[dropcap]శి[/dropcap]శిరమైన నా జీవన పయనంలో…. అతని ఆగమనం
నా మనసుకు ఓ వసంతమై వచ్చి నన్ను
నాకు కొత్తగా చూపుతూ…
నా నిర్ణీత అవర్తిలో అణువణువు నిండిపోయాడు.!
నాలోని నిభిడీకృత నైరాశ్యపు తెరలను తొలగించి
నిత్య తొలకరి తుళ్ళింతలా నన్ను తాకుతూ..
కురిసే వెన్నెల్లా… చల్లగా.. విరిసే మల్లెల్లా మత్తుగా..
నులివెచ్చని గ్రీష్మంలా నన్ను చుట్టేసుకుంటాడు…
ఏనాటికి నా చేయి వీడనంటూ పట్టేసుకుంటాడు..!
నిన్న లేని వర్ణాలేవో నేడు నా చుట్టూ అపురూపంగా
కనిపిస్తున్నాయి… అందంగా..
ఎన్నటికీ వీడని అనుభూతులమయమై..నా మనసు వాటిలో లయమైపోయి…
మరెప్పటికీ మర్చిపోని తీయటి అనుభవాలను
ఆనందంగా హృదిలో నింపుకుంటుంటే..
నీకోసమే… నేను పుట్టానా… నాకోసమై.. నీవు
నిలిచావా అంటున్న నా మనసు మాటలకు
సిగ్గు దొంతరలేవో పెదవులపై నాట్యం చేస్తూ
కనులతో దోబూచులాడుతున్నాయి…
నా ఉత్థాన పతనాల భావాల సమాహారం అంతా అతని మయమే కదా…
ముందర ముందర మేరు పర్వతమే అనుకున్నా,
ఆ తరువాత తెలిసింది అరకు లోయల్లో కూడా అతనున్నాడని.
నిండైన వ్యక్తిత్వంతో …అణువణువు నిలిచిపోయే నా హృదయ లోయల్లోని ఆర్తి అంతా
అతని సొత్తే కాక ఇంకేంటీ….?!