[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
అతిథి దేవోభవ:
[dropcap]”వం[/dropcap]డనలయదు వేవురు వచ్చిరేని
అన్నపూర్ణకు ఉద్దీయో అతని గృహిణి” – అని మను చరిత్రలో ప్రవరుని భార్య సోమిదమ్మను గూర్చి అల్లసాని పెద్దన వ్యాఖ్యానించాడు. నా శ్రీమతి శోభాదేవి ఆ సోమిదమ్మకు ప్రతీకగా చెప్పవచ్చు. మా వివాహం 1969 మే 8న నెల్లూరు జిల్లా బిట్రగుంటలో శాస్త్రోక్తంగా జరిగింది. అప్పుడామె వయసు 18+. నా వయస్సు 22+. 2019లో మా పిల్లలు బెంగుళూరులో అట్టహాసంగా మా వివాహ స్వర్ణోత్సవ వేడుకలు బంధుమిత్రుల సమక్షంలో జరిపారు. గత 50 సంవత్సరాలలో మా యింటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించిన ప్రముఖ వ్యక్తులను గూర్చి నా స్మృతులు ప్రస్తావిస్తాను.
వ్యాకరణ సూత్రం:
జూలై 1969 నుండి 1975 ఆగస్టు వరకు మా కాపురం కందుకూరిలో జనార్దన స్వామి ఆలయానికి సమీపంలో. అక్కడే మాకు ముగ్గురు పిల్లలు కలిగారు. మా యింట్లో ఆతిథ్యం తీసుకొన్న మహనీయులలో దువ్వూరి వెంకటరమణ శాస్త్రి ప్రముఖులు. ఆయన వ్యాకరణ శాస్త్రవేత్త. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాలు వ్యాకరణం బోధించారు. వారు నెల్లూరు వచ్చారు. అప్పటికే వారి వయస్సు 70 సం. పై మాట. కాని, చలాకీగా మాట్లాడేవారు. వార్ధక్యంలో వున్నారు గాబట్టి అన్నం మెత్తగా వండమని నేను నా శ్రీమతితో హెచ్చరించాను. భోజన సమయంలో కూడా ఆయన వ్యాకరణ ప్రయోగం చేశారు. వారు మా యింట్లో బస చేశారు.
“అమ్మా! నాకు వయోభారం వల్ల దంత్యములు పనికిరావు. తాలవ్యములు ఫర్వాలేదు. నీవు వండిన అన్నం కంఠ్యంగా వుంది” అని చమత్కరించారు. అందరం నవ్వుకొన్నాం.
ప్రొద్దుటే వచ్చిన గోపాలరెడ్డి:
1975 నుండి 1995 మధ్యకాలంలో నేను ఆకాశవాణిలో మూడు సార్లు వివిధ హోదాలలో పని చేశాను. అదొక స్వర్ణయుగం. మా బంధుమిత్రులుగాక ప్రముఖుల ఆతిథ్యాన్ని మాత్రమే ప్రస్తావిస్తాను. ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నరు డా.బెజవాడ గోపాలరెడ్డి నెల్లూరులో నుండి కార్లో మరో మిత్రునితో కలిసి కడపలో పెద్దన సాహిత్యపీఠం ప్రారంభోత్సవానికి విచ్చేసి ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో దిగారు. నాకున్న పూర్వ పరిచయంతో వారిని మా యింటికి ఆహ్వానించాను. “రేపు ఉదయం 7 గంటలలోపు నెల్లూరు వెళుతూ దారిలో 15 నిముషాలు మీతో గడుపుతాను. కాఫీ తాగుతాను ఆపై మీ యిష్టం!” అన్నారు.
