జీవన రమణీయం-117

2
3

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]అ[/dropcap]సలు రామ్‍కోటి మ్యూజిక్ కాలేజీ వాతావరణమే అద్భుతంగా వుండేది. వేపచెట్టు మీద కోయిలలు, సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళ గొంతులతో పోటీ పడేవి! ఓ క్లాస్‌లో భరతనాట్యం, ఇంకో క్లాసులో కథక్, మరో క్లాసులో సితార్, వేణునాదం, వీణానాదం; కిందకి మెట్లు దిగి వెళ్తే గోపాలరాజ్ భట్ గారి ఫోక్, కళకళలాడుతూ శారదాదేవి ప్రతీ చోటా దర్శనం ఇచ్చేది! నటరాజు తాండవం ఆడేవాడు!

అమ్మ చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతమే కాబట్తి క్విక్‍గా గ్రాస్ప్ చేసింది. నేను అప్పుడే ఏడు పాసయి, ఎనిమిదిలోకి వచ్చాను. పొడుగు అవుతున్నాను. “కృష్ణుడి వేషం వేస్తే నువ్వు చక్కగా వుంటావు” అని ఉమా రామారావుగారు అనేవారు! నేనూ శ్రద్ధగా నేర్చుకునేదాన్ని. సుల్తాన్‌బజార్ వెళ్ళి, ఆకుపచ్చ బట్ట తెచ్చి పైజామా మీద వేసుకునే డ్రెస్ కుట్టించింది అమ్మ. స్టేజ్ మీద చేస్తున్నట్టు ఫీలయ్యేదాన్ని అది వేసుకుని క్లాస్‌లో చేస్తూ. మొదట బోలెడంత థీరీ, ఉమా మేడం చెప్తుంటే రాసుకున్నాం నోట్స్. భరతముని నుండీ ముద్రల వరకూ, నాట్యశాస్త్రం గురించిన వివరాలు. ఆ క్లాస్ అవగానే మాధవి చెల్లెలు కీర్తీ నేనూ కింద గోపాలరాజ్ గారి క్లాస్‍కి పరిగెత్తే వాళ్ళం! సబితా భమిడిపాటి కూడా మాకు సీనియర్. విజిత అనే అమ్మాయి తండ్రి రామిరెడ్డి గారు అప్పుడు మినిస్టర్. ఆమె కూడా మా ఈడుదే, మాతో స్నేహంగా వుండేది. అలేఖ్యా నర్సింగరావు గారు నాకన్నా చాలా పెద్ద! ఆవిడ కూడా అక్కడే నేర్చుకున్నారట. అప్పట్లో టీ.వీ.లో బాగా కనిపిస్తూ వుండేవారు. దాసరిగారు ‘ఓ ఆడదీ, ఓ మగాడూ’ అని ఆవిడ్ని హీరోయిన్‍గా పెట్టి సినిమా కూడా తీసారు అప్పట్లో. చాలా బావుండేవి ఆ రోజులు.

