[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
రేడియో మనందరికీ… ఆ రోజుల్లో… ఒకే ఒక్క వినోద సాధనంగా వుండేది కదా! మా ఇంట్లో ఓ పెద్ద హార్మోనియం పెట్టె అంత మర్ఫీ రేడియో వుండేది గూట్లో. దాని మీద నోట్లో వేలేసుకున్న ఓ ముద్దులొలికే బాబు ఫొటో వుండేది కింద! పిల్లలెవరైనా ముద్దొస్తే మర్ఫీ పాపాయిలా వున్నాడు అనేవారు! ఆ రేడియోలో పాట వస్తుంటే నేను వెనకాల వైపు తిప్పి చూసేదాన్నిట!, అందులో వుండి పాడుతున్నారేమో అని. మా అమ్మ పాటలు కూడా అప్పుడప్పుడూ రేడియోలో వచ్చేవి! కొద్ది కాలం అయ్యాకా రేడియో నాటకాలు కూడా అమ్మ వేసేది! నాకు రేడియోలో సంస్కృత వార్తలు వినే మా నాన్నగారంటే నవ్వుగా వుండేది. “సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః బలదేవానంద సాగరః.. తప్ప నీకేం అర్థం అయింది నాన్నా” అని అడిగేదాన్ని. దానికాయన ఇచ్చిన జవాబులో చాలా అర్థం వుంది. “మనం కూడా వినకపోతే సంస్కృత వార్తలు ఆపేస్తారమ్మా… సంస్కృతం ఎలా వుంటుందో పిల్లలకి తెలిసే అవకాశం వుండదు” అనేవారు!
ఎంతటి నిజం ఆ మాట? సెల్‍ఫోన్లు వచ్చాకా టెలిగ్రాఫ్ ఆఫీస్ మూత పడిపోయింది… పోస్ట్ ఆఫీస్ ఏదో తప్పనిసరై నడుస్తోంది! మా చిన్నప్పుడు విన్న బాలానందం ప్రోగ్రామ్‌లలో ‘పొట్టి బావా చిట్టి మరదలు’, ‘బుజ బుజ రేకుల పిల్లుందా? బుజ్జా రేకుల పిల్లుందా? స్వామీ దండం పిల్లుందా? స్వరాజ్యమిచ్చిన పిల్లుందా’ లాంటి పాటలూ; అసలు ‘రారండోయ్… బాల వినోదం విందామా… బాలికలారా రారండోయ్… చెంగున రారండోయ్’ అన్న ఆ ప్రారంభ గీతమే ఎంతో బావుండేది.
బాలానందంలో పాట పాడడం అప్పట్లో ఎంతో గ్రేట్! మా కాలనీలో కూడా ఎర్ర గులాబీ బాలానందం సంఘం అని రాజేశ్వరరావు గారనే ఆయానా, ఆయన భార్యా నడిపేవారు. నేను అందులో నాటికలు కూడా వేసేదాన్ని! ఓసారి నేనూ, భవానీ, మంజూ, రమాదేవీ, అందరం ఆవిడతో కలిసి రేడియో స్టేషన్‌కి వెళ్ళి, బాలానందం అన్నయ్యనీ, బాలానందం అక్కయ్యనీ చూసాం. న్యాయపతి రాఘవరావు గారిని బాలనందం అన్నయ్య అనీ, కామేశ్వరి గారిని బాలానందం అక్కయ్య అనీ అనేవారు. పిల్లలెవరెళ్ళి ‘అన్నయ్యా’ అని పలకరించినా, ఆయన వెంటనే “ఓరి ఓరి ఓరి… ఎంత పొడుగైపోయావో… ఎన్ని రోజులయిందో చూసి” అనేవారు! అన్నయ్య నన్ను గుర్తుపట్టి పలకరించారని, ఇంటికొచ్చి గర్వంగా చెప్పేవాళ్ళం! అన్నయ్య ఎవర్ని అయినా అలాగే పలకరింఛేవారని తర్వాత పెద్దయ్యాకా తెలిసింది. అలా బిల్లకంటి రాజేశ్వరరావుగారితో కలిసి మా కాలనీ పిల్లలం అంతా రేడియో స్టేషన్‌కి వెళ్ళి “అందమైన చందమామ… అందరాని చందమామ… అమ్మా నా చేతిలోని అద్దములో చిక్కినాడె” అని పెద్ద గొంతులేసుకుని, ఏటి కొక్కళ్ళూ, కోటి కొక్కళ్ళం లాగుతూ పాడేసామా… “చిట్టి చిట్టి చెల్లాయిలొచ్చి ఎంత బాగా పాడేసారో… చప్పట్లు కొట్టండి మరి!” అని అక్కయ్య చప్పట్లు కొట్టించేసారు. మేం గొప్ప