దైవం మానూష రూపేణ

1
3

సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకోవడంతో చుట్టుచీకట్లు అలముకున్నాయి. మా ఇంటి తోటలోని మొక్కలన్నిటికీ పైపుతో నీళ్ళు పెట్టి అప్పుడే కుర్చీలో కూర్చున్నాను. నా భార్య అనసూయ అపురూపంగా వేసి పెంచుకున్న తోట అది. ఆ మొక్కలు ఒక్కరోజు వాడిపోయినా భరించలేను నేను. మనసంతా ఒంటరిగా, ఒకటే దిగులుగా అనిపించింది. తను పోయి ఆర్నెల్లయినా ప్రతిక్షణం ఆమె లేని లోటు కనిపిస్తూనే ఉంది. నన్నొక పసిపిల్లవాడిని చేసి పిల్లలకు అప్పగించి తను వెళ్ళిపోయింది. ఏ లోటు లేకుండా నన్నెంతో అపురూపంగా చూసుకునేది. నేనే ఆమెను దక్కించుకోలేక విధిరాతకు బలిచేశాను. ‘మీరు ఒక్కరు ఎలా ఉంటారు? మా దగ్గరకు రండి నాన్నా!’ అంటూ పిల్లలిద్దరు ఒత్తిడి చేశారు. కానీ ఈ ఇంటితో నాకున్న అనుబంధాన్ని దూరం చేసుకోలేక పిల్లల మాటను సున్నితంగా తిరస్కరించాను. ఒంటరిగా నా భార్య జ్ఞాపకాలతో కాలం వెళ్ళబుచ్చుతున్నాను. అర్థాంగి గురించి ఆలోచించేకొద్దీ గుండె బరువెక్కింది నాకు. ఇంతలో గేటు చప్పుడవటంతో అటువైపు చూశాను. ఒక ఆవిడ గేటు తీసుకుని లోపలకు వస్తోంది.

వస్తూనే “నమస్కారమండి. రామ్మూర్తిగారి ఇల్లు ఇదేనా?” అని అడిగింది.

“అవును! ఇదే. ఏం కావాలి?” అన్నాను.

“నన్ను గుడి పూజారి నరసింహంగారు పంపారండి. నా పేరు మాణిక్యం. మీరు వంటమనిషి కావాలన్నారట కదా! మీకు ఇష్టమైతే నేను మీకు వంట చేసిపెడతాను” అన్నది.

“అలాగా కూర్చో” అని కుర్చీ చూపించాను. కానీ ఆమె కూర్చోలేదు. అలా నిల్చునే ఉంది. ఆమె నిల్చున్న తీరు చాలా వినయంగా, ఎంతో నమ్రతగా అనిపించింది.

“నా భార్య ఈ మధ్యనే చనిపోయింది. వంట, టిఫిన్ అన్నీ నువ్వే చేయాలి. ఇక్కడే ఉండి చేయాల్సి ఉంటుంది. మరి మీరు ఎవరెవరు ఉంటారు?” అడిగాను ఆమెను.

“నాకు పదేళ్ళ కొడుకు ఉన్నాడు బాబుగారు. మా ఆయన నాలుగేళ్ళక్రితం ఏదో జబ్బుచేసి కాలం చేశారు. మాకు అస్తిపాస్తులేమీ లేవు. నేను, మా అబ్బాయి ఆంజనేయ స్వామి గుడిలో ఉంటున్నాము. పూజారి నరసింహం గారే గుళ్ళో గది ఇప్పించారు. అక్కడే ఉంటున్నాము బాబు. ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడా ఏ ఆధారము దొరకలేదు. వారానికి రెండు, మూడు రోజులు ప్రసాదంతో సరిపెట్టుకోవలసి వస్తుంది. నా కొడుకు భవిష్యత్ తలచుకుంటే దిగులుగా ఉంది బాబు. ఎక్కడన్నా వంట పని కుదర్చమని పూజారిగారిని అడిగాను. వారు చెబితేనే నేనిలా వచ్చాను” అన్నది మాణిక్యం కళ్ళు తుడుచుకుంటూ.

“సరే, మరి నీకెంత జీతం కావాలి? ఇక్కడ ఉండడానికి నీకేమన్నా అభ్యంతరమా? అడిగాను.

“లేదు బాబు గుళ్ళో కూడ గది ఖాళీ చెయ్యమన్నారు. మీరుండమంటే నేనూ నా కొడుకు ఇక్కడే ఉంటాము” చెప్పింది మాణిక్యం. “జీతం మీ ఇష్టం బాబు. మీకెంత న్యాయమనిపిస్తే అంత ఇవ్వండి” అని చెప్పింది.

పరిస్థితులు లేని మనిషిని ఎంతటి స్థితికి దిగజారుస్తాయో కదా! అనుకున్నాను.

