అలనాటి అపురూపాలు-20

1
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

యష్ చోప్రా, పమేలా చోప్రాల ప్రేమ కథ:

యష్ చోప్రా తమ తల్లిదండ్రులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో ఒకరు. ప్రముఖ సినీనిర్మాత బి.ఆర్.చోప్రా ఆయన సోదరులలో ఒకరు. చోప్రా తన తొలి దర్శకత్వపు అవకాశాన్ని తన అన్నయ్య బి.ఆర్.చోప్రా 1959లో నిర్మించిన ‘ధూల్ కా ఫూల్’ చిత్రం ద్వారా పొందారు. 1969లో యష్ చోప్రా తన అన్నయ్య నిర్మించిన ‘ఆద్మీ ఔర్ ఇన్సాన్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధర్మేంద్ర, సైరాభానులు నాయికానాయికలుగా నటించారు. నటి ముంతాజ్ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. అప్పటి నుంచే ఆమెకీ, యష్ చోప్రాకి మధ్య ఆకర్షణ కలిగిందని వదంతులు రేగాయి.

పమేలా చోప్రా – భారత సైన్యంలో అధికారి అయిన మోహిందర్ సింగ్ కూతురు పమేలా సింగ్‍గా జన్మించారు. వారి సంతానంలో ఆమే పెద్దది, ఆమెకి ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు. తండ్రి దేశంలోని వివిధ మారుమూల ప్రాంతాలలో పనిచేయడం వల్ల పమేలా వివిధ సైనిక పాఠశాలలో చదివారు. ఆమె ప్రముఖ నటి సిమీ గరేవాల్‌కి కజిన్. పమేలా తండ్రి మోహిందర్ సింగ్, సిమీ గరేవాల్ తల్లి దర్శి గరేవాల్ తోబుట్టువులు.

పమేలా యష్‌ని తొలిసారిగా ఓ స్టార్ క్రికెట్ షోలో చూశారు. ఆమె కజిన్‌లిద్దరికీ సినీతారలంటే విపరీతమైన అభిమానం. అందుకని ఆ షో కి వెళ్ళాలని అనుకున్నారు. పమేలా తండ్రి సైన్యంలో అధికారి కాబట్టి ఆయనకి మూడు పాస్‌లు సులభంగానే లభించాయి. షోకి వెళ్లారు.

యష్ చోప్రా వీరికి ముందు వరుసలలో కూర్చున్నారు. కజిన్‍లిద్దరూ ఆయన గుర్తుపట్టి కేకలు వేశారు. యష్ వెనక్కి తిరిగి వారిని చూశారు. వారిద్దరూ అందమైన యువతులు. ఆయనకేమో అందమైన వాళ్ళంటే ఆసక్తి. అందుకని మ్యాచ్ జరుగుతున్నంతా సేపు వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నారట. అయితే వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. అంటే ఆ సమయంలో వారిద్దరూ ముఖాముఖి కలుసుకోలేదు. యష్ చోప్రా మేనకోడలి పెళ్ళి సందర్భంగా జరిగిన సంగీత్‌లో ఆమె ఆయనతో మొదటిసారి మాట్లాడారు. ఆమె అప్పుడు సెలవుల్లో తమ కజిన్ సిమీ గరేవాల్ ఇంటికి ముంబయి వచ్చారు. పమేలా పంజాబీ పాటలు బాగా పాడుతారని, సిమీ ఆమెను ఆ సంగీత్‍కి తీసుకువెళ్ళారు. అక్కడే పమేలా యష్‌ని కొద్దిసేపు కలిసారు. కానీ ఆ పూట ఆయన తన సినిమాలో నటించమంటూ హేమ మాలినిని ఒప్పించడానికే సమయం వెచ్చించారు. హేమ మాలినీ, ఆయనా బాల్కనీలో సమయం గడిపారు. పమేలా పాడడం మొదలుపెట్టాకనే ఆయన కిందకి వచ్చారు. బాగా పాడుతున్నావంటూ ప్రశంసించారు. ఆయన ఓ నిర్మాత అని పమేలకి తెలుసు, కాని ఆయనకి అభిమాని కాదు. ఆమెకు రాజ్‍కపూర్ అంటే ఇష్టం.

