99 సెకన్ల కథ-6

3
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. తల్లి రుణం!

[dropcap]”ఎం[/dropcap]తో చదువుకున్న పిల్లలు సయితం తల్లిదండ్రుల్ని ‘వృద్ధాశ్రమాల్లో విశ్రాంతి తీసుకోండి’ అంటూ తరిమేస్తున్న ఈ రోజుల్లో ఈ రాజు గారు వందేళ్ళు వచ్చిన తల్లిని కూడా ఇంట్లోనే వుంచుకుని బాధ్యతగా చూసుకుంటున్నందుకే మనం ఈ రోజు …”

మయూరి సాంస్కృతిక సంస్థ నిర్వాహకుల స్వాగత వచనాలతో సభ వూపందుకుంది.

వేదిక మీద రాజు గారు తన తల్లికి ప్రక్కనే కూర్చొని, మరింత ప్రేమగా తల్లి చేయి నిమురుతున్నాడు.

అప్పటికే అతని భుజాలు కొంచెం పైకి లేచాయి. ఇంకో వక్త మైకు తీసుకున్నారు.

“చక్రాల కుర్చీలో ఆ తల్లిని ఎంతో అణకువతో తీసుకొస్తున్న రాజు గారిని చూసినప్పుడు కొడుకంటే ఇలా వుండాలి అనిపించింది కదా! …”

కరతాళ ధ్వనులు.

రాజు గారి భుజాలు ఇంకాస్త లేచాయి.

మరో వక్త లేచారు.

“మాతృరుణం తీర్చుకోవటమంటే ఇదే కదా …”

మళ్ళీ కరతాళ ధ్వనులు … భుజాలు పైపైకి …

ప్రసంగాలు చాలా వరకు అయిపోయాయి.

ఆ శతాధిక వృద్ధురాల్ని ప్రతివచనం ఇమ్మన్నారు. ఆమె మాట్లాడలేను అన్నట్లు సైగ చేశారు. సభలో అంతా మళ్ళీ మళ్ళీ అడిగారు. చివరికి నిర్వాహకులు మైకు ఆవిడ ముందు పెట్టి, అడిగారు:

“అమ్మా, మీకు మీ అబ్బాయి దగ్గర ఎలా వుందమ్మా ?”

ఆవిడ కుడి చేతి చూపుడు వేలుని, బొటనవేలిని కలిపి సున్నాలా చేసి చూపించారు.

కరతాళాలు … భుజాలు …

“ఇప్పుడు రాజు గారికి గజమాలతో సన్మానం ..” అని నిర్వాహకులు ప్రకటిస్తుంటే, ముందు వరుసలో వున్న పెద్దాయన శేషయ్య లేచి, ఆగమన్నట్లు సైగ చేశారు.

నిర్వాహకులు సగౌరవంగా వారిని వేదిక పైకి స్వాగతించారు. శేషయ్య ముందుగా ఆ శతాధిక వృద్ధురాలికి పాదాభివందనం చేశారు. మైకు తీసుకున్నారు.

“ఈ కొడుకుని సన్మానించాల్సిందే. ఎందుకంటే, తల్లిపోషణకి ఖర్చు ఇతనిదే కదా! … కాని ఆ తల్లికి డైపర్లు ఇతను మార్చాడా? స్నానం ఇతను చేయించాడా? ఎలావండితే ఆవిడకి ఇష్టమో కనిపెట్టి ఇతను వంట చేసిపెట్టాడా ? ఆవిడతో కాలక్షేపం కబుర్లు రోజూ ఇతను చెప్పాడా?… ఈ కుటుంబం నాకు తెలుసు. అలా ప్రేమ చూపించి, ఆవిణ్ణి కాపాడుకొస్తున్నది ఆ కోడలు సుగుణ కుమారి…” అంటూ ఆ సభలో రెండో వరుసలోకి చూపించారు.

అంతే.

కరతాళధ్వనులు మోగాయి. భుజాలు దిగిపోయాయి.

క్షణాల్లో సీను మారిపోయింది.

సుగుణకుమారికి, రాజు గారికి కలిపి గజమాల వేస్తుంటే,

ఆ శతాధిక వృద్ధురాలు ఆప్యాయంగా కోడలి చేయి నిమురుతుంటే,

శేషయ్య ముక్తాయింపు మాటలు చెప్పారు:

“…ఏ ఇంట్లోనయినా వృద్ధుల్ని కొడుకులు బాగా చూస్తున్నారు అంటే అర్థం ఆ కోడళ్ళు బాగా చూసుకుంటున్నారని.”

ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మార్మ్రోగి పోయింది.

2. పార్కులో రొమాన్స్!

శేషయ్య గారూ, నేనూ కలిసి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ని ఒక కార్యక్రమానికి ఆహ్వానించాలని వెళ్ళాం. ఆయన ఇంకా రాలేదని తెలిసి, దగ్గర్లో జంతు విజ్ఞాన శాస్త్రం భవనంలో పచార్లు చేస్తున్నాం.

అంతలో శేషయ్య గారు ఒక క్లాస్ ముందు ఆగిపోయారు.

“…చాలా జంతువులు తమలో ఏ ఒక్కరికి కష్టమొచ్చినా పదిమందీ చేరి బాధపడతాయి. ఏనుగులు చూడండి. ఒక చిన్న ఏనుగు పిల్ల గోతిలో పడిపోయిందని ఎంత ఆవేదన చెందుతున్నాయో! ఒక్క పిల్ల కోసం ఎన్ని ఏనుగులు వచ్చాయో చూశారా? మనం జంతువులనుంచి నేర్చుకోవాల్సిన విషయాల్లో ఈ ఐక్యత ఒకటి…” అంటూ యువ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్టూడెంట్స్‌కి వీడియో పాఠాలు చెబుతున్నాడు ఆంగ్లంలో.

ఓ పదినిమిషాలు విన్నాక, “చాలా బాగా చెబుతున్నాడయ్యా ఈ కుర్రాడు ఎవరో గానీ!” అన్నారు శేషయ్య.

“మా బంధువే. క్రిందటి నెల్లోనే పెళ్ళయింది…” అన్నాను.

అలా మాట్లాడుకుంటూ వి.సి ఛాంబర్స్ కేసి వెళ్ళిపోయాం.

***

ఓ రెండు వారాలుపోయాక శేషయ్య గారు ఫోన్ చేశారు.

“మీ బంధువు.. అదే ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో కొంచెం మాట్లాడాలి. మీ ఇంటికి వస్తాను. పిలిపించగలవా?”

“అయ్యా, ఎంతమాట! గురుతుల్యులు మీరు చెబితే కాదంటానా?” అన్నాను.

ఎందుకు? ఏమిటి? … అని కూడా అడగలేదు.

మా వాడికి శేషయ్యగారి గొప్పదనం గురించి చెప్పి, “ఆయన మాట్లాడాలనుకుంటున్నార్రా ..” అన్నాను.

వాడు మహా బుద్ధిమంతుడు. చెప్పిన సమయానికి వచ్చేశాడు.

పరిచయాలూ, పలకరింపులూ అయ్యాక, శేషయ్య గారు అడిగారు.

“చాలా తరచుగా సాయంత్రం సమయాల్లో బ్రహ్మానందరెడ్డి పార్కులో నేను పదచలనం చేస్తూ నీతో పాటు ఓ అమ్మాయిని చూస్తున్నాను…” ఆగారు.

వాడు సిగ్గుపడ్డాడు.

నేను ఖంగారు పడ్డాను.

అంతలో వాడే నోరు విప్పాడు.

“సర్, ఆమె నా భార్య. ఈ మధ్యే మాకు …”

“అర్థమైంది. నీ భార్య కదా!.. నీ సబ్జక్టు జంతు విజ్ఞాన శాస్త్రం. జంతువుల్ని చూసి మనుషులు నేర్చుకోవాల్సినవెన్నో వున్నాయని విద్యార్థులకి చెబుతున్నావు కదా! పార్కులో చెట్లచాటున నువ్వు నీ కొత్త భార్య ఆ విరగబాటు ఏమిటయ్యా?”

మా వాడి మొహం జేవురించింది.

“… మగ, ఆడ కాకులు రొమాన్స్ చేయటాన్ని ఎప్పుడన్నా చూశావా? చూడలేవు. చూస్తే అది చూసిన వాళ్ళకే అరిష్టం. అందుకే కాకులు మనుషులకి కనబడేలా రొమాన్స్ చేసుకోవు. పిల్లలకి పాఠాలు చెప్పే నువ్వు కూడా…”

మా వాడు ఠపీమని ఆయన కాళ్ళమీద పడిపోయాడు.

“సర్, సైన్స్ తెలుసుగానీ, సంప్రదాయం తెలియలేదు. క్షమించండి.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here