[box type=’note’ fontsize=’16’] సన్నిహిత్ గారు వ్రాసిన “ఎం.హెచ్.కె.” అనే మినీ నవలని పాఠకులకు అందిస్తున్నాము. పల్లెటూరి రాజకీయాలు, అంతరిక్షపు కుట్రలతో ఆసక్తి చదివించే కథనంతో నడిచే సీరియల్‍లో ఇది 5వ భాగం. [/box]
[dropcap]ఊ[/dropcap]ళ్ళో కొన్ని రోజుల క్రితం తప్పిపోయిన పిల్లాడు రాము నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
అంతా చీకటి. ఏదో వాసన. తను ఎక్కడున్నాడో అతనికి అర్థం కాలేదు. కళ్ళు చిట్లించి చూస్తున్నాడు. కాసేపటికి చీకటిని చూడ్డానికి అతని కళ్ళు అలవాటు పడ్డాయి.
భూమి లోపల పాతాళంలో ఉన్న చిన్న ఇల్లు అది. ఆ ఇల్లు బయట ప్రపంచంతో ఎలా కనెక్ట్ అయిందో అతనికి తెలీదు. నెమ్మదిగా పాక్కుంటూ కదిలాడు. అక్కడ ఒక పక్కగా ఆక్సిజన్ సిలిండర్స్ లాంటివి ఉన్నాయి. ఇంకో రూము వైపు వెళ్ళాడు. అందులో ఏవో ఎలెక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. కానీ మనుషుల జాడ మాత్రం లేదు. కంప్యూటర్ లాంటి స్క్రీన్ మీద ఏవో గీతలు కనిపిస్తున్నాయి. అవేమిటో… అసలు ఎందుకో అన్నది ఆ చిన్న బుర్రకి అసలు అర్థం కావడం లేదు.
సడన్‌గా అతనికి అమ్మా… నాన్నా గుర్తొచ్చారు. ఏడుపు తన్నుకొచ్చింది. ఏడ్చి ఏడ్చి అలాగే సొమ్మసిల్లి పడిపోయాడు. కంప్యూటర్ స్క్రీన్‌లో ఇవన్నీ రికార్డ్ చెయ్యబడుతున్నాయని… ఆ సమాచారమంతా అంతరిక్షంలో ఉన్న… ఏ సుదూర గ్రహానికో పంపబడతోందని అతనికి తెలీదు.
కాసేపటికి ఆ భూగృహంలోకి నెమ్మదిగా ప్రవేశించారు ఇద్దరు వ్యక్తులు. పరిశీలనగా అంతా చూడసాగారు. రాము నిద్రపోతూ కనిపించాడు. ‘హమ్మయ్య’ అనుకున్నారు. కంప్యూటర్ రూములోకి వెళ్ళి అన్ని పరికరాలు పరిశీలించారు. అవి సక్రమంగా పనిచేస్తున్నట్టు పచ్చ లైటు వెలగడంతో వాళ్ళు సంతృప్తిగా నవ్వుకున్నారు. ప్రస్తుతానికి ఆ భూగృహాన్ని సవ్యంగా నిర్వహించడమే వాళ్ళకున్న పని. తర్వాత ఏం చెయ్యాలన్న ఆదేశం ఇంకా ‘పై నుండి’ ఇవ్వబడలేదు. కాసేపు అక్కడే ఉండి వెళ్ళిపోయారు వాళ్ళు.
***
విష్ణువర్ధనరావ్ తీరిగ్గా మందు మీద కూర్చున్నాడు. అతని కాళ్ళ దగ్గర విశ్వాసంగా ఒదిగి ఉన్నాడు భుజంగం.
రెండు పెగ్గులయ్యాక విష్ణు అడిగాడు “ఆ పంకజం విషయం ఎంతవరకు వచ్చిందిరా” అని.
“వచ్చింది సార్.. వచ్చింది… త్వరలోనే మీ మంచం ఎక్కడానికి సిద్ధపడి వచ్చేత్తుంది. కానీ బాబూ సానా ఆశ సూపించాల్సొచ్చింది. అవన్నీ సెప్పాకే ఒప్పుకుంది.”
“ఆహా… తొందరగా ఆ పని అయ్యేలా చూడు… నీకు మంచి బహుమతి ఇస్తాను.”
“అయ్యబాబోయ్… నిజంగానే ఒప్పుకుందండీ…” అన్నాడు భుజంగం.
