[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.
1. సెంటిమెంటు
“పిల్లోనికి నాలుగు రోజుల్నుండీ జొరం ఇడ్సకుండా కాస్తాండాదమ్మా, దర్మాసుపత్రిలో రొండు రోజులు చూపించినా తగ్గలేదు” దుఖంతో చెప్పింది పనిమనిషి సుబ్బమ్మ యజమానురాలు లక్ష్మిదేవితో.
“ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళకూడదా, బాగా చూసేవాళ్ళు కదా” అంది లక్ష్మిదేవమ్మ.
“దుడ్లు లేవుమ్మా, మా ముండ సచ్చినోడు లారీకి పొయ్యి వారం దినాలాయె, ఇంగా రాలేదు, నాలుగైదు తావుల్లో అడిగితే ఎవరూ ఇవ్వలా” బాధగా చెప్పింది సుబ్బమ్మ.
“కాలాలు బాగాలేవే, ఎలాగైనా సరే మంచి డాక్టర్ దగ్గరకు త్వరగా తీసుకెళ్ళి రక్తపరీక్ష చేయించు” సలహా ఇస్తున్నట్లుగా అంది లక్ష్మిదేవమ్మ.
“నిన్న సందకాడ ఆ మాటే అనుకున్నానమ్మగోరూ, ఇయ్యాల మీ కాడనే అంతో ఇంతో ఇప్పించుకోని పిల్లోనికి చూపించుకోవల్లని, ఇన్నూర్రూపాయలు ఇవ్వండమ్మా, జీతంలో పట్టుకుందురు” ప్రాధేయపడిగింది సుబ్బమ్మ.
“అయ్యో, నా దగ్గర ఇప్పుడు లేవు కదే, ఐదు వందలు వుంటే బ్లౌజు కుట్టించుకున్న కూలీ ఇచ్చేశాను, సమయానికి మీ అయ్యగారు కూడా లేరు, క్యాంపుకు వెళ్ళారు” చెప్పింది లక్ష్మిదేవమ్మ.
ఓ గంట తర్వాత, సుబ్బమ్మ వెళ్ళిపోగానే…
“మమ్మీ, సుబ్బులు పిల్లాడికి ట్రీట్‌మెంట్ కోసమేగా డబ్బు అడిగింది, బీరువాలో పెట్టమని పదివేలు కట్ట రాత్రే నా చేతికి ఇచ్చావుకదా, ఆ డబ్బులోనుండీ రెండు వందలు ఇచ్చివుండొచ్చు కదా, డబ్బు అస్సలు లేదని ఎందుకు అబద్దం చెప్పావ్?” తల్లిని అడిగింది లక్ష్మిదేవమ్మ పద్నాలుగేళ్ళ కూతురు.
“నీకేం తెలీదు, నోర్మూసుకో,ఇవాళ శుక్రవారం, ఇంట్లోనుండీ ఒక్క నయాపైసా సొమ్ము కూడా గడప దాటి బయటకు వెళ్ళనీకూడదు, అలా కాకుంటే ఆ లక్ష్మిదేవి తల్లి మన ఇంట్లో నిలవదు, ‘సెంటిమెంట్’ ఫీలవుతూ చెప్పిందామె కూతురికి.
మరుసటిరోజున…
“రంగమ్మా, మా సుబ్బులు ఇంకా పనిలోకి రాలేదు, తను వుండేది మీ వాడలోనే కదా?” ప్రక్కింటి పనిమమిషిని వాకబు చేసింది లక్ష్మిదేవి.
“అయ్యో, మీకు తెలీదామ్మా, సుబ్బులు కొడుక్కు టయానికి ఆసుపత్రికి తీసుకోనిపోక జొరం తలకెక్కి రాత్రే సచ్చిపోయినాడు” చెప్పింది బాధగా రంగమ్మ.
2. పరీక్ష
“అమ్మాయికి పరీక్ష ఫీజు కట్టాలంటున్నావు, నీ కూతురు ఇప్పుడు చదివి ఉద్యోగాలు చేసి ఊళ్ళు ఏలాల్సిన పనిలేదు గానీ నోర్మూసుకుని ఇంట్లో పడుండమను, ఇప్పటిదాకా దాని చదువు కోసం పెట్టిన డబ్బే దుబారా అనుకుంటే, మళ్ళీ పరీక్ష ఫీజు అంటున్నావు” కోపంగా అన్నాడు అమరేశ్వర్ భార్యతో.
