[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 27వ భాగం. [/box]
[dropcap]గు[/dropcap]హ్యసమాజతంత్రం బౌద్ధుల సంగీతి – సాహిత్యానికి చెందుతుంది. బుద్ధుడు జ్ఞానసిద్ధిని పొందిన తరువాత, శేషజీవితమంతా బోధనలతోనే గడిపాడు. అతని శిష్యులు అతని మరణం తరువాత సమావేశమయి, అతని బోధనలను, కలిసి పాడడం చేశారు. బుద్ధుడు వచ్చి, భిన్నమైన సమాధులలో కూర్చొని, సమావేశాన్ని ప్రారంభించి, వివిధమైన విషయాలను బోధించడాన్ని వర్ణించడంతో సంగీతి మొదలవుతుంది. తొలుత వచ్చిన సంగీతులను తయారుచేసి అందరూ కలిసిపాడేవారు. కొత్త విషయాలను కేవలం సంగీతులలోనే పరిచయం చేయడానికి వాళ్ళు ఇష్టపడేవారు. తాంత్రికులు తమ విచిత్రమైన సిద్ధాంతాలను పాత మతారాధన వ్యవస్థలోకి పరిచయం చేయవలసి వచ్చినప్పుడు ఈ సంగీతుల రూపంలో పరిచయం చేయకతప్పింది కాదు.
బౌద్ధుల సంగీత – సాహిత్యం వృద్ధి పొందేటప్పుడు కొన్ని ప్రత్యేకతలు దృష్టికి వచ్చాయి. తరువాత కాలంలో వచ్చిన సంగీతులు రెండు స్పష్టమైన తెగలుగా విభజింపబడ్డాయి. ఒక తెగలో బుద్ధుడు సమావేశంలో, బోధిసత్వులతోను, భిక్షువులు మొదలైన వారితోను పరిచయమవుతాడు.
రెండవ తెగలో, అతడు శరీరం నుండి జనించిన తథాగతుల పవిత్రమైన జ్ఞానంలో మనస్సులో, భాషనలో వినోదిస్తున్నట్లు పరిచయమవుతాడు.
మొదటి వర్గం హీనయాన, మహాయాన రచనలలో కనిపిస్తుంది, రెండవవర్గం చాలా తంత్రాలలో ముఖ్యంగా యోగతంత్రాలలో కనిపిస్తుంది. తొలిదశలో వచ్చిన సంగీతులలో విధిగా సమావేశవర్ణన వివరంగా ఉంటుంది, తరువాత కాలంలో వచ్చిన గ్రంథాలలో ఇది తక్కువగా, క్లుప్తంగా ఉంటుంది. సమావేశ వర్ణన గండ వ్యూహంలోను, మంజుశ్రీ మూల కల్పంలోను, గుహ్యసమాజతంత్రంలోను చాలా వివరంగా ఉంటుంది. అటు తరువాత వచ్చిన భూతడామరతంత్రం మొదలైన వాటిలో, సమావేశ వర్ణన చాలా క్లుప్తంగా ఉండి, విషయం వెంటనే ప్రవేశపెట్టబడుతుంది.
గుహ్యసమాజతంత్రం సంగీతి రూపంలో ఉంది. ఇది బౌద్ధ తంత్రాలలో తొలి దశకు చెందినది. గుమ్య సమాజతంత్రం, బుద్ధత్వ ప్రాప్తికి యోగరీతులలో సరియైన మార్గంలో చేరవలసిన తక్కువదారి. ఈ ప్రయత్నంలో కొన్ని సిద్ధులను గురించి దానిలో వ్రాసి ఉంది. ఈ సిద్ధులను సాధకుడు పొంది మంత్రశక్తులను హస్తగతం చేసుకుంటాడు. సిద్ధులు రెండు రకాలని గుష్యసమాజతంత్రం, 18వ పటలంలో చెప్పబడింది. అవి సామాన్యసిద్ధులు, ఉత్తమ సిద్ధులు అన్నవి. అంతర్థానం మొదలైనవి సామాన్య సిద్ధులు. బుద్ధత్వ ప్రాప్తి ఉత్తమసిద్దికి చెందుతుంది. యోగం యొక్క ఆరు అంగాలను ఆచరించడం వలన రెండవ తరగతికి చెందిన సిద్ధి లభిస్తుంది.
