[dropcap]”మ[/dropcap]న ఊరేంటే ఇలా తగలబడిపోతోంది. నేను పుట్టిపెరిగిన అరవైయేళ్లలో, నేను ఎప్పుడూ కనీవినీ ఎరుగను ఇలాంటి సంఘటనలు. ఎవరెవరో వచ్చేసి మన వూరుని భ్రష్టు పట్టించేస్తున్నారు. అయినా ఆ బాస్టర్డ్స్‌ని అక్కడికక్కడ కాల్చిచంపెయ్యకుండా ఇంకా అరెస్టులూ, ఎంక్వయిరీలేంటి?…”
కోపంగా టీవీ ఆఫ్ చేసి, రిమోట్ పక్కమీదకి విసిరేసి, కోపంగా లేచి వచ్చేస్తున్న మా ఆయనకేసి ప్రశ్నార్ధకంగా నా లేప్‌టాప్ మీంచి చూసా!!
“ఏమయింది? మళ్లీ సముద్రంలో ఎవరైనా గల్లంతా?”
“నేనేం చెప్పా? నువ్వేమి విన్నావ్? ఎంతసేపూ ఆ వెధవ సోషల్ నెట్‌వర్క్‌లో కూర్చుని ప్రపంచాన్ని వదిలేసావ్! చుట్టూ ఏం జరుగుతున్నా ఏం పట్టట్లేదు. ఇదిగో ఇలా పేరెంట్స్ పట్టించుకోకే ఇలాంటి దుర్మార్గులందరూ తయారవుతున్నారు. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ మదర్స్ అండ్ ఫాదర్స్…..”
ఉరిమురిమి మంగలంమీద పడ్డట్టు ప్రపంచంలో ఏ ఘాతుకం జరిగినా ఈయన నా ఫేస్‌బుక్, వాట్సాప్ వల్లే అంటారు. ఈరోజు కొంచెం ఎక్కువే సీరియస్‌గా ఉన్నారు!
“ఏం జరిగింది మూర్తీ?” … కాస్త గోముగా, కించిత్ ఆదుర్దాగా అడిగా!
“ఏమవ్వాలి? ఆనందపురం అవతల తోటల్లో నలుగురు కుర్రాళ్లు, మూడో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నవాళ్లు, బర్త్ డే పార్టీ అని క్లాస్‌మేట్స్ ఇద్దరమ్మాయిలని ఫార్మ్ హౌస్‌కు పిలిచి, తప్పతాగించి, రేప్ చేసి, తోటలో కాపలాకి పెట్టిన జాగిలాలను వదిలేసారట. దాంట్లో ఒకమ్మాయిని ఆ వేటకుక్కలు చీల్చి చంపేసాయి.
రెండో అమ్మాయి తప్పించుకుని, చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతూ రోడ్డుమీదకి పరిగెట్టుకొస్తే, ఎవరో కోడిగుడ్ల వేన్ డ్రైవర్ రక్షించి పోలీస్ స్టేషన్లో వదిలాట్ట.
ఆ పిల్ల చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఆ… కొడుకుల్ని అరెస్ట్ చేసారు. మొత్తం ఛానల్సన్నీ అదే న్యూస్….!” అంటూ రిమోట్ నాకేసి విసిరి సిగరెట్ కాల్చుకోడానికి బాల్కనీలోకి వెళిపోయారు!
టీవీ పెట్టి చూద్దును కదా! కుక్కలు చీల్చి చెండాడి మాంసం ముద్దలా పడున్న అమ్మాయినే పదేపదే చూపిస్తున్నారు. కడుపులో దేవేసింది. ఆ పిల్ల ఎంత చక్కని చుక్క అయుంటుంది! ఎన్ని ఆశలతో యవ్వనంలోకి అడుగుపెట్టి ఉంటుంది. భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కని ఉంటుంది. తల్లితండ్రులు ఎంత గారంగా పెంచుకుని ఉండి ఉంటారో! మరి అయ్యో! ఇదేమిటి? ఇలా మాంసఖండంగా మిగిలింది?
రెండో పిల్లని పోలీస్‍౬లు ఆసుపత్రికి తరలిస్తుంటే చూపించారు. ఆ చీలిపోయిన శరీరం తిరిగి నార్మల్ అవుతుందా? ఆ నరకబాధ కన్నా చచ్చిపోయినా బాగుండును కదా! రేప్పొద్దున బతికిబట్టకట్టినా సమాజంలో పిచ్చికుక్కలు మానసికంగా పదేపదే చీల్చిచెండాడేస్తాయ్! ఇవన్నీ తట్టుకుని బతకగలదా! భగవంతుడా! ఏంటి ఈ అన్యాయాలు!”…….
ఆ అమ్మాయిల తల్లితండ్రుల శోకాలు వినలేక చానల్ మార్చా! పోలీసులు ఆ నలుగురు కుర్రాళ్లనీ మీడియాకి ప్రదర్శిస్తున్నారు!
నలుగురూ ఇంకా మత్తుమందు ప్రభావంలో ఉన్నట్టున్నారు. సరిగ్గా నిలబడలేక బుర్రలు వాల్చేస్తున్నారు. ఒక్కడు కూడా ఇరవైయేళ్లకు మించడు. రాగి రంగేసిన గుబురు జుట్లు, ప్రెంచ్ బియర్డ్‌లు, వంటి చెవికి డైమండ్ పోగులు, పొంతనలేని బ్రాండెడ్ దుస్తులు, అత్యంత ఖరీదయిన షూస్, వాచీలూ ధరించి…. డ్రింకింగ్, స్మోకింగ్ వలన మొద్దబారిన మొహాల్లో ఎక్కడా వీసమెత్తు అమాయకత్వం కానీ, మత్తుతో మూసుకుపోతున్న కళ్లలో ఇసుమంత పశ్చాత్తాపం కానీ లేకుండా పొగరుగా నిలబడి ఉన్నారు! నిర్లక్ష్యంగా బబుల్ గమ్‌లు నవులుతూ, “మమ్మల్నెవడు ముట్టుకోగలడు లే” అన్నట్టు!!
నిజమే! వీళ్లకేమీ కాదు. కాయడానికి బాగా ఒళ్లు బలిసిన తల్లితండ్రులుంటారు. అతిత్వరలో తిమ్మినిబమ్మి చేసేసి పిల్లలకు బెయిల్ తెచ్చేసుకుంటారు! నిజానికి ఈ కేసు మీడియా కళ్లలో పడింది కాబట్టీ బయటకొచ్చింది , లేకపోతే స్పాట్ సెటిల్‌మెంట్లే అయిపోయేవేమో!!
ఛానల్‌లో డిస్కషన్ కోసం నలుగురు పెద్దలను కూర్చోబెట్టారు. చర్చకు ముందు నలుగురు కుర్రాళ్ల పరిచయం చెప్తున్నాడు వ్యాఖ్యాత! దాంట్లో రెండు పేర్లు విని నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను!
