వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-23

0
3

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. విలువ

“అమ్మా, మాతా కవళం తల్లీ” అంటూ బిగ్గరగా వినిపించిన బిక్షగాడి కేక విని ఇంట్లోనుండీ బయటకు వచ్చింది సువర్చల.

“నిన్న రాత్రి నుండీ ఏమీ తినలేదమ్మా, ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయ్, ఏదైనా వుంటే కాస్త పెట్టండి తల్లీ, మీకు పుణ్యం వుంటుంది” దీనంగా అర్థించాడు బిక్షగాడు సువర్చలను చూడగానే.

“నిన్ను ఎక్కడో చూసినట్లుందయ్యా?” అడిగింది సువర్చల అరభై ఏళ్లు పైబడి వృద్యాప్యంతో నడవలేక నీరసంగా వున్నఅతడిని ఎక్కడ చూసానా అని గుర్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ.

“నేను మామూలుగా ‘ఎంగట్రోణ సామి’ గుడి కాడ వుంటానమ్మా” బదులిచ్చాడు బిక్షగాడు.

“ఇప్పుడు గుర్తొచ్చింది” చెప్పింది సువర్చల.

“ప్రతి శనివారం సందకాడ మీరు ఆ గుడికి రావడం నేను కూడా చానాసార్లు చూసినానమ్మా” అన్నాడు అతడు.

“అవునయ్యా, ఓ చిన్న మాట, నాకు తెలిసీ నువ్వు ఇలా వీధుల్లోకి వచ్చి ఇళ్ళ ముందు అడుక్కున్నట్లు నేనెప్పుడూ చూడలేదే?” అడిగింది సువర్చల.

“నిజమే తల్లీ, నేనే కాదు ఇంకా నాలాంటోల్లమంతా ఆ గుడికి వచ్చే మీలాంటోల్లు ఇచ్చే చిల్లర దుడ్లు, పెట్టే ఏదైనా తిండితో కడుపు నింపుకునేటోల్లం, జనాలంతా ఒకే తావులో గుమిగూడితే అదేందో కరోనా రోగం అంటుకుంటా వుందని నాలుగు దినాలకు ముందు గుడి మూసేసిన కాడినుండీ మాకు ఈ తిప్పలు తప్పడం లేదు” ఆవేదనగా చెప్పాడు బిక్షగాడు.

“అది సరేగానీ, గవర్నమెంటు నీలాంటి ఆరభై ఏళ్లు నిండిన పేదలందరికీ నెల నెలా పెన్షన్లు ఇస్తోందట కదా, నువ్వూ అప్లై చేసుకోరాదా?, ఇలా ఇబ్బందులు పడకుండా హాయిగా గడిచిపోతుంది” సలహా ఇస్తున్నట్లుగా చెప్పింది సువర్చల ఇంట్లో నుండీ తెచ్చిన అన్నం , కూరలు అతడి గిన్నెలోకి వేస్తూ.

“మీరు చెప్పే పించినీలు, గవర్మెంటు కట్టించే ఇండ్లు అన్నీ ఓట్లు వుండి ఎవురో ఒగ నాయకుడి అండ వుండేవాల్లకేనమ్మా, మాలాంటోల్లం ఒట్టి పానాలు వుండేటోల్లమేగానీ విలువ వుండే మనుసులం కాదు” చెప్పాడు బిక్షగాడు తనదారిన తాను బయలుదేరి వెళుతూ…

2. పసి మనసు

“మమ్మీ, ఈ నెల ఇరభైమూడున సోమవారం నాడు జరిగే స్కూల్ యానివర్సరీ డే కి నువ్వూ, డాడీ ఇద్దరూ తప్పనిసరిగా రావాలట, మా క్లాస్ టీచర్ అదే పనిగా చెప్పమంది” తన తల్లితో చెప్పాడు మూడో తరగతి చదివే తొమ్మిదేళ్ళ చింటూ స్కూల్ నుండీ ఇంటికి రాగానే.

“అయ్యో, సారీ నాన్నా, గత రెండు వారాలుగా వాయిదా పడుతున్న కిట్టీ పార్టీని ఎలాగైనా సరే ఆ రోజే జరపాలని ఇవాళ ఉదయమే మా మహిళామండలిలో నిర్ణయించేసుకున్నాం, పైగా పార్టీ జరిగేది కూడా మన ఇంట్లోనే, ఈ సారికి మీ డాడీని రమ్మని చెబుతాలే” కొడుకును కన్విన్స్ చేస్తున్నట్లుగా అంది సుప్రజ.

