[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]
విష్ణుగయలో దేవాలయము విశాలమైనది. రెండు అంతస్తులుగా వుంది. ప్రాకారము కూడా పెద్దది. బయట పూలు, దేవుని రూపులు, ముద్రలూ అమ్మేవారి దుకాణాలతో నిండిపోయి వుంది. ప్రక్కనే పారుతున్న నది. ఆవులు అటూ ఇటూ తిరుగుతూ, శ్రాద్ధ కర్మలు చేసే వారితో, చేయించే బ్రాహ్మల హడావిడితో చాలా రణగొణధ్వనిలతో వుంది.
నేను ఒక పూల బుట్టు కొందామంటే అక్కడ కేవలము తులసిమాలలే అమ్ముతున్నారు. ఒక బుట్ట తులసిమాలలు కొని లోపలికి వెళ్ళాను. మనము అడగకపోయినా, పండాలు వదలరు. వెంట తగులుకున్నారు. నేను స్త్రీని కాబట్టి అనర్హమని చెప్పి తప్పించుకుందామంటే, “మునుపు జానకీదేవి చేసింది ఇక్కడ, దోషము లేదు. మీరూ చెయ్యండి” అని నా వెంట పడ్డారు కొందరు.
‘ఆహా! ధనమెంత మాయ! ఈ డబ్బు కోసము వీరు ఏమైనా చెబుతారు. మునుపు బ్రహ్మ కపాలములో వద్దు కాక వద్దన్నారు నన్ను, నాన్నగారికి అమ్మకు అలకనందలో తర్పణము వదలాలని ఆశపడితే. ఇక్కడ వెంట బడుతున్నారు. అసలు శ్రాస్త్రమేమిటి?’ అనిపించింది. హృదయము బరువెక్కింది. మౌనము వ్రతముగా ఆచరించటమంటే అనవసరపు మాటలే కాదు, ఊహలు వద్దని, ఆలోచనలను త్రోసివేసి, మౌనముగా ఆలయంలో ఒక మూల కూర్చున్నా. ఎందరు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినా పలకక ఈశ్వర సన్నిధానములో వున్న అమ్మా, నాన్నగార్లను గురించి ఆలోచిస్తూ పరమాత్మను ధ్యానము చేశాను. నా హృదయము మరింత బరువెక్కింది. వాళ్ళను తలుచుకొని. అరగంట సేపు అలా వుండి, లేచి లోపలికి వెళ్ళాను. అంతరాలయము విశాలముగా వుంది. గోడలపై సమ్మోహనపు మహావిష్ణువు రూపాలు. పరమ సుందరముగా వున్నాయి. నడి మధ్య నేల మీద విష్ణు పాదపు ముద్రలు. స్వామి గయాసురుని శిరసున వుంచి పాద ముద్రలు. భక్తితో నమస్కరించి తులసిమాలతో అలంకరించి బయటకు వచ్చాను. అక్కడ అర్చనలు వుండవు. పిండంగా పెట్టిన నివేదనను ఆ పాదాలకు పూసి ఎవరికివారు వెళ్ళిపోతున్నారు. నేను నా వద్ద వున్న తులసిమాలను ఆ పాదముద్రలకు సమర్పించాను. బయటకు వచ్చి కారులో కూర్చున్నా, నాహృదయపు బరువు తగ్గలేదు, తథాగతుని దర్శించే వరకూ.
బోధగయ, విష్ణుగయకు అరగంట ప్రయాణము. బోధగయ చాలా రక్షిత ప్రదేశము. అంటే ఆ బోధివృక్షం వరకూ కార్లు వెళ్ళవు. ఐదు కిలోమీట్లర దూరములో ఆగి, బ్యాటరీ ఆటోలలో వెళ్ళాలి. ఆటోలు మనలను తీసుకెళ్ళి తీసుకువస్తాయి. బౌద్ధుల అతి ప్రాముఖ్యమైన క్షేత్రమైన బోధగయలో వివిధ దేశాల వారు వారి దేవాలయాలు నిర్మించారు.
