వలస

0
3

[dropcap]ఉ[/dropcap]దయాన్నే 5 గంటలకు విశాఖలో బయలుదేరాను. చాలారోజులనుంచి కొల్లేరుని చూడాలని ఉన్నా ఇప్పటికి కానీ తీరింది కాదు. చాలారోజుల నుంచి కొల్లేరు గురించి ఆలోచిస్తున్నా ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. వెళ్ళినప్పుడు ఆలోచించవచ్చులే అన్న నిర్లిప్తత వల్ల కావచ్చు.

అందుకే నిన్న సాయంత్రం గూగుల్‌లో చూస్తే చాలా విషయాలు తెలిశాయి. హైవే మీద నుంచి ఏలూరు వెళితే అక్కడ నుంచి కైకలూరు రోడ్డుకి మారాలి.

మొత్తానికి మా స్కార్పియో ఏలూరు చేరేసరికి పదకొండు అయింది. డ్రైవర్ నాగరాజు నాకు తెలిసినవాడే. అక్కడే ఓ ఆటోవాడిని కనుక్కుంటే కైకలూరు రోడ్డు చూపించి తిన్నగా వెళ్ళిపొమ్మని చెప్పాడు.

అది ఫిబ్రవరి మాసాంతం కావడంతో ఎండ తీక్షణత ఎక్కువగా ఉంది. అది పేరుకే తార్రోడ్డు కానీ గతుకులతో, గుంతలతో చాలా ఘోరంగా ఉంది. ఒక పక్క పర్యాటకాన్ని బాగా ప్రోత్సహిస్తున్నామనీ చెప్పే ప్రభుత్వాలు ఇలాంటి రహదార్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాయో అర్థం కావట్లేదు…

కొంచెం దూరం వెళ్ళిన తరువాత ఏదో ఊరు వచ్చింది. ఇంతకీ మేము వెళ్తున్నది సరియైన మార్గమేనా అన్న సందేహం వచ్చి అక్కడ ఓ చెట్టుకింద పళ్ళమ్ముతున్న వ్యక్తి దగ్గర జీపునాపమన్నాను. అతను ఓ పెద్ద గొడుగు కింద కమలాలు, జామపళ్ళు అమ్ముతున్నాడు.

అతని దగ్గర కమలాలు కొంటూ “కొల్లేరుకి ఎలా వెళ్ళాలి?” అని అడిగాను.

“తిన్నగా వెళ్తే ఇరవై కిలోమీటర్లు. ముందు కైకలూరు అక్కడనుంచి ఆటపాక వెళ్ళొచ్చు” అన్నాడు.

అప్పుడు నాకు ఆటపాక పక్షుల కేంద్రం గుర్తుకొచ్చింది

“ఆటపాకలో ఇప్పుడు పక్షులొస్తున్నాయా?” అని అడిగాను.

“నవంబర్ నుంచి మార్చి దాకా లక్షల్లో పక్షులు వస్తాయి బాబూ… ఆ తరువాత ఎల్లిపోతాయి… ఇప్పుడు చాలా ఉన్నాయి” అన్నాడు కమలాలను ఓ సంచిలో వేస్తూ. జీపు ఎక్కిపోతూ “ఇంకేం ఉన్నాయి ఇక్కడ చూడటానికి?” అని అడిగాను.

“పది కిలోమీటర్లు ఎల్తే అక్కడో పెద్ద బ్రిడ్జి ఉంటుంది. అక్కడే మొన్న రామ్‍చరణ్ రంగస్థలం షూటింగ్ జరిగింది” అని జీపు దగ్గరకు వచ్చి చెప్పాడతను…

అతనికి థాంక్స్ చెప్పి మళ్ళీ బయలుదేరాను.

మళ్ళీ స్కార్పియో ప్రయాణం మొదలైంది. గతుకుల రోడ్డు… ఒకటే కుదుపులు… రోడ్ల మీద విపరీతమైన జనం.

