జీవన రమణీయం-114

0
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]’ఈ[/dropcap]గ’ సినిమా రాజమౌళి తీయడం వెనుక అర్థం… ‘నేనే చాలు సినిమా సూపర్ హిట్ అవడానికి. ఈ హీరోల వల్ల సూపర్ హిట్ అవడం కాదు!’ అనేమో నాకు తెలీదు కాని మగధీర తర్వాత నానిని పెట్టి ఈగ తీసి హిట్ చెయ్యడం, అతనికే చెల్లింది.

లక్ష్మి అక్కతో

ఆ మరునాడు నేను మిల్పిటాస్‌లో వున్న మా అక్కయ్య కొడుకు అనంతకృష్ణ ఇంటికి వెళ్ళాను. వెళ్ళాను అంటే, హైదరాబాదులా కాదుగా, మనం ఎడ్రెస్ చెప్పాలి, వాళ్ళు కార్‍లో వచ్చి పిక్ చేసుకోవాలి. అప్పుడు మా లక్ష్మి అక్కా, హనుమంతరావు బావగార్లు వాడి దగ్గరే వుండడంతో, వెళ్ళేసరికి అక్క వంట చేసుంచింది. బాబీ అంటాం అనంత్‍ని. వాటి నన్ను ఇంట్లో దింపి మళ్ళీ ఆఫీస్‍కి వెళ్ళాడు. వాళ్ళావిడ శ్రీతేజ, అర్జెంటుగా వాడితో బయల్దేరి వెళ్ళి నాకో రెడ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చింది. చాలా కాస్ట్లీ, బ్రాండెడ్!

ఓ రెండు మూడు ఏళ్ళ క్రితం వరకూ నాకు ఈ గూచీ, గెస్ లాంటి వాటి విలువ తెలీదు. చిన్న పిల్లలూ, కాలేజీలకి వెళ్ళేవాళ్ళూ, మా పోస్టల్ ఏజంట్ కూతురు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళ కిచ్చేసేదాన్ని! ఇచ్చేసాకా దాని విలువ డాలర్లలో తెలిసినా నేను విచారించలేదు, మంచిదే ఇచ్చాను అని సంతోషపడ్డాను. మా పోస్టల్ ఏజంట్ భారతి కూతురికి రెండే జతల చుడీదార్లు వున్నా, CBIT లాంటి ఇంజనీరింగ్ కాలేజీలో నోటీస్ బోర్డ్ మీద మెరిట్ స్టూడెంట్ అని పేరుండేది. అంత బాగా చదివేది. నేనూ భారతికి వుపయోగపడాలనే పోస్టల్ సేవింగ్స్ చేసేదాన్ని!

శ్రీ తేజ, బాబీలతో

ఇంతకీ తేజ పాపం అంత ఖరీదు బ్యాగ్ తెచ్చి ఇచ్చింది. అందరం భోజనాలు చేసాకా, మళ్ళీ బాబి నన్ను కిరణ్ ప్రభ గారి ఇంటి దగ్గర దింపాడు. ఈ ట్రిప్‍లో నేను అందరికీ బుద్ధ భగవానుడి బొమ్మలు కొని తీసుకెళ్ళి ప్రెజెంట్ చేసాను.

మరునాడు లంచ్‍లో మృత్యుంజయుడొచ్చి నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. జయమాల అతని శ్రీమతి. అక్కడ గవర్నమెంట్ స్కూల్లో టీచర్. కొడుకు మా చిన్నవాడి ఈడు వాడే, ఏదో స్టార్‍ అప్ కంపెనీ ప్రయత్నాల్లో వున్నట్టు చెప్పారు. చాలా కబుర్లు చెప్పుకున్నాం.

