లోకల్ క్లాసిక్స్ – 25: భావజాలాల పట్టూ విడుపూ

0
3

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా గిరీష్ కర్నాడ్, బీవీ కారంత్ సంయుక్త దర్శకత్వం వహించిన కన్నడ సినిమా ‘వంశ వృక్ష’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘వంశ వృక్ష’ (కన్నడ)

[dropcap]1[/dropcap]970లలో కన్నడలో ఆర్ట్ సినిమాలు విరివిగా వచ్చేవి – కాడు, చోమన దుడి, సంస్కార, సందర్భ, ఘట శ్రాద్ధ వంటివి. ఇవన్నీ ఒకెత్తయితే ‘వంశ వృక్ష’ ఒకెత్తు. అలాగే ఇద్దరు దర్శకుల సంయుక్త కృషి కావడం మరోకెత్తు. 1970లో ‘సంస్కార’తో నటుడిగా పరిచయమైన గిరీష్ కర్నాడ్ మరుసటి సంవత్సరమే 1971లో ప్రతిష్టాత్మక ‘వంశ వృక్ష’ దర్శకత్వ బాధ్యత తీసుకోవడం కూడా విశేషమే. నాటక రంగంలో ప్రఖ్యాతుడైన బీవీ కారంత్ నాల్గే సినిమాలకి దర్శకత్వం వహించారు. వాటిలో ‘వంశ వృక్ష’ సంయుక్త దర్శకత్వమొకటి. ఇలా ఈ ఇద్దరి దర్శకత్వంలో ‘వంశ వృక్ష’ ఆనాడొక చర్చనీయాంశ సబ్జెక్టు అయింది. ఇదెలా వుందో చూద్దాం…

కథ

1924లో శ్రీనివాస శోత్రి (టి. వెంకటరావు) ప్రశాంత జీవితం గడుపుతూంటాడు. భార్య భాగమ్మ, ‘రెండో భార్య’ లక్ష్మి, లేత వయసులో వితంతువైన కోడలు కాత్యాయినీ (ఎల్వీ శారద), చిన్ని అనే నాల్గేళ్ళ మనవడూ వుంటారు. కాత్యాయిని భర్త నంజుండ శోత్రి బియ్యే పూర్తి చేయకుండానే మరణించాడు. బొట్టు లేకుండా తెల్ల చీరలో వుంటున్న ఆమె శిరో ముండనానికి ఒప్పుకోక పోతే అత్తగారు చీవాట్లు పెడుతుంది. మామగారు శ్రీనివాస శోత్రి ఇంత చిన్న వయసులో శిరో ముండనం బావుండదని కోడల్ని సమర్ధిస్తాడు. అతను ధర్మ శాస్త్రాలు చదివిన వాడు. ధర్మ బద్ధంగా జీవించాలంటాడు. అయితే ఎవర్నీ శాసించడు. ధర్మం ఏం చెప్తుందో చెప్పి నిర్ణయం వ్యక్తులకే వదిలేస్తాడు. కాత్యాయినిని గీత, ఉపనిషత్తులు చదువుకోమని ప్రోత్సహిస్తాడు. ఆమెకి భర్త పూర్తి చేయని బియ్యే చదివి ఆయన కోరిక పూర్తి చేయాలనీ వుంటుంది. తండ్రి కోరిక కొడుకు బాధ్యత అనీ, అది నీ కొడుకు చూసుకుంటాడనీ, వంశ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందనీ ఆమెకి భోదించి, నిర్ణయం ఆమెకే వదిలేస్తాడు.

ఆమె కాలేజీలో చేరిపోతుంది. అక్కడ హిస్టరీ ప్రొఫెసర్ సదాశివరావు, అతడి తమ్ముడు ఇంగ్లీషు లెక్చరర్ రాజారావు (గిరీష్ కర్నాడ్) వుంటారు. సదాశివరావుకి భార్య నాగలక్ష్మి వుంటుంది. అతడి కింద పనిచేసే సింహళ రీసెర్చి విద్యార్థిని కరుణా రత్నే (ఉమా శివకుమార్) వుంటుంది. రాజారావూ కాత్యాయనీ ప్రేమలో పడతారు. పెళ్లి విషయం వచ్చేసరికి ఆమె సందేహిస్తుంది. మామగారికి ఎలా చెప్పాలి రెండో భార్య పట్ల ఆయన వైఖరి తెలిశాక? రెండో భార్య నిజానికి పని మనిషి. మొదటి భార్య కాన్పులో నంజుండ పుట్టాక, రెండో కాన్పు ఆమెకి ప్రమాదమవుతుందని డాక్టర్ హెచ్చరించాడు. దీంతో మామగారు భార్యకి దూరంగా వుండసాగాడు. భర్తకి శారీరక సుఖం దక్కడం లేదని భార్య పని మనిషిని ఒప్పించింది. భర్తని వదిలేసిన పనిమనిషి లక్ష్మి, మామగారికి రెండో భార్య గా ఇంట్లో వుంటోంది. కానీ ధర్మం అడ్డొచ్చిన మామగారు ఆమెని ముట్టుకోలేదు. ఈ విషయంలో ఆమెకి అన్యాయం చేస్తున్నానని ఎంతో క్షోభ కూడా అనుభవించాడు. రెండో భార్య విషయంలో ఇంత కఠినంగా వుంటూ, కోరికలు చంపుకున్న మామగారితో, ఇప్పుడు తను వెళ్లి పునర్వివాహం గురించి, కోరికల గురించీ ఎలా చెప్పాలి? ఇదీ సమస్య.