టైం పాటించడం ఆయన నియమం. ఉదయం ఏడు గంటలలోపు వచ్చారు. 15 నిముషాలు అన్నారు గదా మా ఆవిడ స్టౌ మీద రెండు దోసె పెనములు వెలిగించి రెడీగా కూచొంది. ఇడ్లీ, పెసరట్టు తయారుగా వడ్డించింది. ఆయన, ఆయన మిత్రుడు సరదాగా గడిపి వెళ్లిపోయారు. కడపలో ఆకాశవాణి రికార్డింగుకు వచ్చిన ప్రముఖులు దూర ప్రాంత జిల్లాల నుండి వస్తారుగాబట్టి రికార్డింగు కాగానే వారిని మా యింటికి ఆహ్వానించి సందర్భోచిత ఆతిథ్యం ఇచ్చాం. వారిలో కర్నూలు వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టరు పి.యస్.ఆర్.కె.హరనాథ్, వారి సతీమణి డా.పి.సావిత్రి ముఖ్యులు. అలానే తిరుపతి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లు ఆచార్య యం.వి.రామశర్మ, ఆచార్య జి.యన్.రెడ్డి, ఆచార్య ఆర్.రామమూర్తి, మాజీ కేంద్ర మంత్రి పి.పార్ధసారథి, డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు పి.రాములు పేర్కొనదగినవారు. కలెక్టరు కె.వి.రమణాచారి కుటుంబ స్నేహితులు. నేను వ్రాసిన పుస్తకాలు వరుసగా చూపిస్తే “చుప్ కా రుస్తుమ్” అని అభినందించారు.
మహనీయుని సేవా భాగ్యం:
1994 వేసవిలో శ్రీకాళహస్తి శుకబ్రహ్మాశ్రమ అధిపతి వయోజ్ఞాన వృద్ధులైన శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వాముల వారు గీతోపన్యాసాల రికార్డింగుకు కడపకు ఉదయం 10 గంటలకు శిష్య సమేతంగా వచ్చారు. నలుగురు శిష్యులు, ప్రత్యేక కార్యదర్శి ఈశ్వర్, స్వామివారు రికార్డింగు గదిలోకి చేరారు. ఒక్కక్కటి అరగంట చొప్పున ఆరు భాగాలు రికార్డు చేయాలి. దాదాపు 3 గంటలు పడుతుంది. కడప నుండి ప్రొద్దుటూరుకు వెళ్లి అక్కడ ఒక శిష్యని ఇంట్లో భోజనం చేయాలని సంకల్పం. నాలుగు భాగాలు రికార్డింగ్ కాగానే, నేను ఈశ్వర్‌తో మాట్లాడి ఆరు మందికి మా యింట్లో భోజనం ఏర్పాటు చేస్తానన్నాను. నేను ఇంటికి ఫోను చేశాను. మరో గంటలోపు రెండింటికి మా ఇల్లు చేరాము. హడావిగా మా ఆవిడ వండి వార్చింది. స్వాముల వారు పీటపై కూర్చున్నారు. ఆయనకు చూపు తక్కువ. ఒక శిష్యుడు అన్నం, కూర కలిపి పెట్టాడు. స్వామి వారు తాపీగా భోంచేశారు. అనంతరం పరివారమంతా భోంచేసి ప్రొద్దుటూరుకు వారి కార్లో బయలుదేరారు. అదొక మహాద్భగ్యం.
కడప ఆకాశవాణి కవి సమ్మేళనానికి వచ్చిన కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి మా ఆతిథ్యం స్వీకరించినపుడు “కూర్చొండ మా యింట కుర్చీలు లేవు” అనే వారి పద్యం గుర్తుకు తెచ్చుకొన్నాం.
మినప వడలు మానేసిన జగ్గయ్య:
1995-97 మధ్య రెండేళ్లు ఆకాశవాణి డైరక్టర్‌గా పని చేసిన సమయంలో మధురస్మృతులు నెమరు వేసుకుంటే వొళ్లు పులకరిస్తుంది. 1995 డిసెంబరు 1న విజయవాడ కేంద్ర వార్షికోత్సవానికి ప్రముఖ సినీ నటులు కొంగర జగ్గయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వనించాను. ఆ మధ్యాహ్నం మా యింట ఆతిథ్యానికి అంగీకరించారు. భోజన సమయంలో నా శ్రీమతి మినప వడలు వడ్డిస్తుంటే ఆయన వద్దన్నారు.
“నూనె పిండివంటలు నిషేధమా?” అని సున్నితంగా అడిగింది.
‘చిన్నతనంలో మా అమ్మ శ్రీషర్షుని కథ చెప్పింది. బుద్ధిమాంద్యానికి మినపవడలు దోహదం చేస్తాయి అని చెప్పి నా చేత మాన్పివేయించింది’ అని సమాధానమిచ్చారు. అంతర్వేది స్వామి, ప్రజ్ఞారణ్యస్వామీ, సుందర చైతన్య, విశ్వయోగి విశ్వంజీలు మా గృహం పావనం చేశారు.
