మానస సంచరరే-46: ‘మాట’ కచేరీ!

7
3

[box type=’note’ fontsize=’16’] “మన మాట మంచిని పంచేదిగా, పెంచేదిగా ఉండాలి. మాటలు బాణపు ములుకుల్లా, తూటాల్లా ఉండకూడదు. మాట చేసే గాయం మానదు” అంటున్నారు జె. శ్యామల. [/box]

[dropcap]బా[/dropcap]ల్కనీలో కూర్చుని ప్రకృతిని తిలకిస్తున్నాను. వాన వచ్చి వెలిసిందేమో తలంటుకున్న తరువులు తళతళమంటూ కొత్త కళను సంతరించుకున్నాయి. మెల్లగా గాలి వీస్తుంటే ఆకుల తడి ఆరిపోతూ చెట్లు మరో సరికొత్త దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. కానీ కాసింత దూరంగా గోవు మాలక్ష్మి.. మొక్కజొన్నపొత్తుల వ్యర్థాల కుప్ప దగ్గరకు వెళుతూ.. ఇంతలో లేగదూడ ఒకటి ‘అంబా’ అంటూ వచ్చింది. వెంటనే గోవు మాలక్ష్మి వెనక్కి తిరిగి చూసింది. లేగదూడ చెంగుచెంగున వెళ్లి చెంతచేరింది. గోవు మాలక్ష్మి నాలుకతో లేగ ఒంటిని ఆప్యాయంగా నాకింది. లేగ మరింతగా దాని దగ్గరకు జరిగింది. జంతువులకు మాట లేదనుకుంటాం కానీ వాటి కోడ్ లాంగ్వేజ్ మనకు అర్థంకాక, అవేవో మూగ ప్రాణులని, మనకే నాలుకబలం ఉందని విర్రవీగుతుంటాం. అంతలో కుక్కలన్నీ ఒక్క సారిగా భౌభౌ రాగం అందుకున్నాయి. అటు చూస్తే ఓ పదికుక్కలు మట్టికుప్పపైకెక్కి ఎదురుగా కింద కొద్దిదూరంలో ఉన్న కుక్కను ఎలుగెత్తి నిలదీస్తున్నాయి. తమ ప్రాంతంలోకి ఆ అపరిచిత కుక్క రావడం ఒప్పుకునేది లేదంటూ అరుస్తున్నట్లున్నాయి. ‘ఈ భౌభౌ భాష మనకర్థంగాక దాని మీద జాలిపడుతుంటాం..’ అనుకుంటుండగా

మాటే మంత్రము.. మనసే బంధము
ఈమాటే ఈ సమతే మంగళవాద్యము
ఇది కల్యాణం కమనీయం జీవితం.. ఓ..

‘సీతాకోక చిలుక’ చిత్రంలోని వేటూరి పాట వీనుల విందు చేసింది. అవును.. ప్రేమికులకు పరస్పరం మాట మంత్రంలాగే ఉండటంలో ఆశ్చర్యం ఏముంది. అయితే చాలామంది విషయంలో కొంతకాలం గడవంగానే ఆ మాటే చిరాకు కలిగించడమో, మరికొంతకాలానికి మాటవింటేనే మండి పడటమో జరుగుతుంది.ఏమైనా మాటకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదు.

ఎందుకో ఈ క్షణాన అమ్మ గుర్తుకొస్తోంది. అమ్మకు మూడ్ వచ్చినప్పుడు పాడుకునే పాట…

పాట పాడుమా కృష్ణా పలుకు తేనె లొలుకునటుల
మాటలాడుమా ముకుందా మనసు తీరగా..

మంచి ఫీల్‌తో ఎంత బాగా పాడేదో. అమ్మ ఇప్పుడొక జ్ఞాపకం మాత్రమే..