ఎలావుంది కథ

1965లో ప్రసిద్ధ రచయిత డాక్టర్ ఎస్. ఎల్. భైరప్ప రాసిన ‘వంశ వృక్ష’ నవల ఆధారంగా తెరకెక్కించిన కథ. కన్నడ సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయిన ఈ నవల కర్ణాటక సాహిత్య అకాడెమీ అవార్డు పొందడమే గాక, ఎన్నో భాషల్లో అనువాదమయింది కూడా. నవల ప్రకారమే సినిమా రూపొందింది. వితంతు యువతి కన్న కొడుక్కీ, కొత్త భర్తతో ప్రేమకీ మధ్య నలిగిపొయిన మనో విశ్లేషణాత్మక నాటకీయ కథ. వ్యక్తికీ ధర్మానికీ మధ్య సంఘర్షణ. మనిషి జీవనాన్ని నిర్దేశించే వంశ వృక్ష వృత్తాంతపు వాస్తవం. కోడలు ధర్మం తప్పింది సరే, మామగారు ఏ వంశ వృక్షం కోసం ధర్మాలు భోదిస్తున్నాడో, ఆ వంశ వృక్షమే తన పుట్టుకని ప్రశ్నార్థకం చేస్తే? తాతకి పుట్టినవాడు తన తండ్రి కాదని బయట పడితే? అప్పుడేది కుటుంబ ధర్మం? ఎవరు ధర్మ విరోధి?

సినిమా చూస్తే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు మనమెవరం? మన పూర్వీకులెవరు? వంశానికి ప్రథముడెవరో ఖచ్చితంగా తెలియకపోతే వంశ వృక్షంతో ప్రయోజన మేమిటి? ఈ కథలో మామగారి తండ్రి లాగా అక్రమ సంతానమైతే ఇంకెక్కడి వంశ వృక్షం? వంశ వృక్షం కాన్సెప్టు హిందూ సంస్కృతి లోనే కాదు, అన్ని సంస్కృతుల్లోనూ వుంది. కొన్ని తరాల వంశ వృక్షాల్ని రూపొందించే, వంశ క్రమాల్ని కనుగొనే జీనియాలజీ వెబ్ సైట్లు కోకొల్లలుగా వెలిశాయి.

ఇది మూడు దశాబ్దాల కాలావధిలో సాగే రెండు కుటుంబాల కథ. మామగారి కుటుంబం, కోడలి కుటుంబం. మామ గారింట్లో వున్న వితంతు కోడలు రెండో పెళ్లి చేసుకుని వేర్పడే కథ. మరో వైపు భార్య వుండగా రీసెర్చి విద్యార్ధినితో కాపురం చేసే ధర్మాలు పట్టని ప్రొఫెసర్ కథ. ఈ పాత్రల కథలు కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వుంటాయి. రెండో భర్త ప్రేమ పొందిన కోడలికి మొదటి భర్త కొడుకు ప్రేమ దక్కదు. తను అక్రమ సంతానానికి సంతానమని తెలుసుకున్న మామగారికి గృహస్తాశ్రమ ధర్మం దక్కదు. భార్యని వదిలి రీసెర్చి విద్యార్థినితో కాపురం చేస్తున్న ప్రొఫెసర్‌కి, తన ఐదు సంపుటాల బృహత్ రీసెర్చి పూర్తి చేయడానికి ఆరోగ్యం దక్కదు.

సమాజ కట్టుబాట్లు – వ్యక్తి స్వేచ్ఛ, నైతిక విలువలు – వ్యక్తి ఇష్టాలు, సాంప్రదాయ నియమాలు – ఆధునిక ఆశయాలు… వీటి మధ్య కూడా చిరు సంఘర్షణలు ప్రతిబింబిస్తాయి కథలో.

