మోక్షగుండం బాటలో నడచిన శేషాచారి

7
3

[box type=’note’ fontsize=’16’] తెలంగాణ జిల్లాలలో అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా నీటి పారుదల శాఖలో వివిధ హోదాలలో బాధ్యతలను నిర్వర్తించిన శ్రీ ఉత్తలూరి శేషాచారి గారి అర్ధ శతాబ్ది వర్ధంతి సందర్భంగా వారి కోడలు డా. శ్రీభాష్యం అనూరాధ అందిస్తున్న ప్రత్యేక వ్యాసమిది. [/box]

1958వ సంవత్సరం… నేటి ఉత్తరాఖండ్ లోని హరిద్వార్… ఆగ్నేయ ఆసియా దేశాలకు మకుటాయమానమైన ‘రూర్కీ’ విశ్వ విద్యాలయం (ప్రస్తుతం ఐఐటి విద్యాసంస్థ)లో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, సగర్వంగా పట్టా పొంది, ఆనందోత్సాహాలతో స్వంత గ్రామాలకు చేరుకున్నారు విద్యార్థులంతా. అందులో ఓ చురుకైన విద్యార్థి… మోక్షగుండం వారే రోల్ మోడల్, నిరంతర సాంకేతికాభివృద్ధి పైనే ధ్యాస, తాను స్వస్థలం చేరుకున్నారు. ఆ రాష్ట్ర, ఆ ప్రాంతాభివృద్ధి కోసం, కుటుంబం కోసం బృహత్తర కార్యక్రమం చేపట్టాలనుకున్నారు. తాను పనిచేసే నీటి పారుదల శాఖలో రాణించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో, అనూహ్యంగా తాను చదువుకున్న సంస్థ నుంచి అధ్యాపకుడిగా నియామకపు ఉత్తర్వులు అందాయి. విద్యార్థులంతా నీ ప్రతిభకు తార్కాణమన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోమని అన్నారు తోబుట్టువులు. కానీ, “నేను విద్యార్థిగా వెళ్లిన ఆ సంస్థ నాకు ఎంతో విజ్ఞానాన్ని అందించింది. ఆ స్ఫూర్తితోనే నేను ఓ నిర్ణయం తీసుకుంటున్నాను” అని పేర్కొన్న ఆ ఇంజినీరే… శ్రీ ఉత్తలూరి శేషాచారి గారు. సొంత ప్రాంతానికి, ఓ వ్యక్తిగా ఉన్నతంగా నిలిపిన విశ్వవిద్యాలయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే, సున్నితంగా వారు ఇచ్చిన అవకాశాన్ని స్వీకరించలేనని చెప్పిన మహోన్నత వ్యక్తి ఉత్తలూరి వారు.

వీరు 1923లో శ్రీనివాసాచార్యులు, సీనమ్మ దంపతులకు ప్రస్తుత యాదాద్రి నందలి భువనగిరిలో జన్మించారు. ఉత్తమ విలువలు, ఉన్నత సంస్కారం బాల్యం నుండే అలవరచినారు తండ్రి శ్రీనివాసాచార్యులు. ఉపాధ్యాయ వృత్తి రీత్యా వీరి కుటుంబం గౌలిపుర(ఛత్రినాక) హైదరాబాదు నందు స్థిరపడింది. అక్కడే శేషాచారి విద్యాభ్యాసం కొనసాగింది. ఛాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలో, సిటీ కళాశాలల్లో చదువు పూర్తి చేశారు.

తెలంగాణకే సరస్వతీ నిలయంగా పేరు గాంచి, ఎందరో మహానుభావుల విద్యా క్షేత్రమైన ఉస్మానియా విశ్వ విద్యాలయంలో మొదటి బ్యాచ్ సివిల్ ఇంజినీర్ పట్టా అందుకున్న ప్రథముడు (1944) శేషాచారి గారు. మాస్టర్ ఆఫ్ ఇంజినీర్ (ఎంఈ) ‘రూర్కీ’ విశ్వవిద్యాలయం ద్వారా పట్టా పొంది, పుట్టిన నేల రుణం తీర్చుకోవడానికి, ఆ నేలను సుభిక్షం చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలకు రూపకల్పన చేయడం ఆరంభించారు వీరు.