ఇంతలో పక్క బాల్కనీలో హేమ పిల్లవాడికి బువ్వ తినిపించడం వినిపించింది. ‘ఏంతి, నాన్నా మూతి మూతేత్తే ఎలా? ఈ కొంచెం తిను, ఆ.. అను. పిచ్చుకా లావే.. మా బాబిగాడితో ఆడిపోవే’.. ఆమె మాటలు వింటుంటే నవ్వొచ్చింది.. మాటలు వచ్చే వేళ పిల్లలు ముద్దుమాటలు మాట్లాడటం సహజమే. పెద్దలు పిల్లల ముద్దు మాటలకు ఆనందించటమే కాదు, తామూ ముద్దుముద్దుగా మాట్లాడటమే తమాషా.. మాట మెల్లగా ఆలోచనను ఆవరించుకుంటోంది..

పిల్లలకు పది నెలల వయసుకే అత్త, తాత మాటలు వచ్చేస్తాయి. అవి వింటూ, మళ్లీ మళ్లీ అనిపిస్తూ మురిసిపోతుంటారు. పిల్లల నోటివెంట ఒక్కొక్క కొత్త మాట వచ్చినప్పుడల్లా పెద్దల ఆనందానికి హద్దులుండవు. అసలు పిల్లలకు మాటలు బాగా రావాలని గతంలో వస పోసేవారు. అందుకే ‘వసపోసిన పిట్టల్లే వాగుతుంది’ వంటి ప్రయోగాలు వాడుకలోకి వచ్చాయి. వాక్కు దేవుడిచ్చిన వరం.

కేయురాణి న భూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వలా
నస్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్దజా!
వాణ్యేకా సమలంకరోతి పురు షం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం

ఏ నగలు, అలంకారాలు శాశ్వతం కాదు, మంచిమాటే సిసలైన నగ అని ఎంత చక్కగా చెప్పారో..

మాట్లాడటం ఒక కళ. ఆనాడు మహాత్ముడు అన్ని కోట్లమంది భారతీయులను తన మాటతో ఆకట్టుకుని, తన మాట పైనే నడిచేలా చేశాడంటే ఆయన మాటకున్న శక్తి ఎంతటిదో కదా. మన మెందరో నాయకులను, విశిష్ట వ్యక్తులను చూశాం, చూస్తున్నాం. ఒక వివేకానందుడు, ఒక వాజ్‌పేయి, ఒక కలాం.. అయితే కొందరు తమ అనర్గళ ప్రసంగంతో మాత్రమే ఆకట్టుకుంటారు. మరికొందరి మాటకు వారి ఉన్నత వ్యక్తిత్వం కూడా తోడవుతుంది. అంతలో పొద్దున కారులో వెళుతూ రెడ్ ఎఫ్ఎమ్ విన్నవిషయం గుర్తొచ్చింది. ఆర్.జె. కరోనా గురించి, ఎస్. ఎమ్. ఎస్. (శానిటైజ్, మాస్క్, సోషల్ డిస్టెన్స్) గురించి, ట్రాఫిక్ గురించి ఆపకుండా మాట్లాడుతూ మధ్యలో శ్రోతలకు కాల్ చేసి, వారితో చతుర సంభాషణలు చేసి, మధ్యలో శ్రోతల కోరికపై వారి స్నేహితులకు బ్యాండ్ బజాయించి.. ‘ఉండండి ఉండండి దూరంగా.. క్షేమంగా’ అంటూ, వాక్ ప్రవాహంలో శ్రోతల్ని దూరదూర తీరాలకు కొట్టుకు పోయేలా చేయడం.. నిజంగా పెద్ద కళ. అన్నట్లు వాగ్ధాటితో, వాదనతో కోర్టులలో కేసులు నెగ్గుతూ పేరు సంపాదించేవారు లాయర్లు. వారి నాలుకకు రెండు వైపులా పదునుంటుంది. తిమ్మిని బమ్మిని చేయగల సమర్థులుగా ఉంటారు. కేసులో బలమున్నా లేకపోయినా లాయరు నాలుక బలమైనదైతే తిరుగుండదు.