శ్రీలక్ష్మీ, శ్రీగౌరీ అమర్‍నాథ్ గారి పిల్లలు. అమర్‌నాథ్ గారంటే, చక్రపాణి సినిమాలో, భానుమతి మొగుడిగా వేషం వేసి, అసలు మొగుడు ఏ.ఎన్.ఆర్.ని ఏడిపించిన మనోరమక్కయ్య తమ్ముడు వేషం వేసినాయన. ఇంకా చాలా సినిమాల్లో వేసారు. కొన్ని తీసారు కూడా. ఆయన పిల్లలే, శ్రీలక్ష్మీ, శ్రీగౌరీ, రాజేష్‌లు. శ్రీగౌరి చక్కగా పాడేది. “శ్రీ గౌరి శ్రీగౌరి యే.. శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసినా” అన్న పాట ఆమె పాడ్తుంటే విన్నాను. వీళ్ళు బయట ఏవో ప్రోగ్రామ్‌లలో కూడా పాడారు. అప్పట్లో అమ్మ కొలీగ్ భారతి కూడా వీళ్ళతో బాటు చేరింది. మొదటి ఏడు పరీక్షల దాకా, నేనూ అమ్మా, నా స్కూలూ, అమ్మ ఆఫీసు అయిపోగానే నాలుగు గంటలకి గోల్కొండ చౌరస్తాలో బస్సెక్కి, రామ్‌కోటి వెళ్ళేవాళ్ళం. అమ్మ ఆర్.టి.సి. కదా, డ్రైవర్లు బస్సు ఆపేసేవాళ్ళు! ఇలా చక్కగా సాగుతుండగా, మళ్ళీ విధి పరిహసించింది అన్నట్లుగా, అమ్మ సెక్షన్ మారడంతో, నాలుగింటికి ఆఫీసు నుండి రావడానికి అయ్యేది కాదు! నాకూ మేథమెటిక్స్‌కీ చిన్నప్పటినుండీ పడక, జీవితంలో ఎన్నో లెఖ్ఖలు తప్పాను! నాకు కొంచెం తక్కువ మార్కులొస్తున్నాయి అని స్కూల్లో జెస్సీ డేవిడ్ సార్ అమ్మమ్మని పిలిచి మాట్లాడ్డంతో, “డాన్సూ వద్దు, పీన్సూ వద్దు” అని అమ్మమ్మ నా నాట్యానికి అడ్డుకట్ట వేసి మాన్పించేసింది. అప్పటికే కొనేసిన గజ్జెలు చూసుకుంటూ కొన్నాళ్ళు, మంజుభార్గవిలా పోజు పెట్టి ఏడ్చేదాన్ని!

అమ్మమ్మ పెద్దమ్మకి ఏదో అవసరం వచ్చి నాగ్‍పూర్ వెళ్ళింది. అప్పుడు మళ్ళీ అమ్మకి ఎవరో ‘మా స్కూలు దగ్గరే గోల్కొండ చౌరస్తాలో ఎల్. విజయలక్ష్మి అనే మాస్టర్ వచ్చి డాన్స్ నేర్పిస్తున్నారు, స్కూలు నుండీ బస్సు అదీ ఎక్కక్కర్లేదు’ అని చెప్పారు. నేను వెంటనే అమ్మ ప్రాణాలు కొరుక్కు తినేసాను! అసలు అమ్మ లాంటి అమ్మని నేను నా పిల్లలకి అయ్యానో లేదో కానీ, అమ్మ లాంటి అమ్మలు అందరికీ దొరకరు! నా అదృష్టం… అమ్మ వెంటనే నన్ను తీసుకెళ్ళి, ఆవిడ వచ్చే రోజులు తెలుసుకుని మాట్లాడింది. ఎల్. విజయలక్ష్మి గారంటే ఆవిడ పాత సినిమాల హీరోయిన్ కాదు. ఆవిడ మొదలియార్‌లు. మదర్ టంగ్ తెలుగు కాదు! ఆవిడకి చీర పెట్టి, గజ్జె పూజ కూడా చేసాం. అలా కొన్నాళ్ళు ఆవిడ శిష్యరికంలో చేసాకా, అదీ ముందుకు వెళ్ళలేదు. ఎందుచేతనో, ఆవిడ కూడా “నేను రాధ వేస్తే… నువ్వు కృష్ణుడి వేషం వెయ్యచ్చు” అనేవారు! ఈ కృష్ణుడి పోలిక చెప్పిన ఏ మాస్టర్ దగ్గరా నేను నాట్యం కొనసాగించలేకపోయాను…. ఆ ఇంటావిడ అంతలోనే, తన పిల్లల కన్నా నాకెక్కడ ఎక్కువ నేర్పిస్తుందో ఈవిడ అని కంగారు పడిపోయి, గేట్ సరిగ్గా వెయ్యలేదనీ, నేను కాళ్ళు తుడుచుకుని లోపలికి రావడం లేదనీ, పిల్లి మీదా, పిచిక మీదా పెట్టి నన్ను సూటీపోటీ మాటలనసాగింది. సరిగ్గా ఆర్నెల్లకీ అదీ కుంటుపడింది! నేను చదువు మీద శ్రద్ధ పెట్టసాగాను!

