వెంకట్రమణకి బుడుగు గ్రీటింగ్స్

0
5

[dropcap]వెం[/dropcap]కట రమణా బాగున్నావా! హేపీ బర్త్ డే. నేను…. నీ బుడుగుని. నిజం పేరు చాల పొడుగు. బామ్మేమో ఆరి భడవా అంటుందీ! రాదేమో (రాదంటే మా అమ్మ) బంగారుతండ్రీ అంటుందీ! చాలమందేమో అల్లరివెధవా అంటారూ…. ఆ బుడుగుని. నేనేం పెద్దగా అల్లరి చెయ్యను. ఇంటింటి బుడుగులు చేసే అల్లరే. క్రిష్నుడు చెయ్యడా అల్లరి! అయితే వాడి స్టైల్ వాడిది. నా స్టైల్ నాది.

క్రిష్నుడు గ్నాపకం వచ్చింది. లాక్‌డౌన్ అంటే తెలుసా నీకు? బళ్ళు మూసేయడం, అందరూ ఇంట్లో వుండడం అన్నమాట. అప్పుడెప్పుడో టి.వి.లో వచ్చిన రామాయణం, బారతం మళ్ళీ వెయ్యడం అన్నమాట. ఇప్పుడు రామానంద్ సాగర్ తీసిన శ్రీక్రిష్న వస్తుంది కదా డి.డి.లో! అందరూ ఆ క్రిష్నుడి అల్లరి చూసి ఓ మురిసిపోతారు. నన్నేమో అల్లరివాడూ అంటారు.

పొద్దుటే సీ గానపెసూనాంబ మా ఇంటికొచ్చేస్తుంది నాతో ఆడుకోడానికి. కానీ గోపాలం (గోపాలం అంటే మా నాన్నలే) రోజూ సాయంత్రం వచ్చే మా ప్రైవేటు మాస్టార్ని పొద్దునపూట కూడా రమ్మన్నాడు లెక్కలు పెత్యేకంగా చెప్పడానికి. ఆ మాస్టారు లెక్కలు చెప్తూ చెప్తూ నాకో లెక్క చెయ్యమని ఇచ్చేసి తను టీ.వీ. చూస్తూ కూచుంటాడు. యెడ్వర్‌టేజ్‌మెంట్లు వచ్చేటప్పుడు “భడవా చేసావా” అంటూ గదమాయిస్తాడు. నాకు చాల ఖోపం వచ్చేస్తుంది.

సీ గానపెసూనాంబ నాకు సపోర్ట్ వస్తుందా అని చూస్తే ఇంతింత కళ్ళు పెట్టుకొని టి.వి. చూస్తూ వుంటుంది. నాన్న పేపరు చదువుతూ, టి.వి. చూస్తూ, టీపాయ్ మీదికి కాళ్ళు బార చాపుకు కూర్చుంటాడు. అమ్మ కూరగాయలు, కత్తిపీట తెచ్చుకొని, ముక్కలు కోస్తూ, మధ్య మధ్య బుగ్గన చెయ్యి చేర్చుకుంటూ శ్రీక్రిష్న చూస్తుంటుంది.

ఆపద సమయాల్లో నన్నెప్పుడూ ఆదుకునే బామ్మ కూడ శ్రీక్రిష్న చూస్తూ, ఆనందపరావస్యంతో కన్నీళ్ళు తుడుచుకుంటూ టి.వి. క్రిష్నుడికి దణ్ణం పెట్టేసుకుంటూ ఉంటుంది.

లావుపాటి పక్కింటి పిన్నిగారు, ఆవిడ మొగుడుగారు వాళ్ళ టి.వి. పాడయిపోయిందని చెప్పి పొద్దుటే ఏడింటికి ఠంచనుగా మా ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళ టి.వి. ఎప్పటికి బాగుపడుతుందో, అసలు ఎప్పటికైనా బాగుపడుతుందో లేదో నాకు తెలీదు. నిజం ఏమిటంటే వాళ్ళ డొక్కు చిన్న టి.వి.లో శ్రీక్రిష్న చూస్తే బాగుండదని, మా పేద్ద దాంట్లో అయితే ఎంచక్కా ఉంటుందని ఆవిడ ప్లాను. కానీ ఆ నిజం నేను చెప్తే అమ్మ గసురుకుంటుంది. అలాంటి పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు అంటాడు నాన్న. వాళ్ళ ఆఫీసరుగాడ్ని విగ్గు లేని యెముడు అని అందరిముందు అన్నానని కోపంలే.

