కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 36

0
3

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

బెనరస్‌ వస్త్రాలు:

[dropcap]కా[/dropcap]శీకి వెళ్ళిన వారు తప్పక చేసే మరో పని ఒక చీర కొనటము. అది తప్పక చెయ్యాలని నాకు ముందు తెలియదు. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు కొందరు ఘనాపాటి అయిన బ్రాహ్మలతో వెళ్ళాను. వారితో వచ్చిన స్త్రీలు చెప్పారు. కాశీ ప్రతి ఆడపిల్లకు పుట్టిలు అట. జగదంబ ఆవాసము కదా. అందుకే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు వట్టిచేతులతో పోకూడదు. ఒక చీరన్నా కొని తీసుకువెళ్ళాలలని.

కారణము ఏదైనా మంచి మేలైన వస్త్రాలు వారణాసిలో లభ్యం.

చరిత్రను చూస్తే 14వ శతాబ్ధము నుంచి వారణాసీ చుట్టు ప్రక్కల మంచి కాటను, తరువాత మేలైన పట్టు వస్త్రాలు దొరకటము వున్నది. నేడు మనకు చాలా ప్యాషనైన లెనెన్‌ కాటను ఉత్తమమైనది వారణాసిలో నేతపనివారు నేసే వారు.

తరువాత కాలములో వారు పట్టునేతలో కూడా ప్రావీణ్యత గడించారు. బెనారస్ పట్టుచీరల నేత మిగతా ప్రాంతాలలోని పట్టుచీరల నేత కంటే విశిష్టంగా వుంటుంది. ఆ చీరకు అంచులలో పట్టుపోగులతో పాటు వెండి, బంగారు పోగులను కలిపి నేయటము వారణాశీ నేతకారుల ప్రత్యేకత.

చీర మీద చిన్న చిన్న చుక్కల నుంచి అరచేతంత ‘బుటా’ను పట్టుతోనూ, వెండి బంగారు దారాలతో, సరిగేతోనూ వచ్చేటట్టు నేయగలరు. వారణాసీ నేత సంప్రదాయాలలో చిరకాల సహవాసము చేత ముస్లిం సంప్రదాయాలు కూడా కలవటము బెనారస్‌ పట్టు చీరల విశిష్టతకు కారణమని చెబుతారు. వారణాసి కాక చుట్టుప్రక్కల చాలా గ్రామాలలో నేతపని ఒక ముఖ్య జీవనాధారం. వారణాసికి సమీపములో వుండే గ్రామము ‘మదనపుర’ గ్రామముగా వుండేదట. అందులో మహమ్మదీయ నేతగాండ్రు నేసే నేత మిక్కిలి పనితనముతో వుంటుందని పేరు వుండేది. మదనపురా నేడు వారణాసిలో ఒక భాగము. ఆ నగరము అంతలా పెరిగిపొయ్యింది. వారు వాడే రంగులు కూడా ప్రకృతి సహజసిద్దమైన రంగులే వాడుతారట.

మేము సారనాథ్ వెళ్ళినప్పుడు అక్కడ నేతపనివారి సంఘపు వర్కుషాపు, అమ్మే దుకాణాలు చూశాము. వారికి సొసైటీ వున్నది. నేత పనివారికి సాయం చేస్తూ, సరి అయిన ధర నిజమైన నేతగాళ్ళకు వచ్చే వీలు కలిపించే ఏర్పాటు ఈ సొసైటీ చేస్తుంది.

అక్కడే ఒక నేసే యంత్రము, ఎలా నేస్తారు అన్న వివరాలతో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. మనము చూసి తెలుసుకోవచ్చు ఇవన్నీ. మనము వద్దన్నా ఆటోవాళ్ళు మనలను రెండు మూడు వేర్‌హౌసులవంటి వాటికి తీసుకుపోతారు. తెలిసిన వారితో వెడితే మనకు ఆ వేర్‌హౌసులలో తక్కువకు దొరికే అవకాశముంది. కాని ఆ ప్రదేశాలలో కుప్పగా పోసిన చీరలు ఎంత విలువైనవైయినా, మనకు అసలు నచ్చవు కూడా.

గంగ వడ్డున వున్న దుకాణాలలో కూడా ఎన్నో బట్టల దుకాణాలున్నాయి. ఏవి నిజమో ఎవి నకీలీనో అర్థము కావు. ప్రతీ వారు మనలను వారివే మేలైనవని, చవకైనవనీ పిలుస్తారు. పైపెచ్చు వాళ్ళకి అవసరమైనంతగా అన్ని భాషలు వచ్చు. మన హైద్రాబాదులోని కోఠిని మించి వుంటుంది ఆ దుకాణాల గొడవంతా.

ఎక్కడ కొన్నా మనము మన వూర్లో కొన్న వాటికన్నా ఎంతో చవకగా వస్తాయి. మంచి కాటను బట్టలు, చక్కటి బెనరస్ చీర కాశీ నుంచి తెచ్చుకునే వాటిలో తప్పక వుండవలసిన సావనీర్లు.

లక్నో నుంచి వచ్చే మంచి కాటను వస్త్రాలు కూడా చాలా చవకగా లభ్యమవుతాయి వారణాసిలో. అవే మనము మళ్ళీ హైద్రాబాదులోనో మరో చోటో కొనబోచే రెట్టింపు ధర ఇచ్చి తీసుకోవాలి.

వారణాసిలో పరమశివుని దర్శనము, గంగా స్నానముతో పాటూ, ఒక్క బెనరస్ వస్త్రమైనా తెచ్చుకోవటమన్నది దాదాపు అందరూ ఆచరిస్తున్న ఆచారము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here