ఎవరెలా చేశారు

కాత్యాయిని పాత్ర ఎల్వీ శారదకి, శోత్రి పాత్ర టి. వెంకటరావుకి మైలు రాయి పాత్రలు. నటులుగా ఈ నటులు కన్పించరు, పాత్రలుగా వీళ్ళ పాత్రలు కన్పించవు. పాత్రల ఆత్మలు కన్పిస్తాయి. అంటే పాత్రల మానసిక లోకాలు దర్శనమిస్తాయి. నవలలు మానసిక లోకాలనే ఆవిష్కరిస్తాయి. కానీ సినిమాలు అరుదుగా మానసిక లోకాల్ని ప్రతిబింబిస్తాయి. ఇలా కాకుండా ఇక్కడ నవల్లోని మానసిక లోకాలు, తెర మీద మానసిక లోకాలుగా తర్జుమా అయి చక్కగా కనబడతాయి. దీంతో ఈ ఆర్టు సినిమా వ్యాపార సినిమా నిడివితో రెండు గంటలా 20 నిమిషాల పాటు, అదీ నిదానంగా సాగినా, పాత్రల మానసిక లోకాలతో ఆలోచనాత్మకంగా కనెక్ట్ అయిన మనం, విడువకుండా చూసేస్తాం.

ఎల్వీ శారద వూరు విడిచి కాలేజీలో చేరడానికి మైసూరు రైలు ప్రయాణపు దృశ్యాన్ని రెండు నిమిషాల 20 సెకన్ల పాటు అంత సుదీర్ఘంగా చూపించడంలో ఆంతర్యం, అప్పుడనుభవిస్తున్న వివిధ అనుభూతుల ఆమె మానసిక లోకంలోకి ప్రేక్షకుల్ని తీసి కెళ్ళి కట్టేయడమే.

వెంకట రావు భార్య పాత్ర ఏర్పాటు చేసే రెండో భార్యతో రాత్రి గడపలేక పడే సంఘర్షణని, రెండు నిమిషాల 51 సెకన్ల పాటూ చూపించారంటే ఉద్దేశం, పాత్రలోకి ప్రేక్షకుల్ని ఐక్యం చేయడమే. ఇలాటి ఘట్టాలు అవసరమైనప్పుడల్లా వున్నాయి.

శారద, వెంకటరావు పోషించినవి ఎదురెదురు పాత్రలు. కానీ ఇవి ఎప్పుడూ సంఘర్షించుకోవు. కనీసం కోపాన్ని గానీ, అసహనాన్ని గానీ ప్రదర్శించవు. ఆమె తన మనోభీష్టాన్ని సున్నితంగా అతడి ముందు పెడుతూంటుంది. అతను దానికి తగ్గ ధర్మాన్ని సున్నితంగా ఆమెకి భోదిస్తూంటాడు. నిర్ణయం ఆమెకే వదిలేస్తూంటాడు. ఆమె అనుకున్నదే చేసి వెళ్లి పోతూంటుంది. అతను మౌనంగా వుండిపోతూంటాడు.

మరి ఈ రెండు ఎదురెదురు పాత్రల మధ్య సంఘర్షణ? సంఘర్షణ లేకపోతే కథేం బావుంటుంది? ఇక్కడ అలాటి ప్రత్యక్ష సంఘర్షణ అవసరం లేదు, ఆమె తీసుకునే నిర్ణయాలతో ఆమే మానసికంగా సంఘర్షిస్తూంటుంది. రెండు పాత్రల మధ్య భౌతిక సంఘర్షణ కాదిక్కడ. వెంకటరావు కూడా తన నమ్మకాలే మానసికంగా తన సంఘర్షణకి కారకాలు. వంశ వృక్షంతో తన నమ్మకం వమ్ము అయినప్పుడు పడే వేదన, దాంతో తీసుకునే నిర్ణయం.

శారద మొదట చదువుకోసం, తర్వాత పునర్వివాహం కోసం, ఆ తర్వాత కొడుకు కోసమనే మూడు కీలక ఘట్టాల్లో వెంకటరావుతో సంభాషణ లోకొస్తుంది. చదువుని భర్త కోరికతో ముడి పెట్టింది. తండ్రి కోరిక తీర్చాల్సింది కొడుకు గానీ, భార్య కాదన్నాడు వెంకటరావు. తన నిర్ణయం తను తీసుకుని కాలేజీలో చేరిపోయింది.