గుహ్యసమాజం యొక్క లక్ష్యం ఈ విధంగా ఉంటుంది.
దుష్కరైర్నియమై స్తోత్రై సేవ్యమానో న సిద్ధ్యతి
సర్వకామోపభోగైస్తు సేవ్యయంత్యాసు సిధ్యతి
బాధాకరమైన, కష్టమైన అభ్యాసాలవలన సిద్ధి లభించదు – కాని, సాధకుడు సులభంగా, అన్ని కోరికలను సేవించి తొందరగా సిద్ధిని పొందగలడు.
తొలిదినాలలో, హీనయాన మహాయానశాఖలకు చెందిన సాధకునికి, నియమ నిబంధనలు చాలా కష్టసాధ్యం గాను, చాలా ఇబ్బంది కలిగించేవి గాను, మహత్తరమైన శరీర బాధతో కూడినవి గాను ఉండేవి. అయినప్పటికి బుద్ధత్వప్రాప్తి చాలకాలం తీసుకొనేది. లేక చాలా జన్మలు పట్టేది. కాని గుష్యాసమాజతంత్రం, చాలా తక్కువ కాలంలో, ఈ జన్మలోనే బుద్ధత్వ ప్రాప్తి కోసం ఒక కార్యాచరణ క్రమాన్ని నిర్దేశించింది.
గుహ్యసమాజతంత్రం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే బౌద్ధంలోకి శక్తిని ప్రవేశ పెట్టడం. యోగం, సమాధిని ఆశ్రయించి ముక్తిని పొందడానికి ఈ విధంగా ప్రయత్నం జరిగింది. గ్రంథారంభంలో భగవానుడు సమావేశంలో ఐదుగురు ధ్యానబుద్ధులుగా మారుతాడు. ప్రతి బుద్ధుడికి ఒక శక్తిని అనుసంధానిస్తాడు. ఇంకా, 18వ పటలంలో ప్రవేశపెట్టే అభిషేక విధులలో ప్రజ్ఞాభిషేకం ఒకటి. శిష్యుడు ప్రజ్ఞ లేక శక్తితో కలియడం. అందులో ఏమని ఉందంటే, గురువు శక్తిని చేయిపట్టుకొని శిష్యుడు చేతిలో ఉంచుతాడు. ఆ శక్తి అందమైనది, శిష్యునికి ఆమోద యోగ్యమైనది,
యోగసాధనలో అనుభవం కలది. తథాగతులు సాక్ష్యులుగా, గురువు, శక్తియొక్క చేతిని శిష్యుని చేతిలో ఉంచాలి. తరువాత, గురువు తన చేతిని శిష్యుని తలపై ఉంచి, బుద్ధత్వం మరి ఏ ఇతర సాధనాల వలన లభించడం అసంభవమని, అందుచేత ఈ విద్యను స్వీకరించమని చెప్తాడు. లోకవృత్తం ద్వంద్వాతీతమైనా ద్వంద్వంగా అగుపడుతుంది. అందుచేత, శిష్యుడు జీవితంలో ఆమెను ఎప్పుడూ విడిచి పెట్టకూడదు. దీనినే విద్యావ్రతం అంటారు. దీనిని ఎవరైతే అతిక్రమిస్తారో వీరికి ఉత్తమ తరగతికి చెందిన సిద్ధి లభించదు.
యోగాభ్యాసాలకు శక్తులు అవసరమని గుహ్యసమాజ తంత్రం మరీ మరీ చెప్తుంది.
గుహ్యసమాజతంత్రం మరొక సేవ చేసింది. బౌద్ధం మొదలైననాటి నుండి, బౌద్ధులు ఆచరించే క్రమశిక్షణా పద్ధతులనన్నిటిని తొలగించింది. అన్ని విధాలైన వైభవాలను, మాసం, మత్స్యం, మదిర, మహిళ మున్నగుననవి బౌద్ధులకు మొదటి దశలోను, తదనంతర దశలలోను నిషేధాలు – కాని, గుహ్య సమాజతంత్రం అన్నిటిని అనుమతించింది. ఏ విధంగాను హాని చేయని మాసంమే కాక, ఏనుగుల మాంసం, గుర్రాల మాంసం, కుక్కల మాంసం, ఆవు మాంసం, ఇంకా చెప్పవలసివస్తే, మనుష్య మాంసాన్ని కూడా అనుమతించింది. మానవ రక్తం, జంతువుల రక్తం, ఎటువంటి మధువైనా, ఏ ప్రమాణంలోనైనా, సాధకుడు తీసుకోవచ్చునని గుహ్యసమాజతంత్రం చెప్పింది.
