[dropcap]”వ[/dropcap]సూ! ఇలా ఎన్నాళ్ళు బాధపడతావు? వారం రోజుల నుండి నిద్రాహారాలు మాని మంచం పట్టావు. ఇలా అయితే ఆరోగ్యం దెబ్బతినదూ?” లాలనగా తల మీద చేయి వేసి నిమురుతూ అన్నాడు మధుసూధన్.
“నేను… నేను బ్రతికి ఉండడమే అనవసరం అనుకుంటూ ఉంటే ఇంక నా ఆరోగ్యం పాడయితే మాత్రం నష్టం ఏముందండి?” అని రెండు చేతుల మధ్య ముఖం పెట్టుకొని ఘొల్లున ఏడ్చింది వసుంధర.
“వసూ!… నువ్వు చదువుకున్నదానివి. నీకు నేను వేరే చెప్పక్కర లేదు. నేను…. నేను… మాత్రం ఎవరి కోసం బ్రతకాలి వసూ? మన ఇద్దరం ఒకేసారి…” ఇంకా మధుసూదన్ మాట పూర్తి కానేలేదు…
“ఏవండీ… అంత మాట అనకండి… నేను నేను మీ మనసు నొప్పించాను. ఒక్కసారి ఏ ఆడది తట్టుకోలేని మాట వినేటప్పటికి తట్టుకోలేపోయాను. స్నానం చేయండి. ఈలోగా టిఫిను చేస్తాను” అని మంచం మీద నుండి లేచిన వసుంధరని చూస్తుంటే ఎన్నో లంఖణాలు చేసిన దానిలా అనిపించింది మధుసూధన్‌కి.
***
కాలగర్భంలో పదేళ్ళు దొర్లిపోయాయి. కాలం దొర్లినా వసుంధర మనసులో బాధ అంతకంతకు ఎక్కువ అవుతుందే కాని తగ్గడం లేదు. మధుసూధన్ ఆఫీసుకి వెళ్ళిపోవడంతో వంట పని పూర్తి కావడంతో డ్రాయింగ్ రూమ్‌లో ఒంటరిగా కూర్చని ఉంది వసుంధర. బెల్ ఎవరో కొట్టడంతో తలుపు తీసిన వసుందర ఎదురింటి ఐదేళ్ళ వికాస్‌ని చూసి మొఖం సంతోషంతో నిండిపోయింది. మెరూన్ బేగీ షర్టు, బ్లూజీన్స్ ప్యాంటు వేసుకొని, తలంటిపోసుకున్న తల మీద అక్కడక్కడ కనబడుతున్న అక్షింతలతో, చేతిలో చాక్‌లేట్ డబ్బాతో ఉన్న వికాస్‌ని చూసి, సంతోషంతో గభాలున దగ్గరకు వెళ్ళి ఎత్తుకుని…. “ఓ హేపీ బర్త్ డే నా వికాస్…విష్ యు హేపీ బర్త్ డే” అంది బుగ్గలు చేత్తో నొక్కుతూ వసుంధర.
“థాంక్యూ యూ ఆంటీ! ఇదిగో నీకు రెండు చాక్‌లేటులు, అన్నట్లు మీ ఇంట్లో పిల్లలు లేరుగా, పోనీలే అంకుల్‌కి కూడా రెండు చాక్‌లేటులు ఇస్తాను” అని చాక్‌లేట్లు వసుంధర చేతిలో పెట్టాడు వికాస్.
‘మీ ఇంట్లో పిల్లలు లేరుగా’ అన్న వికాస్ మాటలకు ఒక్క నిముషం మనసు బాధతో నిండిపోయింది. మరు నిముషంలో “ఒక్క నిముషం కూర్చో వికాస్.. ఇప్పుడే వస్తాను” అని లోపలికి పరిగెత్తుకొని వెళ్ళింది వసుంధర.
“ఇదిగో! ఇటు చూడు ఇది మారుతీ కారు… ఇలా వెనక్కి లాగి ముందుకు వదిలితే రయ్‌మని వెళ్ళిపోతుంది. నీకే తీసుకో” అంది.
“నువ్వు…. నువ్వు…. చాలా మంచి దానివి ఆంటీ. నాకు నువ్వుంటే ఇష్టం. అమ్మకే నువ్వంటే ఇష్టం ఉండదు. చాక్‌లేటులు ఇచ్చి వెంటనే వచ్చేయ్. ఆంటీ ఉండమన్నా ఉండ వద్దు అంది. అయినా ఆంటీ…. మీ ఇంట్లో చిన్న పిల్లలు లేరుగా ఈ కారు ఎందుకు కొన్నావు?” అన్నాడు కళ్లు చక్రల్లా తిప్పుతూ వికాస్….
ఒక్క నిముషం ఏం మాట్లాడాలో తెలియని దానిలా మౌనం వహించి “నీలాంటి చిన్న పిల్లలకు ఇద్దాం అని అంకుల్ కొన్నారు వికాస్… అన్నట్లు మీ మమ్మీ, తొందరగా వచ్చేయమంది అన్నావుగా, పద” అని చేయి పట్టుకొని నడిపించుకుంటూ గేటు దగ్గరకు వెళ్ళింది వసుంధర. అప్పటికే ఎదురింటి గేటు దగ్గర నిలబడి ఉంది వికాస్ అమ్మ. వసుంధరని చూసి తప్పదన్నట్లు నవ్వి “ఏరా ఇంత సేపు, రా తొందరగా! డాడీ నీ కోసం చూస్తున్నారు” అంది కోపంగా.
బాధగా వచ్చి మంచం మీద వాలిపోయింది వసుంధర. ఎందుకో తెలియదు, ఎదురింటి వికాస్ తల్లి తనని చూస్తే మాట్లాడడానికి ఇష్టపడదు. వికాస్ వీదిలో ఆడుకుంటున్నప్పుడు తను వాడిని పిలిచి సరదగా మాట్లాడితే రుసరుసలాడుతూ వికాస్‌ని ఇంట్లోకి తీసుకు వెళ్ళిపోతుంది. వికాస్ తల్లి అలా ప్రవర్తించడానికి కారణం ఇంకేముంటుంది? గొడ్రాలి నీడ తన కొడుకు మీద పడకూడదు అని అయి ఉంటుంది? అవును!… అందుకే… వికాస్ తల్లి తనని చూస్తే కోపం తెచ్చుకుంటుంది. ఇది తన లోపమా?