ఆ దేవాలయాలన్నీ బుద్ధునివే. ప్రతి దేవాలయము, వారి దేశ శిల్ప పద్ధతిని చూపిస్తూ వుంటాయి. మనకు అలా సింహళ, థాయిలాండు, బర్మా వంటి వారి దేవాలయాలు కనిపిస్తాయి. ఒకదానికి మించి మరోటి పెద్ద పెద్దగా, లోపలి తథాగతుడు రోడ్డు పై వెడుతున్నా కనపడుతూ వుంటాడు. నేను రెండు దేవాలయాలోకి వెళ్ళి, ఇక ముఖ్యమైన బోధి వృక్షపు ఛాయలో వెలసిన బుద్ధ భగవానుకై అటు వెళ్ళాను. ఒక గైడు వెంట వస్తూ మాట కలిపాడు. స్పష్టమైన ఇంగ్లీషులో మాట్లాడుతూ నాతో పాటు వచ్చి అక్కడి వివరాలన్నీ వివరిస్తూ చూపాడతను.
‘బు’ అంటే బుద్ధి. ‘ద్ధా’ అంటే అతీతముగా.. మానవ బుద్ధికి అతీతమైన జ్ఞానము, లేదా అపరిమితమైన జ్ఞానము కలిగినవాడు అని అర్థము.
ఆధ్యాత్మిక గురువులలో శాక్యముని అయిన గౌతమ బుద్ధుడు మహా గురువు. మనము చిన్నతనము నుంచి ఎంతో కొంత నేర్చుకునే వున్నాము, బుద్ధదేవుని గురించి. చరిత్రలో గౌతముని కాల నిర్ణయం పై కూడా చాలా చర్చలున్నప్పటికీ.. క్రీ.పూ 562 నుంచి 483 మధ్య జీవించి వున్నాడని చరిత్రకారులు చెబుతారు.
తండ్రి కపిలవస్తు రాజైన శుద్దోధనుడు. తల్లి మహామాయాదేవి. పుట్టింటికి వెడుతూ మార్గమధ్యములో లుంబినీ వనములో ఆమె శిశువును ప్రసవిస్తుంది. కొద్ది కాలనికే మాయాదేవి మరణిస్తుంది.
గౌతమి పెంచిన తల్లి. సిద్దార్థుడంటే అన్నీ జయించిన వాడని అర్థము. చిన్ననాట జ్యోతిష్యులు సిద్దార్థుడు యోగి గాని, చక్రవర్తి గాని అవుతాడని చెబుతారు. తండ్రి భోగభాగ్యాల మధ్య పెంచటము, యశోధరతో వివాహము, ఒక కుమారుడు రాహులుడు కలగటము జరుగుతుంది. ఆయనకు ఒక రోజు నగర సంచారములో వృద్ధ, రోగపీడిత, శవ దర్శనము కలిగి ఆలోచనలు కలుగుతాయి. జీవితము ఏమిటి అన్న ప్రశ్న ఉదయించి ఒక రాత్రి ఎవ్వరికీ చెప్పక రాజభవనము వదిలి వెళ్ళిపోతాడు.
ఆనాడు భారతదేశములో వివిధములైన యోగ మార్గాలు వుంటాయి. గౌతముని తెలివికి ఏ మార్గమైనా చాలా త్వరగా తెలిసిపోతూ వుంటుంది.
అందరూ ఎన్నో సంవత్సరాల కాలములో పొందే సమాధి స్థితి గౌతమ సిద్దార్థునికి కేవలము కొన్ని నెలలో కలుగుతూ వుంటుంది. ఆయనకు ఆ మార్గాలలో ప్రయనించినా తృప్తి కలగదు. ఎలా మానవాళికి కలిగే దుఖం నివారణ కలుగుతుందన్న ప్రశ్నకు సమాధానము తెలియదు. అలా ఎనిమిది మార్గాల ద్వారా సమాధి స్థితి కలిగినా తృప్తి కలగదు. గౌతముడు వాటిని వదిలి తిరగటము మొదలెడుతాడు. ఆయన ఆహారవిహారాదుల మీద పూర్తిగా ధ్యాస కోల్పోతాడు. ఆహారము కోసము ప్రయత్నించక సత్యాన్వేషణ చేసే సాధువులను ‘సహజ’ అంటారు. వారు ఆహారము కోసము కూడా ప్రయత్నించరు. ఎవ్వరినీ అడగరు. ఎవరైనా ఇస్తే మాత్రమే స్వీకరిస్తారు.
