[dropcap]రు[/dropcap]గ్మతలు –
శారీరకం కావచ్చు!
మానసికం కావచ్చు!
సామాజికం కావచ్చు!
వాటిని తప్పక తొలగించాలి!
వ్యాధుల్ని తప్పక తరిమేయాలి!
ఒకడు-
కులంతో కుమ్ములాట ఆడవచ్చు!
మతంతో మరణహోమం చేయవచ్చు!
ప్రాంతంతో ప్రాణాంతకం కావచ్చు!
మరొకడు –
నవ్వుతూనే నట్టేట ముంచవచ్చు!
మౌనంగా మరణ శాసనం లిఖించవచ్చు!
నారద పాత్ర పోషించి
నరమేధం కావించవచ్చు!
మనసు మనసుకు మానని గాయం చేసి –
నాయకత్వం వహించవచ్చు!
ఒకడికి –
డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు!
బర్డ్ ప్లూ, హెపటైటిస్ – బి కావచ్చు!
వ్యాధి ఏదైనా మనిషిని బాధిస్తుంది!
కానీ కరోనా మాత్రం కాకూడదు!
అది సమాజాన్ని సమాధి చేస్తుంది.
ఇప్పుడు కరోనా కాదు కావాల్సింది
బాధితులకు, పీడితులకు కరుణ కావాలి!
హెపటైటిస్ – బి కాదు కావాల్సింది
‘ఎపటైట్’ చల్లార్చేందుకు
పేదవానికి పట్టెడన్నం కావాలి!
ఇప్పుడు కావాల్సింది చైతన్యం!
మనిషి మనిషికి సాంత్వనం!
మనిషిని పట్టి పీడిస్తున్న వైరస్‍ని రూపుమాపి
సామాజిక చిత్రాన్ని మార్చే మార్పు రావాలి!
ప్రతి హృదయంలో మానవతా జ్యోతి వెలగాలి!