అప్పటికే కొల్లేరు ప్రాంతం ప్రారంభమైందనుకుంటాను… రోడ్డు కిరువైపులా కనుచూపు మేర చేపల చెరువులు కనిపిస్తున్నాయి.

మిట్టమధ్యాహ్నం పన్నెండుకి కైకలూరు చేరుకొని అక్కడ టీ తాగి ఆటపాక పక్షుల కేంద్రానికి చేరుకున్నాము.

ఆ పక్షుల కేంద్రం ఓ పెద్ద చెరువులో నిర్మించినట్లు కనిపించింది. దూరంగా గట్టుమీద ఉండే చెట్ల మీద వేలపక్షులు ఎగురుతూ కనిపించాయి.

జీపుని పార్క్ చేసి అటవీశాఖ వారి బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టిక్కెట్లు తీసుకున్నాను. దూరంగా చాలామంది పర్యాటకులు… ముఖ్యంగా ఆ రోజు ఆదివారం కావడంతో చాలామంది పాఠశాల విద్యార్థులు కనిపించారు…

దూరంగా చెరువులో మెట్లు మెట్ల దగ్గర పడవలు కట్టేసి ఉన్నాయి. వెంటనే మళ్ళీ కౌంటర్ దగ్గరకు వచ్చి “సార్! పడవలు నడుపుతున్నారా?” అని అడిగాను.

“పదిరోజుల క్రితం దాకా తిరిగేవి. కానీ మొన్న గోదారిలో పడవ ప్రమాదం తరువాత ప్రభుత్వం పడవలను నడుపవద్దనీ చెప్పటంతో వాటిని ఆపేశాము” అన్నాడు తను.

“మరి పడవలో వెళ్ళకపోతే ఆ చెరువు మధ్యలో ఉన్న లంకలో ఉన్న చెట్ల మీద ఉన్న పక్షుల్ని చూడటం కష్టం కదా?”

“మరేం చేస్తాం బాబు… ప్రభుత్వం ఆర్డర్స్. మేమేం చెయ్యలేము” అన్నాడు.

ఇంక చేసేదేం లేక నడచుకుంటూ కేంద్రం వైపు నడిచాను.. నా వెనకే మా డ్రైవర్ రాజు.

దూరంగా సముద్రంలా నీరు… మధ్యాహ్న మార్తాండుని తీక్షణ కిరణాలు నీటిపై పడి పరావర్తనం చెందుతున్నాయి… చెరువు మధ్యలో పొదలు… వాటిమీద సైబీరియన్ కొంగలు పెద్ద పెద్ద రెక్కలతో ఎగురుతున్నాయి. మొత్తం చెరువంతా నీటి బాతులతో నిండి ఉన్నాయి.

పక్షుల కేంద్రం పైన నీలాకాశం… ఆ నీలాంబరంలో రకరకాల రంగుల పక్షులు ఎగురుతూ ఇంద్రదనుస్సుని గుర్తుకు తెస్తున్నాయి.

దూరంగా చెరువు గట్టుపై రెండు వాచ్‍ టవర్లు కనిపించాయి. దాన్నెక్కి దూరంగా చెట్లమీద పక్షుల్ని ఫోటోలు తీశాను. అక్కడ ఉన్న వాచ్‍మెన్‍ని అడిగితే ఆ పక్షుల పేర్లు చెప్పాడు. వింతగా ఉన్నాయి ఆ పేర్లు… పరాజుపిట్టలు, నులుగుపిట్టలు, పురాజాలు… పెలికాన్లు… ఇవన్నీ వలస పక్షులనీ, ఎక్కడో రష్యానుంచి ఇతర దేశాలనుంచి వలస వస్తాయనీ చెప్పాడతను.

చెరువు గట్లుమీద మధ్యలో ఇనప పైపులతో స్టాండ్లు నిర్మించింది అటవీశాఖ. ఇరవై అడుగుల ఎత్తులో ఇనుపరాడ్లతో వలయాకారంగా తయారు చేయబడ్డాయి. వాటిమీద పక్షులు కూర్చుని గుడ్లను పొదుగుకుంటాయనీ అన్నాడతను.