ప్రముఖ ఐరన్ స్క్రాప్ వ్యాపారి దినేష్ కుమార్ కొడుకు సంపత్ కుమార్, నగరంలో పలు డిగ్రీకాలేజీలు, రెండు ఇంజినీరింగ్ కాలేజీల యజమాని వీరేంద్రరావు కొడుకు నవీన్ రావ్! వాళ్ల ముఖాల క్లిప్పింగ్స్ క్లోజప్‌లో చూసి, నా గుండె లయ తప్పింది.
“ఓ మై గాడ్! ఎంత పని చేసారు పిచ్చివెధవలు!”
***
యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడలిస్టుగా బయటకొచ్చిన నాకు, వెంటవెంటనే జరిగిపోయిన పెళ్లి, ఉమ్మడి కుటుంబంలో కాపురం, ఆ వెంటనే ఇద్దరి పిల్లల బాధ్యత దాదాపు పదిహేనేళ్ల కాలాన్ని నాకు కాకుండా చేసి ఉక్కిరిబిక్కిరి చేసేసాయి.
పిల్లలిద్దరూ చదువులో బాగా కుదురుకుని, నా అవసరం లేకుండా చదువులు చక్కబెట్టుకోవడం నేర్చుకోవడంతో నాకు నా మిగులు సమయం పెద్ద అఖాతంలా కనిపించసాగింది. అది బయటకెళ్లి ఉద్యోగం చెయ్యనీయని నా కుటుంబ నేపథ్యం మీద ఫ్రస్ట్రేషన్‌గా మారి, అందరిమీదా అరుస్తూ ఉండేదాన్ని.
అలాంటి రోజుల్లో ఒకరోజు మాకు పనిచేసే అమ్మాయి, “అమ్మా! యమునమ్మగారు మీతో మాట్లాడాలంట. కింద కారులో ఉన్నారు”.. అంటూ వార్త మోసుకొచ్చింది.
అసలీ యమునమ్మగారెవరో నాకర్థం అవలేదు. పనమ్మాయే చెప్పింది ఆమె మా వీధిలోనే ఉండే పేద్ద ఐరన్ అండ్ స్టీల్ మర్చెంట్ భార్య అని. నాతో మాట్లాడాలనుకుంటోందని. నన్ను కారు దగ్గరకు పిలుచుకు రమ్మనమందని.
ఆమెకు నాతో ఏమి పని? అయినా నేను కారు దగ్గరకి వెళ్లడమేంటి? పనుంటే ఆవిడే రావాలి కానీ. అదే చెప్పా నూకాలుకు.
ఐదునిమిషాల్లో యమున మేడమ్ మెట్లెక్కి మా ఇంటి తలుపు కొట్టింది. తలుపు తీసిన నాకు కొంచెం సేపు మాట రాలేదు. భువనైకమోహినిలా ఉంది ఆమె. అత్యంత ఆధునికంగా ఉంది ఆమె కట్టూబొట్టూ! నార్త్ ఇండియన్ లా ఉంది. పెట్టుకున్న కొద్దిపాటి నగలూ మేలుజాతి వజ్రాలు. వాటితో పోటీపడే ఒకనవ్వు నవ్వి , హిందీలో “లోపలికి రావచ్చా ?”…..అని అడిగింది.
ముందు గమనించలేదు. వెనుకనుండి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. పదీ, తొమ్మిదీ, ఏడు ఉంటాయేమో! ఆడపిల్లలిద్దరూ పొట్టి గౌన్లూ, పప్పీకటింగ్‌లో ముద్దుగా ఉన్నారు. వెనుక సిసింద్రీలా చురుగ్గా, అక్కల చేతిని వదిలించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తూ తమ్ముడు… ఈ సంపత్!!
యమున మేడమ్ పెద్దగా సమయం వ్యర్ధం చెయ్యలేదు. నేరుగా విషయంలోకి వచ్చేసింది. హిందీలోనూ, బ్రోకెన్ ఇంగ్లీషులో మాట్లాడుతూ!!
నేను మా ఏరియాలోనే బాగా చదువుకున్న దానినని మా నూకాలు చెప్పిందట. మా పిల్లలు ఇద్దరూ రేంకర్లు కనుక నేను చదువు బాగా చెప్పగలనని నమ్మి తన ముగ్గురు పిల్లలూ నగరంలో పోష్ స్కూలులో చదువుతున్నందున, నేనొక్కతినే వాళ్లకు ట్యూషన్ చెప్పగలనని, అందుకే వాళ్లని అప్పగిద్దామని వచ్చానంది.
ఆమె దౌర్జన్యానికి నేను విస్తుపోయాను. నా అంగీకారం తెలుసుకోకుండానే, పుస్తకాల బేగ్‌లతో పిల్లల్ని తెచ్చేసిన ఆమె చొరవకి అభినందించకుండా ఉండలేకపోయా! అప్పటికే పిల్లలు ముగ్గురూ ఇల్లంతా సర్దేస్తున్నారు. సంపత్ గాడు ఫ్రిడ్జ్ లోంచి మంచినీళ్ల సీసా తీసి పారపోస్తున్నాడు. చూస్తుంటే ఏడీహెచ్‌డీ( Attention deficit hyperactivity disorder) చైల్డ్ లా ఉన్నాడు.
నేను, “నావల్ల కాదు!”….. అనబోయేలోగా ఆమె ఒక సంఖ్య చెప్పింది. అది నేను ఏ బడికి ఉద్యోగాని కెళ్లినా సాధించలేని జీతం సంఖ్య అది. అంతే! కొంత విముఖత్వం నటిస్తూనే ఒప్పేసుకున్నాను!!
ఇంక చూడాలి నా పాట్లు! ఈ ముగ్గురు పిల్లల బుర్రల్లో మట్టిని తీసి, కంపోస్ట్ వేసి, మెల్లగా ఫలవంతం చేసేసరికి నాకు ఆరునెలలు పట్టింది. పెద్దది వేద చాలా తెలివైంది. రెండోది తేజా మడ్డు. కానీ పిల్లాడు సంపత్, వాడిని బాబుల్ అనేవారు… వాడు అతిచురుకు. ఇలా చెప్తే అలా వచ్చేసేవి. ఎటొచ్చీ అల్లరే తట్టుకోవాలి.
సాయంత్రం మూడున్నరకి డ్రైవరు వదిలి వెళ్తే, తొమ్మిదయినా ఎవరూ వచ్చేవారు కాదు. ఫోనులు చేస్తే ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. ఇంచుమించు మా ఇంట్లోనే ఏదో పెట్టేదాన్ని తినడానికి. మా పిల్లలూ డిస్టర్బ్ అయిపోతున్నారు వీళ్ల వల్ల.