గుహ్యసమాజతంత్రానికి పూజలందుకునే వస్తువుల మీద ఎటువంటి గౌరవం లేదు. చైత్యాలను నిర్మించడం, పవిత్రమైన బౌద్ధ గ్రంథాలను వర్ణించడం, మండలాలను చిత్రించడం, త్రిరత్నాలైన బుద్ధుడికి, ధర్మానికి, సంఘానికి పూజలందించడం నిషేధించింది. యోగికి ఇవేవి సత్యమైనవి కావు. కాబట్టి అతని దృష్టిలో ఏక ప్రయోజనకారులు కావు – తృణీకరించవలసినవి.
గృహ్యసమాజతంత్రం మరో అడుగు కూడా ముందకు వేసింది. ఈ తంత్రాన్ని అనుసరించేవారు, యోగికి ఎటువంటి ప్రాముఖ్యత లేని సామాజిక నిబంధనలను నిస్సంశయంగా నిర్లక్ష్యం చేయాలి. నువ్వు స్వేచ్చగా జంతువులను బలి ఇవ్వవచ్చు. ఏ విధమైన అభ్యంతరం లేకుండా ఎన్ని అసత్యాలనైనా పలుకవచ్చు. నీకు చెందని వస్తువులను సంగ్రహించవచ్చు, వ్యభిచరించ వచ్చు. ఇది కూడా వారికిచ్చే సలహా.
సరియైన సత్యాన్ని గ్రహించిన యోగికి, శూన్యాన్ని గ్రహించిన వాడికి, ప్రపంచమంతా అడుగు భాగంలేని నాటకంగా కనిపిస్తుంది. అతని ముందు ద్వంద్వాలు అదృశ్యమవుతాయి, కేవలం ఆకారాలుగా అన్ని వస్తువులు అతనికి గోచరిస్తాయి. సామాన్య మానవులు భక్తితో కొలిచే వస్తువుల పట్ల అతనికి గౌరముండదు, మానవులు ఏవగించే వస్తువుల పై ద్వేషముండదు. సామాజికమైన న్యాయం పట్లకాని, దైవసంబందమైన న్యాయం పట్లకాని అతనికి గౌరవముండదు. అతని మనస్సు అత్యద్భుతమైన శక్తిని పెంచుకొంటుంది. అతడు విశ్వసృష్టి చేసేవాడుగా, పోషించేవాడుగా, నాశనం చేసేవాడుగా రూపొందుతాడు. దానినే పరాశక్తి అంటారు.
యాస్యదృష్టో నైవభూమండలాంశో
యస్యాదాసో విద్యతే నక్షితీశః
యస్యాజ్ఞాతం నైవ శాస్త్రం కిమన్యైః
యస్యాకారః సా పరా శక్తిరేవ
పరాశక్తి విశ్వంలో కనిపించని భాగంలేదు, ఆమెకు విధేయుడు కాని రాజులేడు, ఇతరులు రచించిన శాస్త్రం ఆమెకు తెలియనిది ఏదీ లేదు.
ప్రతి సాధకుడు హఠయోగం అభ్యసించాలి. హఠయోగం అంతమైన తరువాత తంత్రం మొదలవుతుంది.
గుహ్యసమాజంలో క్రూరమైన కర్మలు ఆరింటి గురించి చెప్పబడింది. అవి మారణము (శత్రువులను నాశనము చేయుట), ఉచ్ఛాటనము (నివాసగృహాలను నాశనం చేయుట), వశీకరణము (మంత్రబద్ధులను చేసి లోబరుచుకొనుట),స్తంబనము (నిర్బంధించుట), ఆకర్షణ, ‘శాంతికము (శాంతింప జేయుట) అన్నవి ఈ కర్మలు. ఇవికాకుండా, సైన్యాలను ఆపడంగాని, నాశనం గాని చేసే మంత్రాలు, కరువులో వర్షం కురిపించే మంత్రాలు, వాగ్వాదంలో ఎదుటిపక్షం వారిని గెలవడం, వరదలు అదృశ్యమైనట్లు చేయడం, పాముకాటు నుండి మనుష్యులను బతికించడం, మొదలైన అద్భుతాలను చేయడం గురించి ఈ గ్రంథంలో ఉంది.