‘వెనుకబడిన నా ప్రాంత అభివృద్ధి కోసం నేనేమైనా చేయాల’ని నిరంతరం కలలు కనేవారు. ఈ ప్రాంతం అన్నపూర్ణగా ప్రజల ఆకలి తీర్చాలంటే రైతన్నలకు సుస్థిర వ్యవసాయానికి సాగునీరు అందించాలని, నీటి పారుదల శాఖలో ఉన్న తాను రైతులకు ఎలా సాయం చేయాలని తపించారు. వీరు ‘పనియే దైవం’గా భావిస్తారు. నల్గొండ, ఖమ్మం , వరంగల్, నిజామాబాద్ జిల్లాలలో అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా వివిధ హోదాలలో బాధ్యతలను నిర్వర్తించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ, పరిష్కార మార్గాలు సూచించారు. రైతుల ఆర్థిక, సాంఘిక పురోగతి కోసం తనదైన పంథాలో కృషి చేశారు. నీటి వనరులను అభివృద్ధి చేయడం, నీటి వనరులలోని నీటి నిల్వలు పెంచడం, వ్యవసాయం కోసం రైతుకు సాగునీటిని అందించడం వీరి ప్రధాన ఉద్దేశం.

‘ప్రజలకు తాగునీరు, రైతులుకు సాగునీరు’ అందించడంతో తన బాధ్యత తీరిపోదని భావించారు. అందుకై సాగునీటి సామర్థ్యాన్ని పెంచుటకు వ్యవసాయ శాఖ అనుబంధంతో వరంగల్ సర్కిల్ ఆఫీసు వెనుక ప్రదర్శన క్షేత్రాలు స్థాపించారు. సాంప్రదాయ రీతిలో వరి పండించే వారు రైతులు. అందుకు భిన్నంగా వాణిజ్య వ్యాపారాభివృద్ధి పెంచడం కొరకు కూరగాయలు, పండ్ల తోటలు పెంచే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ పంటలతో వ్యవసాయాభివృద్దే కాక వారి ఆరోగ్యానికి తోడ్పడతాయని తలచారు. దీనిద్వారా తక్కువ నీరుతో ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి ఉంటుందని ప్రయోగాత్మకంగా చూపిన ప్రాజ్ఞులు వీరు.

అంతేకాదు, సాగునీటి వ్యవసాయంలో నీరు ప్రవహించే మేర కలుపు మొక్కలు పెరిగేవి. ఈ కలుపు, పంటకు నానా రకాల ఇబ్బందులు కలిగించేవి. కలుపు నివారణకై చిన్నచిన్న కాలువలు తీసి, సిమెంట్ వేసి, నీరు వృధా కాకుండా పంటకు చేరేలా చేసిన ప్రథములు వీరే. రైతు పురోభివృద్ధి చెందితే, దేశాభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం కలిగిన వారు ఉత్తలూరి వారు. ఎండ సమయంలో నీరు ఆవిరి కావడం, రైతు అలసట చెందుతాడని మోటబావుల ద్వారా నీటిని పంట పొలాలకు ఉదయ సంధ్య వేళల్లోనే అందించాలని సమయాన్ని నిర్దేశించారు ఈ ఇంజినీరు.

