[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
మాహురీం తు సమాసాధ్య తిలగ్రహస్థ ఫలం లభేత్।
తత్సంగమే వితస్తాయాం స్నాత్యాముచ్యేత కిల్విషైః॥
[dropcap]మా[/dropcap]హురీ నది చేరుకున్న వారికి తిలదాన ఫలం లభిస్తుంది. వితస్తతో ఈ నది సంగమం వద్ద స్నానం వల్ల పాపాలు, మలినాలు నశిస్తాయి. త్రిప్రదేశ వద్ద ఈ నదీస్నానం, మహాదేవ పర్వత దర్శనం వల్ల రుద్రలోకం లభిస్తుంది. అమరేశ నదీస్నానం వల్ల వంద గోవుల దాన ఫలం లభిస్తుంది. మాలిని నది స్నానం వల్ల పది గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది. పాండవ తీర్థంలో స్నానం వల్ల పంచ యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఉద్దేశ తీర్థ స్నానం వల్ల రుద్రలోకం లభిస్తుంది.
రామహృద నదీస్నానం వల్ల బంగారం లభిస్తుంది. మాలిని నది సింధు నదుల సంగమం; రామహృద, సింధు నదుల సంగమం స్నానం రాజసూయ, అశ్వమేధ యాగాలతో సమానం. కనకవాహిని సింధునదిని కలిసే స్థలంలో స్నానం వల్ల వంద గోవులు లభిస్తాయి. వ్యక్తి ధనవంతుడవుతాడు. పావన నది అతి పవిత్రమైనది. రజోబిందు వినిర్మలలో స్నానం వల్ల పుండరీక వ్రతం ఆచరించిన ఫలితం లభిస్తుంది. పావన నది, రజోబిందు వినిర్మల నదుల సంగమం వద్ద స్నానం రాజసూయ యజ్ఞఫలాన్నిస్తుంది. ఈ రెండు నదుల సంగమ స్థలం నుండి చిరమోచనం నది వరకు ఉన్న స్థలం వారణాసి అంత పవిత్రం. చీర ప్రమోచనం నది స్వర్గానికి మార్గం ప్రసాదిస్తుంది. తమ వస్త్రాలు వదిలి సప్తర్షులు ఈ ప్రదేశం నుండే ప్రయాణించారు. ఈ నదీ స్నానం వల్ల పాపాత్ములకు కూడా పాపాల ప్రక్షాళన వల్ల స్వర్గప్రాప్తి లభిస్తుంది.
సాదర నదీ స్నానం వెయ్యి గోవుల దాన ఫలాన్నిస్తుంది. కనకవాహిని, కాలోదక నదుల సంగమమే కాదు, ఈ రెండు నదులలో విడివిడిగా స్నానం చేయటం వల్ల కూడా రాజసూయ, అశ్వమేధ యాగాలు జరిపిన ఫలం లభిస్తుంది. పౌర్ణమి రోజున సింధు, వితస్త నదుల సంగమ స్నానం వల్ల అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. పాత్రతీర్థ నదీ స్నానం వల్ల పౌండరీక యజ్ఞ ఫలం లభిస్తుంది. అపగ నదీ స్నానం వల్ల కుటుంబం సురక్షితమవుతుంది. అభివృద్ధి చెందుతుంది.
మానస సరోవరంలో ఆషాఢ మాసం పౌర్ణమి రోజున స్నానం చేయటం వల్ల అగ్నిష్టోమ ఫలం దక్కుతుంది. దీన్ని సందేహించాల్సిన అవసరం లేదు.
మహాపద్మ నదిలో స్నానం వల్ల వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది. హరముండ పర్వతం నుంచి ఉద్భవించిన హిరణ్య నదిలో స్నానం చేయటం వల్ల అగ్నిష్టోమ యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుంది. హిరణ్య, మహాపద్మ నదుల సంగమంలో పౌర్ణమి రోజు స్నానం చేయటం వల్ల అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుంది.
బహురూప నదిలో స్నానం విష్ణులోక ప్రాప్తినిస్తుంది. శతశృంగ, వైశ్వానర, భూర్జస్వామి వంటి పవిత్ర స్థలాలు వసులు, రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, సకల దేవతలు, భృగు, అంగీరసుల వంటి వారందరూ అతి పవిత్రంగా భావించిన స్థలాలు. ఈ నదులలో స్నానం వల్ల దశ గోదాన ఫలం లభిస్తుంది. బిలాస్ప, సిలామ నదులు వితస్తని కలిసే స్థలం అత్యంత పవిత్రమైనది. ఈ నదుల దర్శనం వంద గోదాన ఫలితాన్నిస్తుంది. కులార్లి, వితస్త నదుల సంగమ స్థలిలో స్నానం వంశాభివృద్ధికి తోడ్పడుతుంది. వంశంలోని వారందరి పాపాలను పరిహరిస్తుంది. పుష్కర నదిలో స్నానం అతిరాత్ర యజ్ఞ ఫలాన్నిస్తుంది. సప్తర్షుల పవిత్ర నదిలో స్నానం అగ్నిష్టోమ యాగ ఫలాన్నిస్తుంది.
వితస్త నదిలోని వరహా స్థలం చేరటం వల్ల విష్ణులోకం ప్రాప్తిస్తుంది. అతని వంశం అభివృద్ధి చెందుతుంది. వితస్త నదిలోని నారాయణ తీర్థం వద్ద స్నానం వల్ల విష్ణులోకం ప్రాప్తిస్తుంది. గోత్ర నది వితస్తను కలిసే మార్గంలోనూ, గోత్ర నది, వితస్తలలో విడివిడిగా స్నానం చేసిన వారికి వెయ్యి గోవులను దానం ఇచ్చిన ఫలితం లభిస్తుంది.
మాధురి నది మధుర అంత పవిత్రమైనది. శతానీల, సామల, విమలోదక, రాపల, శ్రీమధ్య, శుద్ధ, సామల, సురస వంటి నదులలో స్నానం వల్ల గోదాన ఫలం లభిస్తుంది. ఈ నదుల సంగమాలలో స్నానం వల్ల దశగోదాన ఫలం లభిస్తుంది. నాగుల లోకం ప్రాప్తిస్తుంది.
చిందునాదేశ్వర తీర్థం, సోమ తీర్థం, పృథూదక, తుంగేశ తీర్థ క్షేత్రం, ఉదంకస్వామి, రామతీర్థం, భృగు తీర్థం, అంగీరసుల పవిత్ర తీర్థం వంటి తీర్థాల దర్శనమే పది గోవులను దానమిచ్చిన ఫలితాన్నిస్తుంది.
(ఇంకా ఉంది)