[dropcap]ఒ[/dropcap]క గ్రామంలో రామయ్య సోమయ్య ఇరుగు పొరుగున నివసించేవారు. స్వతహాగా రామయ్య బాగా కష్టపడే మనస్తత్వం కలవాడు. సోమయ్య మాత్రం ఏ పని చేయాలన్నా కాస్తంత బద్దకం కలవాడు.
ఇద్దరికీ పక్క పక్కనే పొలాలు వున్నా రామయ్య భార్యతో కలిసి కష్టపడి పనిచేసి వివిధ రకాల పంటలు పండించేవాడు.
అయితే కష్టపడ్డం ఏమాత్రం ఇష్టంలేని సోమయ్య తన పొలాన్ని అలాగే బీడుగా వుంచి జీవనోపాధి కోసం భార్యను వేరొకరి పొలంలోకి పనులకు పంపి ఆమె సంపాదించిన కూలి సొమ్ముతో జీవనం చేసేవాడు.
సొంతంగా పొలం వుండి కూడా బద్దకం కారణంగా సోమయ్య ఆ విధంగా జీవించడం ఏమాత్రం నచ్చని రామయ్య తన ధోరణి మార్చుకోమని సోమయ్యకు ఎన్నోసార్లు చెప్పిచూసాడు.
ఒళ్ళు వొంచి పనిచేయడం ఏమాత్రం ఇష్టంలేని సోమయ్య అతడి మాటలను లెక్కబెట్టేవాడు కాదు. దీనికి తోడు తిండి విషయంలో సోమయ్యకు కాస్తంత ఆసక్తి ఎక్కువ.
కొన్ని సార్లు తగినంత డబ్బు లేనందున సోమయ్య తన అవసరాలు తీర్చుకునేందుకు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవాడు. రాత్రి వేళల్లో ఎవరూ చూడకుండా ప్రక్క పొలాల్లో కూరగాయలు దొంగతనంగా ఇంటికి తెచ్చేవాడు. కొందరు రైతులు ఈ విషయం కనిపెట్టి మిత్రుడైన రామయ్య దగ్గర వాపోయేవాళ్ళు. దొంగతనం విషయం నేరుగా సోమయ్యను అడిగితే బాధపడతాడని ఊరుకునేవాడు రామయ్య.
తనను ఎవరూ ప్రశ్నించనందున సోమయ్య దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ విషయంలో సోమయ్య తానే తెలుసుకుని మారతాడులే అని రామయ్య మిన్నకుండిపోయాడు.
ఓసారి రామయ్య తన పొలంలో అనప పంటను సాగుచేసాడు. కొన్ని రోజుల్లోనే పంట బాగా వచ్చింది మరో వారం రోజుల్లో పంటను కోసి అమ్ముదామని అనుకున్నాడు రామయ్య.
ఆ మరుసటి రోజే ఉదయాన్నే నిద్రలేచిన రామయ్యకు సోమయ్య ఇంట్లో నుండి అనపకాయలు కూర వండుతున్న వాసన వచ్చింది.
కాసేపటి తర్వాత ఏదో పనిమీద సోమయ్య భార్య రామయ్య ఇంటికి వచ్చింది. ఏం కూర వండుతున్నావని అడిగిన రామయ్య భార్యతో నాలుగు రోజుల క్రితం సంతలో తెచ్చిన అనపకాయలతో కూర వండుతున్నానని చెప్పింది.
తనతోపాటు సంతకు వచ్చిన సోమయ్య సంతలో అనపకాయలు కొనలేదనే విషయం రామయ్యకు గుర్తుకు వచ్చింది.
వెంటనే పొలం వద్దకు వెళ్ళి చూస్తే రాత్రి పొలంలో ఎవరో తిరిగిన గుర్తులు, అక్కడక్కడ కాయలను తెంపిన గుర్తులు కనపడ్డాయి దీనితో ఈ పని సోమయ్యనే చేసాడని స్పష్టంగా అర్థమైంది.
మిగతా రైతులు అప్పటికే పొలాల్లో దొంగతనాలు జరగకుండా కంచెలు వేసుకోవడంతో సోమయ్య వరసగా వారం రోజులు రామయ్య పొలంలోనే కాయలు దొంగతనం చేయసాగాడు. ఆ విషయం అడిగితే మిత్రుడు బాధపడతాడని తనలో తానే ఆవేదనపడసాగాడు రామయ్య.
ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిలో వున్న రామయ్య ఇంటికి మరుసటి రోజు పట్నం నుండి తన బావమరిది చందూ వచ్చాడు. దిగులుగా వున్న బావ పరిస్థితిని తెలుసుకుని వాళ్ళ మధ్య స్నేహం చెడిపోకుండా ఓ సలహా ఇచ్చాడు.
మరుసటి రోజు పొలం దగ్గర నుండి వచ్చిన రామయ్య ఇంటి ముందు దిగులుగా కూర్చుని తీవ్రంగా బాధపడుతున్న వాడిలా కనిపించాడు.
ఏమైందని ప్రశ్నించాడు సోమయ్య.
అనపకాయలు చేతికి వచ్చే దశలో పొలం గట్లలో వున్న బొరియల్లోని ఎలుకల కోసం అనేక పాములు పొలంలోకి వచ్చాయని, తాను పొలం దగ్గరకు వెళ్ళినప్పుడు నాలుగైదు పాములు కనపడ్డాయని, అజాగ్రత్తగా వుంటే వాటి కాటుకు ప్రాణాలు కోల్పోయేవాడినని చెప్పాడు.
ఆ మాటలు వినగానే సోమయ్య రాత్రి వేళలో తాను చిమ్మ చీకటిలో పొలం వైపుకు వెళితే పాముకాటుకు గురవుతానేమోనని మనసులో ఆందోళన పడ్డాడు. బతికి వుంటే బలుసాకు తినవచ్చుననే ఉద్దేశ్యంతో ఆరోజు నుండి పొలం వైపు వెళ్ళడం మానుకున్నాడు.
దొంగతనం చేసే మార్గం పూర్తిగా లేకపోవడంతో తాను కూడా రామయ్య లాగా కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు.
బావమరిది చందూ సలహాతో అటు తన పంట దొంగతనానికి గురి కాకుండా, ఇటు మిత్రుడు సోమయ్య బద్దకాన్ని వదిలి పరివర్తనతో కష్టపడి పనిచేసుకోవడంతో చందూకు మనసులోనే ధన్యవాదాలు తెలియజేసుకున్నాడు రామయ్య.