కిన్నెరసాని ప్రాజెక్టు వద్ద అధికారులతో శేషాచారి గారు

ఇలా వ్యవసాయం అభివృద్ధి చెందితే దుర్భిక్షం పోయి, సుభిక్షం అవుతుందని, నీటి పారుదల శాఖలో ప్రయోగాత్మక ప్రణాళికలను సిద్ధం చేసి రైతులకు శిక్షణను ఇచ్చారు. భారత ప్రభుత్వం వీరి సేవలు వినియోగించుకోవడానికి ఆగ్నేయ ఆసియా దేశాల ఇంజినీర్లకు నిర్వహించిన ఉన్నత శిక్షణకు ఆహ్వానించింది. ఆ సందర్భంగా కేంద్రం నుండి వీరికి ఘనమైన సత్కారం, పారితోషికం అందించి, జాతీయ స్థాయిలో వీరి సేవలను ఉపయోగించుకుంది. అక్కడి శిక్షణలో అత్యాధునిక పరికరాలతో నూతన పద్ధతిలో వ్యవసాయం చేయడం, ప్రాంతీయ వనరులతో సాగు చేయడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం చేకూర్చే వ్యవసాయోపయోగ కార్యక్రమాలలో వారికి శిక్షణను ఇచ్చారు. వీరు చేసిన ఈ కృషి ఫలితంగా ఉత్తర తెలంగాణయే కాకుండా కృష్ణా జిల్లా రైతన్నల పాలిట వరాలై అనావృష్టి పోయి, ఇంటింటా ఆనందాలు వెల్లివిరిసాయి.

శేషాచారిగారు పనిచేసిన జిల్లాలలో వృత్తి ధర్మాలను నిర్వర్తిస్తూనే బృహత్ ప్రణాళికల ద్వారా శాశ్వత నిర్మాణాలక రూపకల్పన చేశారు. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టు సర్కిల్‌లో భాగంగా, వ్యవసాయాభివృద్ధికై జలాశయాలపై ఆనకట్టలు నిర్మించడానికి వ్యూహరచనలు జరిగాయి. మొదట ‘కిన్నెరసాని’ ప్రాజెక్టు కోసం అడవి మధ్యభాగాన్ని ఎంచుకున్నారు. ఇది ఖమ్మం జిల్లా పాల్వంచ వద్ద ఉన్నది. ఏ ఆనకట్ట నిర్మాణానికైనా కేవలం ఇంజినీర్లు కాకుండా సహాయ మరియు సాంకేతిక సిబ్బంది అవసరము. నిర్మాణ సమయంలో వీరందరు కుటుంబాలతో ఉండడానికి ప్రాజెక్టు సమీపాన ‘పాల్వంచ’లో అన్ని వసతులతో ఒక కాలనీ నిర్మించారు. వీరి ఆలోచనలకు అప్పటి ప్రభుత్వం సహకారం పూర్తిగా ఉంది. కాలనీవాసులకు తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా(జనరేటర్ ద్వారా) చేయించారు. ఈ కిన్నెరసాని ప్రాజెక్టును ‘పాల్వంచ నుండి యాలం బావి’ వరకు ఏడు వాగులగుండా పది కి.మీ.ల దూరం వరకు రోడ్డు నిర్మించారు. మధ్యలో అడ్డువచ్చే వాగులను కట్టడి చేసి, వంతెనలతో మంచి నాణ్యతగల రోడ్డును వేయించారు. ఈ కిన్నెరసాని ప్రాజెక్టు నిర్మాణ సమయంలో (10 కి.మీ.ల వరకు వేసిన రోడ్డు) ఆనకట్ట నిర్మాణానికి అవసరమయ్యే బరువైన యంత్రాలు, నిర్మాణపు వస్తువులు సులభంగా చేరవేయుటకు ఈ దారి ఉపయోగపడింది.

‘కిన్నెరసాని’ ప్రాజెక్టు ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది. ఇది ప్రపంచంలో అతి పెద్ద మట్టి ఆనకట్టగా పేరుపొందినది. ఈ వంతెన నిర్మాణం ఒక వ్యూహాత్మక ప్రయోజనానికి ఉపయోగపడింది. నిర్ణీత సమయంలో పూర్తిచేసి ‘కిన్నెరసాని’ ప్రాజెక్టు ప్రజల ఉపయోగానికి అందించిన ఘనత ఉత్తలూరు వారిదే.

పాల్వంచ ప్రాంతం అంతా వన్యమృగాలు సంచరిస్తుంటాయి. ఆదివాసులు అభివృద్ధికి నోచుకోక అక్కడే వారు జీవనాన్ని గడిపేవారు. పాలొంచ నుండి రోడ్డు మార్గం ఏర్పడ్డాక ఆ ప్రాంతం అంతా విద్య, వైద్య, ఆరోగ్య అభివృద్ధికి బాటలు పడ్డాయి. వారి వ్యధలు బాసి పురోభివృద్ధికి నోచుకున్నారు. 1960లో అక్కడి నుండే ఆ ప్రాంతాలలో లభించే వస్తువుల ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి, వాటి అభివృద్ధి సాధనకు కృషి చేయడంలో ఉత్తలూరి వారికి సాటి మరొకరు లేరు.