ఆరోజు ఆదివారం! అందరం సింహాచలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం! ఎనిమిదింటికి కాలింగ్ బెల్! చూద్దును కదా! నిద్రమొహాలతో, చింపిరిజుట్లతో, నైట్ డ్రస్ లేసుకుని పుస్తకాల సంచీతో ముగ్గరూ! నా కోపం తారాస్థాయికి వెళ్లిపోయింది.
కానీ దున్నపోతు మీద రాళ్లవాన కురిసినట్టు ఏ రియాక్షనూ లేకుండా ముగ్గురూ వచ్చి సోఫాలో కూర్చుని పుస్తకాలు తీసారు. వేద చెప్పింది వాళ్ల ఇంట్లో పార్టీట ఉదయం తొమ్మిది నుంచీ. అందుకే వాళ్లమ్మ ఇలా తోలేసిందట.
ఆ పిల్లలకేసి సాలోచనగా చూస్తూ మూర్తి అన్నారు. “వీళ్ల నాన్న గౌడౌన్స్ అన్నీ రెయిడ్ చేసారు. పోర్ట్ నుండి ఎన్నో టన్నులు ఐరన్ వీళ్ల గౌడన్‌కి తరలించేసారుట. అతన్ని అరెస్ట్ కూడా చేసి, ఆంటిసిపేటరీ బెయిల్ మీద వదిలేసారు. అందుకేనేమో ఈ పార్టీలు! సరేలే చిన్నపిల్లలు. వాళ్లనేమీ అనకు. మనం మరోసారి వెళ్దాములే…” అంటూ సర్దుకున్నారు.
ఆడపిల్లలిద్దరికీ కాస్త తల దువ్వి, ముగ్గురికీ బ్రేక్‌ఫాస్ట్ పెట్టా! పిల్లలకు పాలు కూడా ఇవ్వకుండా వదిలేసిన ఆ తల్లినేమనాలో నాకర్థం కాలేదు. ఆరోజు రాత్రి పదింటివరకూ మా ఇంట్లోనే. మాటల్లో వేద అంది. వాళ్ల నాన్న కలకత్తా వెళ్లాడని. మరి ఈ పార్టీ? నాకు అడగడానికి ధైర్యం చాలలేదు!
పొద్దున్న పని ఎగ్గొట్టీ సాయంత్రం వచ్చిన నూకాలు మిగిలిన కథ పూర్తిచేసింది. యమునే వ్యవహారం అంతా చూసుకుంటుందనీ. ఆరోజు ఎవరో పోలీస్ టాప్ బాస్ వచ్చాడని. మాంసాహారాలు, తాగుడూట పొద్దున్నుంచి. యమున పై ఫ్లోరులోనే అతనితో ఉందట! “అయినా నాకెందుకమ్మా పెద్దోళ్ల భాగోతాలు…….” అంటుంటే……
“దేవుడా! వీళ్లేం పెద్దాళ్లు? ఇంట్లో చిన్న ఆడపిల్లలు. వీళ్ల మీద తల్లి ప్రవర్తన తాలూకు ప్రభావం ఎలా ఉండబోతోంది”!….. నా మనసంతా కలచివేసింది.
పిల్లల్ని మానిపించేద్దామా అనిపించింది, కానీ జాలే వేసింది వాళ్లను చూసి! కోట్లకొద్దీ డబ్బుంటే చాలదే! పిల్లలకు ఆదరణ, మంచిగా పెరిగే వాతావరణం కదా ఉండాలి!
ఇలాంటి ఆదివారాలు చాలా మామూలయిపోయాయి! నా ట్యూషన్ ఫీస్‌కు బేబీసిట్టింగ్ చార్జెస్ కూడా వేసి పంపే యమున దాతృత్వానికి సంతోషించాలో, లేక స్వార్ధంగా పిల్లల బాధ్యత నా మెడకు చుట్టేస్తున్న ఆమె నిర్భీతికి ఉడుక్కోవాలో తెలిసేది కాదు.
యమున రికమెండేషన్‌తో నాకు ఇప్పుడు ముప్ఫైమంది ట్యూషన్ పిల్లలు. అందరూ నగరంలో క్రీమీలేయర్‌కు చెందిన పిల్లలు! కారుల్లో ఒచ్చి, రెండు గంటలు కూర్చుని చదువుకుని వెళ్లిపోయేవారు! ఏసీలతో, సోఫాలతో నేనిచ్చే ఆంబియన్స్, నా తెలివితేటలూ వాళ్లకు నచ్చినట్టున్నాయి.
పెద్ద కష్టమేమీ లేకుండానే ఐదేళ్లు గడిచిపోయాయి! యమున పిల్లలు కూడా మంచిదారిలో పడ్డారు. ఆమె నావలన తనెంతో నిశ్చింతగా ఉంటున్నానని చెప్పేది. టెన్త్ బోర్డ్స్ అయిపోయిన తేజాని బిజినెస్ స్కూల్ యేదో ఉందని ముంబయి పంపేసారు. చిన్నదాన్ని తల్లి దగ్గరకు జైపూర్ పంపేసింది. ఇంక ఈ బాబుల్ గాడు, ఇక్కడే పేరెంట్స్‌తో!
ఈలోపు మా అమ్మాయి, అబ్బాయి ఎమ్.ఎస్. చేయడానికి యుఎస్ వెళ్లే హడావిడిలో నేను తలమునకలై ఉన్నాను. ఆరోజు మళ్లీ రెండోసారి యమునా మేడమ్ మా ఇంటికొచ్చింది. చేతిలో పాంటలూన్స్ బేగ్స్! ఇద్దరి పిల్లలనూ పిలిచి ఇచ్చింది. వెస్టర్న్ వేర్! అక్కడ అవసరం పడతాయని. చెప్పద్దూ! ఆమె వితరణశీలతకు చాలా సంతోషమేసింది. ఇద్దరికీ రెండు కవర్లు చేతిలో పెట్టింది. ఒక్కోదాంట్లో వెయ్యేసి డాలర్లు. చాలా డబ్బు అది! నేను తీసుకోనన్నాను!
కానీ, నేనూ, నా పిల్లల వలనే తన పిల్లలు బాగుపడ్డారని, తనెంత చేసినా తక్కువేనని ఏవో చెప్పింది.
డబ్బులిచ్చిందని కాదు కానీ, మొట్టమొదటసారిగా, ఆమెలో ఏదో విషాదకోణం ఉన్నట్టు అనిపించింది. ఇన్నాళ్లకీ అదే చెదరని లావణ్యం ఆమెలో!
కానీ రోజులు సరిగ్గా వెళితే ఇంకేం! సాఫీగా సాగుతున్న నా ప్రొఫెషన్లో శనిలా ప్రవేశించాడు “నవీన్ రావ్!” వాడూ, సంపత్ క్లాస్‌మేట్లు, బెస్ట్ ఫ్రెండ్స్!!