విజయోత్సాహంతో, పల్లీలు కొనుక్కు తింటూ బస్సెక్కి ఇంటికొచ్చేసాం. మర్నాడు శనివారం… బాలానందంలో మా పాట వస్తుందని ఇంట్లో వాళ్ళు రేడియో ముందు కూర్చున్నారు. మేమూ మా శక్తి కొద్దీ టముకు వేసినట్టు కాలానీ అంతా తిరిగి, మా పాట బాలానందంలో వినండి అని చెప్పామా… రానే వచ్చింది. కరెంట్ పోకూడదని వెయ్యి దేవుళ్ళకి మొక్కాం. దేవుడు కనికరించాడు. కరెంట్ పోలేదు. మా పేర్లు కూడా చెప్పారు… పాట వచ్చింది. సగం పాడాకా, ఆపేసి చప్పట్లు కొట్టించేసారనుకోండీ… అమ్మ నా వైపు చూసి నవ్వి, పాలకోవా నోట్లో పెట్టి… “బాగా పాడావు” అంది. అసలు అందులో నా గొంతేదో నాకే అర్థం కాలేదు… రద్దీగా వున్న రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, నాలుగు రకాల దుకాణాల వాళ్ళూ మార్కెట్‍లో బండ్ల వాళ్ళూ అరిచినట్లుగా వుంది అది! సరే… అయిపోయింది… కావాలంటే డాన్స్ చేద్దాం… లేదా నాటకాలు వేద్దాం, కానీ ఈ పాట మన ఒంటికి అచ్చిరాదు, ఇంకెప్పుడూ పాడొద్దు అని నేను ఒట్టు పెట్టేసుకున్నాను… కానీ విధి పరిహసించింది! ఇంత పెద్ద మాటలూ… వాటికి అర్థాలూ నాకు ఆ వయసులో తెలీవు కానీ… మరునాడు సాయంత్రం, నేనూ మా అమ్మా అలవాటుగా చిక్కడపల్లి వెళ్తున్నాం, చిక్కడపల్లి ఎందుకు వెళ్తున్నామో గుర్తు లేదు, గుర్తుంచుకోదగ్గ పని కూడా అయి వుండదు! మేం ఇద్దరం చెయ్యీ చెయ్యీ పట్తుకుని వూపుకుంటూ, గొప్ప స్నేహితుల్లా, సాయంత్రం అయ్యేసరికి చిక్కడపల్లి వెళ్ళీ కూరలో, నెయ్యో, అద్దె పుస్తకాలో, ఏ పనీ లేకపోతే మావయ్యా వాళ్ళింటికో ఆంధ్రాబ్యాంకు సందులో… అంత దూరం వెళ్ళాం కదా అని, సుధా హోటల్‌కో ఇడ్లీ తినడానికి, లేదా బాలాజీ బజరంగ్ దాకా వెళ్ళి ఆకూ పకోడీ, మిర్చీ బజ్జీ, కలాకండ్… లేదా వేడి వేడి జిలేబీలూ కొనుక్కోడానికో వెళ్ళేవాళ్ళం! నేను లోటస్ కాఫీ పొడీ, ప్రభాకర్ నెయ్యి దుకాణం, యాదగిరి పచారీ షాపూ, బ్రాండ్స్ లాగా, “మీ వూర్లో ప్రభాకర్ నెయ్యి దుకాణం వుందా? లోటస్ కాఫీ దొరుకుతుందా?” అని మా కజిన్స్‌ని అడిగేదాన్ని! అలా ఎంచక్కటి మూడ్‌లో చార్మినార్ చౌరస్తా అనే ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్‌లో… చెయ్యీ చెయ్యీ పట్టుకుని నేనూ అమ్మా వెళ్తుంటే, మా ఫ్రెండ్ రమాదేవీ, వాళ్ళమ్మగారు సుబ్బలక్ష్మి గారు ఎదురుపడ్డారు! ఆవిడ చాలా ముక్కుసూటి మనిషి… “నిన్న బాలానందంలో మీ పాట విన్నాను” అంది. నా మొహం, మొదటి సినిమా ప్రివ్యూ అవగానే, రిపోర్టర్స్‌ని చూసి వెలిగే హీరోయిన్ మొహంలా వెలిగిపోయింది! వెంటనే ఆవిడ “వినలేక చచ్చిపోయాం… ఇంకెప్పుడూ పాడకండి…. నేను మీ బాలానందం ఆంటీతో కూడా చెప్పాను… గండు పిల్లులు పోట్లాడుకున్నట్లు వుంది ఆ పాట” అంది. ఒక్కొక్క మాటకీ నేను తల వంచేసుకుంటూ, భూమి లోకి ఇక దిగలేక, అలా వుండిపోయాను… మా అమ్మ నా మొహం చూసి, “ఏదో చిన్న పిల్లలు, పాడారు. అంతే చాలు వదినగారూ!” అంది.