పమేలా, యష్ లది ప్రేమ వివాహం కాదు, నిజానికది పెద్దలు కుదిర్చిన పెళ్ళి. ఈ రెండు కుటుంబాలకీ, నటుడు రొమేష్ శర్మ అమ్మగారు ఉమ్మడి స్నేహితురాలు. ఢిల్లీలో జరిగిన ఓ వివాహంలో పాటలు పాడిన పమేలాని ఆవిడ చూసి యష్‌కి సరిజోడీ అవుతారని భావించారు. ఆమె నమ్మకం వమ్ము కాలేదు. పమేలా, యష్ అద్భుతమైన వైవాహిక జీవితాన్ని గడిపారు. ఆమె ముంబయిలోని బి.ఆర్. చోప్రా భార్యకి ఫోన్ చేసి పమేలా గురించి చెప్పారు, అదృష్టం కొద్దీ అదే సమయంలో యష్ ఆడిషన్స్ కోసం ఢిల్లీ వచ్చారు. రొమేష్, ఆయన తండ్రిగారు పమేలా ఆఫీసు వెళ్ళారు. అప్పట్లో పమేలా బ్రిటీష్ ఎయిర్‌వేస్‌లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఆమెని లంచ్‍కి బయటకు తీసుకెళ్ళారు. యష్ చోప్రా ప్రస్తావనే తీసుకురాలేదు. రొమేష్ శర్మ సరదా మనిషి కావడంతో సమయం సంతోషంగా గడిచిపోయింది. పమేలా ఉద్యోగస్తురాలనీ, ఆమెది బాబ్డ్ హెయిర్ అనీ బి.ఆర్. చోప్రా భార్యకి ముందే చెప్పారు! తరువాత పమేలా, ఆమె తల్లిదండ్రులు యష్‌ చోప్రాని కలవడానికి వెళ్ళారు. యష్ ఏమీ మాట్లాడలేకపోవడంతో, ఆ సమావేశం ఎటూ కాకుండా ముగిసింది. పిల్లలు సంకోచం లేకుండా మాట్లాడుకుంటారని పెద్దవాళ్ళు అక్కడ్నించి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏం మాట్లాడుకోవాలో తెలీలేదు. ఇబ్బంది పెట్టిన మౌనం ముగిసాక, “మనం ఇంతకు ముందే కలిసాం” అని ఆయన అన్నారు. “ఎక్కడ?” అని ఆమె అడిగితే, “ఒకసారి స్టార్ క్రికెట్ మ్యాచ్‌లో (ఆ సమయంలో ఆయన తన అందమైన కజిన్స్‌ని చూస్తున్నారని ఆమె అనుకున్నారు), రెండోసారి మా మేనకోడలు సంగీత్‌లో” చెప్పారాయన. పమేలా ఇంటికొచ్చాక, అబ్బాయి నచ్చాడా అని తల్లిదండ్రులు అడిగితే, “లేదు, మా మధ్య మాటలు సాగలేదు” అన్నారామె. ఆయనేమో తన కుటుంబసభ్యులతో “ఘంటీ నహీ బజీ” (సంబంధం కుదరలేదు) అన్నారు. అయితే విధి మరోలా తలచింది. యష్ ఫ్లయిట్ మిస్సయ్యారు. ఢిల్లీలో మరో రోజు గడపవలసివచ్చింది. అందుకని పమేలాతో మరో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సారి బాగా జరిగింది. యష్ మరో రూపాన్ని చూశారామె. లుంగీ కుర్తా ధరించి నేల మీద కూర్చుని ఢోల్కీ పైన చెంచాతో వాయిస్తున్నారు యష్, రొమేష్ సోదరి ఢోలక్ వాయిస్తున్నారు. వాళ్ళంతా పాడుతున్నారు. వాతావరణం అంతా సందడిగా ఉంది. ఈ సంబంధం కుదరదనుకుని వాళ్ళంతా విశ్రాంతిగా ఉన్నారు. పెళ్ళిచూపుల పేరుతో ఎవరినైనా చూడడానికి వెళ్తే ఎంతో కొంత టెన్షన్‍గా ఉంటుంది. ఈ సంబంధం ఇక కుదరదని అనుకున్నారు కాబట్టి ఈసారి అస్సలు టెన్షన్ లేదు. అనూహ్యంగా, ఆమెకి ఆయన నచ్చసాగారు. ఆయనకీ ఆమె నచ్చేసారు. ఆయన ముంబయి వెళ్ళి “ఘంటీ బజ్ గయీ” (కళ్యాణ ఘంట మ్రోగింది) అన్నారు.