అక్కడ గిరీష్ కర్నాడ్ పాత్రతో ప్రేమా పెళ్ళీ ఎదురయ్యే సరికి, కాగితం మీద రాసి వెంకటరావు కాళ్ళ దగ్గర పెట్టింది. అప్పుడతను, ‘దీని గురించి సమాజం ఏమనుకుంటుందని కాదు, నా అంతరాత్మ చెప్పాలి. ధర్మ శాస్త్రాల ప్రకారం మనిషి జీవిత లక్ష్యం వంశాన్ని అభివృద్ధి చేయడం. వంశం ముఖ్యం, వ్యక్తి కాదు. ఇలా నీ మార్గం వేరైతే, నేనెలా దారి చూపేది?’ అన్నాడు. అందుకామె, ‘నేను వెళ్ళిపోయినా ఈ ఇల్లు నా ఇల్లుగానే వుంటుందెప్పటికీ’ అంది. అప్పుడతను, ‘ఒకసారి వెళ్ళిపోయాక ఇల్లు ఇల్లు కాదు’ అన్నాడు. నిర్ణయం ఆమెకే వదిలేశాడు. ఆమె వెళ్లి పోయి పెళ్లి చేసేసుకుంది.

తర్వాత కొడుకు కోసం వచ్చినప్పుడు, కొడుకు మీద నీకే హక్కూ లేదన్నాడు. కొడుకు తండ్రి కుటుంబానికే చెందుతాడని ధర్మం చెబుతోందన్నాడు. నా క్షేమం గురించి మీరాలోచించడం లేదంది. ‘ఇది మనోభావాలకి సంబంధించిన ప్రశ్న కాదు. నీకు నీ భర్త పోయాడు, కొత్త భర్తని పొందావు. కొత్త కొడుకుని పొందగలవా?’ అన్నాడు.

పిల్లల మీద తల్లికి పూర్తి హక్కులుంటాయని అంది. అప్పుడతను, ‘పిల్లలు వాళ్ళ వంశపు ఆస్తి. కుటుంబ వ్యవస్థ కావల మాతృత్వానికి విలువ లేదు. కుటుంబ నేపథ్యాలతోనే అన్ని మానవ సంబంధాలూ విలువని పొందుతాయి. కొడుకుని శోత్రియ వంశానికి తగ్గట్టు పెంచగలవా? అతను తాతల తండ్రుల ప్రకారం జీవించాలనుకుంటాడు. కొడుకుని నీ కిచ్చే అధికారం నాకు మాత్రం లేదు. వంశ వృక్షపు కొమ్మని నరుక్కోలేను. అలాగని కొడుకుని మా కొదలమనీ నిన్నూ వేడుకోను. నిర్ణయం నీదే’ అనేశాడు.

 ఈసారి మాత్రం విఫలమైంది. ఈ వైఫల్యం జీవితాంతం వేధించింది. తనే లెక్చరర్ గా వున్న కాలంలో ఎదిగిన కొడుకు తన క్లాసులోనే చేరాడు. అప్పుడు, ‘నువ్వు నా తల్లివి కావు’ అన్నాడు. ఇలా నిత్య సంఘర్షణలకి గురయ్యే పాత్రని ఎల్వీ శారద చిన్న వయసులోkనే ఉత్తమంగా పోషించింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డు నందుకుంది. వెంకట రావుకి ఉత్తమ నటుడి అవార్డు లభించింది.

గిరీష్ కర్నాడ్ పాత్ర మరో ముఖ్యమైన పాత్రే గానీ, అతను భార్య సమస్యని పరిష్కరించలేని పాత్ర. భాగమ్మ పాత్రలో నటిది మాత్రం అరచి గోల చేసే పాత్ర కోడలి నిర్ణయాలకి. రెండో భార్య లక్ష్మిగా నటిది సర్ది చెప్పే పాత్ర. ఇక తర్వాతి కాలంలో హీరోగా ఎదిగిన విష్ణువర్ధన్, ఈ సినిమాలోనే కొడుకు పాత్రలో పరిచయమయ్యాడు.

సంగీతం భాస్కర్ చందావర్కర్, ఛాయాగ్రహణం యూ. ఎం. ఎన్. షరీఫ్ నిర్వహించారు. కూర్పు అరుణా వికాస్. సంగీతం శాస్త్రీయ స్వరాలే. ఛాయాగ్రహణం తెలుపు నలుపు. అనంత లక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై ప్రసిద్ధ దర్శకుడు జీవీ అయ్యర్ నిర్మించారు. దీనికి జాతీయ ఉత్తమ చలన చిత్రం అవార్డుతో బాటు, సంయుక్తంగా దర్శకత్వం వహించిన బీవీ కారంత్, గిరీష్ కర్నాడ్ లకి ఉత్తమ దర్శకత్వం అవార్డు లభించింది. 1980 లో దీన్ని అనిల్ కపూర్ – జేవీ సోమయాజులు- జ్యోతిలతో ‘వంశ వృక్షం’ గా బాపు తెలుగులో పునర్నిర్మించారు.

ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరు నిర్ణయించాలి? మనిషి మాత్రం నిర్ణయించ కూడదని మనకి భోదపడేలా చేసే ఈ ఆర్టు మూవీని అందరూ తప్పక చూడాలి. యూట్యూబ్ లో సబ్ టైటిల్స్ తో అందుబాటులో వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here