అసలు కాగితం, కలం లేని రోజుల్లో గురువులు వాక్ రూపేణా చెప్పిందే చదువుగా ఉండేది. విద్యార్థులు అది విని నేర్చుకునే వారు. దాన్నే శ్రుతజ్ఞానం అంటారు. ఇప్పటికీ చదివి, రాసి నేర్చుకునే వాటికన్నా పదేపదే విని నేర్చుకునేవే ఎక్కువ జ్ఞాపకం ఉండటం అందరికీ అనుభవైకవేద్యమే. ముఖ్యంగా ఈ ఆన్‌లైన్ చదువులు వచ్చాక ఆడియోలు, వీడియోల ప్రాముఖ్యం పెరగటం తెలిసిందే. ‘మట్టిలో మాణిక్యం’ చిత్రంలో ‘నా మాటే నీ మాటై చదవాలి.. నేనంటే నువ్వంటూ రాయాలి.. అఆ, ఇఈ’.. అంటూ కథానాయిక, కథానాయకుడికి పాడుతూ చదువు చెప్పేస్తుంది. కేవలం ఒక్కసారి విని విషయాన్ని గ్రహించగలిగేవారిని ‘ఏకసంథాగ్రాహి’ అంటారు. ఇక అప్పటికప్పుడు ఒక అంశం పై పద్యంచెప్పే ప్రక్రియ ‘ఆశువు’. అష్టావధానంలో ఇదొక అంశం. వాక్కుకు అధిదేవత వాగ్గేవి.. సరస్వతి.

అందుకే ముత్తయ్య భాగవతార్ ‘కీరవాణి’ రాగంలో

అంబ వాణి నన్నాదరించవే..
పరదేవి నిన్ను భజించే నిజ భక్తులను బ్రోచే పంకజాక్షివే
వరవీణపాణి వాగ్విలాసిని.. హరికేశపుర అలంకారిణిఅంటూ వేడుకున్నాడు, స్తుతించాడు.

కొందరికి మాటంటే మాట, మరికొందరికి మాట అంటే ఆట..

తండ్రి మాటకై కానకు తరలిపోయే రాఘవుడు
అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు‘.. పాట గుర్తొచ్చింది. తానిచ్చిన మాటకు కట్టుబడి ఉండటం కాదు, తండ్రి, తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి, రాజ్యం వీడి, వనవాసం చేసి అగచాట్లు పడటం ఎంత అసాధారణం…

హరిశ్చంద్రుడూ అంతే. సత్యవాక్య పరిపాలనకోసం కష్టాల సముద్రంలో కొట్టుమిట్టాడాడు. మనుషులు మాత్రమే కాదు, పంచతంత్రంలోని ‘హితబోధ’ కథలో పులిచేత చిక్కిన ఆవు, తన దూడ గుర్తొచ్చి, కడసారిగా పాలిచ్చి వస్తానని అందుకు అవకాశమివ్వమని పులిని వేడుకుంటుంది. పులి చివరకు అంగీకరిస్తుంది. ఆవు తన నివాసానికి వెళ్లి, దూడ ఆకలి తీర్చి, దానికి ఎన్నో హితవులు చెప్పి పులి దగ్గరకు వచ్చి తనను ఆరగించి ఆకలి తీర్చుకోమంటుంది. ఆవు సత్యసంధతకు మెచ్చి పులి దాన్ని ఆరగించకుండా వదిలేస్తుంది. అన్నట్లు బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు.. కల్లాకపటం తెలియని బాలల మాటకు అంతటి శక్తి ఉంటుందని కాబోలు.. అంతలో ఓ పాట తలపులోకి వచ్చింది..

ఎంతబాగ అన్నావు.. ఎవ్వరు నేర్పిన మాటరా
వేలెడైన లేవురా వేదంలా విలువైన మాట‘.. IIఎంతబాగ అన్నావుII

‘అమ్మ మాట’ చిత్రంలో పసివాడి మాటలకు మురిసిన తల్లి మనసు పాడే పాట. ‘పెద్దల మాట చద్దిమూట’ అన్నారు అనుకోగానే భానుమతి పాట గుర్తొచ్చింది. అది..