ఆవిడ తల అడ్డంగా వూపేసి “మీరు ఎంత గొప్ప సింగరూ? మీ పేరు పాడు చెయ్యడానికి కాకపోతే… దీనికి పాట లెందుకండీ? చక్కగా వుంటుంది. డాన్స్ నేర్పించండి… బావుంటుంది” అనేసి వెళ్ళిపోయింది. అమ్మ “పద, సుధా హోటల్‍కి వెళ్ళి ఇడ్లీ తిందాం” అంది, నన్ను హేపీ చెయ్యడానికి. నేను తల ఎత్తి, నా కళ్ళు మెరుస్తూండగా, “అమ్మా నేను డాన్స్ నేర్చుకుంటానే” అన్నాను. అలా ఆవిడ నా బుర్రలో కొత్త బీజం వేసి వెళ్ళిపోయింది!
మా అమ్మ సీరియస్‌గా నాకు డాన్స్ నేర్పించే గురువు కోసం వెదికి, ఎవరో రామ్‌కోటిలో గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ వుందిగా అంటే, నేను ప్రతి రోజూ బస్సెక్కి ఒక్కదాన్నీ వెళ్ళలేననీ, ఎప్పుడో వదిలేసిన సంగీతంలో తనూ, డాన్స్‌లో నేనూ చేరేటట్టు, మా అన్నయ్య ఫ్రెండ్ నానీని అప్లికేషన్ ఫారాలు తెమ్మంది! నానీ అనే విష్ణువఝల హనుమంతరావు, అప్పటికే రామ్‌కోటి మ్యూజిక్ కాలేజ్‍లో మూడవ ఏడు సితార్ నేర్చుకుంటున్నాడు. వాళ్ళింట్లో, పొడవాటి సితార్ పెట్టె కూడా వుండేది! నేను డాన్స్ నేర్చుకుంటాను అనగానే వెళ్ళి తీసుకొచ్చాడు!
ఉమా రామారావుగారి క్లాస్‌లో నేను భరతనాట్యంలో చేరాను. వరలక్ష్మి గారి దగ్గర అమ్మ ఓకల్‌లో చేరింది. నాకు, సినీతారలు శ్రీలక్ష్మీ, మాధవీలు చాలా సీనియర్స్. కానీ మాధవి చెల్లెలు కీర్తి నా క్లాస్‌మేట్. అమ్మకి శ్రీలక్ష్మి అక్క శ్రీగౌరీ, ఎస్.సి. శశికళా (చిన్న పిల్లలు అయినా క్లాస్‌మేట్సే). శశికళ అంటే ఇప్పుడు సినిమా పాటలు పాడ్తున్న హేమచంద్ర తల్లి! నల్లూరి సుధీర్ కుమార్ సీనియర్ అయినా, వచ్చి శశికళని “మనసే అందాల బృందావనం పాడూ…” అని పాడించేవాడు! మాకు ఏ డాన్స్ నేర్చుకున్నా, ఫోక్ డాన్స్ ఫ్రీగా, అప్లయి చెయ్యకుండానే నేర్పించేవారు! అంటే ఎవరైనా ఆ క్లాస్‌కి వెళ్ళచ్చు అన్నమాట! గోపాలరాజ్ భట్ గారు ఆ క్లాసు తీసుకునేవాళ్ళు. ఆయన దగ్గర మా అమ్మ కూడా చిన్నప్పుడు జటాభవన్‌లో వున్నప్పుడు నేర్చుకుందిట. శ్రీరంగం గోపాలరత్నం గారు మాకు అప్పుడు ప్రిన్సిపాల్! పప్పు సోమేశ్వరరావు గారు వీణ చెప్తుంటే కిటికీ దగ్గర నిలబడి వినే వాళ్ళం. ఎల్లా వెంకటేశ్వరరావు గారూ వుండేవారు! అంతా మహామహులు నేర్పించేవారు. అప్పుడు మారేడ్‍పల్లిలో మ్యూజిక్ కాలేజ్‌కి ప్రసన్నలక్ష్మి ప్రిన్సిపాల్‌గా వుండేది. ప్రసన్నలక్ష్మి అంటే ‘సుడిగుండాలు’లో, అక్కినేని నాగేశ్వరరావు గారికి బోన్‍లో నిలబడి “హత్య చేయడంలో కిక్ వుంది” అని చెప్పే వేషం వేసిన అమ్మాయి.
(సశేషం)