ఇంటి బెల్ కొట్టిన అల్లు:
ఓ ఆదివారం సాయంకాలం 4 గంటల ప్రాంతంలో నేను విజయవాడ క్వార్టర్స్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాను. బయట కాలింగ్ బెల్ మోగితే, నా శ్రీమతి తలుపు తీసి…
“ఏమండీ!” అంటూ ఆశ్చర్యంతో వచ్చి తబ్బిబైంది.
నేను లేచి వచ్చి చూస్తే ఎదురుగా ప్రముఖ సినీ హాస్యనటులు పద్మశ్రీ అల్లురామలింగయ్య. ఆయన ముందు మా ఆఫీసుకు వెళ్లి, ఆదివారం నేను ఇంట్లో వున్నానని తెలిసి అనౌన్సర్ మల్లాది సూరిబాబుతో కలిసి మా యింటికి వచ్చారు. ఆ సాయంత్రం 5 గంటలకు మేమిద్దరం నందిగామలోని రామాలయ బ్రహ్మోత్సవ వేడుకల సభకు అతిథులుగా వెళ్లాలి. సినీ రచయిత జాలాది మా యిద్దరికీ కారు ఏర్పాటు చేశారు. మా యింట్లో ఓ అరగంట గడిపి నందిగామ వెళ్లాం. దారి పొడుగునా ఎన్నో ‘చిత్ర’ విచిత్రాలు చెప్పారు. అదే రాత్రి 11 గంటలకు ఇల్లు చేరాం.
విజయవాడలో మరో అతిధి ప్రముఖ రచయిత సంజీవదేవ్. రికార్డింగు కాగానే మా యింటికి తీసుకెళ్లాను. ఓ గంట సేపు ముచ్చటించుకొన్నాం. బస్టాండు కెళ్లాలి అన్నారు. నేను వెంటనే ఆఫీసుకు ఫోన్ చేసి కారు తెప్పించి వారితో కలిసి వారి గ్రామానికి వెళ్లి దించి వచ్చాను. సుప్రీంకోర్టు జడ్జి, జస్టిస్ జగన్నాధరావు దంపతులు, డి.ఐ.జి గుంటూరు సి.యన్.గోపీనాథరెడ్డి ఆదరంతో వచ్చారు. స్వామీ సుందరచైతన్య మా కుటుంబంతో కొంత సమయం మా యింట గడిపారు.
దేశ రాజధానిలో:
ఢిల్లీలో రెండు దఫాలు కలిపి పది సంవత్సరాలు ఆకాశవాణిలో, దూరదర్శన్‌లలో పని చేశాను. నా అధీనంలో ఎల్లవేళలా ఆఫీసు కారు సౌకర్యం వుండేది. నగరం నడిబొడ్డులో పండారా రోడ్డులో నాకు క్వార్టర్సు కేటాయించారు. లోగడ అందులో పార్లమెంటు సభ్యురాలు నిర్మాలా దేశ్‌పాండే ఆరేళ్లు నివసించారు. 1999 జనవరి నుండి 2005 మార్చి వరకు నేనందులో బస చేశాను. పలువురు ఆంధ్ర ప్రముఖులు కార్యార్థులై వచ్చి ఆప్యాయంతో మా యింటికి వచ్చారు. మా పక్క వీధిలో యల్.కె.అద్వానీ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, కృష్ణంరాజు, విద్యాసాగరరావు, ఎలక్షన్ కమీషనరు టి.యస్.కృష్ణమూర్తి, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి పి.యల్.సంజీవరెడ్డి ప్రభృతుల క్వార్టర్లు. రాజ్యసభ సభ్యులుగా ఆరేళ్లు పని చేసిన సి.నారాయణరెడ్డిగారితో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలకు మా కార్లో వెళ్లేవారం. ఒకటి, రెండు దఫాలు మా యింటికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు డా.నండూరి రామకృష్ణమాచార్య ఆదరంతో విచ్చేశారు.
మరో దఫా అధికార భాషా సంఘాధ్యక్ష హోదాలో వచ్చిన డా.మాడుగుల నాగఫణిశర్మ గత రెండు దశాబ్దాలుగా కడప నుండి పరిచితులు. భోజనానంతరం ఇలా అన్నారు
“రుచిగా, శుచిగా భోజనం తిన్నాను తృప్తిగా.”