అలా చాలాసేపు ఆ ప్రాంతమంతా తిరిగి ఫొటోలు, వీడియోలు తీసి మళ్ళీ టికెట్లు అమ్మే ప్రదేశం దగ్గరికి వచ్చాము. అక్కడ పెద్ద షెడ్డు. కూర్చునేందుకు కుర్చీలు… బల్లలున్నాయి. అక్కడే ఓ మూల టీ దుకాణం, ఇంకో పక్క బిస్కట్లు… హల్దీరామ్ తినుబండారాలు అవీ ఒకతను అమ్ముతున్నాడు.

నేను ఎండలో తిరగడం వల్ల చెమటలు పట్టడంతో అక్కడ కాసేపు కూర్చున్నాను. పడవలో ప్రయాణిస్తే ఇంకా పక్షుల్ని దగ్గరగా వీలుండేది కానీ అది కుదరలేదన్న అసంతృప్తి నన్ను పీడిస్తోంది.

ఇంతలో ఆ టీ షాపతను “బాబూ! టీ తాగుతారా?” అని అడగటంతో కళ్ళు తెరిచి ఈ లోకంలోకి వచ్చాను.

ఎదురుగా ఓ ముప్పైఏళ్ళ యువకుడు… మాసిపోయిన బట్టలు, చెదిరిన జుట్టు… సన్నగా ఉన్నాడు. కాని ఆ ముఖాన్ని చూస్తే ఎక్కడో పరిచయం ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు… అతన్ని అలాగే చూస్తూ రెండునిమిషాలు ఉండిపోయాను. కానీ నా మస్తిష్కం అతన్ని ఎక్కడ చూశానో… ఆ వివరాల కోసం వెనక్కి వెళ్ళిపోసాగింది. మస్తిష్కం… అందులోని వేల న్యూరాన్లు… అవి మరిచిపోవుకదా… అయినా గుర్తుకు రావట్లేదు…

కాసేపటికి ఫ్లాష్‍లా ఓ ఆలోచన అవును! గుర్తుకొస్తున్నాడు. వాడు మా రైతు నారాయణ కొడుకులా ఉన్నాడు. వాడు సన్యాసి… నా చిన్నప్పుడు మా ఊళ్లో నాతోనే పెరిగినవాడు… కానీ నిజమేనా? మనుషుల పోలిన మనుషులుండోచ్చు కదా? అయిన ఎక్కడ విజయనగరం జిల్లా… ఎక్కడ ఈ కృష్ణాజిల్లాలోని కొల్లేరు… వాడెందుకు ఇక్కడికొస్తాడన్న ఆలోచన ఇంకోవైపు.. ఇంతలో ఆ యువకుడు కూడా నా వైపు ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టాడు నా కాశ్చర్యం కలిగించసాగింది.

“బాబూ! తమరు… రామం బాబుగారు కదూ!” అని అడిగాడు.

ఇప్పుడు నాకు పూర్తిగా నిర్థారణ అయిపోయింది. వాడు సన్యాసే.

“సన్యాసి కదూ!” అని అడిగాను.

“అవును బాబూ! నన్ను బాగానే గుర్తుపట్టారు” అంటూ పరుగున వెళ్ళి మంచి కాఫీ పట్టుకొచ్చాడు.

నాకు కొద్ది క్షణాలసేపు గతం కళ్ళముందు కదలాడింది… పాతికేళ్ళ క్రితం సన్యాసి నేను ఒకటో తరగతి చదివాము… మాదో చిన్న పల్లె… మా నాన్న ఊరికి సర్పంచ్… మాకు బాగా పొలం ఉండేది.. మా రైతు నారాయణ.. మా పొలం పనులు, దాని బాగోగులు… ఇంట్లో పశువుల పెంపకం… పాలు తియ్యడం… మమ్మల్ని అప్పుడప్పుడు సంతకి తీసుకువెళ్ళడం వరినూర్పులప్పుడు కళ్ళానికి బండిమీద తిప్పడం, ఏరు పొంగితే దాటించి స్కూలుకి తీసికెళ్ళడం… ఇలా అన్నింటికీ నారాయణే.