“అలా అనకండీ, మనమ్మాయి గ్యారంటీగా పాసవుతుందని లెక్చరర్లంతా చెబురున్నారు, ఈ ఒక్కసారికి ఫీజ కట్టేయండి” ప్రాధేయపడింది రాజేశ్వరి.
“దాని చదువు విషయంలో ఇదే చివరిసారి నీ మాట వినడం, నువ్వు చెప్పినట్లు పాస్ కాక ఫెయిల్ అయ్యిందో మళ్ళీ చదువు మాట ఎత్తకుండా దాని కాళ్ళు విరిచి మూలన కూర్చోబెడతా” అన్నాడు అమరేశ్వర్.
మూడు నెలల తర్వాత…, ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నాలుగో రోజు….
“అమ్మా, నా ఇంగ్లీష్ బుక్ ఎంత వెదికినా కనిపించడం లేదు, ఇంపార్టెంట్ మెటీరియల్ అంతా అందులోనే వుంది, నువ్వుగానీ చూశావా?” తల్లి రాజేశ్వరిని కంగారుగా అడిగింది సుస్మిత.
“లేదు కదమ్మా, రేపు ఇంగ్లీష్ పరీక్షే కదా, సరిగ్గా చూడు, ఎక్కడ పెట్టావో” తనూ ఆందోళనగా అంది రాజేశ్వరి.
మరుసటి రోజున…
“ఎలా రాశావమ్మా ఇవాళ్టి పరీక్ష?”ఎగ్జాం సెంటర్ నుండీ రాగానే అత్రంగా అడిగింది రాజేశ్వరి కూతురిని.
“రాత్రంతా వెదికినా ప్రిపరేషన్ కోసం ఇంగ్లీష్ బుక్ కనిపించలేదు కదమ్మా, రిజల్ట్స్ వచ్చేంతవరకూ చెప్పలేను” దిగులుగా అంది సుస్మిత.
పరీక్షలు పూర్తయిన సరిగ్గా వారం రోజుల తర్వాత…
“సుస్మితా, ఇది నీ పుస్తకమేనేమో చూడు, ఎక్కడో పడేసుకును మరెక్కడో వెదికితే సమయానికి ఎలా దొరుకుతుంది?” పనికిరాని పాత సామాన్లు వున్న గదిలో నుండీ పుస్తకాన్ని బయటకు తీస్తూ కూతురిని మందలిస్తున్నట్లుగా అంది రాజేశ్వరి పరీక్ష ఫీజు ఇచ్చే రోజున భర్త అన్న మాటలు గుర్తుకు వస్తుండగా.
3. తృప్తి
“అయ్యా, ఈ ఇంటి యజమాని మీరేనా?” అడిగాడు వెంకటేశ్వర్లు పల్లె మొదట్లోనే వున్న ఇంటిముందు కూర్చుని బీడీ కాల్చుకుంటున్న నలభై ఏళ్ళ వ్యక్తిని.
“అవునయ్యా, ఏం కావాలి మీకు?” అడిగాడాయన సందేహంగా చూస్తూ.
“నా పేరు వెంకటేశ్వర్లు, పట్నంలో గవర్నమెంటు టీచర్‌ను, ఇప్పుడు మాత్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది పథకాలు, వాటివల్ల మీకు అందుతున్న ప్రయోజనాల గురించి వివరాలు నమోదు చేసుకోవడానికి వచ్చాను, మీ పేరు చెప్పండి?” అడిగాడు వెంకటేశ్వర్లు.
“నా పేరు గోపాలయ్య, ఇంకా ఏం వివరాలు కావాలి మీకు?” ప్రశ్నించాడాయన.
“మీరు ఏం చేస్తారు?” అడిగాడు వెంకటేశ్వర్లు.
“వ్యవసాయ కూలీని” బదులిచ్చాడు గోపాలయ్య.
“మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది వుంటారు, వాళ్ళ పేర్లు, వయసులు చెప్పండి?” అడిగాడు వెంకటేశ్వర్లు తన వద్దవున్న సమాచారం పుస్తకంలో నమోదు చేసుకోవడానికి రెడీ అవుతూ.
“పిల్లలతో కలిసి మొత్తం అయిదుగురం, మా ఇంటిదాని పేరు అలివేలు, వయస్సు నలభై, నా మాదిరే వ్యవసాయ కూలీ, మాకు ఇద్దరు కూతుర్లు, కృష్ణవేణి, కావేరి, కొడుకు పేరు భద్ర” చెప్పాడు గోపాలయ్య.
