[dropcap]“శూ[/dropcap]న్యం అంటే ఏమినా?” అంటా అన్నని చిన్నగా అడిగితిని.
“ఏమీ లేదనిరా” మెల్లిగా అనె అన్న.
“ఏమీ లేనిదా… ఇదేమినా” అశ్చెరము పడితిని.
“అదేరా శూన్యము” ఇంగా మెల్లిగా అనె అన్న.
“నన్ని రేగియొద్దునా” అంటా రేగితిని.
“ఉండేది చెప్పితే నీకి రేగుతుందా?” అడిగే.
“లేనిదాన్ని ఉందని చెప్పితే రేగుతుందినా” అంట్ని.
“అట్లనా”
“ఇంగేమి”
“సరే! నువ్వు నిద్రపోయేతబుడు నీమతి ఏడవుంటుందిరా”
“అదేడ వుంటుందో”
“నీమతి వుండేది శూన్యంలోనేరా”
“తిప్పేసి మలేసి చెప్పిందే చెప్పొద్దునా, కళసి పోనా ఇక్కడినుంచి”
“పోతాలేరా…. నా ఎనకే నువ్వు వొస్తావు”
“ఏడకి”
“శూన్యంలోకి”
***
రేగుతుంది = కోపమొస్తుంది