[dropcap]వం[/dropcap]టింటి గుమ్మంలో చతికిలపడింది లక్ష్మమ్మ. చేసే పనిలేక చేతులాడడం లేదు. మంచం మీద నీరసంగా పడుకున్న కూతుర్ని చూస్తే మరింత బెంగగా ఉంది. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ఉన్న సరుకులన్నీ ఈ నెల్లాళ్ళుగా వాడేసింది. ఆకలి నకనకలాడుతోంది. తినడానికి గుప్పెడు అటుకులు కూడా లేవు. ఏమీ పాలుపోవడం లేదు.
గుమ్మంలో నిస్తేజంగా నిల్చున్నారు సుబ్బరాయశాస్త్రి గారు. కళ్లవెంట ధారాపాతంగా కన్నీరు ఉబుకుతోంది. వేద మంత్రాలూ, పూజా పునస్కారాలు వచ్చినా ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఈ మూడు నెలలనుంచి ఉదయమే దీపం పెట్టి, అష్టోత్తరం చదివి, బెల్లం ముక్క నైవేద్యం పెట్టి వస్తున్నారు. కరోనాకి భయపడి ఒక్క మనిషి కూడా గుడివైపు రావడం లేదు.
అమ్మ దయవల్ల అసలీమధ్యే ఈ గుడికి ఆదరణ మొదలయింది. జనం రావడం యెక్కువయింది కూడా ఈ మధ్యనే.
రోజుకొకరు తెచ్చే ప్రసాదాలతో, వారిచ్చే దక్షిణతో రోజులు గడుస్తున్నాయి. పిల్ల స్కూలు చదువు సాగుతోంది. ఇంతలోనే ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది. ఉన్న డబ్బులూ, సరుకులూ అయిపోయాయి. రేపెలా అన్న ప్రశ్నలోంచి ఈరోజెలా అనే సమస్య మొదలయింది. నోరు విప్పి అడగనూలేడు చెయ్యిచాచి యాచించనూ లేడు. ఇంకెన్నాళ్లీ పరిస్థితి? బరువెక్కిన గుండెతో గుడి వైపు నడిచారు శాస్త్రిగారు.
***
ఇంట్లోంచే ఆఫీసు వర్కు చేసుకుంటున్న ప్రసాదరావుకి బెంగ ఎక్కువైపోయింది. ఒక్కడే కొడుకు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం ఏమీ ఫలించడం లేదు. ఆ దేవుని మీద భారం వేసి రోజూ గుడికి వస్తాననీ, ప్రదక్షిణాలు చేసుకుంటాననీ మొక్కుకున్నాడు. ఈ కరోనా భయంతో ఇల్లు కదలలేకపోతున్నాడు. మొన్నటినుంచీ పిల్లాడికి ఒళ్లు తెలియని జ్వరం. మొక్కు తీర్చకపోతే పిల్లాడికి ఏమవుతుందోననే ఆందోళన పెరిగిపోతోంది.
రోజూ ఆఫీసుకి వెళ్లేముందే, ప్రసాదం పట్టుకుని గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేయడం, పది రూపాయలు హుండీలో వేసి, ఇంకో పది హారతి పళ్లెంలో వేసి రావడం అలవాటు అతనికి. అది లేక ఆఫీసు పని మీదకి కూడా మనసు మళ్లడం లేదు. ఇంక ఉండలేక భార్యను ప్రసాదం చెయ్యమని, అది తీసుకుని, పర్సులో డబ్బులు పెట్టుకుని, గుడి వైపు బయల్దేరాడు ప్రసాదరావు.
అప్పుడే గుడి తలుపులు తీస్తున్నారు శాస్త్రిగారు. ప్రసాదరావుని చూడగానే ఆయన ముఖం సంతోషంతో వికసించింది. ప్రసాదరావు వినయంగా నమస్కరించాడు.
‘మొక్కు అలాగే ఉండిపోయింది శాస్త్రిగారూ, మనసుకేమీ తోచక వచ్చేసాను. ప్రదక్షిణాలు చేసుకుంటాను’ అంటూ వెళ్లాడు ప్రసాదరావు. ఒక్కో ప్రదక్షిణకీ మనసులో బెంగ తీరి, మనసు తేలికవుతున్న భావం. కొడుకుకి తప్పక నయమవుతుందని దేవుడు దీవిస్తున్నట్టు అనిపించింది.
శాస్త్రిగారు గబగబా గర్భగుడి తలుపులు తీసి, దీపం వెలిగించి, అష్టోత్తరం చదువుతూ పూజ చేసారు.
ఈలోగా ప్రసాదరావు ప్రదక్షిణాలు ముగించి, హారతి కళ్లకద్దుకొని, వెయ్యి రూపాయలు పళ్లెంలో ఉంచాడు. ‘ఇదేమిటండీ! ఇంత డబ్బా!’ఆశ్చర్యంగా ప్రశ్నించారు శాస్త్రిగారు.
‘మూన్నెళ్లనించీ రావడమే లేదు. ఉంచండి శాస్త్రిగారూ! దేవుడికీ, దేవుడిలాంటి మీకూ ఋణం ఉంచుకోకూడదు’ అని నవ్వుతూ నమస్కారం చేసాడు ప్రసాదరావు.
ఆనందంతో “దీర్ఘాయుష్మాన్ భవ. నీ కుటుంబం ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో తులతూగాలి’ అని ఆశీర్వదించారు శాస్త్రిగారు.
ఆ దేవుడే శాస్త్రిగారి రూపంలో తననీ, తన కుటుంబాన్నీ ఆశీర్వదించినట్టు సంతోషించాడు ప్రసాదరావు.
‘ఆ దేవుడే ప్రసాదరావు రూపంలో ఆపద్భాందవుడిలా వచ్చి ఆదుకున్నాడు’ అనుకుంటూ చేతిలో ప్రసాదంతో, జేబులో డబ్బులతో వడివడిగా ఇంటికేసి నడిచారు శాస్త్రిగారు.