ఇరుగు పొరుగు, సంఘం – ‘గొడ్రాలు’ అని ముద్ర వేసినప్పుడు మానసికంగా దెబ్బతింది. ఆలోచనలు భరించలేని దానిలా ఏమైనా బుక్స్ చదువుదామని అలమార తెరిచింది వసుంధర. ఎదురుగుండా పెళ్ళినాటి ఆల్బమ్స్ కనిపించడంతో అవి తీసుకొని వచ్చి కూర్చీలో కూర్చుని తిరగవేసిందో లేదో రెండు ఉత్తరాలు కనిపించాయి. చదివిన పాత ఉత్తరాలు అని తెలిసినా విప్పింది.
“మధుసూదన్‌కి,
మీ అక్క దీవించి వ్రాయునది. మీకు ఇక పిల్లలు పుట్టరని తెలిసింది. తమ్ముడూ!… ఎన్నాళ్లు పిల్లా జెల్లా లేకుండా బ్రతకగలరు? అందుకు కన్న ప్రేమను చంపుకొని మా రెండో వాడిని నీకు దత్తత ఇవ్వాలని మీ బావగారు, నేను నిర్ణయానికి వచ్చాము. కాని ఒక షరతు. కన్న తల్లిదండ్రులుగా మా అబ్బాయి భవిష్యత్తు మేము ఆలోచించాలి కదా? మీకున్న ఆస్తిపాస్తులు ముందే మా అబ్బాయి పేరున వ్రాయాలి. అంతే కాదు, నీ రిటైర్మెట్ అయినాక వచ్చే డబ్బు నీ తదనంతరం వాడికి చెందేట్లు ముందే వ్రాయాలి. ఇదిగో తమ్ముడు! అక్క ఇలా వ్రాసింది ఏమిటా అని నీకు బాధ కలుగవచ్చు. కన్న సంతతి మీద తల్లితండ్రులకు ఎంత ప్రేమ అనురాగాలు ఉంటాయో ఏ అనుబంధం లేని మీలాంటి పిల్లలు లేని తల్లితండ్రులకు తెలియదు. మరి మమ్ములను ఎప్పుడు బయలుదేరి రమ్మంటావ్? వెంటనే ఉత్తరం వ్రాయి. మరదలుని అడిగినట్లు చెప్పు.
ఇట్లు,
నీ అక్క పార్వతి.
ఉత్తరం చదువుతున్న వసుంధర కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి. అప్రయత్నంగా రెండో ఉత్తరం విప్పబోయింది. మధుసూదన్ అన్నయ్య వ్రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం పార్వతి ఉత్తరంకి కాపీ లాగే ఇంచుమించు వ్రాసాడు.
ష్చ్!…. పిల్లలు పుట్టనంత మాత్రాన మమతానురాగాలు, అనుబంధాలు మాలాంటి తల్లిదండ్రులకు తెలియదా? అయినా పిల్లలను పెంచుకోవాలంటే ఇన్ని షరతులా? ఆలోచనల్లో ఉండగానే వీధిలో కాలింగ్ బెల్ మ్రోగింది.
తలుపు తీసిన వసుంధర మధుసూదన్ ముఖం సంతోషంతో నిండి ఉండడంతో “ఏమిటండీ విశేషం? అయినా టైము కాకుండానే ఆఫీసు నుండి వచ్చేసారు?” అంది.
“ఇన్నాళ్ళు ఒక్కదానివి ఇంట్లో బోరు కొడుతూ కాలక్షేపం చేస్తున్నావు కదోయ్. ఇక నీకు కావలసినంత కాలక్షేపం, మా అన్నయ్య ఆఖరి కూతురు వినీల మన ఇంట్లో ఉండడానికి వస్తుంది” అన్నాడు.
“వినీల వస్తుందా? అదంటే నాకు ప్రాణం. ‘పువ్వుల్లో పెట్టి పెంచుతాను’ అని బావగారిని అడిగితే ఆయన పెట్టిన షరతులకు మీరు ఒప్పకోలేదు. శలవులకైన మన ఇంటికి పంపమంటే పంపని వాళ్ళు! మన ఇంట్లో ఉండడానికి వస్తుందా నిజం చెప్పండి?” అంది ఆత్రుతగా వసుంధర.
“అవును వసూ! మా అన్నయ్యకి నార్త్ సైడ్ ట్రాన్స్‌ఫర్ అయింది. వినీల మన ఇంట్లో ఉండి చదువుతాను అందట. అంతే కాదు ‘వినీల ఇక మీ అమ్మాయే అనుకోండి, మేము చూడటానికి వచ్చినప్పుడు ఒకసారి చూపిస్తే చాలు. నేను పొరపాటుగా ప్రవర్తించాను’ అన్నాడు. అర్జెంటు అర్డర్స్ వచ్చాయట, అక్కడ అన్నయ్యని జాయిన్ అవ్వమని. వినీల సాయంకాలం 5 గంటలకు మన ఇంట్లో ఉంటుంది. నేను స్టేషనుకి వెళ్ళి తీసుకురావాలి, అందుకే ఒక పూట శెలవు పెట్టి వచ్చాను” అన్నాడు మధుసూధన్.
“నాకు… నాకు…. నిజంగా చెప్పలేని సంతోషంగా ఉందండి. చిన్నప్పటి నుండి వినీలకి నా దగ్గర చేరిక ఎక్కువ నాకు అందటే ప్రాణం. పోనీలెండి భగవంతుడికి మన మీద జాలివేసి ఉంటుంది.” ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి వసుంధరకి.
***
“సీతమ్మా! మా అమ్మాయి సాయంకాలం ట్రైన్‌కి వస్తుంది రేపటి నుండి నాకు బోలెడు పని ఉంటుంది. రోజూలా కాకుండా పెందలాడే గిన్నెలు కడగడానికి రావాలి, తెల్సిందా” అంది వసుంధర.