గుహ్యసమాతంత్రం మొదటి పటలంలో భగవానుడు బోధి చిత్తవజ్ఞుడు, సుప్రసిద్ధులైన సభ్యుల సమావేశంలో వేరు వేరు సమాదులలో వేరు వేరురూపాలతో కూర్చొని అయిదుగురు ధ్యాన బుద్ధులు, వారి వక్తులు, నలుగురు ద్వారపాలురు గల మంటలాన్ని నిర్మాణం చేస్తాడు. తథాగతులు బోధి చిత్తులు కలసమావేశమది. బోధి చిత్తులు తథాగతులకన్న తక్కువ స్థాయి లోనివారు. భగవానుడు వేరు వేరు సమాధులలో కూర్చొని, వేరు వేరు తథాగతులుగా మారి తన రూపాలుగా మారి వారిని మండలంలో వేరు వేరు భాగాలలో ప్రతిష్ఠించాడు.
తొలుత అతడు జ్ఞాన ప్రదీపవజ్రమనే ధ్యానంలో కూర్చొని, వజ్రధృక్ అన్న మంత్రం, దేవకుటుంబానికి చెందినదానిని జపించాడు. వెంటనే అతడు అక్షోభ్యుడుగా మారిపోయాడు. తాను కూర్చున్న స్థానమందు అక్షోభ్యుని ప్రతిష్ఠించాడు. తరువాత అతడుసమయసభవ వజ్రమనే ధ్యానంలో, మోహకుటుంబానికి చెందిన జినజిక్ అనే మంత్రాన్ని జపించి, తన రెండవ రూపాన్ని వైరోచనుడుగా, తనకు ఎదురుగా కూర్చోబెట్టాడు. అటుపిమ్మట అతడు రత్న సంభవవజ్రశ్రీ అన్న ధ్యానంలో, చింతామణి కుటుంబానికి చెందిన మంత్రధృక్ అన్న మంత్రాన్ని జపించాడు. అతడు వెంటనే తను రత్నకేతువుగా (రత్న సంభవుడు) మారి, అతనిని దక్షిణం వేపు కూర్చోబెట్టాడు. తిరిగి భగవానుడు, మహారాగ సంభవ వజ్రమనే ధ్యానంలో, వజ్రరాగ కుటుంబానికి చెందిన ఆరోలిక్ అన్న మంత్రాన్ని జపించాడు. అతడు తనకొత్త ప్రతిరూపాన్ని, లోకేశ్వర మహావిద్యకు ప్రభువు, లేక అమితాభుడుగా తనవెనుకను కూర్చోబెట్టుకున్నాడు. తరువాత అతడు అమోఘసమయసంభవ వజ్రధ్యానంలో, సమయాకర్షణకుల లేక సమయకులమని పిలువబడే కుటుంబానికి చెందిన ప్రజాధృక్ అన్న మంత్రాన్ని జపించాడు. ఈ నూతన ప్రతిరూపాన్ని అమోఘవజ్రుడుగా (అమోఘ సిద్ధి) ఉత్తరంలో ప్రతిష్ఠించాడు.
ఈ విధంగా అయిదుగురు పురుషమూర్తులను ప్రతిష్ఠించిన తరువాత భగవానుడు అదే సంఖ్యలో వారికి స్త్రీమూర్తులైన శక్తులను ప్రసాదించడం కోసం ప్రయత్నించాడు. తానే వివిధ రూపాలలోకి మార్పు చెందాడు. ఆ ప్రకారం ద్వేషరతి ఉద్భవించి, కేంద్రంలో స్థాపించబడింది. ఆ విధంగానే మోహరతి ఉద్భవించి తూర్పు మూలను స్థాపింపబడింది. ఈర్ష్యారతి దక్షిణాపు మూలను, రాగరతి పడమటి మూలను, వజ్రరతి ఉత్తరపు మూలను స్థాపింపబడ్డాయి. ఈ అయిదుగురు స్త్రీలుగా ఉద్భవించిన శక్తులు, ద్వేష, మోహ, రాగ, చింతామణి, సమయ కులాలకు చెందిన ధ్యాన బుద్ధులతో అనుసంధానించబడినవి. ఆ విధంగా అక్షోభ్యునితో ద్వేషరతి, మోహరతి వైరోచనునితోను, ఈర్ష్యారతి తర్నసంభువుడితోను, రాగరతి అమితాభుడితోన, వజ్రరతి అమోఘ సిద్ధితోను అనుసంధానించబడినవి.