“సరే అయితే రేపు ఉదయమే వచ్చేసెయ్యండి” అన్నాను ఆమెతో.

“అలాగేబాబు, ఉంటాను మరి” అని మరోసారి దణ్ణం పెట్టి వెళ్ళిపోయింది మాణిక్యం.

అనుకున్న ప్రకారం మర్నాడు ప్రొద్దునే తన కొడుకుతో సహా వచ్చింది. వెంట ఓ చేతి సంచి తప్ప మరేమీ లేదు. కొడుకు చెయ్యిపట్టుకుని జాగ్రత్తగా నడిపించుకొచ్చింది. దగ్గరగా చూస్తే పిల్లవాడి ముఖంలో ఏదో తేడా కనిపించింది.

మాణిక్యం లోపలికొస్తూనే “నమస్కారమండి! వీడు నా కొడుకు శ్రీనివాస్. మూడేళ్ళప్పుడే ఏదో లోపంతో వీడి కళ్ళు మసకబారాయి. చూపు పూర్తిగా కనపడదు బాబు. ఏదో ఆపరేషన్ చేయిస్తే కళ్ళు వస్తాయంట. ఐదారు లక్షలు అవుతాయి అన్నారు. కడుపునిండా తిండిపెట్టలేని నేను అంతడబ్బు ఎక్కడనుండి తేగలను? అందుకే దేవునిమీద భారంవేసి ఊరకుండిపోయాను బాబు” అన్నది.

“శీనూ! బాబుగారికి నమస్కారం పెట్టు” అన్నది.

“నమస్కారమండి” అన్నాడు శీను.

చూపు సరిగ్గా లేదు కానీ, చాలా కళగల మొహం శీనుది. ఇద్దరినీ ఇంట్లోకి తీసుకెళ్ళాను. వాళ్ళు ఉండవలసిన గది చూపించాను. వంటగది సామాను ఆమెకు పరిచయం చేశాను. నా భార్య పోయిన తర్వాత ఇంట్లో ముగ్గురు మనుషులుండటం ఇదే ప్రథమం. ఇల్లంతా ఎంతో సందడిగా ఉన్నట్లనిపించింది. మాణిక్యం వంట చాలా రుచిగా చేసింది. చాలా రోజుల తర్వాత రుచిగా భోజనం చేశాను. ఇల్లంతా తొందరగానే ఆకళింపు చేసుకుంది మాణిక్యం. శీనుకి ఎలా కాలక్షేపం అవుతుందబ్బా అనుకున్నాను. టి.వి చూడమన్నాను. చూపులేదు కాబట్టి వినడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. బట్టలన్నీ మడతపెట్టడం, ఇల్లంతా శుభ్రంగా ఊడవడం అలవాటు చేసింది వాళ్ళమ్మ. మొక్కలకు నీళ్ళు పెట్టడం అలవాటు చేసుకున్నాడు. తోటలో ఏఏ మొక్కలున్నాయో అడిగి తెలుసుకున్నాడు. వాడు ’ఏకసంథాగ్రాహి’ అని గ్రహించాను నేను. నేను రాగానే లేచి నిల్చోవడం, నన్ను బాబుగారు అని పిలవడం నాకు నచ్చలేదు. తాతయ్యా అని పిలవమన్నాను. తాతగారు అని అలవాటు చేసుకున్నాడు. తాతగారు అనేవాడి పిలుపులో నాకెంతో ఆత్మీయత కనబడుతుంది. ఫోన్ ద్వారా విషయం అంతా పిల్లలకు చెప్పాను. “మంచిపని చేశారు నాన్నా మీకు ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. మాకు అదే చాలు” అన్నారు నా కొడుకు, కూతురు. భగవంతుడి దయవల్ల అత్తవారింట్లో నా కూతురు పిల్లాపాపలతో చాలా సుఖంగా ఉంది. కానీ నా కూతురు లాంటి మాణిక్యం నిస్సహాయతగా శీను గురించి బాధపడటం నన్ను కదిలించింది. సర్వీసులో ఉండగా, ఎంతోమందికి సాయం చేశాను. నా కళ్ళెదురుగా ఒక పసివాడి జీవితం చీకటి కాకూడదనిపించింది నాకు. దీనివల్ల సమాజం నుండి ఎటువంటి సవాళ్ళు ఎదురవుతాయో అని ఒక్కక్షణం ఆలోచించాను. కానీ ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. నా ఆలోచనన్ను నా స్నేహితుడు నరసింహం ముందు పెట్టాను. “ఈ వయసులో బాధ్యతలను పెంచుకుంటున్నావేమో ఆలోచించు రామ్మూర్తి” అన్నాడు. “లేదు నరసింహం, బాధ్యతలోనే బంధం ఉంటుంది. శీను నాకు దేవుడిచ్చిన మనవడు. ఆ పసివాడి జీవితం అలా నిరాశా, నిస్పృహలతో గడిచిపోకూడదు. వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తాను” అన్నాను. ఏ ఆలోచనలకు నిమిత్తం లేకుండా కాలం దొర్లిపోతోంది.