నవీన్ బతుకు సంపత్ కన్నా ఘోరం!! రెండు విమెన్స్ కాలేజీలు నడిపే వాళ్లమ్మ రోజుకి ఇరవైగంటలుండేది క్లబ్ లోనే! చాలా హైస్టేక్‌కు పేకాట ఆడే పేజ్ త్రీ లేడీ ఆమె!! తండ్రి కూడా కేరాఫ్ క్లబ్…. గోల్ఫ్ క్లబ్ లేక పబ్! నవీన్ ఒక్కడే కొడుకు!
వీడు నెలకి పదిరోజులే స్కూలుకి పోతాడు! ఎప్పుడూ ఏదో రోగమని ఇంట్లోనే ఉండేవాట్ట. ఒకరోజు టీవీ హైవాల్యూంలో పెట్టి నిద్రపోతుంటే, ఇంట్లో షార్ట్సర్క్యూట్ అయ్యి మొత్తం వాళ్ల పెంట్ హౌసంతా బుగ్గయిపోయింది. కుక్క మంచమెక్కి వీడిని పీకడం వల్ల వీడు ఫ్రెంచ్ విండో నుండి బాల్కనీలోకి దూకి , బతికిబయటపడ్డాడు. యమున రికమెండేషన్‌తో నావద్దకు తరలించబడ్డాడు.
వీడు స్కూల్ కెళ్లకపోతే వీడి అమ్మ తొమ్మిదింటికి నా దగ్గర డ్రాప్ చేసేసి క్లబ్బుకు వెళ్లిపోయేది. వీడికి వర్క్ ఇచ్చి నేను వంటగదిలో పనిచేసుకుంటుంటే, వీడు మా ఫోనులోంచి ఎక్కడెక్కడికో ఎస్‌టీడీలూ, ఐఎస్‍౬డీలూ చేసేసేవాడు. నాకు నెల తిరిగేలోగా వచ్చిన ఫోను బిల్లుకి బుర్రగిర్రున తిరిగి ఫోన్ లాక్ చేసి పడేసా. వీళ్లమ్మ పరమ పిసినారి. తన కాలేజీ లెక్చరర్ల కన్నా నాకు ఎక్కువ పే చేస్తున్నా అనేది.
ఈ నవీన్ తన ఇంట్లో వంటరిగా కూర్చుని టీవీలో నానా చెత్తా చూసేవాడు. ఇంట్లో విచ్చలవిడిగా పడుండే డెబొనీర్, ప్లేబోయ్ పత్రికలు ట్యూషన్‌కు తెచ్చి, రహస్యంగా పుస్తకాల్లో పెట్టి స్టూడెంట్స్‌కు పాస్ చేసేవాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురు సులగ్న చెప్పేవరకూ నాకు ఈ విషయం తెలీలేదు.
వాళ్లమ్మకు కాల్ చేసా! షరామామూలు! స్విచ్ ఆఫ్! నవీన్‍కు గట్టిగా వార్న్ చేసా! కాళ్లు పట్టుకున్నాడు ఇంట్లో చెప్పద్దని. తండ్రి బెల్ట్ తీస్తాడని. నిజమే వాడి వీపు మీద పచ్చిగా కమిలిపోయిన దెబ్బలు! ఆ అర్భకంగా ఉన్న పిల్లాడిని చూసి జాలేవేసింది!
అప్పుడప్పుడే ఇంటర్‌నెట్ వాడకం ఎక్కువవుతోంది. నవీన్ ట్యూషన్‌కు సెల్ ఫోన్ తెచ్చేవాడు! వీడి ప్రభావంలో ముందు పడింది సంపత్ గాడు.
ఇద్దరూ స్కూలు ఎగ్గొట్టి, ట్యూషన్ కని బయలుదేరి, పార్కులో కూర్చుని, ఫోన్లో నానా చెత్త పోర్న్ చూసి, సాయంత్రం ట్యూషన్ కొచ్చేవారు.
త్వరలోనే సిగరెట్లు కాలుస్తున్నారని అర్థమయింది. దగ్గరకొస్తే వాసన. అది కవర్ చెయ్యడానికి బబుల్ గమ్‌లు నముల్తూ!
ఒకసారి నవీన్ బేగ్ లోంచి మూడు బీర్ కేన్లు బయటపడ్డాయి.
ఆ రోజు వాళ్లమ్మకి ఫోన్ చేస్తే, విసుగ్గా తీసి, ” పేకాట్లో పొద్దున్నుంచీ హేండ్ డౌన్‌లో ఉండి మూడ్ ఆఫ్‌లో ఉంటే నీ గోలేంటి?”…అని అరిచింది.
ఇవన్నీ వాళ్ల ఇళ్లలో కామనే అని, పట్టించుకుని రాద్ధాంతం చెయ్యద్దని చెప్పి పెట్టేసింది.
యమునకి చెప్తే నవ్వేసి, తమ బిజినెస్ కుటుంబాల్లో ఇలా పెరిగితేనే వాళ్లు బిజినెస్‌లో రాణిస్తారని అంది.
నా లాజిక్ కందని జవాబులవి!!
ఇంతటితో అయిపోతే సంతోషమే! ఒకరోజు సులగ్న చెప్పిన విషయం విని మాన్పడిపోయా!
ఇద్దరి ఫోన్‌లూ లాక్కుని చూస్తే, స్కూల్‌లో, ట్యూషన్లో ఆడపిల్లల, టీచర్ల కాళ్లూ, వీపులూ, ముందుభాగాలూ ఫోటోలు తీసినవి కోకొల్లలు!
నేనింక కోపం పట్టలేకపోయా! బోర్డ్ మీద చూపించే పాయింటర్ పెట్టి, ఇద్దరినీ పిచ్చెక్కినట్టు కొట్టా!
అందరూ వెళ్లిపోయాక ఇద్దరికీ వాళ్లు చేసింది ఎంత తప్పో చెప్తూ గంటలసేపు కౌన్సిల్ చేసా.
సంపత్ కళ్లలో తప్పుచేసిన భావం కనిపించింది.
కానీ నవీన్ అంతా విని, “ఇంత చేసాకా మీరు మామూలుగా తిరగ గలననుకుంటున్నారా టీచర్? మై మదర్ విల్ సీ యువర్ ఎండ్ ఫర్ హిట్టింగ్ మీ సో హార్డ్! రైట్ నౌ ఐ యామ్ గోయింగ్ టు కాలప్ మై మదర్!” అన్నాడు.
నేనింకా యథార్థానికి రాలేకపోయా! ఈలోపే వాడు వాళ్లమ్మకు కాల్ చెయ్యడం, వాడి తల్లి సువర్చలారాణి ఇద్దరు ఆడపోలీస్ లనేసుకుని రావడం జరిగింది.
చాలా వాదోపవాదాలయ్యాయి. నేను చేసిన పొరపాటు వాడిని కౌన్సిల్ చేస్తూ వీడియోలన్నీ డిలీట్ చేయించడం!
సందు చూసి సంపత్ పారిపోయాడు! మూర్తి వచ్చారు ఈలోపు!