“అమ్మా! తమరు ఏమీ అనుకోనంటే చిన్న మాట! మొగుడు లేని దానిని… నలుగురు పిల్లలు. రెక్క ఆడితే కాని డొక్క ఆడదు. ఎన్నో ఏళ్ళ బట్టి మీ ఇంట్లో పని చేస్తున్నాను. మా పెద్ద పిల్ల లక్ష్మి ఖాళీగా ఉంది. అది పని చేసే అమ్మగారు ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయారు. మీరు ఇంత ముద్ద పడేస్తే మీ చేతి కింద పని చేసుకుంటూ ఉంటుంది. నేను ఐదు ఇళ్ళ పని చేయాలమ్మా” అంది బ్రతిమిలాడుతున్న ధోరణిలో సీతమ్మ.
“నాకు మరీ మంచిది సీతమ్మ. నువ్వు చెప్పినట్లుగానే మా ఇంట్లోనే ఉంచుకుంటాను, అన్నట్లు జీతం ఎంత ఇవ్వమంటావ్?” అంది వసుంధర.
“అమ్మా! తమరు ఏమీ అనుకోనంటే చిన్న మాట. దానికి చదువుకోవాలని ఆశమ్మా. రిబ్బనులు కొనుక్కోమని డబ్బులు ఇస్తే ఐదో తరగతి పుస్తకం కొనుక్కుంది. లక్ష్మి నాన్న చనిపోయి చదువు ఆగిపోయింది. తమరు ఖాళీగా ఉన్నప్పుడు నాలుగు ముక్కలు చెబితే చాలు. ఇక జీతం ఎందుకమ్మా?” అంది.
“నీకు ఇచ్చే జీతం దానికి ఇస్తాను సీతమ్మ. ఇక చదువు అంటావా, ఖాళీగా ఉన్నప్పుడల్లా చెబుతాను. మా అమ్మాయి వచ్చే టైము అయింది. నేను టిఫిను చేయాలి. రేపటి నుండి లక్ష్మిని మా ఇంట్లో ఉండడానికి పంపు” అంటూ హడావిడిగా వంట గదిలోకి దారి తీసింది వసుంధర.
***
వీధి తలుపు బార్లా తెరిచి కూర్చుంది వసుంధర. ఆటో ఆగగానే ఆటలోంచి వినీల దిగి పరుగున వచ్చి వసుంధరను కౌగిలించుకొని “పిన్నీ! బాగున్నావా?” అంది.
“వినీలా!…. నువ్వు ఎలాగున్నావమ్మా? ఒక్క ఏడాదిలో ఎంత పొడవు అయిపోయావు అమ్మా? నాన్నగారు, అమ్మా అందరూ బాగున్నారా?” అంది.
“నాన్నగారు ఈ రోజు నన్ను ట్రైన్‌కి వచ్చి ఎక్కించారు పిన్ని. రేపు వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. నిజం చెప్పాలంటే ఐదో తరగతిలో నేను నీతో ఇక్కడకు వచ్చేస్తాను అని అల్లరి పెట్టాను గుర్తుందా పిన్ని? వాళ్ళు పంపలేదు. ఇన్నాళ్ళకు నా కోరిక తీరింది పిన్ని… ఇక నేను ఇక్కడే ఉండిపోతాను పిన్ని.”
“వినీలా!…. చాలా సంతోషం అమ్మా… పద ఎప్పుడు తిన్నావో ఏమిటో, నీకిష్టమయిన పాయసం చేసాను, జీడిపప్పు వేసి పకోడీలు చేసాను” అంది.
భార్య సంతోషాన్ని కన్నార్పకుండా చూడసాగాడు మధుసూదన్.
“అన్నట్లు పిన్నీ, చిన్నాన్న కిష్టమని అమ్మ అరిసెలు, మినపసున్నులు చేసింది. ఆ సంచిలో ఉన్నాయి” అని పెట్టె పట్టుకొని బెడ్‌రూమ్‌లోకి నడిచింది.
“అన్నట్లు పిన్ని నేను ఏ రూమ్‌లో పడుకోవాలి? ఇల్లు చాలా బాగుంది” అంది.
“రెండో బెడ్ రూము స్టడీ రూము క్రింద వాడుకుందుగాని అమ్మా… మా రూమ్‌లోనే పడుకుందువుగాని” అంది వసుంధర.
***
వినీల ఇంటరులో జాయిన్ అయింది. ప్రొద్దున్న లేచిన దగ్గర నుండి వసుంధర వినీలకు కావలసినవి అమర్చడంలోనే ఉంటుంది. నిజం చెప్పాలంటే మధుసుదన్‌కి కాలసిన వన్నీ అమర్చే పని వసుంధర ఇంచు మించు మరిచిపోయింది.
“ఏమండీ కొంచం కాఫీ ఆ టేబిల్ మీద ఉంది తాగండి. లక్ష్మిని అడిగి టిఫిను పెట్టించుకోండి.”
“అన్నట్లు లక్ష్మి అయ్యగారి బూటులు పాలిష్ చేయి, చూడండీ వినీల రెండు ఇడ్లీలే తింది… మీరు చెప్పండి ఇంకొక ఇడ్లీ తినమని. ప్రాక్టీకల్స్ ఉన్నాయట త్వరగా వెళ్ళాలంటుంది. కొంచం స్కూటరు మీద డ్రాప్ చేయండి. అన్నట్లు సాయంకాలం వస్తున్నప్పుడు బత్తాయిలు తీసుకురావడం మరిచిపోకండి. వినీలకు బత్తాయిరసం ఇవ్వాలి” అని హడావిడి పడిపోతున్న వసుంధర ధోరణి చూస్తుంటే మధుసూదన్‌కి పెదాలపై చిన్నగా నవ్వు చోటు చేసుకుంది.
వినీల కాలేజికి, మధుసూధన్ ఆఫీసుకి వెళ్ళిపోవడంతో సంతోషంగా మంచం మీద వాలిపోయింది.
వినీల ఎంత మంచి పిల్ల? తనంటే పంచప్రాణాలు. వాళ్ళ చిన్నాన్న అంటే ప్రేమ, అభిమానం. అసలు తను పొరపాటు చేసింది. బావగారు రెండో అమ్మాయిని దత్తతకు ఇస్తానని షరతులు పెట్టినపుడు మధుసూదన్ అనవసరంగా కోపం తెచ్చుకున్నాడు.