“చింటూ, మీ మమ్మీ బిజీగా వుండి నీ స్కూల్ డే ఫంక్షన్‌కు నన్ను వెళ్ళమంటోంది, కానీ ఆ వారంలో నాకు క్యాంప్ వుంది నాన్నా, వచ్చే నెలలో రిలీజ్ అయ్యే ప్రమోషన్ జాబితాలో నేను చోటు సంపాదించుకోవాలంటే ఈ క్యాంపుకు తప్పనిసరిగా వెళ్ళి టార్గెట్స్ పూర్తిచేయాలి, నేను కష్టపడేదంతా నీకోసమే కదా, పైగా అక్కడికి వచ్చినా వాళ్ళు ఇచ్చే స్నాక్స్ తిని కూర్చోవడం తప్ప నాకు వేరే ఏం పని వుండదుగా, ఈసారికి ఎలాగోలా కానిచ్చెయ్” రాత్రి భోజనాల సమయంలో చెప్పాడు తండ్రి చింటూకు.

“కనీసం ఒకరన్నా రాకుంటే మా టీచర్ ఒప్పుకోరు నాన్నా, మీరు ఎందుకు రాలేదని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి?” అన్నాడు చింటూ ఏడుపు గొంతుతో.

“అలా అయితే మీ టీచర్ అడిగే పక్షంలో ఏదో ఒక చిన్న అబద్దం చెప్పెయ్” సలహా ఇచ్చాడు తండ్రి.

స్కూల్ డే రోజున.. సోమవారం సాయంత్రం… ఫంక్షన్ మరో అరగంటలో ప్రారంభం కాబోతుందనగా….

“చింటూ, ఈసారి కూడా ప్రోగ్రాంకు మీ మమ్మీ, డాడీ వచ్చినట్లు లేరు, వాళ్ళు ఇద్దరూ ఖచ్చితంగా రావాల్సిందేనని నేను చెప్పినట్లుగా ఇంట్లో చెప్పావా?” అడిగింది క్లాస్ టీచర్.

“చెప్పా టీచర్, మమ్మీ డాడీ ఇద్దరూ వస్తామన్నారు, కానీ శనివారం రాత్రి డాడీకి గుండెనొప్పి వచ్చింది, హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే అమ్మ తోడుగా అక్కడే వుంది, అందుకనే రాలేదు” చెప్పిందా పసి మనసు మాటల్లో తల్లిదండ్రుల మీద అసహ్యాన్ని రంగరిస్తూ…

3. చెల్లుబాటు

“ఏమండీ, నేను ఉదయం చెప్పిన సంగతి గురించి ఏమైనా ఆలోచించారా?” సాయంత్రం ఆఫీసు నుండీ ఇంటికి రాగానే భర్తను అడిగింది శ్యామల.

“మీ దూరపు బంధువు సుగుణ పిల్లల్లో ఎవరో ఒకరిని మన ఇంటికి తెచ్చుకుందామన్నావ్, ఇంతకీ ఈ ఆలోచన ఇప్పుడు ఎందుకొచ్చింది?” అడిగాడు గిరి భార్యను.

“చిన్న వయస్సులోనే భర్త చనిపోయి ఏ ఆసరా, ఆదాయం లేని సుగుణ ముగ్గురు పిల్లలను పోషించుకోలేక చాలా అగచాట్లు పడుతోందండీ, పైగా పెళ్ళయి పద్నాలుగేళ్ళు అయినా మనకూ ఎలాగూ పిల్లలు లేరు, ఎవరినైనా అనాథాశ్రమం నుండీ తెచ్చుకుని పెంచుకుందామని నెల క్రితం మీరే చెప్పారు కూడా” భర్తకు గుర్తు చేస్తున్నట్లుగా అంది శ్యామల.

“నేను అన్నది నిజమే శ్యామలా, కానీ అడిగితే సుగుణ ఒప్పుకుంటుందా?” అడిగాడు గిరి.

“విధవరాలిగా ఏ రకమైన చేయూత లేని సుగుణ పిల్లల పెంపకం సులభంగా జరిగిపోతుందంటే, పైగా మనం తెచ్చుకునే పిల్లాడిని బాగా చదివించి మంచి ప్రయోజకుడిని చేస్తామంటే ఖచ్చితంగా కాదనదు” చెప్పింది శ్యామల ఎంతో నమ్మకంగా.

“సరే, నాకేం అభ్యంతరం లేదు, నీ ఇష్టం” చెప్పాడు గిరి శ్యామలతో.

అదే రోజు రాత్రి….

“శ్యామలా, చిన్నమాట, సుగుణ కొడుకును ఇక్కడికి తెచ్చుకుని పెంచుకుందామని సాయంత్రం నువ్వు అల్లుడు గారితో మాట్లాడుతుండగా విన్నాను, నీ ఆలోచన మంచిదేగానీ, మగపిల్లాడి కంటే సుగుణ పెద్దకూతురు పదకొండేళ్ళ పెద్దపిల్లది వుందే, దాన్ని తెచ్చుకో”కూతురికి సలహా ఇస్తున్నట్లుగా అంది చుట్టపుచూపుగా వచ్చిన శ్యామల తల్లి సుభద్రమ్మ.

