మామ…!

0
2

[dropcap]బెం[/dropcap]గళూరు పోతనని రంగును పోయినావు
దీపాలికి ఒస్తానని దిల్లు ఇచ్చి పోయినావు
మామ, నువ్వు మస్తు యాదికొస్తున్నవ్ మామ
నీ ఫోటో సూసి ఏడుస్తున్ననే మామ
నెలా నెలా ఇంటి కర్సు
అత్తమ్మ కి మందులు,
మామయ్యకి కల్లు చిందులు
తప్పకుండ
నువ్వు పంపిన పైసలు
తప్పకుండ ఒస్తున్నయ్ మామ
కానీ ఆళ్ళ రంధి నీ మీద మామ
చంటి గాడి స్కూలు ఫీజు
చిట్టి దాని పాల కర్సు
నువ్వు పంపిన ఇంగిలీషు బొమ్మలు
తప్పకుండ ఒస్తున్నయ్ మామ
కానీ పోరలకి నైనా కావాలంట మామ
పోచమ్మకి సారె పోసి
దసరాకి చుట్టాలు పీల్చే
దీపాలికి అమ్మ వచ్చే
యాడికైన ఒంటిగానే పోతున్న మామ
నా గుండె సివుక్కుమంటున్నదే మామ
సంతకు పోదామంటే ఒక్కదాన్నైతి
సైన్మా పోదామంటే ఒక్కదాన్నైతి
నవ్వ నీకే నువ్వు లేవే మామ
నేనేడవనీకే నువ్వు లేవే మామ
ఉత్తరాల బరువు గవ్వెత్తు
నీ రాతల బరువు మోపేడెత్తు
అవి సదివి నా బాధలు గంపెడెత్తు
నువ్వు మస్తు యాదికొస్తున్నవే మామ
మాకోసం పరదేశం పోయినవ్
నీతోనే మా పానాలు తీస్కపొయినవ్
నువ్వు జల్దీ ఎనక్కొచ్చేయ్యి మామ
మనమంతా కల్సి ఉందామె మామ
నువ్వు లేని బిరియాని కన్నా
నీతోనే గంజి తాగి
బడే ఖుషీగా ఉంటాము మామ
జర్ర వచ్చి సూడు మమ్ములను మామ
పరదేశపు పదివేలు నిన్ను ఊరబెట్టే
పాడెక్కే మా పంజరాలు ఎదురు సూడబట్టే
ఊర్ల జనాలు నిన్ను యాది జెయ్యబట్టే
నువ్వు రాకుంటే నా మీద ఒట్టే
అందరుంటే నువ్వు లేవు
ఎందరున్నా నువ్వు కావు
మా సంతోషం నువ్వేనే మామ
నువ్వు మస్తు యాదికొస్తున్నవే మామ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here