ఢిల్లీకి రాజా అయినా బామ్మ మాట బంగారు బాట
హైక్లాసు చదువులు ఉన్న బామ్మ మాట బంగారు బాట
పైపై మెరుగుల భామల కన్నా
బామ్మలు ఎంతో మెరుగంట

అలాగే ‘మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్లు గడపలు దాటవు’ అనే సామెత డాంబికాలు మాట్లాడేవారి గురించి చెపుతుంది.

‘పగటి కలలు కంటున్న మామయ్య
గాలిమేడలెన్నో నువ్వు కట్టావయ్యా..
డాబు సరిగ కూర్చుంటే డబ్బులొస్తాయా
మాటలు దులిపేస్తుంటే మూటలొస్తాయా?
మామయ్యా నీసంగతి తెలుసులేవయా
పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవయా?’

భలేరంగడు సినిమాలో మావను ఓ దులుపు దులిపే సందర్భంలోని పాట. ఎదుటి వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తీయని మాటలు చెప్పి మోసగించేవారెందరో.

తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు.. నమ్మవద్దూ‘…

అంటూ పసివాడికి లోకం తీరు తెలియజెప్పే ఖైదీ కన్నయ్య చిత్రంలోని ఆత్రేయ పాట ఎంతో పాపులర్.

మనసిచ్చిన అమ్మాయి మౌనంగా ఉంటే అతగాడి మనసేమంటుందో ‘షావుకారు’ చిత్రంలో ఓ చక్కని పాటుంది. అది..

పలుకరాదటే చిలుక పలుకరాదటే
సముఖంలో రాయబారమెందులకే
ఎరుగని వారమటే.. మొగ మెరుగని వారమటే
పలికిన నేరమటే .. పలుకాడగనేరవటే
ఇరుగు పొరుగు వారలకీ అరమరికలు తగునటే.. పలుకరాదటే’… ఇందులో ప్రతిపంక్తిలో టకారం పునరుక్తమవుతూ పాటకో వింత అందాన్నిచ్చింది.

మాటలు కలిపి ముగ్గులోకి దించే వ్యవహారం కొందరిది. కన్యాశుల్కంలో గిరీశం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కల్లబొల్లి మాటలు చెప్పి బోల్తా కొట్టించడం ఎందరికో పరిపాటి. మాటతో కొన్ని సార్లు చిక్కులు తప్పవు. పిల్లల మనసు తెలుసుకోకుండానే మా అమ్మాయిని మీ అబ్బాయికిస్తామనో, మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుంటామనో మాటిచ్చే పెద్దలు, ఆ తర్వాత పిల్లలు అందుకు సుముఖంగా లేకపోతే వచ్చే గొడవలు అన్నీ ఇన్నీ కావు. ఒక్క మాటతో సమస్య తీరిపోయి జీవితానికే వెలుగొచ్చే సందర్భాలూ ఉంటాయి. అలాంటి మాటసాయం ఎవరికైనా వరమే. పదవుల్లో ఉన్నవారి మాటకు పవర్ ఎక్కువుంటుంది. వారు తమ మాట పైనే పనులన్నీ నడిపిస్తుంటారు. నేటి రాజకీయ నాయకులు ఎన్నికల ముందు అసంఖ్యాక వాగ్దానాలు చేయడం, ఆ పైన అవన్నీ నీటిమూటలు కావడం చూస్తుంటాం. ఇక అసెంబ్లీలలో, పార్లమెంటులో మాటల యుద్ధాలు చూస్తుంటాం. ఇటీవల అసెంబ్లీలలో అయితే వీధి తగవులను మించి మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో సైతం మాటల దుర్గంధం రోజురోజుకు పెరిగిపోతోంది. వాక్ స్వాతంత్రం ఉంది కదాని దాన్ని దుర్వినియోగం చేసి సమాజానికి చెరుపు చేయడం శోచనీయం.

కొంతమంది తీయగా మాటలు మాత్రమే చెపుతూ, క్రియలో శూన్యం అనిపిస్తారు. వీరి మాటలనే ‘శుష్కప్రియాలు’ అంటారు. మాట మనిషి స్వభావానికి ప్రతీక.

అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినుర వేమ!

మాటల తీరు గురించి వేమన ఇలా అంటే.. సుమతీ శతకకారుడు బద్దెన

ఎప్పటికెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడియన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగువాడె ధన్యుడు సుమతీ..

అని లౌక్యంగా మాట్లాడమన్నాడు.

మాటలు కొన్ని ప్రమాదాలు తెచ్చి పెడతాయి. అవే చెప్పుడు మాటలు. ఎవరైనా మన గురించి ఇంకొకరు చెడుగా అన్నారని చెపితే, వెంటనే ఆవేశపడిపోయి నిజానిజాలు తెలుసుకోకుండా సత్సంబంధాలను చెడగొట్టుకోవడం జరుగుతుంది. అందుకే బద్దెనగారు

వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగ పడక వివరింప తగున్
కనికల్ల నిజము తెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!‘.. అన్నారు.

అలాగే ఓ మంచి వ్యక్తికి లేనిపోనివి నూరిపోసి, వారి తీరునే మార్చేసి, కలహాలకు, కదనాలకు కారణమయ్యేవారూ ఉంటారు. రామాయణంలో మందర, కైకేయకు కుత్సితపు మాటలు చెప్పి మనసు మార్చటం వల్లే పట్టాభిషిక్తుడు కావలసిన రాముడు వనవాసానికి వెళ్లడం, దశరథడు బెంగతో కన్నుమూయడం.. ఆనందాల అయోధ్య విషాద అయోధ్యగా మారటం జరిగింది. మహాభారతంలో విదురుడు ఎన్నో నీతిమాటలు చెప్పినా అదంతా విఫలమే అయింది.

ఇక రాయబారులు, మధ్యవర్తులు మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తూనే ఇరుపక్షాల మధ్య సయోధ్య సాధనదిశగా చాకచక్యంగా మాట్లాడటం వారికి వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుంది. పెళ్లి సంబంధాలు కుదిర్చేవారి మాటల నేర్పు మరోరకం. ఇరుపక్షాలకు నచ్చచెపుతూ, చొరవ జేసి సంబంధం ఖాయమయ్యేలా చేస్తారు. ‘పెళ్లి మాటలు’ అనే వాడుక కూడా ఉంది.

మాట చెప్పి, పనయ్యేలా చేయటం అనేది చెప్పే వ్యక్తిని బట్టి, అది చెప్పే సమయం పైనా ఆధారపడి ఉంటుంది. ఈ సంగతి భక్త రామదాసుగారికి కూడా బాగా తెలుసు. అందుకే రాముడికి తన విన్నపాన్ని తెలియజేయమని సీతమ్మకు మొర పెట్టుకుంటాడు..

ననుబ్రోవమని చెప్పవే.. సీతమ్మ తల్లీ… ననుబ్రోవమని చెప్పవే..
నను బ్రోవమని చెప్పునారీ శిరోమణి
జనకుని కూతురా జననీ జానకమ్మా..
ప్రక్కన చేరిక చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి జాక్కియుండు వేళ.. ॥ననుబ్రోవమని॥

‘ఏగూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది’ అంటుంటారు. అంటే ఆ యింట్లో పెద్దల్లాగే పిల్లలూ మాట్లాడతారని.. అలాగే చిన్నపిల్లలు పెద్దల మాటలు మాట్లాడితే ‘ముదురు మాటలు’ అంటారు. మాట వినడం, వినకపోవడం.. భార్య చెప్పిన మాటే వింటాడనో, తల్లి మాటే వేదమనో, పిల్లలు అసలు చెప్పిన మాటే వినరనో పదప్రయోగాలు నిత్యం వినిపించేవే.

