[dropcap]ఈ[/dropcap] లాక్‌డౌన్ కాలం నాకు ఒక రైలు ప్రయాణం లాగానే ఉంది. రిజర్వేషన్ కంపార్ట్మెంట్‌లో కుటుంబ సమేతంగా దూరపు ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తోంది.
అందరం ఇంట్లోనే ఉండడం వలన ఒకరికొకరు సాయం చేసుకుంటూ ప్రయాణంలో పదనిసల్లానే సాగాయి కొన్నిరోజులు. ఆ తర్వాతే ప్రయాణాల్లో వుండే సామాన్య కష్టాలు మొదలయ్యాయి.
రైలు ప్రయాణాలలో లేస్తున్నట్లు లేటుగా ఒక్కక్కళ్లు ఒక్కో టైంకి లేవడం, యేదో తినడం, అవకాశం ఉన్న పనులు గుమ్మం దాటకుండా చేసుకోడం, మళ్ళీ ఏదో టైంలో పడుకోడం. ఇవన్నీ చూస్తుంటే రైలు కొద్దిగా నెమ్మదిగా ప్రయాణిస్తున్నట్లు, గమ్యస్థానం కోసం మన మనసు పరుగులు పెడుతూ విధి లేక యాంత్రిక జీవనం గడుపుతున్నట్లు అనిపించసాగింది.
మన పక్క యింటి వాళ్ళతో మాట్లాడుతున్నా, కూర్చున్న చోటునుండే కాలక్షేపం కబుర్లు చెప్పుకోవడం వలననేమో రైలులో పరిచయం అయిన సహ-ప్రయాణికులతో మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తోంది నా మనసుకి.
అంత మాత్రానికేనా రైలు ప్రయాణంతో పోల్చుకుంటున్నాను అనుకోవద్దు…
మన గుమ్మంలోకి అమ్మకానికి వచ్చే నిత్యావసర సరుకులు ట్రైన్ కంపార్ట్మెంట్ లోకి వచ్చే అమ్మకపుదారులతో సరి సమానంగా పోటీ పడుతున్నట్లు అనిపించింది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో ఎవరెంత ఖరీదు చెప్పినా మారు మాట్లాడకుండా కొనుక్కుంటాము.
వేరే గత్యంతరం లేదనీ వాళ్ళకీ తెలుసు కాబట్టే రైలు ప్రయాణాలలో జేబులు చిల్లులు పడడానికి వేరే అవకాశం లేని అవసరాలే కారణం అనిపించింది.
యిక రోజూ చదివే వార్తా పత్రికలూ, ఫోన్‌లో మాటలూ గురించి చెప్పనవసరం లేదు ఎక్కడైనా షరా మాములే. అవి చేతిలో ఉంటే పక్కన ఉన్న మనుషులని కూడా పట్టించుకోము. ఆ విధంగానే…
ఆఫీస్ వర్క్‌లు కూడా ట్రైన్లలో చేసే సాఫ్ట్‌వేర్ ఉద్దండులు వున్నంత కాలం లాప్టాప్ పట్టుకుని ఇంట్లో కూర్చున్నా అప్ అండ్ డౌన్ ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుందే కానీ పెద్దగా తేడా యేమి అనిపించట్లేదు.
యికపోతే ముఖ్యంగా చెప్పుకోవలసినవి అమూల్యమైనవీ మన్ కీ బాత్ అంటూ ప్రధాన మంత్రి గారి ముఖ్య ప్రసంగాలే.
రైలు ఏ స్టేషన్‌లో ఆగిందో? ఎప్పుడు బయలుదేరుతుందో శ్రావ్యమయిన గొంతుకతో రైల్వే అనౌస్మెంట్ లని మరపింప చేసేవిగా ఉన్న అతని మాటలు మన ప్రయాణం సురక్షితంగా జరిగేలా తీసుకున్న ముందు జాగ్రత్తల్లానే అనిపించాయి.
జనాలని ఉత్తేజపరచడానికి చప్పట్లు కొట్టమనీ మోడీ గారు పిలుపునిచ్చిన రోజు, రైల్‌లో కూర్చునే చప్పట్లు చరుస్తూ రాబోయే స్టేషన్‌లో వచ్చే మన వాళ్ళని తలచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి హడావిడి చేసినట్లు అనిపించింది.
రెండోసారి లైట్స్ ఆపేసీ చీకట్లో దీపాలు పెట్టమన్న ఆ క్షణం, అర్ధరాత్రి ప్రయాణంలో కనుచూపు మేరలో స్టేషన్ వస్తున్నప్పుడు ఆకుపచ్చ జండా కనపడేటట్లు చూపించే లైట్‌ల కాంతిని తలపింపజేసింది.
ఇవి మాత్రమే కాదు, ఒకొక్క లాక్‌డౌన్ మధ్యలో పెద్దాయన ఇచ్చే చిన్న సడలింపులు పేద్ద స్టేషన్ల దగ్గర మాత్రమే ఆగుతుంది అనుకున్న రైలు, మధ్యలో వచ్చే చిన్న స్టేషన్ల దగ్గర కూడా ఆగుతోందని తెలిసినప్పుడు వచ్చే ఆనందంతో పాటూ ఆశ్చర్యం కూడా వేసింది.
సుదీర్ఘమైన రైలు ప్రయాణం లాంటి జీవితం నుండీ త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలనీ, ఎన్నో లక్షల, కోట్ల మంది ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఈ లాక్‌డౌన్ ప్రయాణంలో కరోనా మహమ్మారి అనే ఘోరమైన ఆక్సిడెంట్ ప్రమాదానికి బలి కాకుండా, క్వారంటైన్‌లలో గడిపే జీవితానికి గురి కాకుండా, సురక్షితమైన మునపటి రోజుల్లాంటివే మళ్ళీ తిరిగి రావాలనీ, అన్ని ప్రయత్నాలతో పాటూ దేముడి మీద కూడా భారం వేస్తూ ముక్కోటి దేవతలకీ మొక్కుకుంటున్నారు.
ఈ ప్రయాణంలో నేను గమనించింది ఒక్కటే …..
రైలు పట్టాల మధ్య ఉన్న ఆ సామాన్య దూరమే రైలు చక్రాలు నడవడానికి అనువుగా మారీ యెలాంటి ప్రమాదాలకీ తావివ్వకుండా జనాలని సురక్షిత ప్రాంతాలకి చేరుస్తోందనీ. అలాగే మనం కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మనతో పాటూ మనవాళ్ళూ కూడా సురక్షితంగా ఉండగలుగుతారు .
అంతే కాదు …….
జనాభా లెక్కల్లో మనపేరు మరి కొంతకాలం ఉండాలి అనుకుంటే మనకి నచ్చినా, నచ్చకపోయినా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.
కాదూ, కూడదూ అని యిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే… …కరోనా తన పని తాను చేసుకుపోతుంది…
యిక తుది నిర్ణయం మనదే!!