మెచ్చుకున్నట్టు సగం ఖాళీ అయిన మందు బోటిల్‌ని భుజంగానికి ఇచ్చాడు విష్ణు. ఫుల్ ఖుషీగా వెళ్ళిపోయాడు భుజంగం.
అప్పటి దాక లోపలి గదిలో వెయిట్ చేస్తున్న ఊరి ప్రెసిడెంట్ బయటకు వచ్చాడు.
“ఆ భుజంగం గాడు వెళ్ళిపోయడా” అని విష్ణువర్ధనరావ్‌ని అడిగాడు
“ఆ… వెళ్ళాడు… మందు బోటిల్ కూడా పట్టుకుపోయాడు” అని చెప్పి “…నువ్వు నాతో కలిసావన్న విషయం ఎవరికీ తెలియకూదదు. ఊరి వాళ్ళు నీ మాట వినాలంటే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలి” అన్నాడు విష్ణువర్ధనరావ్.
“సరే… అలాగే ” అని తలూపి మందు కొట్టడానికి మళ్ళీ లోనికి వెళ్ళిపోయాడు ప్రెసిడెంట్
***
పొలం గట్టు మీద నడుస్తున్న కళ్యాణ్‌కి గాజు పెంకు గుచ్చుకుంది. పగిలిన గాజు సీసా మట్టిలో కూరుకుని ఉండి నడుస్తున్న కళ్యాణ్ పాదంలో గుచ్చుకుంది. రక్తం బాగా కారుతుండటంతో విధి లేక కొత్త హాస్పిటల్‌కి వచ్చాడు.
అతన్ని చూడగానే రశ్మి “హాయ్ కళ్యాణ్‌గారు… ఏంటి ఇలా వచ్చారు?” అంది.
“హాస్పిటల్‌కి ఎవరైనా ఎందుకొస్తారండి… పెద్ద డాక్టర్ కదా మీరు, ఆ మాత్రం తెలీదా” విసురుగా అన్నాడు.
గట్టిగా నవ్వేస్తూ “… సరే సరే… చెప్పండి ఏంటి ప్రోబ్లెం?” అంది.
కళ్యాణ్ తన కాలికి తగిలిన గాయాన్ని చూపించాడు.
“మై గాడ్” అని కాంపౌండర్‌ని పిలిచి ట్రీట్‌మెంట్ చెప్పింది. పేడ్ తీసుకుని ప్రిస్క్రిప్షన్ వ్రాసి ఇచ్చింది.
“ఈ మందులు తీసుకుని వెళ్ళండి” అని “…ఎంతవరకు వచ్చింది మీ రీసెర్చ్..” అంది.
“ఫర్వాలేదండీ బాగానే సాగుతుంది… అయినా ఈ ఊరు ఒక అంతుబట్టని రహస్యాల నిధిలా ఉంది…” అన్నాడు.
“ఈజ్ ఇట్… అంత సీన్ ఉందా ఈ ఊరికి?” అంటూ ఆశ్చర్యపోయింది.
” ఏమో… కాలమే తేల్చాలి ఆ విషయం. నేను మాత్రం నా ప్రయత్నం చేస్తున్నాను.”
” అదేంటి… మీ రీసెర్చ్‌కి ఈ ఊరి రహస్యాలకి ఏమిటి సంబంధం?” అంది అనుమానంగా
నాలిక్కరుచుకున్నాడు కళ్యాణ్. “అబ్బే… అది… అది… నేననేది సాధారణంగా ఊరు మనకి కొత్త కదా… అందుకే రహస్యాలు అన్నాను… అయినా పల్లెటూళ్ళో రహస్యాలు ఏముంటాయి లెండి… నా చాదస్తం గాని” అంటూ కవర్ చెయ్యడానికి ప్రయత్నించాడు. కొంచెం కన్విన్స్ అయినట్టు తలూపింది రశ్మి.
“సరే అండి… వెళ్ళొస్తాను” అన్నాడు కళ్యాణ్.
“వెళ్ళండి… కానీ రావాలని మాత్రం అనుకోకండి… ఇది రోగులు ఉండే హాస్పిటల్” అంది నర్మగర్భంగా.
“ఓకే… ఓకే…” అంటూ గట్టిగా నవ్వేసాడు కళ్యాణ్. రశ్మి కూడా అతని నవ్వుతో శృతి కలిపింది. అప్పుడే అటు వైపుగా వెళుతున్న జనని దృష్టిలో ఇది పడింది. ఆమె మొహం ఎందుకో ఎర్రగా మారింది.