మూడో అమ్మాయి వినీలను వాళ్ళు కోరిన షరతులన్నింటికి ఒప్పుకొని తాము తెచ్చుకోవలసింది. ఇన్నాళ్ళు నిరాశ నిస్పృహలతో గడిపింది.
“అమ్మగారూ… పుస్తకం చదవడం వచ్చిందమ్మా, కాని లెక్కలు రావడం లేదమ్మా. కొట్టుకు నిన్న వెళ్ళి సామానులు తెచ్చాను కదా అమ్మా… డబ్బు సరిగా ఇచ్చావా అంటే, నీకు లెక్కలు రాకపోతే మీ ఇంట్లో లెక్క వేయించుకో అన్నాడు. చూడండమ్మా పద్దు కాగితం… అమ్మా! నాకు లెక్కలు నేర్పండమ్మా” అంది లక్ష్మి.
ఒక్క నిముషం లక్ష్మి వైపు చూసింది వసుంధర. చంద్రబింబంలాంటి ముఖంలో గుండ్రంటి కళ్ళు, లక్కపిడత లాంటి నోరు, కొనతేరిన ముక్కు… గాని లక్ష్మి వేసుకున్న రంగు వెలిసిపోయిన బట్టలు, సంరక్షణ లేని రాగి వెంట్రుకలుగా మారిన పొడవాటి జుట్టు, లక్ష్మి అందాన్ని నిండు చందమామని ఆవరిస్తున్న అమావాస్యలా ఉంది.
“నూని వ్రాసుకొని జడ వేసుకోలేకపోయావా? ఎప్పుడు చూసినా రంగు వెలసిపోయిన ఈ పాత బట్టలు వేసుకుంటావ్? వేరే బట్టలు వేసుకలేకపోయావా?” అంది వసుంధర.
బేలగా కళ్ళుదించింది లక్ష్మి. “నూని వ్రాసుకొని పది రోజులయిందమ్మ. మా చెల్లి గౌరి బట్టలు చినిగిపోయాయి అని అమ్మా నా బట్టలు తీసుకువెళ్ళిపోయింది. ఒకటవ తారీఖున డబ్బులందుకొని నాకు బట్టలు కుట్టిస్తాను” అంది.
లక్ష్మి పేద స్థితి చూసి జాలి వేసింది వసుధరకు. కాగితం మీద వ్రాసి “లక్ష్మీ, వినీలమ్మగారికి నేను కాగితం మీద వ్రాసిన నూని, నీకు కొబ్బరి నూని కొట్టుకు వెళ్ళి తెచ్చుకో. అన్నట్లు నా చీర ఇస్తాను లంగా, జాకెట్లు కుట్టించుకో. ముందు ఈ పనులు చేయి. రేపటి నుండి లెక్కలు చెబుతాలే” అంది.
“అలాగే అమ్మా” అంది లక్ష్మి.
***
మంచం మీద ములుగుతున్న భార్య వంటి మీద చేయి వేసి చూసి, “మైగాడ్! జ్వరం చాలా ఎక్కువగా ఉంది వసూ! నాతో చెప్పలేదేం? లక్ష్మీ!… మంచి నీళ్ళు తీసుకురా! అమ్మగారికి జ్వరానికి మాత్ర వేస్తాను” అన్నాడు మధుసూదన్.
గ్లాసుతో నీళ్ళు తెచ్చి మధుసూదన్‌కిచ్చి “అయ్యగారూ! అమ్మగారికి, మీకు కాఫీ తీసుకురానాండీ” అంది లక్ష్మి.
“నీకు కాఫీ పెట్టడం వచ్చా లక్ష్మీ?” అన్నాడు మధుసూధన్ ఆశ్చర్యంగా.
“రోజూ అమ్మగారు కాఫీ కలపడం చూస్తున్నాను అయ్యగారు, నాకు కాఫీ చేయడం తెలుసు. వీనీలమ్మగారికి కాలేజికి టైము అవుతుంది అని ఇడ్లీలు చేసాను. పాలు కాచి వినీలమ్మగారికి పాలు ఇచ్చాను. మీకు, అమ్మగారికి కాఫీ ఇస్తాను” అని వంటగదిలోకి పరిగెత్తింది.
“చురుకైన పిల్ల” అనుకున్నాడు మధుసూధన్. స్నానం చేసి వచ్చిన వినీల కంగారుగా మంచం దగ్గరకు వచ్చి “ఏమిటి చిన్నాన్నా! పిన్నికి జ్వరమా? డాక్టరు దగ్గరకు వెళదామా” అంది.
చిన్నగా కళ్ళు విప్పిన వసుంధర “కంగారేం లేదమ్మా. ఈ రోజు చూసి రేపు వెళతాను, నీకు టిఫిను పెడతాను” అని మంచం మీద నుండి వసుంధర లేవబోయింది.
రెండు కాఫీ కప్పులతో మంచం దగ్గరకు వచ్చి, “అమ్మగారు, మీరు లేవకండి. వినీలమ్మగారికి టిఫిను టేబిల్ మీద పెట్టాను, కాలేజీకి వెళ్ళేటప్పుడు తాగడానికి బత్తాయి రసం తీసాను” అంది.
“వసూ! ముందీ కాఫీ తాగు” అన్నాడు మధుసూదన్.
“ఎలా కలిపిందో కాఫీ” అని వసుంధర అనేంతలో “అచ్చం మీరెలా కలుపుతారో అలాగే కలిపానమ్మగారు కాఫీ” అంది.
కాఫీ తాగుతూ “బాగా చేసిందండి కాఫీ” అంది మెచ్చుకోలుగా వసుంధర.
ప్రతి పని చేతిలోది అందుకుంటు చక చకా పని చేసే లక్ష్మిని చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది వసుంధర.
కాలం దొర్లతుంది వసుంధర విషయంలో సంతోషంగా.
వినీల డిగ్రీ ఫైనల్ ఇయర్‌లోకి వచ్చింది. లక్ష్మిని ప్రైవేటుగా టెన్త్ క్లాసు కట్టడానికి అప్లై చేయించింది వసుంధర.
“అమ్మగారూ! దేవుడి గది కడిగి, పువ్వులు తెచ్చిపెట్టాను” అంది లక్ష్మి.