అయితే పెళ్ళికి ముందు – ‘నటి ముంతాజ్, యష్ చోప్రాల మధ్య ఏదో ఉందనే పుకార్లలో నిజమెంత’ అని పమేలా రొమేష్ శర్మని అడిగారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, అంతే అని చెప్పారట ఆయన. ఆయన మాటలని పూర్తిగా విశ్వసించకపోయినా, పెళ్ళికి అంగీకారం తెలిపారు పమేలా. వారి వివాహం 1970లో జరిగింది. రెండు కుటుంబాలూ ఈ పెళ్ళిని పూర్తిగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో జరిపాయి. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు (ఆదిత్య, 1971; ఉదయ్ 1973) పుట్టారు (ఆదిత్య చోప్రా సినీ నిర్మాత, దర్శకుడు. నటి రాణి ముఖర్జీనీ పెళ్ళి చేసుకున్నారు. ఉదయ్ చోప్రా నటుడు, నిర్మాత). పెళ్ళి తరువాత యష్‌కీ, ఆయన అన్నయ్య బి.ఆర్. చోప్రాకి మధ్య కొన్ని అపార్థాలు నెలకొన్నాయి.

తన జీవితంలో తాను నేర్చుకున్న క్రమశిక్షణనంతా ఆమె మెట్టినింటికి తెచ్చారు. వాళ్ళింట్లో కథా చర్చలు జరిగేవి, అవి ఆ ఇంటి క్రమాన్ని పూర్తిగా తప్పించేవి. నలుగురైదుగురు కథకులు పొద్దున్నే వచ్చేసేవారు, రాత్రయినా కూర్చునేవారు. వాళ్ళందరికీ కూడా వంట చేయాల్సి వచ్చేది. ఇదంతా కొంత ఇబ్బందిగా ఉండేదామెకు. వాళ్ళింట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగేవి. ఆమెకి వినాలని ఆసక్తి ఉన్నా, యష్ ఆమెను వాటికి ఎన్నడూ ఆహ్వానించలేదు. అందుకని ఆమె బెడ్ రూమ్‌లోనే ఉండిపోయేవారు. ఆమెకి సంగీతం అంటే ఆసక్తి అని ఆయన గ్రహించినప్పుడు, తాము రికార్డు చేసిన పాటలను వినిపించేవారు. యష్ జీవితంలో భాగం కావాలంటే – ఆయన వృత్తి జీవితంలో భాగం పంచుకుంటేనే సాధ్యమని పమేలా పెళ్ళయిన కొద్దిరోజులకే గ్రహించారు. లేకపోతే అసలు కంటికే కనిపించరు ఆయన. యష్ ఓ చిత్రమైన మనిషి. నిద్రలో ఉండగా ఏదో గుర్తొస్తుంది, వెంటనే లేచి కాగితం మీద రాసుకుని మళ్ళీ పడుకునేవారు. సొంతగా తీసిన తన మొదటి సినిమాకి (దాగ్: ఎ పోయెమ్ ఆఫ్ లవ్, 1973) ఆయన ఎంతగానే శ్రమించారు. బి.ఆర్. చోప్రా ప్రమేయం లేకుండా తీస్తున్న సినిమా కాబట్టి తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం వుంది యష్‌కి. తర్వాత నెమ్మదిగా తన సినిమాల గురించి పమేలాకి చెప్పసాగారు.