అతనొక సన్నకారు రైతు… వాడికి నలుగురు పిల్లలు… సన్యాసి ఆఖరివాడు. ఆ పొలం పంట సరిపోక మా పొలాన్ని శిస్తుకి చేసేవాడు. అయినా కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేది. పదవ తరగతిలో సన్యాసి నాతోపాటు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఇంటరులో చేర్పించడానికి మా రైతు నారాయణకి ఆర్థిక ఇబ్బందులు చదివించలేనన్నాడు…

నాన్నే నాకూ వాడికి ఫీజులు కట్టి ఇంటర్లో చేర్పించడం నాకింకా గుర్తే! ఆ తరువాత నేను ఇంజనీరింగ్‍కని అమెరికా వెళ్ళిపోవడం… అక్కడే ఉద్యోగం.. అలా పదిహేనేళ్ళ పాటు అక్కడ ఉండిపోవడంతో ఊరిని నేను, నన్ను మా ఊరు మరిచిపోయాము.

రెండేళ్ళక్రితం మా నాన్నగారు చనిపోయినప్పుడు మా ఊరు వెళితే నాకు తెలిసినవాళ్ళెవరూ కనిపించలేదు. ఊళ్ళో కరువువల్ల నారాయణ కుటుంబంతో పాటు చాలామంది సన్నకారు రైతులు పడమరకి వలసవెళ్ళి పోయినట్లు మావాళ్లు చెప్పడంతో నారాయణ కుటుంబాన్ని చూడాలన్న నా కోరిక తీరలేదు.

ఆ తరువాత పొలాన్ని అమ్మేసి విశాఖలోనే ఇల్లు కట్టుకుని స్థిరపడిపోయాను. ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం పదవతరగతిలో చూసిన సన్యాసి… ఇన్నాళ్ళకు అది కొల్లేటి ప్రాంతంలో కనిపించడం వింతకాక మరేమిటి? అతనిచ్చిన కాఫీ తాగుతూ “సన్యాసీ! నువ్వెంటి ఇక్కడ?” అని అడిగాను.

“మీరు అమెరికా వెళ్ళిపోయిన తరువాత నేను డబ్బు ఇబ్బంది వల్ల ఇంటర్ తరువాత చదువు ఆపేసి వ్యవసాయంలోకి దిగాను. కాని వరుసగా మూడేళ్ళు కరువు రావడంతో ఊరంతా బీడైపోయింది. దాంతో మా అయ్య మంచం పట్టేశాడు. ఆ ఉన్న రెండెకరాలు అమ్మి ఇద్దరక్కలకి పెళ్ళి చేసేశాము. ఇంక అక్కడ ఉంటే పస్తులుండాలని నాకనిపించింది. మాకు తెలిసిన ఓ పంచదార మిల్లు ఓనర్‍ది ఇదే ప్రాంతం. ఇక్కడతనికి చాలా చేపల చెరువులున్నాయి. అతను నన్నూ, నా భార్యని ఇక్కడికి తీసుకొచ్చేసి చెరువుల్ని చూడమని చెప్పాడు… అప్పట్నుంచీ ఇక్కడే ఉంటున్నాను. అయ్య, మా అమ్మ ఐదేళ్ళ క్రితం చనిపోయారు” అని చెబుతుంటే నేను మౌనంగా వినసాగాను.

ఇంతలో రెండయింది. సన్యాసి నా దగ్గరకొచ్చి “రామంబాబూ! ఇక్కడికి దగ్గర్లోనే కొల్లేటికోట లంక గ్రామంకి దగ్గర్లోనే నేను కుటుంబంతో ఉన్నాను. మీకభ్యంతరం లేకపోతే మా ఇంటికిరండి” అన్నాడు.