“వంట్లో బావుండలేదే లక్ష్మీ. తలంతా తిరుగుతుంది. బి.పి గాని ఎక్కువయిందో ఏమో?” అంది వసుంధర.
“అమ్మో! మొన్న అయ్యగారికి బి.పి ఎక్కవయి నాలుగు రోజులు హాస్పటల్‌లో ఉన్నారు. డాక్టరుగారు అయ్యగారిని బి.పి అప్పుడప్పుడు చెకప్ చేయించుకోవాలి అన్నారు. మీరు కూడా అశ్రద్ధ చేస్తున్నారు” అంది కంగారుగా లక్ష్మి.
“ఉష్! గట్టిగా అనకే. అయ్యగారు, వినీల వింటే ఇప్పుడే హస్పటల్‌కి బయలుదేరమంటారు. అసలే వినీలకు పరీక్షలు” అంది.
మధుసూధన్ ఆఫీసుకి, వినీల కాలేజీకి వెళ్ళిపోయారు. నెమ్మదిగా శక్తి తెచ్చుకొని దేవుడి గది దగ్గర కూర్చుని పూజ అయిందనిపించి, మంచం మీద వచ్చి వాలిపోయి “లక్ష్మీ! మంచి నీళ్ళు పట్టుకురా…” అని లక్ష్మి తెచ్చిన నీళ్ళతో మందులు వేసుకుంది వసుంధర.
“ఇప్పటిదాకా టిఫిను తిన్నారు కాదు, వంట్లో బాగలేనప్పుడు పూజ ఎందుకు చేయడం అమ్మా?” అంది లక్ష్మి.
“లక్ష్మీ… నా చివరి ఊపిరి ఉన్నంత వరకు దేవుడికి పూజ చేయాలి. నేను…. జీవితంలో పొందలేను అనుకున్న ఆనందాన్ని నాకిచ్చాడు. దేవుడు మనం కోరిన కోరికలు తీరుస్తాడు” అంది.
విప్పారిన నేత్రాలతో అలా అమ్మగారి వైపు చూస్తూ ఉండిపోయింది లక్ష్మి.
***
“ఏవండీ! వినీలకు డిగ్రీ పూర్తయిపోతుంది. ఒక వేళ మీ అన్నయ్యగారు వచ్చి వినీలను తీసుకుని వెళ్ళిపోతారు. ఏమో? వినీల… వినీల మన కూతురేకదండీ? చెప్పండి” అంది మధుసూధన్ చేయి పట్టకొని ఆవేదనగా వసుంధర.
“పిచ్చి వసూ! అన్నయ్య మనకు పిల్లలు లేరన్న బాధతోనే వినీలను మన దగ్గర వదిలాడు. శెలవులు వచ్చినా కూడా వాళ్ళు వచ్చి చూసి వెళుతున్నారు. మొదట్లో ఏదో రెండో దానిని ఇవ్వడానికి షరతులు పెట్టాడు కాని తరువాత తన తప్పు తాను తెలుసుకునే వినీలను మన దగ్గర ఉంచాడు.”
“అయితే వినీల… వినీల మన కూతురే కదండీ?” అంది సంతోషంగా వసుంధర.
“నీ కూతురేలే వసూ!..” అని మధుసూధన్ నవ్వుతూ “అన్నట్లు పాపం లక్ష్మికి పనితోనే సరిపోతుంది. టెన్త్ పరీక్షలకు పంపుతున్నావ్… అన్ని సబ్జెక్టులు చెబుతున్నావా?” అన్నాడు.
“సరే లెండి… లక్ష్మి గురించి మీరు నాకు చెప్పాలా? అసలు దాని తెలివితేటలు ఎవరికి ఉన్నాయండి? ఈ రోజు పరీక్ష పెడితే వ్రాయడానికి సిద్ధంగా ఉంది” అంది నవ్వుతూ వసుంధర.
***
వినీల పరీక్షలయిన వెంటనే వినీల తల్లితండ్రులు రావడం చూసి ఒక ప్రక్క సంతోషంగా ఉన్నా మరో ప్రక్క వసుంధర గుండెలు దడదడలాడసాగాయి.
“మధూ!… వినీలకు పెళ్ళీడు వచ్చింది. మా ఫ్రెండు కొడుకు సంబంధం కూడ రడీగా ఉంది. అబ్బాయి ఈ ఊరిలోనే బిజినెస్. మా ఫ్రండ్ వినీలను చూసి నచ్చిందన్నాడు. అబ్బాయికి వినీల ఫోట నచ్చిందట. ఈ నెలాఖరుకి పెళ్ళి చేసేయాలి అని మా ఫ్రెండ్ అంటున్నాడు. అన్నట్లు వినీల గురించి మరదలు బెంగ పెట్టుకుంటుంది అని ముఖ్యంగా ఈ ఊరిలోనే అబ్బాయి ఉంటాడని ఈ సంబంధానికి ఒప్పకున్నాను. మరదలు వినీల మీద ఎంత ప్రేమ అనురాగాలు పెంచుకుందో నేను ఊహించగలను. వినీలను మరదలికి దూరం చేయండం నా కిష్టం లేదు” చివరి మాటలంటున్నప్పుడు ఆయన గొంతులో బాధ కొట్టవచ్చినట్లు మధుసూధన్‌కి కనిపించింది.
“అన్నయ్యా! నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని, నీలాంటి అన్నయ్య నాకు ఉన్నందుకు” అన్నాడు మధుసుధన్.
ఆప్యాయంగా మధుసూధన్ భజం మీద చేయివేసాడు మధుసూదన్ అన్నయ్య.
వినీల పెళ్ళి గురించి ఆలోచించనందుకు ఒక్క నిముషం సిగ్గు పడింది వసుంధర. బావగారు ఎంత మంచి మనిషి? తన కోసం ఈ ఊరి సంబంధం కుదిర్చారు. తన కూతురుకి పెళ్ళి కాబోతుంది. తన చిన్నారి తల్లిని నవ వధువుగా చూడబోతుంది.
***
వసుంధర వంటి మీద నగలు తప్ప లాకరులో నగలన్నీ తీసి వినీలకిచ్చేయడం, పెళ్ళి బట్టలన్నీ వసుంధర మధుసుధన్ కొనడం, పెళ్ళి ఖర్చంతా వాళ్ళే భరించడం చూసి వినీల తల్లి తండ్రులతో పాటు చుట్టాలు అందరూ ఆశ్చర్యపోయారు.