“ఎందుకమ్మా అలా?” అర్థం కానట్లుగాఅడిగింది శ్యామల.

“ఈ నగరంలో పనిమనుషుల సమస్య ఎక్కువగా వుందని, నెల నెలా వేలకు వేలు పోసినా అంత అనుకూలమైన వాళ్ళు ఎవ్వరూ దొరకడం లేదని నువ్వే ఎన్నోసార్లు బాధపడుతూ చెప్పావ్, మగపిల్లాడి బదులు ఆడపిల్ల అయితే ఒక్క నయాపైసా ఖర్చు కాకుండా, వేరే పనిమనిషి అవసరం లేకుండా మీరు ఆ అమ్మాయి కోసం చేసే ఖర్చులకు చెల్లుబాటు అయ్యేలా చేతికిందికి పనికొస్తుంది, పైగా పెద్ద చదువులు చదివించమని అడగదు, పెట్టింది తిని నోర్మూసుకుని పడివుంటుంది”తన దూ(దు)రాలోచనను కూతురికి చెప్పింది సుభద్రమ్మ.

4. గిట్టుబాటు

“నాయుడూ, ఈసారి కష్టం ఎక్కువగా వుంది, పైగా ఖర్చు కూడా ఎక్కువగా పెట్టాల్సివచ్చింది, నువ్వు చెప్పే రేటు మీద కిలో మరో రెండు రూపాయలు పెంచి ఇప్పించయ్యా” టౌనులోని ఓ మామిడి కాయలు మండీ దగ్గర మండీ యజమానిని దీనంగా బ్రతిమలాడాడు తన పంట దిగుబడిని అమ్ముకోవడానికి వచ్చిన ఓ రైతు.

“కిలోకు పది రూపాయలకు మించి ఒక్క నయాపైసా కూడా ఇవ్వనయ్యా, నీకు ఇష్టం వుంటే అమ్ము, లేకుంటే వాపసు తీసుకెళ్ళు” కసురుకున్నట్లుగా తెగేసి చెప్పాడు మండీ యజమాని.

“నువ్వు చెప్పే రేటు తోట సాగుకోసం నేను వడ్డీకి అప్పు తెచ్చి ఎరువులు, మందులు కూలీలకోసం చేసిన ఖర్చులో సగానికి కూడా గిట్టుకోదు, అయినా ఏం చేస్తాం, అలాగే కానివ్వు” లోపలినుండీ ఎగదన్నుకుని వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ చెప్పాడు రైతు నీరసంగా.

సరిగ్గా ఓ గంట తరువాత…

“సార్, వారం రోజులుగా అప్పుడప్పుడూ కళ్ళు తిరుగుతున్నాయ్, నీరసంగా కూడా వుంటోంది” చెప్పాడు రైతు తన వంతు వచ్చాక ధర్మాసుపత్రిలోని డాక్టర్‌ను కలిసి.

“నీ వయస్సు పైబడినందున ఇది మామూలే, మంచి టానిక్కు రాసిస్తా, కొని ఓ ఆరు నెలలు వాడు, ఇప్పుడు ఓ ఇంజెక్షన్ వేస్తా, ఏమైనా తిన్నావా?”అడిగాడు డాక్టర్.

“లేదు సార్, మళ్ళీ త్వరగా వెళ్ళిపోవచ్చని తెల్లవారుజామునే పల్లె నుండీ వచ్చా, బయట ఎక్కడా తినే అలవాటు కూడా లేదు” చెప్పాడు రైతు.

“అలా అయితే వెళ్ళి ఓ జ్యూస్ త్రాగేసి రాపో”సూచించాడు డాక్టర్.

“బాబూ, ఓ జ్యూస్ బాటిల్ ఇవ్వు”ఆసుపత్రి బయటవున్న షాపువాడిని అడిగాడు రైతు.

“అరలీటర్ బాటిల్ నలభై రూపాయలు అవుతుంది” అన్నాడు వాడు ఓ కంపెనీ మ్యాంగో జ్యూస్ బాటిల్ చూపిస్తూ.

ఆ ధర వినగానే మళ్ళీ కళ్ళు తిరిగాయి రైతుకు. కేవలం అర కిలో మాత్రమే తూగే రెండే మామిడిపళ్ళు పిండి మిగతా నీళ్ళు కలిపి ఓ రంగు కాగితం అతికించిన సీసాకు అంత ధర పలుకుతుండగా ఎండ, వాన, మబ్బు, మోడం, పురుగు, పుట్రను లెక్క చేయక ఆరుగాలం కష్టంతో చెమటచుక్క చిందించి తను పండించిన మామిడిపంట వారం రోజుల క్రితం గౌరవ మంత్రిగారు చెప్పినట్లుగా కిలో కేవలం పదిరూపాయల ‘గిట్టుబాటు’ ధరకు అమ్ముడుపోవడం గుర్తుకువచ్చి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here