తన సినిమాల్లో రొమాంటిక్‌గా ఉండే యష్ నిజ జీవితంలో మాత్రం చాలా ప్రాక్టికల్ మనిషి. ఆయన చిన్న పిల్లాడిలా ఉండేవారు. ఆకలేస్తే, మరుక్షణంలో తినేసేవారు. నిద్ర వస్తే, ఏ పని చేస్తున్నా ఆపేసి పడుకుండిపోయేవారు. ఇంట్లో ప్రవర్తించే తీరుకు, బయట ప్రవర్తించే తీరుకీ అస్సలు పోలిక ఉండదు. పని విషయంలో ఆయన సమర్థుడు, అన్నింటినీ తన నియంత్రణలో ఉంచుకుంటారు. కానీ ఇంటి విషయాలు పట్టవు. వాటిని పమేలాకి వదిలేసారు. ఆమెకి నచ్చినట్టుగా ఇంటిని నడపనిచ్చారు. ఆమెని బాధించిన ఒకే ఒక్క అంశం ఏంటంటే ఆయనకి తమ పిల్లల పుట్టినరోజులు గుర్తులేకపోవడం. పాపం, పిల్లలకి నాన్నంటే ఎంతో ఇష్టం! ఆదిత్యకి బాగా నిరాశ కలిగేది. అలా ఒకటి రెండు సార్లు జరిగింది.

తన కుటుంబం సెట్స్‌కి రావడం యష్‌కి ఇష్టం ఉండేది కాదు. ముఖ్యంగా చోప్రా కుటుంబంలో ఆడవాళ్ళెవరూ సెట్స్‌కి వెళ్ళరు. అవుట్ డోర్ షూటింగ్స్‌కి వెళ్ళేవాళ్ళు. పిల్లలు కాస్త పెద్దయి బడికి వెళ్ళే వయసొచ్చాకా, వాళ్ళ స్కూళ్ళకి సెలవులిచ్చిప్పుడు మాత్రమే అవుట్‍ డోర్ షూటింగ్స్ వెళ్ళనిచ్చేవారు. ఆదిత్య, ఉదయ్‍ల పెంపకం బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటిపట్టునే ఉండేవారు పమేలా. అదేమీ కష్టమనిపించేది కాదామెకి. భర్త తనదైన ప్రపంచంలో ఉంటారు కాబట్టి పిల్లలతో గడపడం కష్టమని ఆమెకు తెలుసు. తన పిల్లలు ఏం చదువుతున్నారో కూడా యష్‌కి తెలిసేది కాదు. స్కూల్లో పేరెంట్-టీచర్ మీటింగ్స్‌కి ఒక్కసారి కూడా ఆయన హాజరు కాలేదు. కాని పమేల ఎన్నడూ దీని గురించి ఫిర్యాదు చేయలేదు. కాలం గడిచేకొద్దీ యష్‌లో మార్పు వచ్చింది. అది గొప్ప మార్పు. ఆయన ఆవిడను పెళ్ళి చేసుకోకపోయుంటే – సెట్స్ పై యాంగ్రీ మ్యాన్‌గానే ఉండిపోయేవారు. సెట్స్ మీద ఎవరేం తప్పు చేసినా, ప్రొడక్షన్ వాళ్ళయినా ఆయన ఉపేక్షించేవారు కాదు. అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు లంచ్-బ్రేక్ ఇవ్వరనే అపప్రద ఆయనకి ఉంది. ఆయన గట్టి టాస్క్‌మాస్టర్. కానీ నెమ్మదిగా, ఆయన మారారు.

13 అక్టోబరు 2012 నాడు డెంగూ వ్యాధితో ఆయన ముంబయిలోని బాంద్రా లోని లీలావతి హాస్పిటల్‌లో చేరారు. డెంగూ కారణంగా, శరీరంలో పలు అవయవాలు పనిచేయక ఆయన 21 అక్టోబరు 2012 నాడు సాయంత్రం ఐదు గంటలకి 80 ఏళ్ళ వయసులో మరణించారు.