కాపురానికి వినీల వెళుతున్నప్పుడు వసుంధర వినీలను విడిచిపెట్టలేకపోయింది. “వసూ! నీకేమైన మతి పోతుందా? ఊరిలోనే ఉంటుంది. ఎప్పుడు చూడాలి అని అనకుంటే అప్పుడే చూడవచ్చు. లేదా మన ఇంటికి తెచ్చి ఉంచుకోవచ్చు అయినా వసూ! ఒక్క నిజాన్ని తెలుసుకో నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని, కష్టాలు పడి అయినా కోరిన కోరికలు తీర్చిన తండ్రిని పిల్లలు రెక్కలు వచ్చిన పక్షుల్లా వదిలివేస్తారు. చివరికి ఆ తల్లి తండ్రులు ఒంటరిగానే మిగిలిపోతారు” అని మధుసూధన్ అనగానే… “ఏమో నాకు… నాకు వాళ్ళ గురించి తెలియదండి… నేను… నేను… మాత్రం వినీలను చూడకుండా ఉండలేను” అంది బాధగా వసుంధర.
“పిన్నీ… నేను మాత్రం నిన్ను చూడకుండా ఉండగలనా? నన్ను చూడాలని ఉంటే ఫోను చేయి… వచ్చేస్తాను” అని వసుంధరను పెనవేసుకుపోయింది వినీల.
వసుంధర వినీల మధ్య ఆత్మీయతను చూసి అలా చూస్తూ ఉండిపోయాడు నవీన్… నవీన్ కళ్ళల్లో కన్నీటి తెర చోటుచేసుకొని “ఆంటీ!… రోజు ఒకసారి వినీలను తీసుకు వచ్చి మీకు చూపెడతాను” అన్నాడు అప్యాయంగా నవీన్…
“బాబూ నవీన్… నేను… చాలా అదృష్టవంతురాలిని” అంది వసుంధర.
***
మధుసూధన్‌కి సడన్‌గా బి.పి పెరిగి ఆఫీసులో స్పృహ కోల్పోవడంతో హాస్పటల్‌లో జాయిన్ చేసి ఇంటికి ఫోను చేసారు ఆఫీసు వాళ్ళు.
ఆదురుతున్న గుండెలతో దుఃఖాన్ని ఆపుకుంటూ హాస్పిటల్‌కి వెళ్ళింది వసుంధర.
బి.పి బాగా ఎక్కువయి స్పృహ కోల్పోవడంతో, సైడ్ ఎఫెక్ట్సు రాకుండా బి.పి తగ్గే వరకు హాస్పిటల్‌లో ఉండాలి అని డాక్టరుగారు చెప్పడంతో భయంతో వినీలకు ఫోను చేసి పరిస్థితి అంతా చెప్పింది వసుంధర.
సాయంకాలం అవుతున్నా వినీల రాకపోవడంతో ‘వచ్చేస్తున్నాను పిన్నీ’ అని ఫోనులో చెప్పిన వినీల, ఇంకా రాలేదు ఏమిటి అని గుమ్మం వైపు చూడసాగింది వసుంధర.
క్యారేజీ పట్టకొని, తలకి స్నానం చేసిన జారు జడకి రబ్బరు బ్యాండ్ వేసి, వినీల పాత పంజాబి డ్రస్సు వేసుకొని నుదుట ఎర్రని బొట్టుతో లక్ష్మి వసుంధర దగ్గరకు వచ్చి “అమ్మా!… అయ్యగారికి ఎలా ఉందమ్మా?” అని అడుగుతున్న లక్ష్మి కళ్ళల్లో నీరు నిండుకుంది.
“అయ్యగారికి అలాగే ఉంది. నేను భోజనం చేయలేను. ఎందుకే క్యారియరు తెచ్చావు? నా ఒక్కదాని కోసం వంట చేసావా?” అంది వసుంధర.
“వంట ఎప్పుడో చేసానమ్మా. ఈ వేళ శుక్రవారం కదమ్మా. మీరు ఇక్కడ ఉన్నారు. దేవుడి గది కడిగి దేవుడి సమానులు అన్నీ తోమి, తలకి నీళ్ళు పోసుకొని పూజ చేసి వచ్చేటప్పటికి ఆలశ్యం అయిందమ్మగారు.”
వసుంధర ఒక్క నిముషం లక్ష్మి వైపు చూసి, “పూజ నువ్వు చేసావా?” అంది.
భయంగా ఒక్క నిముషం వసుంధర వైపు చూసి “క్షమించండమ్మగారు! శుక్రవారం రోజున మీకు వంట్లో ఎంత బాగుండకపోయినా పూజ చేస్తారు. మనం కోరిన కోరికలు దేవుడు తీరుస్తాడు అని మీరు ఆ రోజు చెప్పారు కదమ్మగారు అందుకని… అయ్యగారి ఆరోగ్యం బాగుపడాలని, జబ్బు తగ్గిపోవాలని…”
“లక్ష్మీ…” అని నీళ్ళు నిండుతున్న కళ్ళతో లక్ష్మి చేయిని తన చేతుల్లోకి తీసుకుంది వసుంధర.
***
“పిన్నీ… చిన్నాన్నకి ఎలాగుంది?” అంది కళ్ళల్లో నీళ్ళతో వసుంధర చేయి పట్టుకొని వినీల.
“ఆఫీసు నుండి రాగానే వినీల చెప్పింది. చాలా కంగారు పడిపోయాను. ఎలాగుందండి మామయ్యగారికి?” అన్నాడు నవీన్.
“బాగానే ఉంది బాబు. ఇంతకు మనుపు కొద్దిగా కళ్ళు తెరిచి చూసారు. డాక్టరుగారు ప్రమాదం లేదు అని అన్నారు. ప్రొద్దున్న పది గంటల నుండి మీ కోసం చూస్తున్నాను. ఎంత కంగారు పడుకూడదన్నా నా మనసు…” అప్పటికే వసుంధర కళ్ళల్లో నీళ్ళు నిండకొని మాట పూర్తి చేయలేకపోయింది.
