లోకల్ క్లాసిక్స్ – 26: ఖాప్ పంచాయతి గతి

0
3

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా అశ్వనీ చౌదరీ దర్శకత్వం వహించిన హర్యాన్వీ సినిమా ‘లాడో’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘లాడో’ (హర్యాన్వీ)

[dropcap]హ[/dropcap]ర్యాన్వీ సినిమాలు 1968 నుంచి నిర్మించడం మొదలెట్టారు. అయితే హిందీ సినిమాల తాకిడి వల్ల పరిశ్రమ ఎదగ లేకపోయింది. ఈ యాభై రెండేళ్ళ కాలంలో కేవలం 32 సినిమాలు నిర్మించగల్గారు. హిందీ, హర్యాన్వీ భాషలు పెద్దగా తేడా వుండవు. అందువల్ల హర్యానా ప్రేక్షకులు అట్టహాసంగా వుండే హిందీ సినిమాలు చూసేస్తూంటారు. అయినా కొందరు అభిరుచిగల నిర్మాతలు, దర్శకులు స్థానిక సమస్యలు కథా వస్తువులుగా హర్యాన్వీ సినిమాలు ఏడాదికో మూడేళ్ళకో ఒకటి తీస్తూనే వుంటారు. ఆ తీసిన వాటిలో మూడిటికి జాతీయ అవార్డులు కూడా తీసుకున్నారు. అలా జాతీయ అవార్డు పొందిన వారిలో 2000లో ‘లాడో’ తీసిన దర్శకుడు అశ్వనీ చౌదరీ కూడా వున్నాడు. ఆ తర్వాత అతను బాలీవుడ్ వెళ్ళిపోయి హిందీ సినిమాలు తీయడం మొదలెట్టాడు. ధూప్, సిస్కియా, గుడ్ బాయ్ – బ్యాడ్ బాయ్, జోడీ బ్రేకర్స్ వంటివి. గత సంవత్సరం ‘సెట్టర్స్’ తీశాక, తాజాగా ‘దేఖో జరా’ ప్రకటించాడు.

‘లాడో’ (ముద్దుల కూతురు) వివాదాస్పదమైంది. దీన్ని ఖాప్ పంచాయత్‌ల గురించి తీయడం వల్ల ఖాప్ పంచాయత్‌లు తిరగబడ్డాయి. ఆధునిక భావాల పేరుతో హర్యానా సభ్య సమాజం పరువు మంట గలిసేలా, శాంతి భద్రతల సమస్యల్ని రెచ్చగొట్టేలా ఈ సినిమా తీశారని నిర్మాత మీద, దర్శకుడు మీద కేసులు వేశారు. రాజకీయంగా కూడా అప్రదిష్ట తెచ్చి పెట్టేలా వుందని రాయకీయ వర్గాలూ ఆందోళనకి దిగాయి. ఇవన్నీ తట్టుకుని సినిమా విడుదలయింది. హిందీ రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందింది.

నిజానికి ఈ సినిమాలో ఖాప్ పంచాయత్‌లనీ, రాజకీయ పక్షాల్నీ ఇంటికి పంపేలా ప్రజలు తమ సమస్యలు తామే పరిష్కరించుకునే చిత్రణ చేశారు. ఇదీ వొళ్ళు మండిపోవడానికి కారణం. కుటుంబ గౌరవం పేరుతో ప్రేమికుల్ని హతమార్చే ఖాప్ తీర్పుల పట్ల ప్రజల వైఖరేమిటో ఈ సినిమా నిదర్శనం. ఇందులో ఒక పాత్ర, మీ పంచాయత్ అవసరం లేదు, మా ఇంటి సమస్య మేం పరిష్కరించుకుంటామని అంటుంది. అలాటిది ఇందులో కథానాయిక తన సమస్యకి ఖాప్ పంచాయతే కావాలని ఎందుకు పట్టుబట్టింది? ఇది తెలుసుకుందాం…

కథ

ఊర్మి(అరుంధతి)కి అరవింద్ (సంజయ్ సింగ్)తో వైభవంగా పెళ్ళవుతుంది. బాగా చూసుకునే అత్తామామలు, మరిది, మరదలూ వుంటారు. భర్త అరవింద్ చిన్నాన్న కొడుకు ఇందర్ (ఆశుతోష్ రాణా) వచ్చి పోతూంటాడు. అరవింద్ కోల్‌కతలో ఉద్యోగం చేస్తాడు. తండ్రి నఫే సింగ్ గ్రామంలో పొలం కొనమని పోరుతూంటే, ఉన్న డబ్బుతో గ్రామంలో పొలం కొంటే ఏమొస్తుంది, పట్టణంలో ప్లాట్ కొందామని అరవింద్ పట్టుబతాడు. ఈ గొడవ నలుగుతూంటుంది. అరవింద్ ఊర్మిని తీసికెళ్ళకుండా కోల్‌కత వెళ్లి వస్తూంటాడు. వెళ్తే ఎప్పుడొస్తాడో తెలీదు. తను భర్త దగ్గరికే వెళ్ళాలని ఊర్మి అనుకుంటే, ‘అది కోల్‌కత వెళ్లి మహారాణీలా వుంటుందా, నేనిక్కడ చాకిరీ చెయ్యాలా?’ అని అత్తగారు ఫూల్మతి మామ దగ్గర ఎత్తి పొడుస్తుంది.

