[dropcap]లా[/dropcap]క్‌డౌన్ సడలింపుల తర్వాత మొదటి రోజు ఆఫీసుకి వచ్చాడు రవి.
తన సీట్లో కూర్చుని ఫైల్సు సర్దుకుంటుండగానే “సార్, మిమ్మల్ని పెద్దసారు వారు రమ్మంటున్నారు” అని వచ్చి చెప్పాడు అటెండరు రాము.
‘ఊ, పిలిచాడా, ఇంకా పిలవలేదేంటా అనుకుంటున్నా!’ అనుకుంటూ సీట్లోంచి లేచి వెళ్ళి, బాస్ గది ముందుంచిన శానిటైజర్‌తో చేతులు రుద్దుకుని, ముఖానికున్న మాస్కు సరిచేసుకుని, స్ప్రింగు డోరు తీసుకుని, గదిలోకి తొంగిచూసి “మే ఐ కమిన్ సార్?” అన్నాడు రవి.
బాస్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ‘రమ్మన్నట్లు’ గా తలూపాడు. రవి లోపలికి వెళ్ళి నుంచున్నాడు.
బాస్ ఫోన్లో మాట్లాడటం అయిపోయాక “సీ.. మిస్టర్ రవీ…” అనగానే,
రవి ఫోను రింగైంది. వెంటనే రెడ్ బటన్ నొక్కాడు. ఫోను రింగవటం ఆగిపోయింది.
“మిస్టర్ రవి, బాస్ రూం లోకి వచ్చేటప్పుడు మొబైల్ ఆఫ్ చేసి రావాలని తెలీదా?” అన్నాడు బాస్.
“సారీ సర్, తొందరలో మర్చిపోయాను” అన్నాడు రవి.
“ఓ.కే… యూసీ రవీ…” బాస్ మొదలు పెట్టగానే, రవి ఫోను మళ్ళీ రింగైంది.
“ఎక్స్యూజ్ మీ సార్… ఏదో అర్జంటు కాల్ లాగుంది” అని, బాస్ రూంలోనే ఓ ప్రక్కకి వెళ్ళి ‘హలో’ అన్నాడు.
“ఏమండీ పప్పుగుత్తి ఎక్కడ పెట్టారు? గంటనుంచి వెతుకుతూనే వున్నాను. కనపడి చావట్లేదు” అంది రవి భార్య.
“దాని కోసం ఆఫీసుకి ఫోను చేస్తావా? ఎక్కడ పెడ్తాను, అక్కడే ఎక్కడో ఉంటుంది చూడు” విసుక్కున్నాడు రవి.
“ఎక్కడ పెట్టారో ఏవిటో? కుక్కర్ వెయిట్ కూడ కనపడి చావటంలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ టైములో మీరు వంట చేయటం కాదుకాని, ఈ రోజు నేను వంట చేయాలంటే, ప్రతిదీ వెతుక్కోవాల్సొస్తుంది. మీ వంట నా చావుకొచ్చింది” అంది రవి భార్య.
“అలాగే? అయితే చావు. నేనిప్పుడు బాస్ రూంలో వున్నాను. నన్ను ఊరికే విసిగించక” అని కోపంగా కాల్ కట్ చేశాడు రవి.
“వాట్ రవీ! ఎవర్ని చావమంటున్నావ్? లాక్‌డౌన్‌లో గృహహింస కాదు కదా?”
“అదేం కాదులెండి సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు కాని అది నా చావుకొచ్చినట్లుంది.”
“వాట్ వాట్ వాట్? మీ ఆవిడ నిన్ను చంపుతానందా? ఎనీ ఫ్యామిలీ డిస్ప్యూట్?” అడిగాడు బాస్ .
“అదేం కాదులెండి సార్. జస్ట్ పప్పుగుత్తి. అంతే.”
“అంటే పప్పుగుత్తితో నీ నెత్తి పగలగొట్టి చంపుతానందా మీ ఆవిడ?”
“మీరూరుకోండి సార్. ఊరికే కథలల్లేయకండి. ఈ విషయం నాకు వదిలేసి ఆఫీసు విషయానికి రండి” అన్నాడు రవి.
“సరే రవీ! ఈ రెండు నెలల లాక్‌డౌన్ కారణంగా మన ఆఫీసు పని ఎంతగా పెండింగు పడిపోయిందో తెలుసుగా! ఈ ఎరియర్ పనంతా త్వరితగతిన క్లియర్ చేయాలంటే, మనందరం ఓవర్ టైమ్ వర్కు చేయాలి. సెలవ రోజుల్లో కూడ పని చెయ్యాలి. యు గాట్ మై పాయింట్?” అన్నాడు బాస్.
“ఆ గాటే సార్. చాలా ఘాట్‌గా వుంది. ఇక మీదట ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అన్నా ఆఫీసుకే వచ్చేస్తాను సార్. ఇల్లంటే బోరు కొట్టింది సార్.” అన్నాడు రవి.
అప్పుడే బాస్ ఫోను రింగైంది. ఫోను ఎవరు చేశారో చూసి “సరే రవీ, హోమ్ డిపార్టుమెంటు నుంచి ఫోను. మళ్ళీ పిలుస్తాను, నువ్వు వెళ్ళచ్చు” అన్నాడు బాసు.
***
బాసు కి ఫోను చేసింది ‘బాసుకి’. అంటే బాసు పెళ్ళాం.
“వొద్దు మొర్రో అంటే ‘నీకు హెల్ప్ చేస్తా… నీకు హెల్ప్ చేస్తా’ అంటూ, ‘వర్క్ ఫ్రమ్ హోం’ అన్నాళ్ళు వండి పెట్టారు. ఈ రోజు హాయిగా ఆఫీసుకి చెక్కేశారు. నేను వంట చేద్దామంటే ఒక్కటీ కనపడి చావదే. పట్టకారుతీసి కబోర్డులో పడేశారు. కుక్కర్ వెయిట్ ఫ్రిజ్‌లో, అట్లకాడ బెడ్రూంలో. ఇవన్నీ వెతుక్కోవటంతోటే ఇప్పటి వరకు సరిపోయింది. ఇక వంట ఎప్పుడు చేసి చావను? ఇంటికి వచ్చేటప్పుడు ఏదైనా ప్యాక్ చేయించి తీసుకురండి. వీలైతే మరో రెండ్రోజులు ‘వర్క్ ఫ్రమ్ హోం’ చెయ్యండి. ” ఆర్డరేసింది బాసుకి.
“అలాగే” అన్నాడు బాసు.
తర్వాత రవిని పిలిచి”సరే నువ్వన్నట్లే ఇక నుంచి వర్క్ ఫ్రమ్ హోం వద్దయ్యా” అన్నాడు బాసు.
బాసు అలాఎందుకన్నాడో అర్థం కాక చూస్తూ నిలబడిపోయాడు రవి.