“ఏమిటి పది గంటలకు మామయ్యగారిని హస్పటల్‌లో జాయిన్ చేసారా?” అని నవీన్ ఆశ్చర్యంగా అంటుండగానే “చెప్పాను కదండీ నేను బయలుదేరబోతున్నాను మీ అంకుల్ ఆంటీ వచ్చారు” అంది వినీల.
“వస్తే వచ్చారు, ఇలా మీ చిన్నాన్నగారికి ఉన్నప్పుడు వాళ్ళు వస్తే మర్యాదలు చేయాలా?” అని నవీన్ అంటుండగానే “అబ్బబ్బ… ఉండండి…” అని… “చిన్నాన్నా… నేను వినీలను వచ్చాను… ఒక్కసారి చూడు చిన్నాన్న…” అంది.
వసుంధర కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి.
“చూడు వినీల! మీ పిన్నిగారు బాగా బెంగ పెట్టుకున్నారు. నువ్వు తోడుగా ఉంటే మీ పిన్నిగారికి ధైర్యంగా ఉంటుంది. నీ బట్టలు ఏవీ తేవాలో చెబితే తీసుకు వస్తాను.”
“అది కాదండీ… మీ ఆంటీ… అంకుల్ ఇంట్లో…” వినీల మాట పూర్తికాలేదు….
“ఉంటే ఉన్నారులే… వాళ్ళకు తోయక నెలకి రెండు సార్లు మన ఇంటికి వస్తుంటారు… వాళ్ళు వండుకు తింటారుగాని” అని నవీన్ అనగానే…
“వద్దులే నవీన్!… హస్పిటల్ ఏం ఉండగలదు వినీల? ఇంటికి వెళ్ళిపో అమ్మా!…” అంది వసుంధర.
“రేప్రొద్దున్నే వచ్చేస్తాను పిన్ని” అంది వినీల…
“ప్రొద్దున్నే హస్పిటల్‌కి పాలు, కాఫీ… ఏం పంపాలో అడుగు… ప్రొద్దున్నే నువ్వు రడీ చేస్తే నేను హాస్పిటల్‌లో ఇచ్చేస్తాను” అన్నాడు నవీన్.
“అయ్యో నాకన్నా లక్ష్మి కాఫీ బాగా కలుపుతుందండి. మా లక్ష్మి చేసిన కాఫీ, ఇంట్లో అందిరికి ఇష్టం. ఏ పిన్నీ నేను కాఫీ పంపనా?” అంది.
“ఎందుకమ్మా వినీల లక్ష్మికి అన్ని పనులు వచ్చు. భోజనం నాకు తీసుకురా వద్దు అని చెప్పినా, క్యారియరు తెచ్చింది. చిన్నాన్నకి స్పృహ వస్తే నిన్ను చూడాలని ఆరాటపడతారు. రేపు ఒకసారి రా అమ్మా!” అంది వసుంధర.
“అలాగే పిన్ని…” అంది వినీల.
***
“వినీల… వినీల… నా వినీల… నా చిన్నారి తల్లి ఎక్కడ… రా అమ్మ…” కళ్ళు తెరవకుండానే నెమ్మదిగా పలవరిస్తున్న మధుసూధన్‌ని చూసి “ఏవండీ! మన వినీల వచ్చి వెళ్ళిందండి…. మీ కోసం కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకుంది… ఇంకొంచం సేపటిలో వస్తుందండి” అంది భర్త చేయి పట్టకొని బుజ్జగిస్తూ వసుంధర.
నెమ్మదిగా కళ్ళు తెరిచాడు మధుసూధన్!
“మన వినీల… మన అమ్మాయి వచ్చిందా?” అని కళ్ళు తెరిచి వసుంధర వైపు చూసి నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు మధుసూధన్.
వసుంధర ఒక్క నిముషం భర్త ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది. ‘ఇన్నాళ్ళు తను ఒక్కతే పిల్లలు లేనందుకు బాధపడుతుంది’ అని అనుకుంది కాని తన భర్త వినీల పట్ల ఎంతో అనుబంధానిని పెంచుకుంన్నాడు? క్యారియరు పట్టకొని లక్ష్మి రావడం చూసి “లక్ష్మి!… నేను వినీలమ్మగారింటికి వెళ్ళి వస్తాను. ఒక్క అర గంటలో. అయ్యగారి దగ్గర నువ్వు కూర్చో” అంది.
“అలాగే అమ్మగారు” అంది.
ఆటోని పిలిచి ఎక్కి వినీల ఇంటికి వెళ్ళింది. తలుపు గడియ పెట్టి ఉంది. కాలింగ్ బెల్ కోసం చూసి కనిపించగానే చేయి పెట్టేటంతలో నవీన్ మాటలు కోపంగా వినబడ్డాయి.
“వినీలా!…. ఛ!… ఛ!… నిన్ను ఏమనాలో కూడా తెలియడం లేదు. మీ చిన్నాన్న, పిన్ని ప్రాణప్రదంగా నిన్ను పెంచారు అని చెప్పావు… ఆవిడకు నిన్ను చూస్తే చాలు కళ్ళల్లో కోటి కాంతులు వెలుగుతాయి. అంత ఆపదలో వాళ్ళు ఉంటే కూతురిగా ఆవిడకు ఎంతో సహాయంగా ఉండవలసింది… అమాయకంగా ఏం తెలియనట్లు తప్పించుకున్నావు. పోనీ అదలా ఉంచు, ప్రొద్దున్న మీ చిన్నాన్నను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే నేను వచ్చే వరకు హాస్పిటల్‌కు వెళ్ళావు కావు.”
“అబ్బబ్బ… మీ స్పీచ్ ఇక ఆపండి… ముందు ఈ నేతి సున్నలు… అరిసెలు తినండి… ఊ… మిమ్మల్నే” అంది వినీల.
“అన్నట్లు మీ నాన్నగారు, అమ్మగారు మీ చిన్నాన్నగారికి ఇష్టమని అరిసెలు, సున్ని ఉండలు సగం పంపమని ఉత్తరం వ్రాసి, పంపిస్తే, ఆంటీలు… అంకుల్ అంటూ వీధిలో అందరికి పంచావు కాని స్వంత వాళ్ళకి పది రోజులు అవుతున్నా ఇవ్వలేదు…. పాపం ఈలోగా ఆయనకు జబ్బు చేసి హాస్పిటల్ పాలయ్యారు.”