***
ఆ రాత్రి రూములో కూర్చుని ఆలోచిస్తున్నాడు కళ్యాణ్. ఊళ్ళో జరుగుతున్న సంఘటనలు ఎవరికీ తెలియడం లేదు. కానీ తన మదిలో ఎన్నో సందేహాలు… అవన్నీ తీరాలంటే తను కొంచెం శ్రద్ధగా పరిశోధించాలి అని నిర్ణయించుకున్నాడు.
జనని వచ్చి “ఏంటో అంత దీర్ఘాలోచన? కొత్త డాక్టరమ్మ గురించా” అంటూ ఆరా తీసింది.
ఒళ్ళు మండింది కళ్యాణ్‌కి. అయినా కంట్రోల్ చేసుకున్నాడు.
“ఏదో కాలికి గాయం అయి ఆ హాస్పిటల్‌కి వెళ్ళాను. అంత మాత్రాన ఆమె గురించి ఆలోచిస్తూ కూర్చోవాల్సిన అవసరం నాకేముంది?” అన్నాడు.
“ఏమోలే ఎవరి మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు… ఆ నవ్వులు… ఆ సంతోషం చూస్తేనే అర్థమవుతోంది ఎవరి అవసరం ఎవరికుందో.”
“ఏమిటి జననీ ఇది? నువ్వు కూడా ఒక సామాన్యమైన ఆడపిల్లలా ఆలోచిస్తే ఎలా?” నొచ్చుకున్నట్టు అన్నాడు.
చురుగ్గా చూసింది జనని. “నువ్వు వేరే ఏ అమ్మాయి తోనూ అంత చనువుగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అర్థం చేసుకో” అని చెప్పి వెళ్ళిపోయింది. నిశ్చేష్టుడయ్యాడు కళ్యాణ్.
తర్వాత తను వ్రాసుకున్న నోట్స్ పరిశీలించసాగాడు. వరుసగా తను చూసిన సంఘటనలను ఒక దగ్గరకు చేర్చి… వాటి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని ఆలోచించసాగాడు. కానీ ఒక దానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. మళ్ళీ పొలాల వైపు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. డ్రెస్ వేసుకుని బయటపడ్డాడు. గతంలో జరిగిన అనుభవం వల్ల ఈసారి జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాడు.
ఎవరికంటా పడకుండా నడుచుకుంటూ వెళ్ళి నెమ్మదిగా పొలాల్లోకి చేరుకున్నాడు. అర్ధరాత్రి దాటి చాలా సేపయింది. కీచు రాళ్ళ రొద. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. నేల మీదకు వంగి పని ప్రారంభించాడు. ఇంతలో అతడి నోరు గట్టిగా మూసారెవరో. ఇంకెవరో రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. మూలుగుతున్నాడు కళ్యాణ్.
“ఎవడ్రా నువ్వు… ఇంత చీకటిలో ఏదో చేస్తున్నావు?” కరుగ్గా అడిగింది ఒక స్వరం. నోటికి అడ్డంగా ఉన్న చేతులు తొలగ్గానే –
“నేనెవరైతే మీకెందుకు? నా పని నన్ను చేసుకోనివ్వండి” అంటూ అరిచాడు కళ్యాణ్.
“అవన్నీ మాకనవసరం. పద నడువు” అంటూ అతన్ని తోసుకుంటూ పక్కనే ఉన్న చిన్న షెడ్‌లోకి తీసుకెళ్ళారు. అక్కడ కూర్చుని సిగరెట్ త్రాగుతున్నాడు భుజంగం.
“ఏం బాబూ ఏదో రీసెర్చ్ పని అని చెప్పి మా ఊరి వచ్చి ఇక్కడ నువ్వు చేసే ఘనకార్యం ఏంటి? మాకు తెలియాలి. తప్పించుకోవాలని చూస్తే మరింత ప్రమాదం” అంటూ క్రూరంగా నవ్వాడు.
“నా పనికి మీకు ఏంటి సంబంధం? మీ వ్యవహారాల్లోకి నేను ఎప్పుడూ దూరలేదు కదా” కేర్లెస్‌గా అన్నాడు కళ్యాణ్.