‘ఆస్తుల సంపాదనకన్నా ఆప్తులను సంపాదించుకోవడం మిన్న’ అని నమ్మిన సిద్ధాంతవాది శేషాచారి గారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వీరు ఉన్నత భావాలతో పెరిగారు. వీరికి ముగ్గురు తమ్ములు, ఒక చెల్లి. ఉమ్మడి కుటుంబంలోని ఉన్నత విలువలను ఉగ్గు పాలతోనే నేర్చినవారు ఉత్తలూరి వారు. అన్నదమ్ముల అనుబంధాలు, అక్కాచెల్లెళ్ల ఆత్మీయతలు, బంధుత్వపు బాంధవ్యాలు, సహజీవనంలోని సహాయాలను సంఘరీతి, ధర్మనీతిని తండ్రి నుండి పుణికి పుచ్చుకున్నారు. అందరిలో తానై, అందరికీ తానై కుటుంబ బాధ్యతలను నిర్వర్తించారు. వీరింట డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలు ఉన్నతంగా ఎదిగారు. తన కుటుంబానికే కాకుండా తోటివారికి సహకరించే గొప్ప గుణం శేషాచారి గారిది. వీరి సేవ చిరస్మరణీయము అని అంటారు.

శేషాచారి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. హిందుస్థాన్, కర్ణాటక సంగీతం, గాత్ర వాయిద్యాలలో మక్కువ ఎక్కువ. పండిట్ రవిశంకర్ గారు మానసిక గురువు. సితార్ వాయించడంలో నిపుణత తెలిసిన విద్వాంసులు. వారు పనిచేసిన ప్రాంతాలలో సంగీతం ప్రోత్సహించే వారు. ముఖ్యంగా వీరు నిజామాబాద్ ‘ఇందూర్ సంగీత సంస్థ’ను అభివృద్ధి చేశారు. వీరి కుమార్తె కీ॥ శే॥ మాలికకు విజయనగరం నుండి ‘వీణ’ను తెప్పించి ఖమ్మం జిల్లాలో అభ్యాసం చేయించారు. అలాగే వాహనాల చిరు మరమ్మత్తులు తానే స్వయంగా చేసుకునేవారు. కిన్నెరసాని ప్రాజెక్టు కొత్తది. అడవి ప్రాంతం. డ్రైవర్ పోస్టు మంజూరైన చాలా కాలం డ్రైవర్ లేని కారణంగా వారి వాహనాన్ని వారే చూసుకునేవారు. ప్రాజెక్టు ప్రాంతాలలో హోటళ్లు లేని కారణంగా తోటి సిబ్బంది, వారి కుటుంబాల సఖ్యత పెంచుటకు, ఉత్సాహం నింపుటకు ‘క్యాండిల్, మూన్లైట్ డిన్నర్’లు ఏర్పాటు చేసిన ప్రోత్సాహకులు శేషాచారి గారు.

నిజామాబాద్‌లో కెనాల్ కమాండ్‌లో విస్తృత పర్యటనలు చేశారు. ఈ పర్యటనలో వ్యవసాయపు నేలలో భూగర్భ జలాలు మరియు లవణీయత పెరగడాన్ని, అలాగే సాగునీరు కాలువ చిట్టచివరి రైతు కమతాలకు (పొలాలకు) చేరకపోవడాన్ని గమనించారు. ఈ సమస్యలను అధిగమించడానికి అప్పటి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ‘మిస్టర్ రాబర్ట్ మెన్ నామారా’ గారి ప్రత్యక్ష సహకారంతో ఒక ప్రణాళిక చేపట్టారు. ఈ ప్రణాళికలో వెలువడిన ఫలితాలు సిఫారసు రూపంలో అప్పటి ఏపీ ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించారు. ఈ ఆలోచనలకు ముగ్ధులైన రాబర్ట్ గారు తదుపరి పర్యటనలో ఈ మార్గదర్శకాలు ఇతర కెనాల్ కమాండ్స్ ఉపయోగానికై వీరితో రెండు రోజులు చర్చలు జరిపారు. ఆరోజు వారు వేసిన బాటలే ఈ రోజు మార్గదర్శకాలై ఆ పరివాహక ప్రాంతమంతా పచ్చదనంతో నిండి ఉంది. ఇదేనేమో “నేడు నాటిన మొక్క రేపటి మహా వృక్షమై ఫలాలు అందిస్తాయనడం”.

