బలభద్రపాత్రుని రమణి చిన్న కథలు

0
3

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని రమణి రచించిన రెండు చిన్న కథలను పాఠకులకు అందిస్తున్నాము.

1. షాక్

ఆమే, అతనూ భార్యాభర్తలుగా మారి సంవత్సరం అయింది. ఆమెకి ఆ సంవత్సరంలో రెండు ప్రమోషన్లు వచ్చాయి.

“నీ బాస్ నీ మీద కన్ను వేసాడు… నువ్వంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అందుకే ప్రమోషన్స్ వచ్చాయి. నేను స్టార్ట్ అప్ పెడ్తున్నాను. నువ్వు వుద్యోగం మానెయ్యి” అన్నాడు.

ఆమె మానేసింది, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుని పెయింటింగ్ నేర్పిస్తోంది…

ఓసారి పోటీలో ఆమెకి నేషనల్ అవార్డ్ వస్తే ఢిల్లీ వెళ్లాల్సొచ్చింది… అతను “వద్దు నాకు బిజినెస్‌లో చిక్కులు వచ్చాయి.. నువ్వెళ్లద్దు నన్ను వదిలి” అన్నాడు.

ఆమె వెళ్తానంది. అతను “వెళ్తే మళ్లీ రాకు వెనక్కి” అన్నాడు. ఆమె వెళ్లలేదు.

ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆన్‌లైన్ క్లాసెస్ మానెయ్యమన్నాడు, బిడ్డ మీద శ్రద్ధ పెట్టమన్నాడు. తను లేట్‌గా ఇంటికి రావడం మొదలు పెట్టాడు… ఆమెకి తెలిసింది పి.ఏ. తో ఎఫైర్ మొదలెట్టాడని. నిలదీసింది..

అతను బుకాయించాడు. బిడ్డ మీద ఒట్టు పెట్టి నిజం చెప్పమంది.

“ఔను, ఐతే ఏం చేస్తావ్… బాగా సంపాదించి మీకే పెడ్తున్నాగా” అన్నాడు..

ఆమె బిడ్డని ఎత్తుకు బయటకి నడుస్తుంటే అడ్డుపడి “వాడు నా బిడ్డ… కోర్టు కీడుస్తా… నాకిచ్చేదాకా డబ్బు వెదజల్లి సాధిస్తా” అన్నాడు.

ఆమె చిన్నగా నవ్వింది.. తర్వాత అది వుధృతంగా మారింది… “వీడికి డి.ఎన్.ఏ. టెస్ట్ చెయ్యగానే తెలుస్తుంది నీ బిడ్డ కాదని.. చేయించమంటావా?” అంది.

షాక్‌లో వుండి పోయాడు.. ఆమె బయటకి నడిచింది బిడ్డతో…

“ఎవరికి పుట్టాడు చెప్పు చెప్పు” అని అరిచాడు… జుట్టు పీక్కున్నాడు…

ఆమె “చెప్పను” అని వెళ్లిపోయింది!

2. రెండూ ఏక్సిడెంట్‌లే

వాళ్లిద్దరూ తలమునకలుగా ప్రేమలో వున్నారు…

అమ్మాయి వుద్యోగం చేస్తోంది, అబ్బాయికింకా వుద్యోగం రాలేదు…

ఆమే పోషిస్తోంది.

“మనం పెళ్లి చేసుకుందాం” అంది.

“నాకుద్యోగం రానీ” అన్నాడు…

ఓ రోజు అతనికి ఏక్సిడెంట్ అయి చెయ్యీ, కాలూ విరిగింది. ఆమె తన ఇంటికి తెచ్చి, లీవ్ పెట్టి రాత్రిం పగళ్లు సపర్యలు చేసి మామూలు మనిషిని చేసుకుంది.

అతనికి వుద్యోగం రాగానే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు…

స్నేహితురాలిని పెళ్లికి పిలవడానికి వెళ్లిన ఆమె తిరిగి వస్తుంటే రాత్రిపూట బైక్ పాడయి, నిర్మానుష్యమైన వీధిలో ఆమె ఓ దుర్మర్గుడి బారిన పడి రేప్‌కి గురైంది…

మానసికంగా చితికిపోయి,శరీరకంగా గాయపడి ఆమె ఇల్లు చేరింది…

విషయం విన్న అతను ఏడ్చాడు…

ఆమె కోలుకునే సమయానికి అతను లేడు… వెళ్లిపోయాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here