“ఏ పొలాలైతే మేము దొబ్బేద్దామనుకుంటున్నామో అందులోనే నువ్వు తిరుగుతున్నావు. అదీ మా బాధ!”
“అవన్నీ నాకనవసరం. నేను ఈ ఊరి వాడిని కాను. నాకు ఈ పొలాలతో సంబంధం కూడా లేదు. నన్ను వదిలేయండి. సమయం వచ్చినప్పుడు నేనే మీకు అన్నీ చెబుతాను.”
“సరే ! నీ మాట నమ్ముతున్నాం. మా దారికి అడ్డు రాకు… పో” అని అరిచాడు భుజంగం.
అక్కడి నుండి బయటపడి ‘లాభం లేదు… ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి’ అనుకుంటూ ఇంటి దారి పట్టాడు కళ్యాణ్.
***
ప్రొఫెసర్ బ్రహ్మం, కళ్యాణ్‌తో సమావేశమయ్యాడు. కళ్యాణ్ వైపు నుండి ఎంతకీ ఔట్‌పుట్ రాకపోవడంతో తనే స్వయంగా ఆ ఊరు వచ్చాడు ప్రొఫెసర్. దానికి ఒక కారణం ఉంది. వచ్చే నెలలో జరగబోయే ఒక కాన్ఫరెన్స్‌కి ఫారెన్ వెళుతున్నాడాయన. అక్కడి వాళ్ళతో ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత గురించి రిజల్ట్స్‌తో కూడిన డిస్కషన్స్ చెయ్యాలన్నది అతడి కోరిక. అందుకే హడావుడిగా ఆ ఊరు వచ్చేసాడు.
ప్రొఫెసర్ సంభాషణ ప్రారంభించాడు.
“చూడు కళ్యాణ్! మనం పరిశోధన చేస్తున్నది చాలా సెన్సిటివ్ విషయం. ఒక రకంగా ఇది మన దేశ రక్షణకు సంబంధించినది. ఇంతకీ ఈ పొలాల్లో ఆ గ్రహాంతరవాసులు వచ్చి వెళుతున్న ఆనవాళ్ళు ఏమైనా దొరికాయా?” ఆసక్తిగా అడిగాడు
“అదే నేనూ పరిశోధించాను సార్! వాళ్ళు వచ్చి వెళ్ళే సమయంలో నేను చాటునుండి గమనించాను. వాళ్ళు వెళ్ళగానే నేను ఆ మట్టిని తీసుకుంటుండగా ఆ ఊరి వాళ్ళు నా మీద పడి దాడి చేసారు. అప్పటికి ఏదో చెప్పితప్పించుకున్నాను” చెప్పాడు కళ్యాణ్.
“ఓహో… అదా జరిగింది. ఏది ఏమైనా ఆ గ్రహాంతర వాసులు మన దేశం లోని ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారో మనకి తెలియాలి. దానికి మరింత పరిశోధన అవసరం” ఎక్సైటింగ్‌గా అన్నాడు ప్రొఫెసర్.
“అవును గురూజీ.. కానీ ఈ ఊరి వాళ్ళు ఆ పొలాన్ని వేరే డబ్బున్న వాడికి ఫేక్టరీ కట్టడానికి ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నారు. అందులో ఈ ఊరి పెద్దాయన రఘురామయ్య గారి పొలాలు కూడా ఉన్నాయి. కానీ జనాలతో పాటే ఆయన కూడా. ఏది ఏమైనా ఈ విషయాన్ని మనం బహిరంగంగా చెప్పలేము. సమయం వచ్చినప్పుడు చెబుదాము.”
“అలాగే… కానీ నువ్వు రిలాక్స్ అవద్దు. పరిశోధన కొనసాగించు. జాగ్రత్త. మనం ఆ ఏలియన్స్ దృష్టిలో పడితే మాత్రం ప్రమాదం” అంటూ ముగించాడు.
ఆ రాత్రికే అతడు సిటీకి వెళ్ళిపోయాడు
***
మిట్ట మధ్యాహ్నం… ఎండ గట్టిగా కాస్తోంది.
వడి వడిగా నడుచుకుంటూ ఊరి బయట ఉన్న గుట్ట వైపు వెళుతోంది జనని. కాసేపటికి ఆ గుట్టను చేరుకుని దానిపై నున్న పాడుబడ్డ గుడి లోకి వెళ్ళింది.