“ఏమిటి? ఇందాకటి నుండి చూస్తున్నాను. ఒకటే వాళ్ళ కోసం ఇదైపోతున్నారు? అసలు నన్ను కాదు… మిమ్మలను పెంచుకోవలసింది వాళ్ళు” కోపంగా అంది.
“నన్ను…. నన్ను… నన్నే పెంచుకుంటే… వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన మీద జల్లుకునేవాడిని… ఆపదలో అలా వాళ్ళని ఒంటరిగా వదిలే వాడిని కాదు. నీ అంత స్వార్ధపరురాలిని….” నవీన్ మాట పూర్తి కాలేదు కోపంగా అంది వినీల.
“O.K, నేను స్వార్ధపరురాలిని, నిజం చెప్పాలంటే నా స్టడీస్ కోసం వాళ్ళింటికి వెళ్ళాను…. ఇంకా నిజం చెప్పాలంటే గొడ్రాలు మా పిన్ని… ఇటు నా చదువు అవుతుంది అటు నాకు ఏమైనా పెడతారు అనుకున్నాను. నేను అలా అనుకోవడానికి కారణం ఉంది. చిన్నప్పటి నుండి నేనంటే పిచ్చి ఇష్టం ఆవిడకు.. ‘నా కూతురు’ అంటూ పిచ్చిగా నా చుట్టూ తిరిగింది. సరే ఎలాగు తిరుగుతుంది కదా అని నేను అభిమానంగా తిరిగాను… వాళ్ళు నా చుట్టూ ప్రేమ, అనురాగాలు అల్లుకుంటే నేను బాధ్యురాలినా? నన్ను వాళ్ళు ఎంత పెంచితే మాత్రం ఆ వెధవ హాస్పిటల్ చుట్టూ తిరగమంటారా? లేక క్యారియరు, కాఫీలు చేసి హాస్పిటల్‌కి పంపిస్తూ సేవలు చేయమంటారా? ఈ రోజు హాస్పిటల్‌కి వెళ్ళకపోతే కొంపలు మునిగిపోవుగాని ఈ రోజు వెళ్ళకపోతే నా కిష్టమైయిన సినిమా చూడడం మిస్ అవుతుంది. మీరు నన్ను వేలెత్తి చూపక్కరలేదు. రేపు వెళతాను లెండి” అని వినీల మాట్లాడుతుండగానే రోడ్డు మీదకు వచ్చింది వసుంధర.
కాళ్ళు వణకడం లేదు. శరీరం జలదరించడం లేదు. కళ్ళల్లో నీళ్ళు ఒక్క చుక్క రావడం లేదు. బండరాయిలా అయిన మనసుతో నడుస్తుంది వసుంధర.
***
వీధి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. మధుసూధన్ వసుంధర గుమ్మం వరకు వచ్చారో లేదో…
“అమ్మగారూ! ఒక్క నిముషం ఆగండి” అని పళ్ళెంతో ఎర్ర నీళ్ళు, దిష్టి తీసే సామాగ్రితో వచ్చి మధుసూధన్‌కి దిష్టి తీయసాగింది లక్ష్మి. తలకి స్నానం చేసిన పొడవైన కురులు నుదురు మీద ఎగురుతున్నాయి. ఎర్రని కుంకం నుదిట మీద మెరిసిపోతుంది… వసుంధర ఇచ్చిన పాత చీర కుట్టించిన లంగా, జ్యాకెట్టు వేసుకంది లక్ష్మి. దిష్టి తీయడం పూర్తి చేసి “అయ్యగారు లోపలికి రండి” అంది.
ఏం జరుగుతుందో తెలియని దానిలా వసుంధర బొమ్మలా అచేతనంగా లోపలికి అడుగు పెట్టింది. ఎదురుగుండా హాలులో నుండి దేవుని గది, కడిగి ముగ్గులు వేసి, దేవుని పటాలకు పూలు, పెట్టి, ఊదొత్తులు వెలిగించి, దీపాలు వెలిగించి, ఎంతో పవిత్రంగా వెలిసిన గుడిలా కనిపించింది.
ఒక్క నిముషం అలా దేవుని గది వైపు చూస్తూ ఉండిపోయింది వసుంధర.
భయంగా కళ్ళెత్తి వసుంధర వైపు చూసి “అమ్మగారు ఈ రోజు శుక్రవారం … మీరు హాస్పిటల్‌లో ఉన్నారు. అయ్యగారికి జబ్బు తగ్గిపోవాలని… దణ్ణం పెట్టుకున్నాను ఇక నేను ఎప్పుడు…”
“లక్ష్మి!… నువ్వు… నువ్వే చేయాలి పూజ. మట్టిలో మాణిక్యాన్ని గుర్తించలేని వెర్రిదానిని… ఇన్నాళ్ళు… నీకు.. చాలా అన్యాయం చేసాను లక్ష్మీ” గభాలున లక్ష్మిని దగ్గరకు లాక్కొని హృదయానికి హత్తుకొని…
“ఏవండీ!… ఇటు చూడండీ! లక్ష్మి ఎవరునుకున్నారు మన… మన కూతురు… మన అసలు కూతురు. స్వచ్ఛమయిన మనసుతో మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుని వేడుకున్న ఆణిముత్యం. నేను… నేను గొడ్రాలిని, మీరు సంతానం లేని నిర్భాగ్యుడిగా సంఘంలో ముద్రపడ్డా పరవాలేదండి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను మేలిమి బంగారం లాంటి లక్ష్మికి తల్లిదండ్రులం. నాకు చాలా సంతోషంగా ఉందండి. మన అసలు కూతురు లక్ష్మి” అంత వరకు ఒక్క బొట్టు నీళ్ళు రాని వసుంధర కళ్ళల్లో కట్టలు తెంచుకున్న నదిలా కళ్ళ నుండి కన్నీళ్ళు రాసాగాయి.
కళ్ళల్లో నిండుతున్న నీళ్ళు, చెంపలనీ తుడుచుకోవడం మరిచిపోయి, అప్యాయంగా లక్ష్మిని దగ్గరకు తీసుకొని తల మీద చేయివేసాడు మాధుసూధన్.