అటుపిమ్మట ప్రభువు మరినాలుగు సమాధులలో కూర్చొని, నాలుగు సార్లు రూప పరివర్తన చెంది, నాలుగు వేరు వేరు మంత్రాలను, యమాంతకృత, ప్రజ్ఞాంతకృత్, పద్మాంతకృత్, విమ్నంతకృత్ అన్న వాటిని జపించి, నాలుగు దిక్కుల యందు ద్వారపాలకులుగా నియమించాడు. ఆ ప్రకారం తూర్పద్వారం దగ్గర యామాంతకుడిని, దక్షిణ ద్వారం దగ్గర ప్రజాంతకుడిని, పద్మాంతకుడిని పశ్చిమ ద్వారం దగ్గర విఘ్నాంతకుడిని ఉత్తర ద్వారం దగ్గిర స్థాపించాడు.
ఐదుగురు ధ్యానబుద్దుల మండలం ఇపుడు సంపూర్ణమయింది. ఈ మండలం పెంపుదల చెందిన వస్తువుకాదు, వేరు వేరు ఆకారాలలో మార్పుచెందిన ఒక ప్రభువు యొక్క ఉద్భవమే. భగవానుని యొక్క మానసికమైన అభ్యాసమే ఈ మండలం. ప్రభువు సమీపంలో కూర్చున్న తథాగతులకు, బోధిసత్వులకు అతడు చేసిన ఉపదేశమే మండలం. అయిదుగురు ధ్యాని బుద్దులు పంచస్కంధాలకు ప్రతీకలు. ఈ పంచస్కంధాలు ఏవంటే, రూపము, వేదన, సంజ్ఞ, సంస్కారము, విజ్ఞానము.
పంచబుద్ధస్వభావత్వాత్ పంచస్కంధా జినః స్మృతాః జ్ఞాన సిద్ధి
పంచస్కంధా పంచతథాగత స్వభావా భావ్యన్తే సాధన మా
ఈ పంచమాల స్వభావాలతోనే సృష్టి తయారయింది. ధ్యాన బుద్ధులు ఇంకా తమ శక్తులతో కలిసి ఉన్నారు. శక్తులతో కలిసి ఉండడం చేతనే స్కంధాలు తమకు గల శక్తిని పెంపొందిస్తాయి. మరొక విషయం కూడా తెలుస్తుంది. తాంత్రికులు శక్తిని పెంపొందించుకోవాలంటే తమ శక్తులతో, అంటే స్త్రీ ప్రతిరూపాలతో ఎప్పుడు జత కలిసినప్పుడే, అది సాధ్యమవుతుంది.
బోధిచిత్తము యొక్క క్రమావిర్భావం, మహాయాన గ్రంథాలలో ఆసక్తికరమైన విషయం. తాంత్రికులకు బోధిచిత్తము చాలముఖ్యమైన విషయం. యోగాభ్యాసాలవలన అతి మానుష శక్తులను పొందడమే బోధిచిత్తము యొక్క ప్రయోజనం. బోధిచిత్త నిర్మాణానికి ఐదుగురు ధ్యానబుద్దుల మండల నిర్మాణం గురించే గుహ్యసమాజతంత్రం ప్రథమ పటలమంతా చెప్పబడింది. ఈ మండలం తాంత్రికులు కోరిన శక్తులన్నీ ఇవ్వడమే కాకుండా, ఇతర పద్ధతులలో అనేక జన్మలలో సాధ్యమైన బుద్ధత్వప్రాప్తిని ప్రసాదిస్తుంది.
యోగాభ్యాసం చేయనటువంటి సాధకుడికి బోధిచిత్తం ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నకు భగవానుడు సూటిగా జవాబు చెప్పడు. చిత్తాన్ని కాయరూపం నుండి, కాయాన్ని చిత్త రూపం నుండి, తీసి వాక్కు మార్పు చేయడం నుంచి చిత్తాన్ని పొందవచ్చునంటాడు. బోధి సత్వులు, భగవానుడి వలెననే, కాయ, వాక్, చిత్తములను ఏకం చేసి అన్నారు.