చాలా సేపు అందులో గడిపి బయటకు వచ్చింది. ఆమె నుదుటి మీద చిరు చెమట్లు. ఓణీ చెంగుతో ఆ చెమట తుడుచుకుంటూ మళ్ళీ నడుచుకుంటూ ఊరి వైపు వచ్చేస్తోంది.
సరిగ్గా ఆమె పొలాల దగ్గరకి వచ్చేటప్పటికి కళ్యాణ్ కనిపించాడు. కొంచెం తత్తరపడింది.
“ఏంటి…. అమ్మాయి గారు ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్టు ఉన్నారు?” అడిగాడు కళ్యాణ్.
“అవును… కొంచెం పని ఉండి వెళ్ళి వస్తున్నాను” అంది జనని.
“ఏంటో అంత ముఖ్యమైన పనులు… అదీ ఎవరి కంట పడకుండా వెళ్ళేవి”
“అది నీకు ఇప్పుడు అనవసరం కళ్యాణ్” కోపంగా అంది.
“ఎందుకు అనవసరం? నేను ఎవరో అమ్మాయితో మాట్లాడితే అది నీకు అవసరం… కానీ నీవు రహస్యంగా ఎక్కడికో వెళ్ళి వస్తుంటే మాత్రం నేను అడక్కూడదు… ఇదెక్కడి న్యాయం?”
“న్యాయాన్యాయాలు పక్కన పెట్టు కళ్యాణ్… నేను ఏ తప్పూ చెయ్యడం చెయ్యడం లేదు… సమయం వచ్చినప్పుడు నీకు చెబుతాను… అప్పటి దాకా నన్నేమీ అడగొద్దు… ప్లీజ్” అంది.
ఆమె మాటల్లో ఉన్న స్వచ్ఛతకి లొంగిపోయాడు కళ్యాణ్. పూర్తిగా ఆమెను నమ్మాడు.
“సరే జననీ… నిన్ను నేనెందుకు అనుమానిస్తాను… ఓకే” అని నవ్వేసాడు.
జనని మనసు తేలికపడింది. “బై…” అని చెప్పి వెళ్ళిపోయింది.
అప్పటి దాకా వీళ్ళ సంభాషణ ని చెట్టు పక్క నుండి వింటున్న భుజంగం బయటకు వచ్చాడు.
కళ్యాణ్‌ని సమీపించి “ఏంటి బాబూ ఏదో కోపం మీద ఉన్నట్టున్నావు?” అని ప్రేమగా అడిగాడు.
ఒళ్ళు మండింది కళ్యాణ్‌కి. ‘తన బాధ తనది… వీడి వెటకారం వీడిది…’ అనుకుని కోపంగా చూసాడు.
భుజంగం “అట్టా కోపంగా సూడమాకండి… ఆడపిల్లలతో యవ్వారం… కొంచె జాగర్త…” అన్నాడు
“ఆడపిల్లలు ఎవరు… ఒక్క జనని తోనే కదా నేను ఇప్పుడు మాట్లాడింది?”
“అబ్బో మాకు తెలీదనుకోకండి… ఒక వైపు డాక్టరమ్మని… ఇంకో వైపు జననమ్మని… బాగుంది సారూ మీ యవ్వారం” అన్నాడు భుజంగం.
హతాశుడయ్యాడు కళ్యాణ్. ‘మైగాడ్..ఇంత దారుణంగా ఆలోచిస్తున్నాడా ఈ భుజంగం’ అనుకుని “మీరనుకున్నట్టు నాకు ఏ అమ్మాయిలతోనూ సంభందాలు లేవు… దయచేసి నన్ను వదిలేయండి” అని చేతులెత్తి దండం పెట్టాడు. వంకరగా నవ్వాడు భుజంగం.
“మా ఇసయాల్లో నువ్వు ఏలెట్టినప్పుడు మేవెందుకు ఊరుకుంటాం… మా పుట్టలో ఏలు పెడుతున్నది నువ్వు… ఆలోసించుకో…” బెదిరిస్తున్నట్టు అన్నాడు.
భుజంగం చేస్తున్న బ్లాక్‌మెయిల్ కళ్యాణ్‌కి అర్థమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండటం బెటర్ అనుకుని “సరే అలాగే… మీ విషయాల్లో తలదూర్చను… నా పని నేను చూసుకుంటాను” అని చెప్పి వెనుతిరిగాడు.
విషపు నవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు భుజంగం.
(సశేషం)