రక్షించి మూర్తికి “లా”లో క్లాసుమేట్ ఇప్పుడు కమీషనర్ ఆఫ్ పోలీస్. కాలేజ్ అల్యూమ్నీలో ఈమధ్యే కలిసి, నంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకోడం వలన, మూర్తి నేరుగా ఆయనకే ఫోన్ చేసారు రాత్రి పదకొండింటికి.
ఆయన లేడీ ఎస్ఐ తో మాట్లాడి మర్నాడు పొద్దున్న తన చాంబర్లో అందరూ కలిసి మాట్లాడదామని చెప్పడంతో, అప్పటికి గాలివాన ఆగింది.
సువర్చల అంతటితో ఊరుకోలేదు. మొత్తం మీడియాని సీనులోకి తెస్తానని ప్రతిజ్ఞలు చేస్తూ వెళ్లిపోయింది.
వెళ్లిపోతూ నవీన్ గాడు వెనక్కి తిరిగి, నాలుక మడిచి, వేలు చూపిస్తూ జాగ్రత్త అని సంజ్ఞచేస్తూ వెళ్తుంటే, ఇలాంటి దృశ్యం చూసి నేనెందుకు బతికున్నానా అనిపించింది.
యమున అందుబాటులో లేకుండా తప్పుకుంది. సంపత్ జాడలేడు.
ఈలోపున నేను నా భర్తనుండి సూటీపోటీ మాటలు ఎదుర్కోడం ఇంకో వ్యథ.
ప్రపంచంలో ఇంతమంది ట్యూటర్లున్నారు కానీ, ఎవ్వరూ నాలా మహాన్ అయిపోవాలని పరాయివాళ్ల పిల్లల్ని రాత్రనకా పగలనకా ఇళ్లల్లో ఉంచుకుని సేవలు చెయ్యరనీ, అదనీ, ఇదనీ…. నానా మాటలూ పడ్డా!
మనసు విరిగిపోయింది.
పట్టుమని పద్నాలుగేళ్లు లేవు రాస్కెల్స్‌కి. ఎంత చేటుతెచ్చారు నా బతుక్కి అని రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా!
మర్నాడు ఏదేదో వూహించుకుని సీపీ ఆఫీస్ కెళ్లా! టీవీ నైన్‌లూ, ఆటీవీ, ఈటీవీలుంటాయని. పిట్టలేరు. మూర్తి అన్నారు……..
“నీకే ఫీజ్ సరిగ్గా పే చెయ్యదామె. డబ్బులు పెట్టి మీడియాని పిలుస్తుందా? నీ పిచ్చికానీ! వస్తే రానీ! అప్పుడు చూద్దాం!”
సీపీ ఆఫీస్ లో సీపీ గారు వస్తూనే, పీయే గారు లేప్ టాప్ ఓపెన్ చేసి ఉంచారు.
సువర్చలా, ఆమె భర్తా ఏదో చెప్పడానికి నోరిప్పారు. వాళ్లని కట్ చేస్తూ సీపీ లాప్ టాప్ వాళ్ల ముందుకు తోసారు.
“మీ అబ్బాయి సంగతి తరువాత, ముందు మీమీదున్న పెండింగ్ కేసులు చూద్దాం ఒకసారి. లాస్ట్ ఇయర్ ఇద్దరమ్మాయిలు మీ కాలేజ్ హాస్టల్‌లో అనుమానాస్పదంగా మరణించారు. సెక్సువల్ అబ్యూస్ అయ్యారని ఆరోపణలున్నాయి. ఆ విషయంలో మీరు అరెస్ట్ కూడా అయ్యున్నారు…” అంటూ వీరేంద్రరావ్ కేసి చూసారు సీపీ.
అంతే మొగుడూపెళ్లాలు జావకారిపోయారు. కాళ్లబేరానికి వచ్చేసారు.
“సారీ సిస్టర్! నా కొడుకూ, వాడమ్మా మిమ్మల్ని చాలా ట్రబుల్ చేసారు. క్షమించండి. కేసు వాపస్ తీసేసుకుంటున్నాం” అని దండాలు పెట్టేసాడు వీరేంద్రరావ్!
మూర్తికీ, నాకూ అంత టెన్షన్ లోనూ నవ్వాగలేదు.
సీపీ గారు నాకేసి తిరిగి, ” మీరు వెళ్లండమ్మా! వీళ్లతో మాట్లాడేది ఉంది”…… అని ఆ మీటింగ్ ముగించారు.
బ్రతుకుజీవుడా అనుకుని, ఆ మరునాడు నుండి ట్యుటోరియల్ మూసేద్దామని నిశ్చయించుకున్నా!
సంపత్, నవీన్ తరువాత నవీన్ ఇంట్లో హోంట్యూషన్ తీసుకుంటున్నారని తెలిసి, మనసులోనే వాళ్ల భావిని వూహించా!
ఇంతయినా నా స్టూడెంట్సెవరూ నన్ను వదలలేదు. మరో ఐదేళ్లు విజయవంతంగా వందల విద్యార్ధులను బోర్డ్స్‌కు పంపి మంచి ట్రాక్ రికార్డ్ సాధించా!
ఎందరో మంచి విద్యార్ధులూ దొరికారు నాకు! చక్కగా తల్లితండ్రులు ప్రేమానురాగాలు పంచుతూనే క్రమశిక్షణతో పెంచుకున్న సంపూర్ణ ఆరోగ్యవంతులైన పిల్లలు.
తమ ఆశయమేదో, తమ భావిప్రణాళికలేవో పూర్తి అవగాహన కలిగి, వికాసపథాన సాగిపోయిన విద్యార్ధులు!! చదువులో, సాహిత్యంలో, కళలలో , ఆటలలోతమదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోయిన విద్యార్ధులు!!
కానీ విపరీతమైన శ్రమవల్ల ఆరోగ్యం దెబ్బతినడం, రానూరానూ నవనాగరికంగా తయారయిన కొత్తతరం విపరీత పోకడలూ, ప్రేమవ్యవహారాలూ, టీన్స్ మొదలవగానే మొదలవుతున్న వారి వ్యసనాలూ, వేషధారణలూ….. భరించడం నావల్ల కాదనిపించింది.
అదే సమయంలో కొంతమందికి మంచి కౌన్సిలింగ్‌తో ప్రమాదాల నుండీ బయటపడేసా కూడా!
ఇంక నేను వర్చ్యువల్ గా రిటయిర్‌మెంట్ తీసుకుని, అడపాదడపా చైల్డ్ కౌన్సలింగ్ చేస్తున్నానిప్పుడు.
అప్పట్లో ఆ గొడవయిన ఏడాదికే మేము ఆ ఇల్లు అమ్మేసి, వేరే ప్రశాంతమయిన చోట ఇల్లు కొనుక్కుని వెళ్లిపోయాం.