అలా గౌతమసిద్దార్థుడు ‘సహజ’ గా ఎముకల ప్రోగుగా మారి తిరుగుతుంటాడు. నేటి బోధ గయ ప్రాంతములో వున్న ‘నిరంజన’ అన్న నది దాటటానికి ప్రయత్నిస్తూ అడుగులు కూడా వేసే శక్తి లేక ఒక కొమ్మను పట్టుకు నిలబడిపోతాడు.
అలా నిలబడినప్పుడు ఆయనలో దేనికోసము వెతుకుతున్నానన్న ప్రశ్న ఉదయిస్తుంది. వెతక వలసినది ఎక్కడో కాదని, తనలోనే వున్నదనిపిస్తుంది. వెంటనే ఆ నదిని దాటి దాని వడ్డున వున్న బోధ వనములో వున్న ఒక చెట్టు క్రిందన కూర్చుంటాడు.
అలా కూర్చున్న గౌతమ సిద్దార్థునికి సుజాత అన్న స్త్రీ ఆహారము తెచ్చి ఇస్తుంది. ఆ ఆహారము ఏడు గుక్కలు తీసుకుంటాడు గౌతముడు.
ఆ తరువాత ఆయన ఏడు వారాల పాటు ఆ వనములోనే గడుపుతాడు.
వైశాఖ మాసములో పౌర్ణమి రాత్రి, వెన్నెలలో ఆయనకు జ్ఞానోదయమవుతుంది. ఆ రాత్రి తథాగతునికి కలిగిన జ్ఞానానికి గుర్తుగా భూమి కంపిస్తుంది. ఆకాశములో మెరుపులు, చంద్రుని సాక్షిగా గౌతముడు బుద్ధునిగా పరివర్తన చెందుతాడు.
మరురోజు ఆయన ఆహారము స్వీకరిస్తాడు. కానీ మౌనముగా అదే వనములో మరో చెట్టుక్రిందన ధ్యానము చేస్తాడు. ఒక వారము ఒక వైపుగా అడుగువేస్తూ ధ్యానము చేస్తాడు. ఆయన అడుగులు వేసిన చోట భూమి పులకరించి పుష్పిస్తుంది. అక్కడ గుర్తుగా నేల మీద పాలరాయి పద్మాలు వుంచారు.
మరో వారము ఆయన నుంచి సప్తవర్ణాలు వెలుబడుతాయిట. అలా బుద్ధునిగా మారిన గౌతముడు ఆ వనములోని వివిధ రావి వృక్షాల క్రింద ధ్యానము చేస్తాడు. ఆ వనములో ఒక బ్రాహ్మణుడు కనిపిస్తాడు. కర్మలకు ప్రాధాన్యతనిచ్చి, అసలు దైవముపై దృష్టి పెట్టటము లేదని బుద్ధుడు మొదటిసారి ఆ బ్రాహ్మణునితో ‘జన్మతా కాదు కర్మతా ఆచరించాలి. అదే బ్రాహ్మణత్వం’ అని బోధ వినిపిస్తాడు.
ఆ రావి వనములో వున్న చెట్లలో ఏ చెట్టు నీడన బుద్ధునికి జ్ఞానోదయమైయ్యిందో ఆ చెట్టు నీడన పెద్ద దేవాలయము కట్టించాడు అశోకుడు. తరువాతి రాజులలో విక్రమవర్మ-2 ఆ గుడిలోని బుద్ధదేవునికి బంగారపు తొడుగు చెయ్యించాడు.
ఆ చెట్టు, ఆ ప్రాకారము ఎంతో విశాలమైనది. అక్కడ 1985 తరువాత ఒకసారి టెర్రరిస్టులు చెట్టు మొదట్లో బాంబు పెట్టారుట. అందుకే ఎంతో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు ఆ ప్రాంగణానికి. ఇన్ని శతాబ్దాలలో ప్రకృతి చేసిన గాయాలతో ఎన్నో శిఖరాలు కూలి, ప్రాంగణమంతా వున్నాయి.
బౌద్ధులకు ముఖ్యమైన ఆ ప్రదేశములో వున్న ఆ బోధి చెట్టు మొదట అశోకుని భార్య కొట్టేయించిందట.
(సశేషం)