వాడి మాటలు నాకు ఆనందాన్ని కలిగించాయి. వాడిని తీసుకుని జీపులో వాడుంటున్న ఊరికి బయలుదేరాము. దారి పొడవంతా చెరువులే… మధ్య మధ్య గట్లు… ఆ గట్టుమీదనుంచే మా జీపు వెళుతోంది… చాలాచోట్ల చెరువులు ఎండిపోయాయి. బీటలు వారి కనిపిస్తున్నాయి.

“సన్యాసీ! నువ్వు చేపల చెరువులొదిలేసి ఈ టీ దుకాణం ఏంటీ? ఆ చెరువులు ఇప్పుడు లేవా?” అని నా సందేహాన్ని వాడికి చెప్పాను.

“నేనిక్కడికి పదిహేనేళ్ళ క్రితం వచ్చాను బాబు. నేను కాదు మనూళ్ళో మరికొందరు, చుట్టుపక్కలనుంచి చాలామంది వచ్చారు. అప్పట్లో వేల చెరువులు… వేలల్లో నాలాంటి కూలీలు… ఇంకా కావాలనేవారు. నేనే మనూరునుంచి చాలామందిని తెచ్చాను. కానీ 2005లో ఆపరేషన్ కొల్లేరు సుప్రీంకోర్టు తీర్పుతో వచ్చింది. కొన్ని వందల చెరువుల్ని ప్రభుత్వం పేల్చేసింది. దాంతో నాలాంటివాళ్ళు ఒడ్డున పడిపోయారు. పనులేకుండా పోయింది” అని చెప్పాడు సన్యాసి.

“మరి ఆ చెరువుల స్వంతదారులు గొడవ చెయ్యలేదు… వాళ్ళూ రైతులే కదా?”

“బాబూ! వాళ్ళు రైతులు కాదు… అంతా పెద్దలు. పెద్ద రాజకీయనాయకులు… కంట్రాక్టర్లు… డబ్బున్నోళ్ళు… అందులో మంత్రులు కూడా ఉన్నారు. అసలు 7వ కాంటూరు నుంచి 3వ కాంటూరు దాకా ఉన్న భూముల్ని ఆక్రమించి లోపల చెరువుల్ని తవ్వేశారు… వాళ్ళంతా ఎక్కడో హైదరాబాద్‍లోనో, ఢిల్లీలోనే ఉంటారు. మాలాంటి కూలీలే ఇక్కడ ఈ చెరువుల్ని చూస్తూ ఉంటారు.”

“అసలు మొత్తం ఈ ప్రాంతం ఎన్ని ఎకరాలుంటుంది?”

“పదవ కాంటూరు దాకా రెండులక్షల ఎకరాలంటారు…. సుప్రీంకోర్టు ఐదవ కాంటూరు దాకా చెరువుల్ని తవ్వుకోవచ్చని, ఐదవ కాంటూరు నుంచి చెరువులుండకూడదనీ పర్వావరణం కోసం వాటిని పూడ్చేయ్యాలని చెప్పడంతో వేల చెరువులు పోయాయి. నిజానికి ఈ ప్రాంతమంతా ఒకప్పుడు మంచినీటి సరస్సు కానీ… విపరీతంగా చేపల చెరువుల్ని తవ్వేయడంతో అంతా మురికి నీరైపోయింది. ఇప్పుడు మాకు తాగడానికి మంచినీరు లేదు. కిలోమీటరు దూరం వెళ్ళి బోరు నీరు తెచ్చుకుంటాను” అని చెప్పాడు సన్యాసి.

ఇంతలో మా జీపు ఉళ్ళోకి ప్రవేశించింది. ఊరుకి దూరంగా ఓ చెరువు దగ్గర ఒడ్డుమీద రేకుల షెడ్డుతో కట్టిన ఇంటిముందు ఆగింది.

“రండి బాబూ! ఇదే మా ఇల్లు” అని చెప్పాడు. నేను జీపు దిగి ఇంట్లోకి వెళ్ళాను. చుట్టూ ఎండిన చెరువులు. లోపలినుంచి అతని భార్య కాబోలు వచ్చి నాకు దండం పెట్టింది.