ఆ ఎల్. విజయలక్ష్మి గారే, మా కజిన్ సిస్టర్ మీనా, పరకాల శేషావతారం గారి తమ్ముడి కొడుకుని పెళ్ళి చేసుకుంటే… అంటే నిర్మలా సీతారామన్ మావగారి తమ్ముడు, ఆయన కొడుకు జయసూర్యని మీనా పెళ్ళి చేసుకుంటే, ఆ పెళ్ళిలో కనపడి, “నేను పెళ్ళికొడుకు అత్తయ్యని, అంటే మేనమామ భార్యని” అంది. నేను కాళ్ళకి దణ్ణం పెట్టాను! ఎన్నాళ్ళు నేర్చుకున్నా గురువు గురువేగా! అలాగే ఉమా రామారావుగారు, శేఖర్ కమ్ముల తీసిన ‘హేపీ డేస్’లో అలా కనిపించి, మెరిపించిన శుభ సందర్భంలో ఒకసారి స్టూడియోలో నేను కలిసి, కాళ్ళకి దణ్ణం పెట్టి “78 బ్యాచ్ అండీ, మీ దగ్గర డాన్స్ నేర్చుకున్నాను” అంటే ఉబ్బితబ్బిబ్బు అయి, అందరికీ చెప్పారు “నా స్టూడెంట్” అని. ‘అసలు వడ్డాది వాళ్ళ పిల్లలు, మనకి దూరపు చుట్టరికం వుంది. ఉమా రామారావుగారూ, వాళ్ళ చెల్లెలు సుమతీ కౌశల్ గారితో’ అని – మా అమ్మమ్మ చెప్పేది. అమ్మమ్మ చెల్లెలు ఇంటిపేరు వడ్డాదే! వాళ్ళదీ వీళ్ళలాగే రాజమండ్రీనే! నా ఇంటర్మీడియట్ క్లాస్‌మేట్ మాధవీ సుమంగ అనే అమ్మాయి కూడా సుమతీ కౌశల్ శిష్యురాలే. ఆవిడ గురించి తెగ చెప్పేది! ఇవండీ నా నృత్యశిక్షణ కబుర్లు… ఇప్పటికీ అలరింపూ, “ఝణి ఝణిత సుందరౌ రౌ రా” అని చేస్తూ వుంటాను. ఇదంతా చిన్నప్పుడు రమా వాళ్ళ అమ్మగారు “నువ్వూ, నీ బృందం రేడియోలో ఘోరంగా పాడారు… డాన్స్ నేర్చుకో… బావుంటావుగా” అన్నందుకొచ్చిన ఎపిసోడ్!

చిత్తరంజన్ దంపతులతో ఇటీవల

ఏదైనా రాసుండాలి… ఏ రంగంలో స్థిరపడ్తామో, దేవుడు ఏ పని నిర్దేశించి ఈ లోకంలోకి పంపించాడో మనకి ఎప్పుడో కానీ తెలీదు… నాకైతే నా పిల్లలు పెద్దయి, కాస్త వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదాకా, నేను మామూలుగా, స్కూలు టీచరుద్యోగం, అదీ ప్రైవేటు స్కూల్లో చేస్తూ బతకక్కర్లేదు, నా కోసం నిర్దేశించిన రంగం ఇంకోటి వుందని తెలీనే తెలీదు! అసలు రేడియో, దాని ప్రాముఖ్యతా గురించి నా లైఫ్‍లో జరిగిన సంఘటనలు చెప్దాం అని మొదలుపెట్టాను, రేడియో గురించి మాట్లాడుతూ చిత్తరంజన్ గారి గురించి ఎలా మర్చిపోతాను? ఆయన ‘ఈ మాసం పాట’ మా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం అప్పట్లో. రేడియో మర్చిపోయి అంతా టీ.వీ. సీరియల్స్ చూస్తూ కంటనీరు పెడ్తూ బతికేస్తున్న రోజులలో… ‘రేడియో మిర్చీ’ పేరిట ఓ ప్రభంజనం వచ్చింది, సుజాత రూపంలో నా జీవితంలోకి 2006లో.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here