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు విచ్చేసిన ప్రముఖ సినీ నటులు గొల్లపూడి మారుతీరావు ఢిల్లీలో సతీ సమేతంగా ఆతిథ్యం స్వీకరించారు. మేమిద్దరం కడపలో 1980-81 మధ్య పనిచేశాం. కలిసి “బావగారి కబుర్లు” చేశాం. పరస్పరం “బావగారూ” అని పిలుచుకొనేవారం. విజయవాడలో, హైదరాబాదులో ఎక్కడవున్నా ఇంటికి వచ్చేవారు. మా దంపతులం మదరాసు గోకులం కాలనీలో వారి ఆతిథ్యం పొందాం.
సిక్కిం గవర్నరు దంపతులు:
2002లో సిక్కిం గవర్నరు వి.రామరావు దంపతులు సిక్కిం భవన్‌లో దిగారు. చనువుతో వారిని మా ఢిల్లీ యింటికి భోజనానికి పిలిచాను. దంపతులిద్దరు వచ్చారు. చాలా ముచ్చట్లు చెప్పారు. సిక్కిం రాష్ట్రానికి ఎంతో చేయాలని వారి సంకల్పం. కేంద్ర సెక్రటరీలతో ఒక గెట్ టు గెదర్ ఓ రాత్రి విందులో ఏర్పాటు చేద్దామన్నారు. ప్రముఖుల వివరాలు వారి పి.ఏ.కు ఫోన్ నెంబర్లతో సహా అందించాను. గవర్నరుగారి రాజముద్రతో 25 మంది I.A.S, I.P.S తెలుగు అధికారులకు ఆహ్వానాలు వెళ్లాయి. 20 మంది దాకా స్పందించి వచ్చారు. ఆ సమావేశంలో నేను, పరకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్ ఒక టేబుల్ పై విందు భోజనం చేశాం.
రాష్ట్రపతి భవనంలో ఆగస్టు 15, జనవరి 26 తేదీలలో ఏటా ‘ఎట్ హోం’ సాయంకాలం ఏర్పాటు చేసి స్వయంగా రాష్ట్రపతి ఆహ్వనితులను కలుస్తారు. 1998 నుండి 2001 వరకు ఢిల్లీ స్టేషన్ డైరక్టరు హోదాలో నేను, నా శ్రీమతి ఆ టీ పార్టీలకు వెళ్లాం. కేంద్ర మంత్రులు, ప్రధాని, మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు అంతా 200 మంది వచ్చేవారు. అదొక మధురానుభూతి. నేనుండగా కె.ఆర్.నారాయణన్ రాష్ట్రపతి. ప్రధానిగా అటల్ బిహారి వాజపేయి వుండేవారు. 7, రేస్ కోర్సు రోడ్డులో పలు గ్రంథావిష్కరణ సభలకు నేను హాజరై ప్రధాని నివాస ఆతిథ్యం స్వీకరించే అవకాశం లభించింది.
విశ్వవిద్యాలయ ఆచార్యులు:
నేను పండారా రోడ్డులో నివసించే వాడిని. మా పక్క వీధిలో షాజహాన్ రోడ్డులో యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషను ఆఫీసు. అక్కడ పని మీద విచ్చేసిన ద్రవిడ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య రవ్వా శ్రీహరి రెండు మార్లు మా యింటికి వచ్చారు. అఖిలభారత ఆకాశవాణి కవి సమ్మేళనంలో తెలుగు కవిగా లక్నోలో పాల్గొన్న శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఇనాక్, నేను లక్నో నుండి ఢిల్లీ ఒకే విమానంలో వచ్చాం. విమానాశ్రయానికి ఆఫీసు కారు వచ్చింది. ఇద్దరం మా యిల్లు చేరాం. ఆతిథ్యానంతరం ఆయన తిరుగు ప్రయాణమయ్యారు.
2000 సంవత్సరం:
2000 సంవత్సరం ఆగస్టు 5న మా నాన్నగారు ఢిల్లీలో పరమపదించారు. వారి స్మారక సమావేశం 2001లో మా యింట్లో ఏర్పాటు చేసినప్పుడు ఎలక్షన్ కమీషనరు టి.యన్.కృష్ణమూర్తి, సుప్రీంకోర్టు జడ్జి హోదా గల జస్టిస్ జాస్తి ఈశ్వరప్రసాదు, సెంట్రల్ అడ్మినిస్టేటిన్ ట్రిబ్యునల్ జడ్జి జస్టిస్ రాజగోపాల రెడ్డి తదితరులు మా ఆతిథ్య సౌహార్దాన్ని స్వీకరించారు.