ఇక సినిమా రంగంలో మాటల రచయితలది ప్రత్యేక పాత్ర. ఏ పాత్ర ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అంతా మాటల రచయిత బాధ్యతే. సినిమాల్లో కొన్ని డైలాగులు పాపులర్ అయి ప్రజల వాడుకలోకి కూడా వచ్చేస్తుంటాయి. ఒక్కోసారి చిన్న పదాలు కూడా ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంటాయి. నేనొక్కసారి చెపితే వందసార్లు చెప్పినట్లు; ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు; దేవుడా; అంతేగా మరి..; ఇలాంటివి కోకొల్లలు. ఈమధ్య పంచ్ డైలాగ్లుగా ప్రేక్షకుల నాల్కలమీద నమోదవుతున్నాయి. నాటకాల్లోనూ సంభాషణల పాత్ర కీలకమైంది. అన్నట్లు సినిమాలు ప్రారంభమైన తొలిదశలో అవి మూకీలుగా (మాటల్లేకుండా) మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ‘టాకీ’లు వచ్చాయి. ఇండియాలో తొలి టాకీ సినిమా ‘ఆలం ఆరా’ అయితే, తెలుగులో తొలి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద’. సినిమాల్లో డైలాగులు చెప్పటానికి కొత్త నటులయితే చాలా టేకులు అవసరమవుతాయి. సీనియర్ నటులు ఒకటే టేక్‌లో డైలాగ్ ఓకే అయ్యేలా చెప్తారు. ఆ తర్వాత డబ్బింగ్ ప్రక్రియ మొదలు కావడంతో భాష తెలియని నటులకు డబ్బింగ్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారు. డబ్బింగ్ ఆర్టిస్టుకు మాటే సంపద. ఆయా తారలకు నప్పే విధంగా డబ్బింగ్ చెప్పి మెప్పిస్తుంటారు. రోజారమణి, ఇటీవల కాలంలో సునీత డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంతగా సక్సెస్ అయ్యారో తెలిసిందే. మాట ఒకటే అయినా పలికే వారిని బట్టి, సందర్భాన్ని బట్టి పలికేతీరు ఉంటుంది. అందులో తేడా ఉంటే గొడవే. ఆఫీసర్ ఓకే అనడంలోనూ, కింది ఉద్యోగి ఓకే అనడంలో తేడా ఉంటుంది, ఉండాలి కూడా. పదం ఒకటే అయినా ఆఫీసర్ గొంతులో గంభీరత, కింది ఉద్యోగి గొంతులో అణకువ, నమ్రత వినిపించాలి. ఎవరి మాటలనైనా అనుకరించగలవారు మిమిక్రీ ఆర్టిస్టులు. తెలుగులో మిమిక్రీ కళలో కీ.శే. నేరెళ్ల వేణుమాధవ్ అగ్రగణ్యులు. అలాగే కీ.శే.హరికిషన్ గారు కూడా చాలా పాపులర్. శివారెడ్డిగారి మిమిక్రీ అందరం ఆనందిస్తూనే ఉన్నాం.

ఏమైనా మన మాట మంచిని పంచేదిగా, పెంచేదిగా ఉండాలి. మాటలు బాణపు ములుకుల్లా, తూటాల్లా ఉండకూడదు. మాట చేసే గాయం మానదు. పెదవులనుంచి కాకుండా హృదయం నుంచి మాట్లాడగలిగే మనిషే మనీషి. మన మాట ఇతరులకు ప్రియంగా, ధైర్యాన్నిచ్చేదిగా, నైతిక బలాన్నిచ్చేదిగా, సాంత్వన నిచ్చేదిగా ఉండాలి. పర్యావరణ కాలుష్యం ఎంత ప్రమాదకరమో మాటల కాలుష్యం కూడా అంతే ప్రమాదకరం. సమాజాన్ని ఈ మాటల కాలుష్యం నుంచి రక్షించుకోవాలంటే ప్రతివారు హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి. మాట వ్యక్తిత్వానికి ప్రతీక అనుకుంటుండగా రోడ్డుమీద అంబులెన్స్ కుయ్యో కుయ్యో మనడంతో నేను ప్రస్తుతంలోకి వచ్చి ‘అయ్యో! ఇంత టైమైందా’ అనుకుంటూ మనసులో ‘మాట’కచేరీకి మంగళం పలికాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here