‘నా ప్రాంతమంతా హరితవనం కావాలి. ఒక రైతు పంటకూడా నష్టం కాకూడద’ని తపించే వారు శేషాచారి గారు. వ్యవసాయ క్షేత్రాలు అభివృద్ధి చెంది అన్నదాతల కష్టాలు కడతేర్చుటకు కృషి చేశారు. నీటి కోసం, వనరుల కోసం కష్టపడకూడదని నీటి నిలువలను పెంపొందించాలని భావించారు. 60సం॥ల క్రితమే ఇంకుడుగుంతల ఆలోచనను చేపట్టారు. బోరు బావులతో, మోట బావులతో సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా నూతన పద్ధతిలో వ్యవసాయ అభివృద్ధికై బాటలు వేశారు. తక్కువ నీటిని ఉపయోగించి, ఎక్కువ పంటను పొందే డ్రిప్ (బిందు సేద్యం) మరియు ‘స్ప్రింకిల్'(నీటి జల్లు) విధానాన్ని సాగునీటిలో ప్రవేశపెట్టిన ఆద్యులు వీరే. ప్రభుత్వ ఆమోదంతో దీనిని ప్రయోగాత్మకంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఫామ్స్ ఎంచుకున్నారు. మొదటగా ‘నిజాం షుగర్ ఫ్యాక్టరీలో – సులేమాన్ ఫామ్’ (రుద్రూర్ దగ్గర) ఈ నూతన వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించేందుకు రైతన్నలకు శిక్షణ ఏర్పాటు చేశారు. అన్నదాతలకు ఈ నూతన పద్ధతి ద్వారా నీటి పొదుపుతో వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. ఆ విధానమే ఈనాడు ప్రతి రైతు అవలంబించి, లబ్ధి చేకూరటకు వారి ఆలోచనలే పునాదులు.

మోక్షగుండం గారిని రోల్ మోడల్ గా ఎంచుకొన్న వీరు, ఆ బాటలో నడిచి, నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టి, వాటి నిర్మాణం చేయడంలో వీరి ఆలోచనలు సహకరించాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో వీరు ప్రధాన సలహాదారులుగా వ్యవహరించారు. ‘కడెం’ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ప్రధాన భూమిక పోషించారు శేషాచారి గారు.

శ్రీరాంసాగర్ (పోచంపాడ్) మేజనరీ డామ్ ఇంజినీర్ గా వ్యవహరించే సమయంలో వీరు పడిన తపన, చేసే దీర్ఘకాలిక, నిర్మాణాత్మక వ్యూహాలు భవిష్యత్తుకు బాటలు వేశాయి. పోచంపాడ్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గడియారంలోని ముల్లులా అహోరాత్రులు శ్రమించి, నాణ్యమైన పనితనంతో నిర్మించారు. ఈ రాతి ఆనకట్టను నిర్ణీత కాలంలో ఆ నీటిని విడుదల చేయడంలో తన ప్రాణాన్నే పణంగా పెట్టారు. ప్రభుత్వం ఆనకట్ట నిర్మాణానికి కేటాయించిన నిధులలో కోట్ల రూపాయలు మిగిల్చారు. ఆ రొక్కాన్ని ప్రభుత్వ ఖజానాకు జమచేసి తన నిజాయితీని నిలబెట్టుకున్న కార్యదక్షుడు ఉత్తలూరి వారు. నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీచే ప్రశంసలు అందుకున్న మహోన్నత వ్యక్తిత్వం. వీరు నీరు విడుదల ప్రారంభోత్సవానికి ముందురోజే తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన ప్రధాని ఆ ఆరంభాన్నే వాయిదా వేయమన్నారు.

