[dropcap]”అ[/dropcap]స్యత్రయ, అవపధాస్త్రయస్వప్న” అన్నది వేదవాక్కు, స్వప్నశాస్త్ర గ్రంధాలలో స్వప్న, దుస్వప్న వివరణాదులు ఉన్నాయి. ఉపనిషయత్తుల యందు అవస్ధాత్రయము ప్రస్ధావింపబడింది.
“దృష్ట శ్రుతోను భూతశ్చ,ప్రార్ధిత: కల్పితాస్ధధా”
“భావిక దోషజ శ్పెైవ స్వప్న స్సప్తవిధోమతః”
అని పేర్కొనడం జరిగింది.
వేద, ఉపనిషత్, పురాణ కావ్య, ప్రబంధాది ఇతర ప్రక్రియలన్నింటి యందు అవస్ధాత్రయము ప్రస్తావింపబడినది. స్వప్నాలు మానవ జీవితంతో అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి.
నిత్య జీవిత అనంతయానంలో స్వప్నాలకు ప్రత్యేక స్ధానం ఉందని చెప్పుకోవచ్చు. సాహిత్యం మానవ అపూర్వసృష్టి. అట్టి సాహిత్యంలో స్వప్నాలకు స్ధానం కలిగించడంలో ఆశ్చర్యం లేదు. స్వప్న ప్రాచీనతను మానవావిర్బవ కాలంతో పోల్చవచ్చు. ఆనాటినుండి స్వప్న అంతరార్థవగాహనకై ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.
స్వప్నశాస్త్ర గ్రంథాలు అనేక దేశాలలోకలవు. స్వప్న ప్రాముఖ్యత అన్నికాలాలలోనూ, అన్నిమతాలలోనూ కనిపిస్తుంది. ప్రాచీన మానవులు జాగ్రదవస్థ యందు కాంచిన వాటికంటే, స్వప్నంలో కనిపించిన వాటినే విశ్వసించేవారు. క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నాటి బాబిలోనియన్ నాగరికతకు సంబంధించిన మృణ్మయ ఫలకములతో వివరంతో వారికి అనేక స్వప్న గ్రంథాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈజిప్టియన్ల స్వప్నదేవత ‘సెరఫిస్ దేవతల’ ప్రస్ధావన కనిపిస్తుంది. నేడు మనచే పూజలు అందుకుంటున్న దేవుళ్లు కొందరి కలలో కనిపించి నేను ఫలానా పుట్టలోనో, గుట్టలోనో, గుహలోనో, బావిలోనో వెలసిఉన్నానని నన్ను వెలుపలకు తీసి తనకు గుడికట్టించమని తెలియజేసిన సంఘటనలు మన అందరికి తెలిసిందే.
ఈ కలల ప్రస్థావన మహాభారతంలో పరిశీలిస్తే, కవిత్రయంలో ప్రథముడైన నన్నయను ఆంధ్రీకరణకు ఆహ్వానించిన రాజరాజ నరేంద్రుని స్వప్నం ద్వితీయ, తృతీయ స్ధానాలలోని తిక్కన, యర్రనల స్వీయ స్వప్న వృత్తాంతాలు చెప్పుకోదగినవి.
అరణ్యపర్వంలో, ద్వైతవనంలో పాండవులు నివసించే సమయంలో ధర్మరాజుకు దృష్టస్వప్నం వస్తుంది. సప్తవిధ స్వప్నాలలో దృష్ట స్వప్నం ప్రథమం, జాగ్రదవస్థయందు చూసిన వాటినే తిరిగి స్వప్నవస్థ యందు చూడగలిగే దుప్ట స్వప్నాలు. అభిమన్యుడు పద్మవ్యూహంలోనికి వెళ్లే ముందు రాత్రి అతని భార్య ఉత్తరకు దుస్వప్నం వస్తుంది. శ్రీకృష్ణార్జునులు స్వప్నంలోనే కైలాసం వెళ్లి శివుని దర్శించారని తెలిసిందే. అలాగే పరశురామునితో యుద్ధానికి ముందు రాత్రి భీష్ముడు అష్టవసువులను ప్రార్థించడం, నలోపాఖ్యాన కథలో దమయంతి పాత్రకు, సతీసావిత్రికి, దుర్యోధనుని భార్య భానుమతిదేవికి వేణి సంహారంలోనూ, దుష్యంతునకు, హరిశ్చంద్రునుకి, వనవాసానికిముందు సీతాదేవికి, అశోకవనంలో సీతకు, కావలి ఉన్న విభీషణుని కుమార్తే త్రిజటకు కలలు రావడం మనందరికి తెలిసిందే.
ఇలా సాహిత్యంలో స్వప్నాలకు నాటి, నేటి కవులు సముచిత స్థానమే కలిగించారు.
మన సినీ కవులు సందర్బోచితంగా స్వప్నగీతాలు మన సినిమాల్లో ప్రవేశపెట్టారు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం!
1949 లో విడుదలైన కీలుగుర్రం చిత్రంలో “కాదు సుమా కల కాదు సుమా” అనేగీతం. 1953లో విడుదలైన దేవదాసు చిత్రంలో “కల యిదని” అనే గీతం. 1955లో విడుదలైన జయసింహ చిత్రంలో “ఈనాటి ఈ హాయి కల కాదోయి” అనే గీతం. 1957లో విడుదలైన సారంగధర చిత్రంలో “కలలు కరిగి”అనే గీతం.1998లోని జింబో చిత్రంలో “నీ కల యిది కథ కాదు” అనే గీతం. 1960 లోని శాంతినివాసం “కలనైన నీ తలపే” అనే గీతం.1961 లోని వెలుగునీడలు చిత్రంలో “కల కానిది”అనే గీతం. 1962 లోని గుళేబకావళికథ చిత్రంలోని “కలల అలలపై” అనే గీతం. 1965 లోని సుమంగళి చిత్రంలో “కనులు కనులతో” అనే గీతం.1966లోని శ్రీవెంకటేశ్వరమహత్యం చిత్రంలో “కలగా కమ్మని కలగా”అనే గీతం. 1967లోని గోపాలుడు-భూపాలుడు చిత్రంలో “ఒకసారి కలలోకి రావయ్య” అనే గీతం. మావదిన చిత్రంలో “కలలు కనే వేళ యిది కన్నయ్య” అనే గీతం. 1968 లోని పెళ్లిరోజు చిత్రంలో “ఆ నాటి చెలిమి ఒక కల” అనే గీతం. అసాధ్యుడు చిత్రంలో “కలే కన్నానురా” అనే గీతం.1969 లోని భలేరంగడు చిత్రంలో “పగటికలలు కంటున్న మావయ్య” గీతం. మూగనోము చిత్రంలోని “కలనైనా నిజమైనా” అనే గీతం. 1977లోని దానవీరశూరకర్ణ చిత్రంలో “కలగంటినో స్వామి”, అన్నమయ్య చిత్రంలోని “కలగంటి కలగంటి” వంటి వందలాది పాటలు అలరించాయి. అలరిస్తున్నాయి, అలరించబోతున్నాయి.
కలలు ఎప్పుడు రంగులలో రావు. బంగారుకలలో, పగటికలలో, ఏదైనా కానివ్వండి. కలలు మానజీవితంలో భాగం, కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవాలి అనడం మానవనైజం. కలలు పండించుకోవాలి అనుకోవడం మానవ సహజ లక్షణం.