ఓసారి మృత్యుంజయుడు వచ్చినప్పుడు, “ఎప్పుడూ పారడైజ్ బిరియానీ తినలేదు” అంటే నేను తీసుకెళ్ళి తినిపించాను. వాళ్ళు వరంగల్ వాళ్ళు. తెలంగాణ మాండలికంలో గ్రాంథిక భాష మాట్లాడ్తాడు. మంచి కథా రచయిత. ప్రతీసారి వెళ్ళినప్పుడు లాగే ఈసారి వెళ్ళినప్పుడు కూడా నేను చాలామంది స్నేహితులని పోగు చేసుకుని ఇండియా వచ్చాను.

మనం జీవితంలో చాలామందిని కలుస్తూ వుంటాం. అందులో కొన్ని మధుర జ్ఞాపకాలూ, కొన్ని చేదు జ్ఞాపకాలూ వుంటాయి. మనం చేదుని వగరు అనుకుని, దాన్నీ ఎంజాయ్ చెయ్యాలి. కాకరకాయ కూర కూడా నేను చేస్తే చాలా ఇష్టంగా తింటారు నా స్నేహితులు. నాగుబాబుగారు అయితే ‘సీతామహాలక్ష్మి’ షూటింగ్‍లో నేను కాకరకాయలు కాయలుగా చేసి తీసుకెళ్తే, ఎంతో ఇష్టంగా తినేవారు. అలాగే మనుషులు కూడా.

నేను పేర్లు మార్చి రాస్తున్నాను కానీ నాకు వింధ్య అనే ఓ అమ్మాయి పరిచయం అయింది. మా అబ్బాయి స్నేహితుడు, పోర్టల్స్ అంటే తెలీని రోజుల్లో నాతో “మా మావయ్య గూగుల్ లాంటి వెబ్ ప్లాట్‍ఫారమ్ ఒకటి పెడుతున్నాడు” అన్నాడు. “ఆ!” అని ఆశ్చర్యపోవడమే కాకుండా, అప్పట్లో నేను పని చేసే మా ఆఫీస్ పక్కనే వుండడంతో వెళ్ళి చూసాను. అక్కడో పెద్దాయన కనిపించాడు. ‘గుంటనక్క’ అని కనిపించగానే గుర్తు పట్టడానికి వీలుగా, మన పాత సినిమాల్లో కొన్ని పాత్రలకి, వుదాహరణకి అల్లు రామలింగయ్యగారికీ, నాగభూషణం గారికీ మొదలైన వాళ్ళకి కళ్ళజోడు ముక్కు మీదకి జారిపోతూ, బెల్టు పెట్టుకున్న పంచే, తలపాగా, వెకిలి చూపులూ, నత్తి మాటలు బహుశా రైటరే డిజైన్ చేసి పెట్టేవాడు అనుకుంట! మనకి వాళ్ళు విలన్‍కి చెంచాలనీ, లేదా తప్పుకుండా మోసం చేస్తారని తెలిసిపోయేది.

ఆ మోస్తరుగా వున్న ఈ పెద్దమనిషి, పొడుగ్గా, పిల్లి గొంతుతో, ఖద్దరు బట్టలు తొడుక్కుని, రాజశేఖర్ రెడ్డి నుండీ ప్రతీ రాజకీయ నాయకుడూ తనకి స్నేహితులనీ, అల్లు అరవింద్ గారి అబ్బాయి తన అల్లుడి స్నేహితుడనీ, అసలు పి.ఆర్.పి.కి తనని సలహాదారుగా పెట్టుకోమని నేను అల్లు అరవింద్‍ గారికి చెప్పాలనీ వూదరగొట్టేసాడు. ఇంతకీ ఆ సైట్‍కి ఈయన మేనేజింగ్ డైరక్టర్‍ట… తెల్లని కుందేలు పిల్లలా వున్న ఓ అమ్మాయి ప్రొప్రయిటర్‍ట!

