99 సెకన్ల కథ-7

1
4

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. భార్యని ఏడిపించిన భర్త!

[dropcap]”ఏ[/dropcap]మయ్యా వెంకట్రావ్, ఇదేమీ బాగాలేదు. భానుమతి ఫోన్ చేసి చెప్పింది. అమెరికాలో పి.హెచ్.డి చేస్తున్న మీ అబ్బాయి రెండేళ్ళ తరువాత ఇప్పుడొస్తే, నువ్వేమో వాడితో గడపటానికి సమయమే ఇవ్వలేనంత బిజీగా వున్నావట. చివరికి విమానం ఎక్కించటానికి తప్ప వాడితో గడపటానికి టైమే లేదట.. ఏమిటయ్యా ఇదంతా! ఉద్యోగాలు మేమూ చేశాం గానీ మరీ ఇంతలాగానా! భాను దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నానయ్యా …”

సహస్ర చంద్ర దర్శనం చేసిన శేషయ్య గారు వెంకట్రావుకి ఫోన్ చేసి వాయించేశారు.

ఆఫీసులో పని వత్తిడిలో వున్న వెంకట్రావు సాయంత్రం రామకృష్ణ మఠంలో కలుస్తానని చెప్పి, అప్పటికి వాయిదా వేశాడు.

***

వెంకట్రావు, భానుల ఏకైక పుత్రరత్నం ఎమ్మెస్ చదవటానికి అమెరికా వెళ్ళి నాలుగేళ్ళయింది.

ఆ ఎమ్మెస్ అయిపోయి, ఇప్పుడు పి.హెచ్.డి వెలగబెడుతున్నాడు. రెండేళ్ళకోసారి వస్తున్నాడు. వారం పదిరోజులు వుంటాడు.

అలా రెండోసారి వచ్చిన కొడుకుతో తాపీగా కూర్చొని, వాడి పెళ్ళి గురించి ఒప్పించటం వంటి మంచిపనులు చేయకుండా, వెంకట్రావు ఆఫీసు, ఉద్యోగం పేరుతో బాధ్యతారహితంగా వ్యవహరించాడని భాను కార్చిన కన్నీళ్ళు ఫోనులో శేషయ్య గారికి కనిపించాయి.

ఆ భార్యాభర్తలిద్దరికీ ఆయన బంధువు కదా!

అదీ ఆ మధ్యాహ్న నేపథ్యం.

***

రామకృష్ణ మఠంలో చెట్టు క్రింద… వెంకట్రావు చెప్పాడు.

“భాను చెప్పింది నిజమేనండి. అయితే మా వాడు ఆ పదిరోజుల్లో అయిదారు రోజులు ఫ్రెండ్స్ పెళ్ళికనీ, వాళ్ళ కళాశాల పాత విద్యార్ధుల సంగమం అనీ తిరిగాడు. అయినా నేను వాడితో సెల్ ఫోన్లో కాంటాక్ట్ లోనే వున్నాను. కాని, వాడు ఇంట్లో వున్న రోజుల్లో కూడా నేను రాత్రి ఇంటికొచ్చేసరికి తొమ్మిది దాటిపోయేది. పత్రికలో ఎడిటర్ అంటే మీకు తెలుసుగదా!..”

“విషయానికి రావయ్యా స్వామి.”

“నేను ఎంత లేటుగా వచ్చినా మా 90 ఏళ్ళ అమ్మకి కాస్సేపు కబుర్లు చెప్పి, ఏదో పురాణం చదివి వినిపిస్తేగాని పడుకోదు. అలా వాడు – తెల్లారితే వెళ్ళిపోయే రోజుకూడా జరిగింది. ఆమెకి సుందరకాణ్డ వినిపించాను. కొన్ని శ్లోకాలు ముందు మా వాడిచేతే చదివించాను కూడా. మొత్తం మీద ఆ రాత్రికూడా వాడితో కలిసి భోజనం చేయటం అవలేదు. అదే భానుకి కోపం…”

“ఎందుకలా చేశావ్?”

“ఎందుకంటే ….!”

“ఊ ….”

“….భాను నాకన్నా ముందు వెళ్ళిపోతే అదృష్టవంతురాలు. నేనే ముందు వెళ్ళిపోతే ఆమెని ఈ ఒక్క కొడుకు ఎలా చూసుకోవాలో నన్ను చూసి తెలుసుకుంటాడని…”

శేషయ్యగారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

“భానుకు ఈ మాటే చెప్పవచ్చు గదా!”

“భానుకి నా మీద ఎంత ప్రేమ అంటే – ‘నీకన్నా ముందు నేను…’ అన్న రెండు పదాలు అన్నా, తట్టుకోలేదు…”

వెంకట్రావు కళ్ళల్లో నీళ్ళు.

2. రాజన్న శాస్త్రి వైద్యం!

“కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. కాని, ఆ అర్ధరాత్రివేళ దుర్యోధనుడి ఆనందం కోసం అశ్వత్ధామ పాండవుల శిబిరంలో ప్రవేశించి…” శ్రోతలంతా చెవులప్పగించి వింటుంటే, ఋషిలా పంచ కట్టుకొని, భుజం మీద ఉత్తరీయంతో, నుదుట విభూతి రేఖలతో ప్రకాశిస్తున్న రాజన్న శాస్త్రి కథ చెబుతున్నారు. అంతలో…

“అయ్యో నా కొడుకు… చంపేసిన్రు బాబో… ఆడి బొంద పెట్ట… ఆడి దివసం పెట్ట… అయ్యో అయ్యో…”అని గుండెలవిసేలా రోదిస్తూ మల్లమ్మ వచ్చి శాస్త్రి గారి ముందు కుప్ప కూలిపోయింది. ఆమె ఏడుపుని ఆపటం ఎవరివల్లా కావటం లేదు.

శాస్త్రి గారు పురాణం ఆపేశారు.

“అయ్యా… నా కొడుకుని అన్నాయంగా చంపేశారు. …అయ్యో సమ్మక్కా, సారాలమ్మా, నా కొడుకుని చంపినోడ్ని చంపేయ్యాల… చెప్పండి సామీ దేవుడికి, నా కొడుకుని చంపినోడ్ని…” గుండెలు బాదుకుంటోంది.

“ఎంతమంది కొడుకులు నీకు?” ఆ ఋషి కంఠం పలికింది.

“ఇద్దరయ్యా ఇద్దరు… అయ్యో..” రోదిస్తోంది మల్లమ్మ.

“కాని ఆమెకి అయిదుగురు కొడుకులు కదా!”

మల్లమ్మ ఏడుపు ఆగిపోయింది. “ఎవురుకి ?”

“ఆమెకి అయిదుగురు. వాళ్ళ వూళ్ళూ, భూములూ అన్నీ దాయాదులు అన్యాయంగా లాగేసుకున్నారు. అప్పుడు పెద్ద యుద్ధం జరిగిపోయింది. అయినా ఆమె మొగుళ్ళే గెలిచారు. ఆమెకి అయిదుగురు కొడుకులు… నీకెంతమంది కొడుకులు ?”

మల్లమ్మ అయోమయంగా శాస్త్రిగారు చెప్పింది వింటూనే, “ఇద్దరు” అంది.

మళ్ళీ ఏడుపొచ్చేస్తోంది మల్లమ్మకి.

ఆ ఋషి ఆమె నింక ఏడవనివ్వలేదు.

“అలా యుద్ధం గెలిచేశారా!…. ఆ రాత్రి ఆమె కొడుకులు యుద్ధ శిబిరాల్లో నిద్రపోతున్నారు. ఎంతమంది?”

మల్లమ్మకి కుతూహలం కలిగింది. “అయిదుగురు.”

“అప్పుడు దాయాదుల్లో పెద్ద వాడు ఓడిపోయి ఎక్కడో దాక్కున్నాడు. వాడి ఆనందం కోసం, వాళ్ళవైపు మిగిలివున్న ఒకడు, ఆయమ్మ కొడుకుల శిబిరాల్లోకి చాటుగా వచ్చాడు. ఆయమ్మ కొడుకులు నిద్దరోతున్నారు. ఎంతమంది?”

“అయిదుగురు..” మల్లమ్మలో ఆతృత పెరిగింది.

“అలా చీకటి రాత్రి వాడు ఆ అయిదుగురిని నరికేశాడు.”

“అయ్యయ్యో… ఎంత ఘోరం, ఘోరం..” వాళ్ళ కోసం ఏడుస్తోంది మల్లమ్మ.

“కడాకు ఏమైనాది సామీ ?” ఆ ఏడుపులోనే అడిగింది.

“ఆయమ్మ అయిదుగురు భర్తలూ మహా వీరులు. వెళ్ళారు. వెతికి వెతికి, పట్టుకున్నారు….”

“చంపేసినారా యెదవ నా కొడుకుని?” ఏడుపు లేదు. తెలుసుకోవాలన్న తహ తహ వుంది.

“వాళ్ళంతా వాడ్ని తెచ్చి, ఆయమ్మ ముందు పెట్టారు. అప్పుడేం చేయాలి ?”

“ముక్కలు ముక్కలుగా నరికి బొంద పెట్టాల…” కసిగా అంది.

“ఆయమ్మ చెప్పింది కదా – అయిదుగురు కొడుకుల్ని పోగొట్టుకొని నేను కడుపు శోకం అనుభవిస్తున్నాను. మీ గురువుగారి భార్యకి వీడు ఒక్కడే కొడుకు కదా! వీడ్ని చంపి ఆయమ్మకి కడుపు శోకం పెడతారా! వద్దు, వదిలేయండి…”

మల్లమ్మ మొహంలో రంగులు మారాయి. అంతలో ఆమె రెండో కొడుకు వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు. మెల్లగా లేచింది.

“అట్టందా ఆయమ్మ, అట్టందా.. అట్టందా..” అనుకుంటూ వెళ్ళిపోయింది.

(ఆ ఋషి గుండి రాజన్న శాస్త్రికి ధర్మపురిలో గోదావరి తీరాన గుడి కట్టారు.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here