ డిజైన్ రూమ్ లోకి వెళ్లి లత కోసం రెండు చీరలు తీసుకున్నాడు. రెండూ బాగున్నాయి. ఒకటి నిజంగా మంచిది. లతని ఆకట్టుకుంది. ఇన్వాయిస్ సిద్ధం చేయమని ఆమె శివని అడిగింది.
షాపులో మరెవరూ లేరు. సేల్స్ గరల్స్ ఎప్పటిలాగే రాత్రి 8 గంటలకు వెళ్ళిపోయారు.
లత పూర్తి ధర రూ.33,800 నగదుగా చెల్లించింది.
ఆమె సంజనతో కాసేపు మాట్లాడుతోంది. ఆ రోజు ఎందులో లత చాలా ఆందోళనగా ఉన్నట్టు సంజన గమనించింది.
చివరకు లత – వెల్డింగ్ కుమార్ పన్నిన పన్నాగంపై పనిచేయడం ప్రారంభించింది.
విధి ఇప్పుడు పూర్తి ఊపులో విధ్వంసం సృష్టించబోతోంది. దాని పురోగతిని ఇప్పుడు ఏమీ ఆపలేవు.
***
“సంజన, నేను మీ రెస్ట్ రూమ్‌ని వాడుకోవచ్చా? ఉదయం నుండి కడుపులో గడబిడగా ఉంది. ఏదీ సరిగ్గా లేదు. పైగా అలజడిగా ఉంది.”
“అయ్యో, పర్వాలేదు. వాడుకోవచ్చు”
లత చీర పేకట్‍ను, తన హ్యాండ్ బ్యాగ్‌ను కౌంటర్ వద్ద వదిలేసి పెద్ద సంచిని రెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లింది.
***
వారి దృష్టి మళ్ళగానే లత హైపర్-యాక్టివ్ అయ్యింది. టైమ్ చూసింది. 8:50.
తన మొబైల్‌లో ఒక నిమిషం పాటు కాల్ చేసింది. ఆపై ఆమె 50 సెకన్ల పాటు మరో కాల్ చేసింది.
ఆమె రెస్ట్ రూమ్ నుండి బయటకు వచ్చింది. ఆమె సూపర్ స్టార్ ఇంట్లో ఇవ్వడానికి ఉద్దేశించిన బాక్సులు వరుసలను పెట్టి ఉండడం చూసింది. వాళ్ళ అదృష్టం ఏంటంటే – ఆ పెట్టెలను ఎలక్ట్రికల్ మెయిన్ క్రింద పేర్చారు.
అవి అక్కడ అలా ఉండడంతో లతకు చాలా సమస్యలు తొలగిపోయాయి.
ఆమె పెద్ద సంచీ నుండి ఒక చిన్న కాగితపు సంచిని బయటకు తీసి చీరల పెట్టెల మధ్య ఉంచింది.
ఆ తర్వాత ఆమె పెద్ద సంచీ నుండి సిగరెట్, లైటర్‌ను తీసుకుంది. ఆమె సిగరెట్‌ను నోటిలో పెట్టుకుని వెలిగించింది.
మంట స్థిరంగా ఉన్నప్పుడు ఆమె సిగరెట్‌ను కొత్త అగ్గిపెట్టెలోకి తోసి, చీరల మధ్య ఉంచిన చిన్న సంచిలో పడేసింది.
ఇక ఈ ప్రక్రియని ఎవరూ మార్చలేరు. లత టైమ్ చూసింది. 8:54. అది ఇప్పుడు దాదాపుగా ఓ ఫైర్ బాల్‌లా పేలిపోతుంది, అది మొత్తం షాపుని తగలబెడుతుంది.
మంటలు రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతాయి, రెండు లేదా మూడు నిమిషాల తరువాత కావచ్చు కానీ అంతకుముందు కాదు. ఆమె చేతిలో ఉన్న పెద్ద బ్యాగ్ తీసుకొని షోరూం లోకి పరిగెత్తింది.
***
ఆమె ఉన్మాదంగా సంజనని వేడుకుంది.
“సంజనా ఓ ఎమర్జెన్సీ వచ్చింది. నా స్నేహితురాలు దగ్గరలో ఉన్న ఫ్లాట్‌లో ఉంటుంది. వాళ్ళ నాన్నకి సీరియస్‍గా ఉందట. ప్రస్తుతం నేను అక్కడ ఉండటం అవసరం. నేను వెళ్ళాలి. దయచేసి నన్ను అక్కడ డ్రాప్ చేయమని మీ డ్రైవర్‌కి చెప్పవా?”
ఆ సమయంలో డ్రైవర్ ఉండడని లతకు తెలుసు.
శివ లేదా సంజన – ఇద్దరిలో ఎవరో ఒకరు తనని దింపుతారని లత ఊహించింది. తన వెంట వచ్చిన వారు మాత్రమే అగ్ని ప్రమాదం నుండి రక్షింపబడతారు. లతకి అత్యాశ లేదు.
ఆమె తన ప్రియుడి ఆదేశాలను అక్షరాలా పాటించింది. అదే సమయంలో ఆమె ఆ ఇద్దరిలో ఒకరిని కాపాడగలదు. కొన్ని సెకన్లలో ఎవరు రక్షించబడతారో తెలుస్తుంది.
“నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను మేడమ్” అన్నాడు శివ. సెలవు తీసుకునే ముందు లత సంజన వైపు చూసింది.
ఈ అందమైన దేవకన్యను సజీవంగా చూడటం అదే చివరిసారి అని అనుకుంటే ఆమె హృదయం అల్లల్లాడింది.
“నేను తొందరగా వెళ్ళాలి, పదండి.”
ఆమె బయటకు పరిగెత్తింది. శివ ఆమెని అనుసరించాడు.
వారు కారులో వెళుతున్నప్పుడు లత చుట్టూ చూడటం లేదు. కేవలం టైమ్ కేసి చూస్తోంది.
8:58 వద్ద, ఆ పరికరం యాక్టివేట్ కావడానికి కేవలం రెండు నిమిషాల ముందుగా, ఆమె “ఆపండి” అని అరిచింది. ఆశ్చర్యపోయిన శివ కారుని ఆపాడు. లత దిగి సమీపంలోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోకి పరిగెత్తినట్లు నటించింది.
ఒకసారి శివ దృష్టి తన పై నుంచి మళ్ళాకా, ఆమె తన మొబైల్ నుంచి మరికొన్ని కాల్స్ చేసింది.
శివ షాప్‌కి తిరిగి వస్తుండగా వినూ అతనికి ఫోన్ చేశాడు. శివ అతనితో పది నిమిషాలు మాట్లాడాడు.
చివరకు శివ 9.15కి షాప్‌కి తిరిగి వచ్చినప్పుడు అతనికి భవనం కనబడలేదు, లేదా ప్రకాశవంతంగా వెలిగే ‘శివా సిల్క్స్’ నియాన్-బోర్డ్ కనబడలేదు. బదులుగా మందపాటి నల్లటి పొగతో కప్పబడిన ఒక పెద్ద నిప్పు బంతి కనబడింది.
ఆ స్థలం రద్దీగా ఉంది. రెండు ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి. చుట్టూ చాలా మంది పోలీసులు ఉన్నారు.
“సంజనా”
శివ రోదన ఆ చప్పుళ్ళలో కలిసిపోయింది.
(ఇంకా ఉంది)