అప్పుడప్పుడూ లోకల్ బిజినెస్ మాగజైన్‌లో వేద పెద్ద ఈవెంట్ మేనేజర్ అవతారంలో, దద్దిలా ఉండే తన చెల్లి తేజ పేద్ద ఫాషన్ డిజైనర్ గా పేజ్ త్రీ పార్టీల్లో కనపడతుంటారు! వేద తెలివితేటలుకి ఆ అమ్మాయి యే కార్పొరేట్ కంపెనీకో డైరెక్టర్ లెవల్‌లో ఎదుగుతుంది అనుకునేది తను. కానీ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో గ్లామర్‌తో తనదయిన ముద్ర వేసి దూసుకుపోతోంది. అలాగే ఆమె చెల్లి. నేనూ, నా సమీకరణాలు తప్పేమో ఈ పిల్లల గురించి అనిపించింది.
ఆ!! సంపత్ ఏడాదిన్నర క్రితం మల్టీప్లెక్స్‌లో కనిపించాడు.
ఎస్కలేటర్ మీంచి దూకుతూ దిగుతున్న దుడుకుపిల్లాడెవరా అనుకున్నా.
సీదా నా దగ్గరకొచ్చి ఆగి, “బావున్నారా మిస్? గుర్తుపట్టారా? నేను సంపత్‌ని. మీ స్టూడెంట్‍ని” ఇంగ్లీషులో అని పరిచయం చేసుకున్నాడు.
అతని వంటినుండి ఆల్కహాల్, పాన్ పరాగ్ లతో పాటూ మరేదో మాదకద్రవ్యం కాల్చిన వాసన నా ఆల్సేషన్ ముక్కుకి ఘాటుగా సోకింది. వాడి కళ్లు స్థిరంగా లేవు.
“మిస్! ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ గివ్ మీ ఫైవ్ థౌసండ్ రుపీస్? రేపు మీకు డిపోజిట్ చేసేస్తా. ఇది నా సెల్ నంబర్” అని నా ఫోన్ నంబరడిగి మిస్డ్ కాల్ ఇచ్చాడు!
నేను డైలమాలో పడ్డా, కానీ ఇచ్చా! ఏమో! ఎందుకిచ్చానో! వాళ్లమ్మ నాకు చాలా ఇచ్చి ఉంది. నా యాంత్రిక జీవితంలో తనే నాకు బ్రేక్ ఇచ్చింది!! అందుకేనేమో నాకు సాఫ్ట్ కార్నర్! లేక కృతజ్ఞత కూడా కావచ్చు!!
అంతే డబ్బు తీసుకుని మళ్లీ ఒక్క ఉరుకున పారిపోతున్న వాడు మళ్లీ ఒక్క ఉదుటున వచ్చి, ” స్నేహక్క బాగుందా మిస్. అక్కని అడిగానని చెప్పండి”….. అంటూనే పారిపోయాడు.
అవును వాడు మా అమ్మాయి స్నేహమాటే వినేవాడు అప్పట్లో!
నేను ఆ డబ్బు మీద ఆశ వదిలేసుకున్నా! కానీ మరి నా అడ్రస్ ఎక్కడ పట్టాడో తెలీదు నా పోస్ట్ బాక్స్‌లో ఐదువేల చెక్కు విత్ థేంక్స్ మెసేజ్‌తో వచ్చివుంది.
మళ్లీ సంపత్ కుమార్ అలియాస్ బాబుల్‌ని నేను మళ్లీ చూడలేదు. ఇదిగో ఇప్పుడిలా టీవీలో, విత్ హిస్ పార్టనర్ ఇన్ క్రైంతోపాటూ!
కొన్నాళ్లు ఛానల్స్ అన్నీ విసుగూ, విరామం లేకుండా ఈ రేప్, హత్యల కేస్ గురించి ప్రసారం చేసాయి. అనుకున్నట్టే కథ విచిత్ర మలుపులు తిరిగింది.
తాము ఆరుగురూ పార్టీ చేసుకున్నది నిజమేనని, మగపిల్లలు మత్తులో లేవలేక పడిపోయిన స్థితిలో గెస్ట్ హౌస్ లో పడుండగా, ఆడపిల్లలిద్దరూ ఇళ్లకెళ్దామని బయటకొచ్చారని, ఆ టైంలో కుక్కల్ని ఎవరు విప్పేరో తెలీదని , కానీ తమ తోట కాపలా కాసే ఆ జాగిలాలు వాళ్లను ఎటాక్ చేసుండచ్చని, రేప్ అన్నది తమ వలన జరగలేదని, మరెవరైనా చేసే అవకాశం ఉండచ్చనీ కట్టుకథలు చెప్తున్నారు!
సువర్చలా రాణి, తాగి ఉబ్బిపోయిన బుగ్గలూ, అవిరామ పేకాట క్రీడాస్పూర్తి వలన నిద్రలేక ఎర్రబారిన కళ్లూ వేసుకుని, రాక్షసిలా తన కొడుకు నవీన్ రావ్ అమాయకత్వం వాదిస్తోంది.
ఇంతలో తెరమీదకు ఇద్దరమ్మాయిలు పట్టుకుని తెస్తుంటే, ఒక స్త్రీమూర్తి తలకు నల్ల స్కార్ఫ్ కట్టుకుని వచ్చింది.
వాళ్లిద్దరూ సంపత్ అక్కలు వేద, తేజా! తను యమునా?? అదేంటి అలా ఉంది. తెల్లగా పాలిపోయిన అస్థిపంజరానికి లిప్ స్టిక్, నల్లకళ్లద్దాలు పెట్టినట్టు? ఒకప్పుడు ఎంతటి అందగత్తె! ఇప్పుడేంటి ఇలా?
తను బ్లడ్ కేన్సర్‌తో చివరిదశలో ఉన్నానని, తన అనారోగ్యంకు అప్ సెట్ అయ్యి కొడుకు తాగుతున్నాడనీ, అమాయకుడని, వాడిని ఫ్రేం చేస్తున్నారని మాటలు కూడదీసుకుంటూ చెప్పింది.
“యమునా! ఈ స్థితిలో కూడా నీ కుటుంబం నేరాల బారినుండి బయటపడడానికి నిన్ను వాడుకుంటున్నారా!”……. అనుకోకుండా ఉండలేకపోయా! నా మనసు ఆమె స్థితిని తలుచుకుని బాధగా మూల్గింది!
దినేష్ కుమార్ రంకెలేస్తున్నాడు. తమ పిల్లల ఇన్నోసెన్స్ కోర్టులో నిరూపించే సాక్ష్యాలన్నీ తమ వద్ద ఉన్నాయని, అక్కడే తేల్చుకుంటానని.
అతని బాంక్ నిలవల మీద అంత ఆత్మవిశ్వాసం మరి.
ఆ అత్యాచార బాధితుల తల్లితండ్రులు కూడా మాట్లాడారు. వాళ్ల పిల్లలను చాలా సాంప్రదాయంగా పెంచామని, వాళ్లకు పబ్‌లూ, తాగడం అనేవి అంటేనే తెలీదని, కిడ్నాప్ చేసి ఇంత ఘోరం చేసారని, ఆ నలుగురు కుర్రాళ్లనూ పబ్లిక్ గా ఉరి తియ్యాలనీ డిమాండ్ చేస్తున్నారు.