“కాయ, వాక్, చిత్రాల మంగళకరమైన వజ్రసంయోగం ఎప్పుడూ సంభవించదు, దానికొక పుట్టుక ఉందని చెప్పడం ఎంత ఆశ్చర్యకరమైన సంగతి”.
తరువాత భగవానుడు ప్రత్యేకమైన ధ్యానంలో కూర్చొని, బోధిచిత్తం గురించి నిర్వచించాడు. తరువాత వైరోచనుడు, అక్ష్యభ్యుడు, రత్నకేతువు, అమితాభుడు, అమోఘసిద్ధి బోధిచిత్రం గురించి తమతమ నిర్వచనాలను చెప్పారు.
అచట సమావేశమైన బోధిసత్వులు సంతుష్టులయి, బోధిచిత్తాన్ని గాథలను చదివి ప్రశంసించారు.
బోధిచిత్తం యొక్క గుణాలు –
అది
- శుద్ధతత్త్వార్థము – స్వచ్ఛమైన సత్యస్వబావం కలది
- సిద్ధార్థము – పవిత్రము
- ధర్మనైరాత్మ్యసంభూతము – ప్రపంచంలోని ఇంద్రియ గ్రాహ్య విషయాల శూన్యత నుండి జనించినది.
- బుద్ధబోధి ప్రపూరకము – బుద్ధత్వాన్ని ప్రసాదించేది.
- నిర్వికల్పము – భావనిర్మాణము లేనిది
- నిరాలంబము – ఏ ఆధారము లేనిది
- సమంత భద్రము – అంతటను ఉత్తమమైనది
- సత్త్వార్థము – సర్వప్రాణికోటికి లాభకరము
- బోధి చిత్త ప్రవర్తకము – బోధిచిత్త ప్రభవించుటకు మూలము
- బోధిచర్య – బోధిచర్యలకు నిర్దిష్ట రూపమిచ్చుట
- మహా వజ్రము – గొప్ప పిడుగు
- చిత్తము తథాగతుల చిత్తము వలె శుద్ధము –
- కాయవాక్ చిత్తవజ్రధృక్ – కాయ, వాక్, చిత్తముల సమాహారము – ఇది వజ్రమును ధరించిన వారి స్వరూపము.
- బుద్ధ బోధి ప్రదాచ – సంపూర్ణ జ్ఞానము ప్రసాదించువారు.
కొంతవరకు మానసిక సంపూర్ణము పొందినవారికే గుహ్య సమాజ తంత్రము అనుకూలిస్తుంది. యోగాబ్యాసము లేనివారికి ఇది సాధ్యం కాదు.
తంత్రంలో, రహస్యమైన మరొక, అర్థమిచ్చేదానిని సంధ్యాభాష అంటారు.
గుహ్యసమాజతంత్రం క్రీస్తుశకం మూడవ శతాబ్దంనాటిది. యోగాచార తత్త్వవేత్త అయిన అసంగుడికి సమకాలీనమయినది. సాధన మాలలో ఈ అసంగుడు ప్రజా పారమితాసాదనను రచించాడని ఉంది. ప్రజ్ఞాపారమితాసాహిత్యాన్ని, మాధ్యమిక వాదియైన ఆచార్య నాగార్జునుడు, పాతాళం నుండి ఉద్ధరించి తెచ్చాడు. అతడు క్రీస్తు శకం రెండవ శతాబ్దివాడు, ప్రజ్ఞా పారమిత క్రీస్తు శకం 265 – 313 సంవత్సరాల మధ్య చైనా భాషలోకి అనువదింపబడింది.
అసంగుడు బౌద్ధ తంత్రానికి మూలపురుషుడు. అతడు గాంధార దేశంవాడని ప్రతీతి. బౌద్ధ తంత్రం భారతదేశానికి వెలుపల నుండి వచ్చింది. అర్యుల ప్రపంచం యొక్క పరిసరాలలో అది వ్యాపించింది. భారతదేశంలో జాలంధర, పూనా (పూర్ణగిరి) శ్రీ పర్వతం, ఓడీయానం, కామాఖ్యలు తంత్రం యొక్క మూలస్థానాలు.
మోహన్ అంతటితో ప్రసంగం ఆపివేశాడు.
(సశేషం)