పోచంపాడ్ పరీవాహక ప్రాంతమంతా పచ్చదనంతో నిండి, రైతుల కళ్లల్లో వెలుగులు చూడాలని తపన పడ్డారు శేషాచారిగారు. కృషీవలుర కష్టాలు కడదేరి, ఇళ్లల్లో గాదెలు నిండాలని అభిలషించారు. తెలంగాణ ప్రాంతంలో ఏ రైతు కూడా సాగు, తాగునీటికై కృంగి పోకూడదని తపించారు. కానీ తానుకన్న కల సాకారమైంది. తాను కళ్లారా చూడకుండానే ఆ నేలలోనే తుదిశ్వాస విడిచారు. అక్కడే తాను నిర్మించిన రామాలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాల చెంత మమేకమై హరిత వనాలను, జలాశయాలను వీక్షిస్తున్నారు.

ఆనాటి వారి ఆలోచనలు, ప్రణాళికలు ఈనాడు తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. వీరి సేవ మన తెలంగాణకే నిర్మాణాత్మకమైన సంపద. రైతుల మనసెరిగిన వ్యక్తిగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి నేటికి (1వ తేదీ జులై 1970) 50 సం॥లు పూర్తి అయినది. ఆశయ సాఫల్యం పొంది, ఆనకట్టపై ప్రాణం వదిలిన శేషాచారిగారు అర్ధ శతాబ్దంగా పవిత్రాత్మ ఆ ప్రాంతంలోనే నడయాడుతున్నది. వారి ఆలోచనలు, ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.

వారి నిస్వార్థ, నిజాయితీ, పరోపకారంతో కూడిన సేవకు ఆ భగవంతుడే మెచ్చి, వారి కుటుంబాన్ని సురక్షితంగా చూస్తున్నారు.

“విత్తు ఒకటి పెడితే చెట్టు మరొకటి పుట్టదుగా” అన్నట్లు వీరికి ఒక కూతురు మాలిక(ఫార్మకాలజీ), ఐదుగురు తనయులు. డా॥ రాజా, కిషోర్, విజయ్, అశోక్, డా॥శ్రీను. వీరు ఎంచుకున్న రంగాలలో ప్రవీణ్యులై తండ్రి బాటన నడుస్తున్నారు.

రైతుకు పాడి, పంటలు సంపదలు. శేషాచారి గారి పెద్ద కుమారుడు ప్రొఫెసర్ డా॥ వి.రాజా వ్యవసాయ రంగంలో అనేక నూతన విధానాలకు రూపకల్పన చేస్తూ రైతులను ప్రగతి బాటన నడిపిస్తున్నారు. ‘స్వీట్ కార్న్’ మరియు ‘బేబీ కార్న్’ వంగడాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలలో ఒకరు రాజాగారు. ప్రైవేటు సంస్థలలో నిర్మాణపు వనుల పర్యవేక్షణ చేశారు కిషోర్. మహారాష్ట్ర విద్యుచ్ఛక్తి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా బాధ్యతలు నిర్వర్తించారు విజయ్. తెలంగాణ డెయిరీలో జనరల్ మేనేజర్‌గా (క్రికెటర్) పనిచేస్తూ పాడి రైతుల మద్దతు ధర, సంస్థను ప్రైవేటీకరణ అవుదల, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నారు. మరో తనయుడు అశోక్. వైద్య సేవలో జాతీయ స్థాయిలో పేరు పొందారు డా॥ శ్రీను. వీరు రొమ్ము క్యాన్సర్ వ్యాధి నివారణలో అధునాతన సర్జరీ పద్ధతులను కనిపెట్టిన వైద్య శాస్త్రవేత్త.

వీరి కుటుంబంలో ఎక్కువ శాతం ఇంజనీర్స్ కొందరు వైద్యులు. చేసే వృత్తులు ఏవైనా ప్రవృత్తులు మాత్రం తండ్రి బాటన నడిచి, దేశ సేవ చేస్తూ జాతి సేవకు అంకితమైన మానవతామూర్తులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here