మరి ఏడ్చి ఏడ్చి కన్నీరు అయిపోయిందో యేమో, ఒక్కరి కళ్లలో తడిలేదు. ఆ అమ్మాయిల తల్లులిద్దరూ అంత దుఃఖంలోనూ పెదవులకు రంగు మర్చిపోలేదు. నాకెక్కడా వారి మాటల్లో నిబద్ధత కనిపించలేదు! తమ కూతుళ్ల విషయంలో మరికొంత జాగ్రత్తగా ఉండవలసిందే అన్న పశ్చాత్తాపం లేదు! “అవును తాగారు!! అయితే ఏంటి? అది ఇప్పటి ట్రెండ్!!” అంటున్న ఆ తల్లులను చూసి నాకు సారియా, తానియా అనే నా స్టూడెంట్స్ ఇద్దరు గుర్తొచ్చారు!!
ఆ ఇద్దరమ్మాయిలూ వీరిలాగే చాలా ధనిక కుటుంబాల అమ్మాయిలు! తెలుగొచ్చినా రానట్టు ఇంగ్లీష్‌లో విరివిగా ఎఫ్ పదాలను వాడుతూ మాట్లాడేవారు. చదువులో చురుగ్గా ఉండేవారు. కానీ వేషధారణ, ప్రవర్తన చాలా ఛండాలంగా ఉండేది! అందులో ఒకమ్మాయి తల్లి డైవోర్సీ, కార్పొరేటర్‌గా పనిచేసేది. తానియా ఒక్కతీ ఒక ఫ్లాట్‌లో ఒక కేర్ టేకర్‌తో ఉండేది.
ప్రతీ వారాంతంలో చాలామంది అబ్బాయిలూ, అమ్మాయిలూ చేరేవారు అక్కడ. అంత చిన్న వయసులో అంత పార్టీ కల్చర్ అలవాటవడం నేను జీర్ణించుకోలేక పోయేదాన్ని! మా మేడ ఎక్కుతూ, ఎన్నోసార్లు సిగరెట్ ఆఖరి పఫ్ ఊదేసి, కిందపడేసి వచ్చేది. వస్తూనే ఒకలాంటి పులిసిన ఆల్కహాల్ వాసన, సిగరెట్ వాసన గుప్పున వచ్చేది! హెచ్చరించినా వినేదికాదు. ట్యూషన్ మానేయమన్నా మానకుండా నన్ను దబాయించేది. ఒకసారి నన్ను ఎందుకో గట్టిగా పట్టుకుని ఏడ్చింది! తన తండ్రిని చూడాలని ఉందని. తల్లి తనకు ఏ సమస్యలోనూ తోడుగా ఉండదనీ, ఆమెను చూడడమే గగనం అనీ!! ఆరోజు నా మనసంతా ఆ టీనేజర్ వేదనకి కరిగి నీరయ్యింది. మంచీ చెడ్డా చెప్పా! మళ్లీ షరా మామూలే!!
సారియా ఇంకోరకం! “నింఫోమేనియా “అనే పదం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆడవారికి అంత పెద్ద నింద ఆపాదించడం! కానీ సారియా నా నమ్మకాన్ని వమ్ము చేసింది. తల్లితండ్రులిద్దరూ నగరంలో అతిపెద్ద జిమ్ కమ్ బ్యూటీ పార్లర్ల ఓనర్లు! ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపనీ కూడా రన్ చేస్తారు!
మరి సారియా బాల్యం నుండీ ఎలాంటి వాతావరణంలో పెరిగిందో కానీ, ఆ అమ్మాయి మగవారితో చాలా ప్రమాదకరమైన సంబంధాలు నడిపేది. వారు తన తోటి విద్యార్ధులా, స్కూల్‌లో టీచర్లా, క్రింద పనిచేసే వారా, లేక ఇతరులా…. ఇలాంటి యెలాంటి తేడా లేకుండా!
తన వెకిలిప్రవర్తన నన్ను చాలా ఇబ్బంది పెట్టేది! ట్యూషన్ కొచ్చే అబ్బాయిలకు లవ్ లెటర్స్ రాయడం, పుస్తకాలలో పిచ్చి ప్రేమసందేశాలు రాసి పంపడం, వాళ్ల నంబర్లు తీసుకుని గంటలు గంటలు కాల్ చెయ్యడం, పోర్న్ విడియోలు షేర్ చెయ్యడం, ఒక్కటి కాదు నానా దరిద్రాలు.
చేరిన నెలకే నరకం చూపించేసింది! ఒకసారి ట్యూషన్లో సెల్ ఫోన్ వదిలేసింది. ఆరోజు సభ్యత కాకపోయినా ఓపెన్ చేసి, ఆ ఫోన్లో దృశ్యాలు చూసి దిగ్భ్రమ చెందా! ఆ పిల్ల వయసుకూ, ఆమె ప్రవర్తనకూ లంకెదొరకలేదు! చూచాయిగా తల్లికి కాల్ చేసి చెప్పా. మరునాడే ట్యూషన్ వదిలేసింది. నా ఆరోగ్యం బాగుపడింది!
రాత్రీపగలు ఈ పిల్లల జీవనశైలి గురించిన ఆలోచనలు నన్ను చాలా కలతపెట్టేవి. అదుపూ, ఆజ్ఞాలేని పెంపకాలు, తల్లితండ్రుల నిఘాలేమి, క్రమశిక్షణలేమి, ప్రేమాప్యాయతల లేమి, జేబుల్లో కట్టలకట్టల డబ్బు, అత్యాధునికమైన స్మార్ట్ ఫోన్లూ, గేడ్జెట్లూ, ఇరవైనాలుగ్గంటలూ ఇంటర్‌నెట్లో దొరికే విచ్చలవిడి శృంగారదృశ్యాలు, క్లబ్బుల్లోనే తిళ్లూ, తిరుగుళ్లూ, ఊరికవతల కావలసినంత ప్రైవసీ యిచ్చే సొంత ఫార్మ్ హౌస్‌లూ, రిసార్టులూ, నిర్మానుష్య బీచ్‌లూ, తల్లితండ్రుల విచ్చలవిడి జీవనసరళి……..। ఒకటా !! వేల కారణాలు!!
పువ్వు సహజంగా విచ్చుకుంటేనే దాని సౌందర్యం, సువాసనా! కానీ ఈ సుమబాలలు మొగ్గలగానే బలవంతంగా రేకులు విప్పార్చుకుని, వయసుకు మించిన తెలివీ, మెచ్యూరిటీలు తెచ్చుకుని, గతులూ,గమ్యాలు తప్పి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు!
నాకే కాదు! నా తరం ఎందరికో ఇదే బెంగ ! ఈ తరం ఇలా దారీతెన్నూ లేక సాగిపోతుంటే!!