మాణిక్యం వంటకు కుదిరి సంవత్సరం అయింది. ‘బాబుగారూ’ అంటూ ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తుంది మాణిక్యం. శీనుని నా మనుమడిలా పక్కన కూర్చోపెట్టుకుని కథలు, కబుర్లు చెప్పడం అలవాటు అయింది నాకు. ఇంతకన్నా ఈ వయసులో నాకింకేం కావాలి? అందుకే ఆ పసివాడి కళ్ళల్లో వెలుగు చూడాలనుకున్నాను. శీనుకి ఆపరేషన్ చేయించాలి. వీడు అందరిలా చూడగలగాలి. అదే నా కోరిక. నా పిల్లలకు ఆస్తి ఇస్తే హక్కుగా తీసుకుంటారే తప్ప అనవసరంగా కాదు. అందుకే నేను చేయాలనుకున్న సాయాన్ని వాళ్ళు హర్షించారు. “మీరు చాలామంచి పని చేస్తున్నారు నాన్నా! అమ్మ ఉంటే చాలా సంతోషించేది” అని కూడా అన్నారు. వాళ్ళ సంస్కారానికి గర్వపడుతూ, నా ఆలోచనకు శ్రీకారం చుట్టాను.

వెంటనే డాక్టర్‍ని కలిసి శీను కంటి ఆపరేషన్‍కి ఏర్పాటు చేశాను. “బాబుగారు మీరు మానవరూపంలో ఉన్న దేవుడు” అంటూ నా కాళ్ళు పట్టుకుంది.

“లేదు మాణిక్యం. నేను మామూలు మనిషినే. మీ ఇద్దరితోడు లేకపోతే నేనేమైపోయేవాడినో” అన్నాను. “అంతేకాదు. ఈ పసిమొలక పెరిగి మహా వృక్షమై ఎందరికో నీడను, ఫలాలను అందివ్వాలి. అదే నా కోరిక” అన్నాను. ఆపరేషన్ విజయవంతమై శీనుకు చూపు వచ్చింది. వాడు మొదటిసారి నన్ను చూసి ‘తాతగారు’ అంటూ చాలా సంబరపడిపోయాడు. నాది పరాయిది అనే భేదం తెలియని పసివాడు ఇల్లంతా సంతోషంగా గంతులు వేస్తుంటే నాలో ఒక కొత్త ఆలోచన. శీనుని స్కూల్లో చేర్పించి చదివించాలి. నా ప్రతి ఆలోచనను పిల్లలతో పంచుకుంటూ వచ్చాను. వాళ్ళుకూడా ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు.

తర్వాత శీనుని మంచి స్కూల్లో జాయిన్ చేశాను. వాడు చాలా బుద్దిగా, తెలివిగా చదువుకుంటున్నాడు. వాడిని చూస్తున్న మాణిక్యం మొహంలో చెప్పలేని ఆనందం. ఆమె నాకు ఇప్పుడు వంటమనిషిగా కాదు, నా రెండవ కూతురిగా అనిపిస్తోంది. కాలచక్రంలో ఓ పదేళ్ళు గడిచిపోయాయి. శీను డిగ్రీ పూర్తిచేసి మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. “తాతగారూ! నా అభివృద్దికంతటికీ కారణం మీరే. మీ అండలేకపోతే నేనూ, అమ్మ ఏమైపోయేవాళ్ళమో” అంటూ నా కాళ్ళకు నమస్కారం చేశాడు. ఆ రోజున నాకు కలిగిన తృప్తికి, ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “బాబుగారు మీరు మానవ రూపంలో ఉన్న భగవంతుడు” అన్నది మాణిక్యం. ఆరోజు మనిషిగా నా జీవితం ధన్యమైనట్లుగా అనిపించింది. నన్ను కన్నతండ్రికన్నా ఎక్కువగా చూసుకుంటోంది మాణిక్యం. నేను వయోవృద్ధుడనైనాను. జీవితం చివరి మజిలీలో నాకొక బాధ్యతను అప్పజెప్పి దాన్ని నిర్వర్తించేలా చేసిన భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. శీనుని ఓ ఇంటివాడిని చేసి నా బాధ్యతను పరిసమాప్తం చెయ్యాలనుకున్నాను. అందుకే పిల్లలతో ఓసారి సంప్రదించి, ఉంటున్న ఇంటిని శీను పేరుమీద వ్రాసేశాను. వాళ్ళిద్దరి సంతోషపు వెలుగుల్లో నా జీవితం తెల్లవారిపోవాలని కోరుకుంటున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here