తీజ్ (శ్రావణ మాసం) పండక్కి వూళ్ళో పడతులందరూ భర్తలతో వ్రతాలు చేస్తూ బృందాలుగా ఉయ్యాల లూగుతూంటే, ఆడి పాడుతూంటే, తను ఒంటరిగా మిగిలిపోతుంది ఊర్మి. నెలలు గడుస్తున్నా ఊర్మి నెల తప్పక పోవడంతో ఫూల్మతి వొత్తిడి పెంచుతుంది. ఊర్మి అరవింద్‌కి చెప్తే అతనొప్పుకోడు. ఉద్యోగం వదిలేసి రోహతక్‌లో వ్యాపారం పెట్టబోతున్నాననీ, అక్కడే ప్లాట్ కొంటాననీ, అక్కడే పిల్లలు పుట్టాలనీ చెప్పేస్తాడు. ఏం చేయాలో ఊర్మికి అర్థం గాదు. ‘నీ కడుపులో నిప్పులు పొయ్య’ అని ఫూల్మతి వేసుకోవడం మొదలెడుతుంది.

అప్పుడప్పుడు వచ్చి పోతూండే అరవింద్ చిన్నాన్న కొడుకు ఇందర్, ఊర్మి మీద కన్నేస్తాడు. ‘నీకు కొడుకుని నేనిస్తా’ అంటాడు. మొదట భయపడ్డా, తర్వాత ఒప్పుకుంటుంది ఊర్మి. ఊరి బయట రహస్యంగా కలుసుకుంటూ వుంటారు. ఒక రోజు సెకండ్ షో సినిమా కెళ్ళి వస్తూ ఛోటూ అనే వాడి కంటబడతారు. ప్రమాదం పసిగట్టిన ఊర్మి, ఇందర్‌ని పెళ్లి చేసుకొమ్మంటుంది. కుదరదంటాడు. కడుపుతో వున్నానంటుంది. కుదరదంటాడు. ఛోటూ వెళ్లి వూరంతా టాం టాం చేసేస్తాడు. ఇంటి కొచ్చిన ఊర్మిని పట్టుకుని అత్త ఫూల్మతీ, ఇంకొందరు ఆడవాళ్ళూ వొళ్ళు హూనమయ్యేలా చితక బాదుతారు. మామ, మరికొందరు మగవాళ్ళూ అడ్డుకుని కుటుంబ పంచాయితీ పెడతారు. ఈ కుటుంబ పంచాయితీలో ఏం తేలింది? ఈ కుటుంబ పంచాయితిని గ్రామ పంచాయితీకీ, అక్కడ్నుంచీ ఖాప్ పంచాయత్‌కీ ఊర్మి ఎందుకు తీసికెళ్ళింది? అప్పుడు మూడు ఖాప్‌ల సర్వ్ ఖాప్ పంచాయత్‌లో ఏం తీర్పు చెప్పారు? ఈ పంచాయత్ ఎందుకు రాజకీయ రంగు పులుముకుంది?…ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

హర్యానాలో ప్రాబల్య వర్గాల గురించి తెలియంది కాదు. వాళ్ళ ఖాప్ పంచాయత్‌లు ఎలాటి సంచలనాలు సృష్టిస్తూంటాయో తెలిసిందే. సమాంతర న్యాయ వ్యవస్థ నడుపుకుంటూ తాలిబన్ తీర్పులు, శిక్షలు అమలు చేస్తూంటారు. వాళ్ళకి మూడే ప్రధానం: భూమి, స్త్రీ, కట్టుబాట్లు. వాళ్ళకి గౌరవ సూచకం స్త్రీని కలిగి వుండడం. స్త్రీతోనే కుటుంబ గౌరవ ప్రతిష్ఠలు. అందువల్ల స్త్రీని ఎంత సంరక్షించుకుంటారో, ఆమె కుటుంబ గౌరవానికి భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తే అంత శిక్షిస్తారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ఈ కథని తెరకెక్కించాడు. ఊర్మి కేంద్ర బిందువు. ఆమెని బలిపశువుని చేయకుండా ఆమె విజయాన్ని చూపాడు. ఎక్కడికక్కడ ఆమె దమ్ములేని మగవాళ్ళని తిరస్కరిస్తూ పోతుంది. మొదట సంతానాన్నివ్వని భర్తని, తర్వాత సంతానాన్ని తిరస్కరించిన ఇందర్‌ని, ఆ తర్వాత భ్రష్టురాలని వెలి వేసిన గ్రామ పంచాయితీనీ, చివరికి రాజకీయాలకి వాడుకుంటోందన్న ఖాప్ పంచాయత్‌నీ తీసి అవతల పడేస్తుంది. ఇది తనూ భర్తా, ఇందర్ మాత్రమే పరిష్కరించుకో దగ్గ వ్యక్తిగత సమస్యనే అనివార్య పరిస్థితిని భర్తకీ, ఇందర్‌కీ కల్పించి, వాళ్లతో తేల్చుకుంటుంది.