***
ఈ సంఘటన తరువాత ఇంక చెప్పేదేమీ లేదు! రెండో అత్యాచారం బాధితురాలు కూడా అదృష్టవశాత్తు వారానికే రాబిస్ సోకి చనిపోయింది. అదృష్టవశాత్తు అని ఎందుకనిపించిందంటే, ఆమె బతికి బట్టకట్టినా, అచ్చం కుక్కలు చింపిన విస్తరి చందాన ఉండేది ఆమె పరిస్థితి.
ఆ నలుగురూ బయటకొచ్చేసి, అచ్చోసిన ఆంబోతుల్లా మళ్లీ వూరుమీద పడుంటారు ఈపాటికి. ఎందుకంటే న్యూస్ పేపర్లలో, ఛానల్స్ లో ఈవార్త తాలూకు బూడిద కూడా లేదు. అప్పుడే కాల్చి, కప్పెట్టేసారు! అన్ని కేస్ లలో లాగే!!
***
మళ్లీ ఈ రోజు హిందూ పేపర్‌లో లోకల్ ఎడిషన్ చదువుతూ చిన్న కాలం దగ్గర నా కళ్లు అతుక్కుపోయాయి!
“వూరుశివార్లలో పేరున్న రిసార్టులో, స్విమ్మింగ్ పూలులో ఇద్దరు నగరయువకుల మృతి.”
వివరాల్లోకి వెడితే, ముందురోజు జరిగిన రేవ్ పార్టీలో తప్పతాగిన స్థితిలో, మాదకద్రవ్యాలు పుచ్చుకుని, ఈతకోసం అర్ధరాత్రి ఈతకొలనులోకి దిగిన ఇద్దరు యువకులు, ఈదలేని స్థితిలో, నీటిలో మునిగిపోయి దుర్మరణం పాలయ్యారు.
వీరిద్దరూ ప్రముఖ ఐరన్ మర్చంట్ దినేష్ కుమార్ కొడుకు సంపత్ కుమార్, పలు విద్యాసంస్థల యజమాని వీరేంద్రరావ్ కుమారుడు నవీన్ రావ్!!!
వీరిద్దరూ గతంలో ఆనందపురం ఫార్మ్ హౌస్ లో జరిగిన ఇద్దరమ్మాయిల మృతి కేసులో నిందితులు. పోలీసులు వీరిద్దరి మృతి పై దర్యాప్తు చేస్తున్నారు!!!…………
హు!! నేరమూ! శిక్ష!!
మనసంతా కకావికలయిపోయింది.
సంపత్ నా దగ్గర పెరిగిన పిల్లాడు కూడా! వాడిది చిన్నప్పుడు మంచిమనసు! వాడిమీద నేనూ, స్నేహ ఎంతో వర్క్ చేసాము. అప్పట్లో మంచి చదువుదారిలోకి తెచ్చాం!
నవీన్ అనే గంజాయిమొక్క వాడినీ ఆ వనంలోకి లాగేసింది.
వాడు నాదగ్గరే చదువు పూర్తిచేసుంటే వేరేగా పెరిగేవాడా? ఏమో! అయినా వాడింటి నేపధ్యం ఏమంత ఆరోగ్యకరమని వాడు బాగుపడడానికి?…………
అర్ధాంతరంగా రాలిపోయిన ఆ అమ్మాయిలిద్దరూ ఇదే కుటుంబపరిస్థితుల్లో పెరిగినవాళ్లే!
రెండురోజులు ఆడపిల్ల ఇంటికి రాకపోయినా పట్టని, పట్టించుకోని కుటుంబాలే!
అయితే మాత్రం అంత కాని పరిస్థితుల్లో, దౌర్భాగ్యంగా తమింటి కూతుర్లు చనిపోవడం వారికి ఎంత నామోషి! ఎంత అగౌరవం! డబ్బుండీ ఏమీ చెయ్యలేని అసహాయతను వాళ్ల అహాలు ఒప్పుకోవే!!
సమయం చూసి దెబ్బకొట్టి ఉంటారు. రెండు పరువుహత్యలు స్విమ్మింగ్ పూల్‌లో.
నలుగురు నేరస్థుల్లో ఇంకో ఇద్దరు కుర్రాళ్లున్నారు కదా!
ఏ రోజో సముద్రంలో ఈతకో, సరదాకో దిగకపోతారా? రాకాసికెరటాలు లాగేయకపోతాయా!!! లేక రాకాసికెరటాలు సముద్రంలోకి లాగేసాయి అనేలా అంతం కాబోతున్నారా?
మరో వార్త ఎప్పుడో ఎదురుచూస్తోంది జనాల కోసం!!
నిజమే రాకాసి కెరటాలే! “దురాశ” అనే రాకాసి కెరటాలు!
ఇంకా కావాలి, ఇంకా సంపాదించేయాలనే రాకాసి కెరటాలు.
ఏ అకృత్యం చేసయినా, ఏ చీకటిదారి పట్టయినా వందల, వేల కోట్లు సంపాదించాలనే రాకాసి కెరటాలు పిల్లలు సంపద పెంచడానికే! నువ్వు పెంచి , సంస్కరించడానికి కాదనే రాకాసి కెరటాలు.
సంఘంలో ముందుండాలి
సమాజంలో పినకిల్ చేరాలి
బలముండాలి, బలగముండాలి, దేన్నయినా సాధించిచ్చే డబ్బుశక్తి నీకుండాలనే రాకాసికెరటాలు
అందాలు అనుభవించు, నీ అధర్మం మరపుకి రావాలంటే తాగు!
ఇంకా అలౌకికానందం కావాలంటే మత్తు పీల్చు, సూదిగుచ్చు! ఆశించినవన్నీ అందుకోమనే రాకాసికెరటాలు!!
నువ్వు బావున్నావు, నీ పిల్లలూ బావుంటారు.
నువ్వు అనుభవిస్తున్నావుగా, వాళ్లనీ అనుభవించనీ…… తప్పేముందనే……….
సతాయించే, శోధన చేసే సాతాను సంతకాలు ఈ రాకాసి కెరటాలు!
లాగేస్తాయి మనిషిని! మమతలను!! మానవత్వాన్ని!! మనుగడలను!! మానాలను!! చివరకు ప్రాణాలను!! అవును కృష్ణబిలంలా తనలోకి లాగేస్తాయి!!
అయినా ఏమీ మారదు! ఈ కుక్కమూతిపిందెలు పుడుతూనే ఉంటాయి!
అవినీతి చమురేసిన దీపాలవెలుగులో శలభాల్లా మాడిపోతూనే ఉంటాయి.
కొత్తవి చేరుతూనే ఉంటాయి!
సాగుతూనే ఉంటుంది ఆ వేట!! రాకాసికెరటాలోకి కొట్టుకుపోడానికి!! అఖాతంలోకి లాగబడడానికి!!