ఇంతలో ఎప్పటిలానే హడావుడిగా గాలిదుమారంలా అప్పారావు వచ్చి “హలో ఓ ఫైవుందా” అంటూ అందరివంకా చూసి, ఎవరూ తనని పట్టించుకోకుండా శ్రీక్రిష్న చూస్తుండడంతో, తనూ ఓ చూపు టి.వి. వైపు పడేసి, అంతే హడావుడిగా వెళ్ళిపోతాడు. అతగాడికి ‘అప్పు’ కి మించి ఈ ప్రెపంచకంలో మరేదీ అద్బుతమైంది కాదు.

బాబాయి కూడ అంతే. అసలు బాబాయికి క్రిష్నుడంటే ఎప్పుడూ యిష్టమేలే. ఎమ్టి రామారావు క్రిష్నుడు వేషం వేసిన ప్రతి సినిమా ఎన్నెన్ని సార్లు చూసాడో! తనని ఒక్క ‘రెండు జెళ్ళ సీత’ కూడ ప్రేమించదు. క్రిష్నుడిని అంతమంది ఎలా ప్రేమిస్తారు అన్నది బాబాయి ‘అవమానం’.

టి.వి.లో యెడ్వర్‌టేజ్‌మెంట్లు నాకిష్టం. ఆ పాటలు, మాటలు నేను బాగా చెప్తాను గబగబా. “నువ్వు పేరడీ చెయ్యకు” అంటాడు బాబాయి. ఒకళ్ళు చెప్పిందాన్ని హాస్యంగా, నవ్వుకునేట్టు మళ్ళీ చెప్తే, దాన్ని ‘ పేరడీ’ అంటారట. గరుక్కో…. జరుక్కో చెప్పాడట. శ్రీరమణ కూడ చెప్తాడంట. అసలు ఒకళ్ళు చెప్పిందాన్ని మళ్ళీ చెప్పడం ఎందుకు? ఎవడి ‘ స్టోను’ వాడిదే కదా! ఏమిటో ఈ పెద్దవాళ్ళు ఎప్పడేం చేస్తారో తెలీదు.

సరే కదా! అందరూ అంతగా చూస్తున్నారు కదాని నేనూ అప్పుడప్పుడు చూస్తాను. బాగానే వుంటోంది. నువ్వూ, బాపు మామయ్య కలిసి తీసిన బాగవతం సీరియల్ కూడా చాల బాగుంది అప్పుడు. మీరైతే నాలాంటి బుడుగులకి కూడ అర్దం అయ్యేట్టు చెప్పారు. ఈ హిందీలో శ్రీక్రిష్ణ కూడ బాగానే అర్దం అవుతోంది. ఒక్కొక్క చోట నాకు అర్దం కాదనుకో, అమ్మనో బామ్మనో అడుగుతాను. “తర్వాత చెప్తాలే. ముందు చూడు” అని గసురుకుంటారు. నాకు ఖోపం వచ్చేసి “జాటర్ డమాల్” అనేస్తాను. లెక్కలు పుస్తకాలు విసిరేస్తాను. కానీ అదేంటో శ్రీక్రిష్నుడు వస్తున్నప్పుడు ఆ గంట సేపు నేనెంత అల్లరి చేసినా ఎవ్వరూ ‘ ప్రైవేటు’ చెప్పరు. అందరూ ప్రశాంతంగా, ఆనందంగా వుంటారు. నిజ్జం. నాక్కూడ చాల చాల నచ్చింది. ఎంత నచ్చిందో చెప్పడానికి అంత ‘తెలుగు’ నాకు రాదుగా.

అందుకే నేను అడిగితే “ఇది రాసిపెట్టింది డాక్టర్ సిహెచ్.సుశీల”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here