“చాలా ఆశ్చర్యంగా వుందే, ముగ్గరు పిల్లలకూ వరుసగా నదుల పేర్లే పెట్టారు, మీకు నదులు అంటే అంత అభిమానమా?” నవ్వుతూ అడిగాడు వెంకటేశ్వర్లు.
“అభిమానమా, పాడా, ఈ కరువు సీమలోని బీడు భూములను తడిపి మీ బతుకులు బాగుచేస్తామని నలభై ఏళ్లకు ముందునుండీ నాయకులు చెబుతూనే వున్నారు, మేము వింటూనే వున్నాం తప్ప వాళ్ళ మాటలు ఇప్పటికీ పూర్తిగా నిజం కాలేదు, కనీసం ఆ నదుల పేర్లన్నా నా పిల్లలకు పెట్టుకుని నోరారా పిలవడం ద్వారానైనా కాస్తంత ‘తృప్తి’ పొందుదామని” బదులిచ్చాడు గోపాలయ్య విస్తుబోయి చూస్తున్న వెంకటేశ్వర్లుతో.
4. కారణం
“శ్రీధర్, సత్యనారాయణతో మాట్లాడి చాలా రోజులయ్యింది, కళ్ళముందు మెదులుతున్నాడు, వాడితో ఓసారి మాట్లాడిస్తావా?” సాయంత్రం ఏడు గంటల సమయంలో కొడుకు ఆఫీసు నుండీ ఇంటికి రాగానే తన ఒకప్పటి కొలీగ్, చాలా ముఖ్యమైన స్నేహితుడుతో మాట్లాడాలన్నట్లు అడిగాడు అనారోగ్యంతో లేవలేని స్థితిలో మంచం మీద వున్న డెబ్బై ఏళ్ల వెంకట్రామయ్య.
“మధ్యాహ్నం నుండీ మొబైల్ సరిగ్గా పని చేయడం లేదు నాన్నా, పని చేయగానే మాట్లాడిస్తా” తండ్రికి జవాబిచ్చాడు శ్రీధర్.
“ఫోన్ పని చేస్తోందా శ్రీధర్, సత్యంతో మాట్లాడాలి” మరుసటి రోజు కొడుకు ఆఫీసుకు వెళుతుండగా ఒంట్లోని శక్తినంతా కూడదీసుకుని మళ్ళీ అడిగాడు వెంకట్రామయ్య.
“ఇంకా లేదు నాన్నా, ఏదో ప్రాబ్లెం వున్నట్లుంది, మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో మెకానిక్ దగ్గరకు వెళ్ళొస్తా, సాయంత్రం మాట్లాడుదురుగానీ” చెప్పాడు తండ్రికి శ్రీధర్.
“బాబూ, ఫోన్ రిపేర్ చేయించావా?” సాయంత్రం కొడుకు ఇంటికి రాగానే ఆత్రంగా అడిగాడు వెంకట్రామయ్య అదే పనిగా ఎదురు చూస్తున్నవాడిలా.
“మొబైల్ రిపేర్ అయ్యిందిగానీ, సత్యం అంకుల్ నెంబర్‌కు ఎన్నిసార్లు ట్రై చేసినా కలవడం లేదు నాన్నా” చెప్పాడు శ్రీధర్ జేబులో నుండీ సెల్ ఫోన్ తీసి కీ ప్యాడ్ మీదవున్న నెంబర్లు నొక్కుతూ.
“రేపు ఎలాగూ ఆదివారమే కదా, కారులో నువ్వే వాళ్ళ ఊరికి వెళ్ళి సత్యాన్ని ఇక్కడికే వెంటబెట్టుకుని రారాదా” అడిగాడాయన.
“ఇంటికి రాగానే మొబైల్ స్విచ్చాఫ్ చేసేస్తూ, లైన్ కలవడం లేదని, రిపేర్ అయ్యిందని మామయ్యగారికి ఎందుకండీ అబద్దాలు చెబుతున్నారు?” భర్తను అడిగింది శ్రీధర్ భార్య.
“నాన్న తను మాట్లాడాలని పదేపదే కలవరిస్తున్న సత్యం అంకుల్ హార్ట్ అటాక్‌తో పదిరోజుల క్రితమే చనిపొయాడట నీలిమా, బెడ్ మీద రోజులు లెక్కిస్తున్న ఈ చివరి రోజుల్లో ప్రాణమిత్రుడు లేడన్న సంగతి చెప్పి నాన్నకు అశాంతిని మిగల్చడం ఎందుకు?, హాయిగా కన్ను మూయనీయక” చెప్పాడు శ్రీధర్ భార్యతో.