పిల్లలు స్కూలుకి వెళ్ళారు అని చెప్పాడు.

కాళ్ళు చేతులు కడుక్కున్న తరువాత భోజనం వడ్డించిందామె.

“ఈమె నా భార్య శైలజ.. మన ప్రాంతమే… ఇద్దరు పిల్లలు మాకు” అని చెప్పాడు.

ఆ సమయంలో నాకు బాగా ఆకలి వేస్తుండటంతో భోజనం చాలా రుచిగా అనిపించింది. అరటి ఆకులో వేడి అన్నం, పప్పుచారు. ఇది మా ప్రాంతపు భోజనం. తిని చాలారోజులైంది. తిన్న తరువాత బయట చెట్టుకింద మంచం వేశాడు. దానిమీద కూర్చుంటే చల్లని గాలి వీస్తూ హాయి గొలుపుతోంది.

“సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్ళారా? ఎందుకంత కఠినమైన తీర్పు ఇచ్చింది?”

“ఒకప్పుడు ఈ కొల్లేటి ఎక్కడో రష్యానుంచి సైబిరియానుంచి వేల పక్షుల వలస వచ్చేవట… కానీ చెరువులు తవ్వేయడంతో అవి రావడం మానేశాయి. వర్షాలు తగ్గిపోయాయి. ప్రజలు ఎక్కువైపోయి ఈ ప్రాంతం అంతా కాలుష్యంగా తయారైపోవడంతో సుప్రీంకోర్టు ఓ కమిటీని పంపి తీర్పిచ్చింది.

“ఇప్పుడు ఈ చెరువు ఓనర్ ఇక్కడ లేడా? మరి నువ్వు ఇక్కడే ఉండిపోయావేమి?”

“మొదట్లో నాకు బాగుండేది. ఇద్దరు పిల్లలు ఇక్కడే పుట్టారు. ఈ ఇల్లు మా యజమాని కట్టి ఇచ్చాడు. ఇప్పుడు మన ఊరు వెళ్ళినా నేను బతకలేను. అక్కడ నాకు సెంటు పొలం లేదు. ఇక్కడైతే నాకు కనీసం ఇల్లయినా ఉంది. అందుకే ఇక్కడ ఉన్నాను. ఎలాగు ఇక్కడ పక్షుల కేంద్రం వల్ల బోలెడు టూరిస్టులు వస్తారు. అందుకే అక్కడ టీ దుకాణం పెట్టాను. రోజూ బతకడానికి డబ్బులొస్తాయి. మరో పదేళ్ళు ఉంటే పిల్లల చదువులైపోతాయి. అప్పటిదాకా ఇక్కడే ఉంటాను” అన్నాడు వాడు.

నాలుగు అవుతుండగా నేను బయలుదేరాను. నాతోపాటు సన్యాసి కూడా బయలుదేరాడు.

“ప్రభుత్వాలకి, సుప్రీంకోర్టుకి పక్షులమీద ఉన్న ప్రేమ నాలాటి పేద కూలీల మీద లేనట్టున్నది.. ఎక్కడినుంచో వలస వస్తున్న పక్షులకి ప్రమాదం అని మా బతుకు తెరువైన చెరువుల్ని నాశనం చేశాయి. మేము రోడ్డున పడ్డాం. ఆ పక్షుల లాగే మేమూ ఎక్కడినుంచో వలస వచ్చాము. కానీ మేము మనుషులం కాబట్టి ఎవ్వరూ ఆలోచించటం లేదు. పక్షుల కన్నా హీనమైపోయాము” అన్నాడు సన్యాసి నిర్వేదంగా…

నాకెందుకో వాడి మాటల్లో విచారం వినిపించింది. విషాదం తొంగిచూసింది. వాడికి ఏం చెప్పాలో తోచక మౌనం దాల్చాను. జీపు వేగం పుంజుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here