ఆయన మరణం తర్వాత తన పెద్ద కొడుకు ఆదిత్య – నటి రాణి ముఖర్జీని రెండో పెళ్ళి చేసుకోడానికి పమేలా అనుమతించారు. ఆదిత్య మొదటి భార్య అంటే ఆవిడకెంతో ఇష్టం. చోప్రా కుటుంబంలో స్త్రీలు ఎవరూ సినీ రంగంలోకి ప్రవేశించలేదు. కానీ పమేలా విశాల హృదయంతో రాణి ముఖర్జీ సినిమాలలో కొనసాగేందుకు అంగీకరించారు, ప్రేమ పేరుతో ఆంక్షలు విధించకూడదనుకున్నారు. ప్రస్తుతం ఆదిత్య ఎంతో సంతోషంగా, ఎప్పుడూ నవ్వుతూ ఉంటున్నాడు, కొత్త వ్యక్తిలా అనిపిస్తున్నాడు. ఆదిత్య చిన్నతనంలో మెట్లెక్కేడప్పుడూ పాటలు పాడుతూ ఎక్కేవాడట. ఇప్పుడూ మళ్ళీ అలా చేస్తున్నాడని పమేలా గమనించారు. తన పెళ్ళిలో నాట్యం కూడా చేశాడు. రాణి రాక అతనిని మెరుగుపరిచింది. “వాడు సంతోషంగా, ఉంటే, నేనెందుకు సంతోషంగా ఉండను?” అన్నారు పమేలా. అటువంటి మంచి మహిళ పమేలా. ఇటువంటి మనస్తత్వం ఎంతమంది తల్లులకి ఉంటుంది?


రెండు వివాహాల కథ:

నాగార్జున, లక్ష్మి దగ్గుబాటిల పెళ్ళి పెద్దలు కుదిర్చినది. 1984లో హీరో అవకముందే నాగార్జున లక్ష్మిని వివాహం చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, దగ్గుబాటి రామానాయుడు మంచి మిత్రులు, తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నారు. అందుకని తమ పిల్లలకి పెళ్ళి చేయలనుకున్నారు.

వీరి వివాహం మద్రాసులోని వడపళని రోడ్‌లోని విజయ వాహిని స్టూడియోలోని విజయ శేష్‌మహల్ కల్యాణ మండపంలో 18 ఫిబ్రవరి 1984న రాత్రి 8.30 గంటల ముహూర్తానికి జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.టి.రామారావు సతీసమేతంగా హాజరయ్యారు. ఎం.జి. రామచంద్రన్ నేతృత్వంలో ఎందరో తమిళ ప్రముఖులు సరివారంగా విచ్చేశారు. అక్కినేని కుటుంబంలో జరిగే ఏ వేడుక కైనా శివాజీ గణేశన్ తప్పనిసరిగా హాజరయ్యేవారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా తరలివచ్చారు.

21 ఫిబ్రవరి 1984న అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఆ వేడుకలో నేరెళ్ళ వేణుమాధవ్ మిమిక్రీ, మిట్టా జనార్దన్ సితార్ వాదనం హైలైట్! ఈ దంపతులకి 1986లో నాగచైతన్య జన్మించాడు. అయితే ఆ తర్వాత వారి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడి, 1990లో ఆ జంట విడాకులు తీసుకున్నారు.

అదే సమయంలో తనతో నాయికగా నటిస్తున్న అమలతో ప్రేమలో పడ్డారు నాగర్జున. ‘శివ’ సినిమాని హిందీలో పునర్నిర్మిస్తున్నప్పుడు నాగార్జున తన మనసులోని మాటని అమలకి చెప్పారు. అమల అంగీకరించడంతో వారిద్దరూ 1992లో పెళ్ళి చేసుకున్నారు. 1994లో వాళ్ళకి అఖిల్ పుట్టాడు.

నాగ చైతన్యని పెంచిన తీరుకు అమల లక్ష్మి ఫుల్ మార్క్స్ ఇచ్చారు. సినిమాలలో నటించాలని నిర్ణయించుకున్నప్పుడు నాగ చైతన్య చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. ఆ సమయంలో అన్నదమ్ములిద్దరికీ స్నేహం కలిసింది. ఇద్దరి మధ్యా ఆప్యాయత ఏర్పడింది. చక్కటి ప్రవర్తనతో పెరిగిన చైతన్య అంటే అమలకీ ఇష్టం కలిగింది.

ఇదిలా ఉంటే, టి.వి.సుందరం అయ్యంగార్ అండ్ సన్స్ కంపెనీలో ఒక విభాగమైన, ₹1,800 కోట్ల విలువైన సుందరం మోటార్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అయిన శరత్ విజయరాఘవన్‌ను లక్ష్మి ద్వితీయ వివాహం చేసుకున్నారు. చెన్నైలో సంతోషంగా ఉంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here