[dropcap]వ[/dropcap]లస బ్రతుకులు…
వెలిసిపోయిన వెతలు…
తీర్చలేని కడగండ్లు…
ఆశలకు బీడ్లు…
ఎల్లలు లేని కరవు..
కరువుతీరని ఏకరువు…
ఎవరికి వారే… కన్నీటి మేఘాలై…!
ఏరువాక కూడా.. కరువేరు దాటి
ఎప్పుడో.. బయలుదేరింది
తనకు.. కరువుకు తగదు అని..
నిన్నటి ఏడుకు అమ్మిన పుస్తెలు..
ఏకరువు పెడుతున్నాయి…
వడ్డీ రక్కసి నుండి నన్ను
ఇడిపించలేవూ అని… కన్నీళ్లతో..!
ఎండిన డొక్కలు ఎగిసేలా…
వగచినా… నీవు వలదంటూ….
మబ్బులు ఏకసెక్కాలు ఆడుతున్నాయి…
నిర్జీవ శరీరాలు…గట్టేంటా…పుట్టేంటా..
ఏలాడుతున్నాయి… గరీబు పరదాల్లా..!
ఊరు వూరంతా….శ్మశాన.. ప్రశాంతత..
కరువుకు రాసిచ్చిన వీలునామా లా..
రెపరెప లాడుతూ..ఏరువాక పున్నమి
వచ్చేసింది..ఏ ఏటికి ఆఏడు…
నెర్రెల్లిగ్గిన భూమితో…
రాకాసి కంపచెట్లుతో ..
నాసిరకం విత్తనాలతో..
కౌలు చెల్లించలేని ఋణగ్రస్తంతో..!
పుట్టుకొస్తాయి… కరువు డెక్కలు
తొడుగుకున్న రాబందులు…
మిగిలివున్న ప్రాణాలను
కరుడు గట్టిన కరువు కోరలు..
కసిగా పొడిచి ..పొడిచిన
పోట్లకు… గాట్లకు..బలైన..
రక్తం లేని గుండెలు ఎన్నో..
ఆగిపోయాయి…ప్రకృతి తో..
ఏ ఋణాన్ని నోచుకోక..!
మరుభూమిలో…మట్టిలా
మారి తన ఋణాన్ని తీర్చుతున్నాడు..
రైతు ఏ ఏటికాయేడు…ఏరువాక సాక్షిగా..!