తెల్ల మొహం వేసిన సర్వ్ ఖాప్ పంచాయత్ పెద్దలు ఇక వేదిక దిగి తమ దారి చూసుకుంటారు. ఈ పంచాయత్‌కి ఎలాటి కష్టం వచ్చిందంటే, పార్టీ లీడర్ జోరావర్ సింగ్ వుంటాడు. ఇతను ఓట్ల కోసం రాంరాం, ఓట్లయి పోయాక రాధేశ్యాం టైపు నాయకుడు. ఇతను కూతురికి ఏరికోరి సర్పంచ్ దిలావర్ సింగ్ కొడుకు సంబంధం మాట్లాడుకున్నాడు. ఈ కొడుకు వెధవ ఇందర్ వెళ్లి ఊర్మితో ప్రేమని వెలగబెట్టాడు. రానున్నవి ఎన్నికలు, ఇప్పుడు పోయేది తన టికెట్టు. దీంతో కోపం పట్టలేక, ‘నన్ను రాజకీయంగా దెబ్బ తీయడానికే ఈ అభాండాలు వేస్తున్నావు, రేపు నా దగ్గరా పడుకున్నానంటావ్, వాడి దగ్గరా వీడి దగ్గరా పడుకున్నానంటావ్’ అని దుర్భాష లాడతాడు ఊర్మితో.

ఊర్మి కొక్కటే కావాలి. కడుపులో బిడ్డని సంరక్షించుకోవడం, జన్మనివ్వడం, ఇందుకు అబార్షన్ వొత్తిడుల్ని కూడా తిప్పి కొట్టింది. ఇందర్ ఇంటి ముందు కూర్చుని అతడి కోసం మౌన పోరాటం చేయడం కూడా కాదు. తప్పు తన వల్ల కూడా జరిగింది. ఇద్దరూ కలిసి చేసిన తప్పుతో తన పరువే పోయింది. ఆ పరువు తిరిగి పొందాలి. ఇందుకు ఇందర్ తో సంబంధం, పెళ్ళీ కాదు – బిడ్డ తనదని అతనొప్పుకోవాలి…

ఊర్మి పాత్రని ఈ కథలో మగాళ్ళలా కాకుండా, వేగంగా నిర్ణయాలు తీసుకునే, కరెక్టు నిర్ణయాలు తీసుకునే యువతిగా చిత్రించాడు దర్శకుడు. సినిమా తీసిన 2000 సంవత్సరంలో బేటీ బచావో – బేటీ పడావో రాజకీయ స్లోగన్ ఇంకా లేకపోవచ్చు. ఊర్మి ఇంటర్ వరకే చదివింది. కానీ మగ మంద నుంచి తననెలా బచాయించుకోవాలో అప్పటికే బాగా తెలుసు.

అరుంధతి హైలైట్

ఈ పాత్ర అరుంధతి చివరి అరగంటా అర్థవంతంగా నటించింది. ఏడ్పులూ అరుపులూ వుండవు. విషయం మాట్లాడుతుంది, అరిచే వాళ్ళ నోళ్ళు కట్టేస్తుంది. మంచి ముఖ భావాలు, మంచి శరీర భాషా వున్నాయి. ఇందర్ పాత్రలో హిందీ నటుడు ఆశుతోష్ రాణా తన మార్కు విలనీ పక్కన బెట్టి, కూల్‌గా నటిస్తాడు. ఫూల్మతిగా అమితా ఉడ్గత మరో ఆకర్షించే నటి. ఇతర పాత్రల్లో నటీ నటులు ఫర్వాలేదు.

అశోక్ బెహల్ ఛాయాగ్రహణం, లలిత్ సేన్ సంగీతం వహించారు. తీజ్ పండక్కి ‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ మేఘా బర్సే’ పాట బావుంది. ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణ మూర్తి, అల్కా యాజ్ఞిక్ గీతాలు పాడారు. కథా రచన అశ్వనీ చౌదరి, సురేంద్ర చౌదరి. నిర్మాత కుముద్ చౌదరి. వివాదాలన్నీ పక్కనబెట్టి, జాతీయ అవార్డుల్లో ‘ఇందిరా గాంధీ ఉత్తమ నవ దర్శకుడు’ కేటగిరీలో అశ్వనీ చౌదరికి అవార్డు ప్రదానం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here