ఆ అమ్మాయి పేరే వింధ్య… ముగ్గురు ఆడ పిల్లల తర్వాత ఒక మగపిల్లాడు. నలుగురు పిల్లల తల్లి. ఫక్తు అమాయకురాలు. బోలెడు డబ్బులున్న భర్తకి ఇల్లాలు. భర్తది వ్యవసాయం. ఒకసారి వింధ్య భర్తతో ఈ ఎమ్.రావుతో మా ఇంటికొచ్చింది. రెండు మూడు సార్లు నేను ఆఫీస్‍కి వెళ్ళాను, చందమామలు సీడీ చేసి ఇస్తానన్నాడని. అందమైన ఆ అమ్మాయికి ఈ ఎమ్.రావు మీద ఎడ్మిరేషన్ వుందని పసిగట్టాను. ఈడూ జోడూగా వున్న భర్త మాట వినకుండా, నోట్లో నాలిక లేని ఈ పిల్ల నాలుగు కోట్లు, ఈ పోర్టల్‍కీ, ఒక సినిమాకీ పెట్టుబడిగా తగలేసింది. ఆ నాలుగు కోట్లు రాబట్టాలంటే బిజినెస్ పెంచాలని, జూబ్లిహిల్స్‌లో ఓ సెంటర్‍లో మూడు ఫ్లోర్‍ల ఆఫీసు తీసి, ఓ నలభై మంది స్టాఫ్‍ని అపాయింట్ చేసి, ఇంకా పన్నెండు కోట్లు తగలేయించాడు. ఈ అమ్మాయి నాతో అతని గురించి చెప్పే కబుర్లు ఇలా వుండేవి:

“మట్టి ముద్దలా వున్న నన్ను ఓ శిల్పాన్ని చేసారీ మహా మనిషి!… నన్ను పోలిటిక్స్ లోకి తీసుకెళ్తారట… కాన్ఫిడెన్స్ అంటే ఏమిటో చూపిస్తున్నారు అక్కా… డ్రైవింగ్‍లో చేర్పించారు… నా కారు నేను డ్రైవ్ చేసుకుని ఆఫీసుకు వస్తుంటే, ఇప్పటికి నా కాళ్ళ మీద నేను నిలబడ్డానని అనిపిస్తోంది. ముగ్గురాడ పిల్లలకి జడలేసుకుంటూ, వంట ఇంటి కుందేలులా వుండే నాకు విశాల విశ్వాన్ని పరిచయం చేసారు… నా పూర్వజన్మ పుణ్యం ఈయన నాకు పరిచయం కావడం” అంది. “ఎక్కడ పరిచయం?” అన్నాను. “తిరుపతి వెళ్తుంటే రైల్లో పరిచయం అయ్యారు” అంది. అక్కడి నుండే క్షవరం ప్రారంభం అయిందన్నమాట అనుకున్నాను!… ఓ నాడు వింధ్య లేనప్పుడు ఆఫీసుకు వెళ్ళాను. “నీకు యోగా నేర్పిస్తాను” అని నా భుజాలు పట్టుకోబోయాడు. “దూరంగా నిలబడు… నీ హద్దుల్లో నువ్వుండు… ‘నీ ఫ్రెండ్… అఖండ మేధావీ, పి.ఆర్.పి. జాతకం మార్చేస్తాడూ… అరవింద్ గారికి పరిచయం చెయ్యి’ అన్నప్పుడే, అతని గురించీ నీ గురించీ అరవింగ్ గారు కనుక్కున్నారు. ఇలాంటి వాళ్ళని ఆయన వేలల్లో చూసుంటారు. నేను అమాయకపు వింధ్యని కాను” అని చెప్పి వచ్చేసాను. మళ్ళీ ఆ ఆఫీస్‍కి వెళ్ళలేదు. వింధ్య ఫోన్ చేసి “అక్కా మొన్నొచ్చి వెళ్ళావుట… ఏం జరిగింది? నా ఫోన్ తియ్యడం లేదూ?” అని అడిగింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here