కవి పండిత గాయకులు:
ఢిల్లీకి విచ్చేసిన పులువురిని మా యింటికి ఆహ్వానించే భాగ్యం లభించింది. 2002లో హైదరాబాదు నుండి రావూరి భరద్వాజను మా నాన్నగారి స్మారక పురస్కారానికి పిలిచాను. భారద్వాజ నేను హైదరాబాదులో కలిసి పని చేశాం. కేంద్ర మంత్రి విద్యాసాగరరావు, డా.సి.నారాయణ రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందించాము.
ప్రముఖ సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి మా యింటికి విచ్చేసి, కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి డా.ఆర్.వి.వైద్యనాధ అయ్యర్‌ని కలవాలన్నారు. మా కార్లో శాస్త్రి భవన్‌కెళ్లి వారిని కలిశాం. నేదునూరికి సాంస్కృతిక శాఖ ప్రాజెక్టును వారు కేటాయించారు. అలానే పులికంటి కృష్ణారెడ్డి, కృష్ణాపత్రిక సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్లు, బి.వి.పట్టాభిరాం తదితరులు మా అతిథులు. అమెరికా చిత్రకారులు డా.యస్.వి.రామారావు ప్రత్యేక అతిథి.
మా ‘యింట’ బ్రహ్మానందం:
2018లో ఒక సాయంకాలం నేను మా రెండో కుమారుడు జనార్ధన్, మనుమడు అంశుల్ ప్రముఖ సినీ హాస్య నటులు బ్రహ్మానందాన్ని వారి యింట కలిశాం. గంట సేపు ఆయన ఎన్నో ప్రాచీనాధునిక సాహిత్య విషయాలు ప్రస్తావించారు. మాటల సందర్భంగా నేను నా శ్రీమతి శోభాదేవి అన్నమాచార్య పై నాలుగు పుస్తకాలు వ్రాసిందని చెప్పాను. వెంటనే ఆయన స్పందించి నేను మీ యింటికి వచ్చి స్వయంగా ఆ పుస్తకాలు స్వీకరిస్తానన్నారు. చెప్పిన మాట ప్రకారం మా ఆహ్వానాన్ని మన్నించి మాధ్యాహ్న భోజనానికి వచ్చి ఓ గంట ముచ్చటించి పుస్తకాలు నావి, ఆవిడవి తీసుకొని వెళ్లారు.
తిరుపతిలో అతిథుల ప్రవాహం:
2005-10 మధ్య ఐదేళ్లు తిరుమలేశుని సన్నిధిలో ఆఫీసు క్వార్టర్స్‌లో బస చేసాము. బంధుమిత్రులే గాక ఎందరికో ప్రముఖులకు ఆతిథ్య, దర్శనాలు ఏర్పాటు చేశాను. సినీ ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, సాంస్కృతిక రంగ నిపుణులు మా యింటిని పావనం చేశారు. విశిష్ట దర్శన భాగ్యం అనుభవించారు. అకస్మాత్తుగా ఫోన్ చేసి యింటికి వచ్చిన వారూ ఉన్నారు.
ఢిల్లీ చలిలో పుష్పగిరి స్వాముల వారు:
పష్పగిరి పీఠాధిపతి శ్రీనృసింగ భారతీ స్వామి కైలాసమానససరోవరం వెళ్లడానికిగా ఢిల్లీ వస్తూ “మీ యింట్లో దిగుతాం. మర్నాడు రాత్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో నన్ను విమానం ఎక్కించాలి” అని కోరారు. మూడు దశాబ్దాల పరిచయం వారిది. నా కుమారులు ఇద్దరి వివాహాలకు వారు విచ్చేసి ఆశీస్సులందించారు కూడా. వారికి ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతం పలికాను. మా యింటికి శిష్య సమేతంగా, వారి దేవతార్చనా నిధితో సహా విచ్చేశారు. మర్నాడు అర్ధరాత్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కించడానికి మా కార్లో తీసుకెళ్లాను. మానససరోవర యాత్రకు వారి ఆరోగ్యం సహకరించక, వైద్యుల సలహా మేరకు వారు మార్గమధ్యంలో వెనుదిరిగారు.
ఈ ప్రస్తావనలు అహంకారంతో గాక, నాకు భగవంతుడు కల్పించిన అతిథి సేవన భాగ్యంగా, పూర్వపుణ్యంగా మా దంపతులం భావిస్తాం. అతిధులకు చందన తాంబూల వస్త్రాదులు సమర్పించడం మా పూరాకృత కృతం!