[dropcap]”అ[/dropcap]క్కా! మొన్న లాక్‌డౌన్ సమయంలో బావని పోలీసోళ్ళు కొట్టారటగా, ఏం చేశారేంటి? నాకు చెప్పలేదే, అమ్మ చెప్తే తెలిసింది” అడిగింది సుబ్బు చెల్లి కుష్బూ.
“అదేమైనా శుభవార్తా చెప్పుకోవటానికి? అదంతా ఓ పెద్ద కథ. నేను రాసిన కథ చదువుకో… కాసేపు నవ్వుకుందువు కాని” అని ఇ-మెయిల్‌లో ఈ కథ పంపింది సుబ్బు.
***
“సరే అమ్మా… ఆయన ఇప్పుడే వస్తారు. అవన్నీ ఇచ్చి పంపించు” అంది తల్లితో సుబ్బు. సుబ్రావ్‌ని బ్రతిమాలి ఏమేం తేవాలో చెప్పి పంపింది.
సుబ్రావ్ అత్తారింటి నుంచి తిరిగి వస్తుంటే, “ఏయ్ ఆగు… బండి ప్రక్కకు తియ్” అంటూ కానిస్టేబుల్ ఎదురుగా నుంచోవటంతో, సుబ్రావ్‌కి గుండె ఆగినంత పనయ్యింది. అసలే చిన్నప్పటినుంచి పోలీసులంటే భయం.
“లాక్‌డౌన్ వేళ రోడ్డుమీద ఎందుకు తిరుగుతున్నావ్?” గద్దించి అడిగాడు ప్రక్కనే వున్న ఎస్సయి.
“ని… నిన్ని… నిత్యావసరాల కోసం” నీళ్ళు నమిలాడు సుబ్రావ్.
“తియ్… ఏం కొన్నావో చూపించు” ఎస్సయి దగ్గరకొచ్చాడు.
స్కూటరు ముందున్న సంచి తెరచి చూపించాడు సుబ్రావ్ .
సంచిలో వున్న పిడకలు చూసి, “ఇవట్రా నువ్వు కొన్న నిత్యావసరాలు?” అడిగాడు ఎస్సయి.
“ఇవి ఆవుపేడ పిడకలు సార్. మా అత్తగారిచ్చారు. ఇవి ఇంట్లో వెలిగించి ధూపం వేస్తే కరోనా దగ్గరకు రాదట సార్. కావాలంటే మీరు రెండు పిడకలు పట్టుకెళ్ళండి” అన్నాడు సుబ్రావ్ .
“ఒరేయ్! నాకు పిడకలు ఇస్తావురా? నడువ్…” అంటూ లాఠీతో సుబ్రావ్ నడుంమీద ఒక్కటిచ్చాడు ఎస్సయి.
“రా… అంటారేమిటి సార్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్” అందామనుకుని, ఇక అక్కడుంటే మరోసారి వాయిస్తాడేమోనని భయపడి ఇంటికొచ్చి పడ్డాడు సుబ్రావ్.
***
“ఎంత ఎస్సయి అయితే మాత్రం అలా కొడ్తాడా? పాపం నొప్పిగా వుందా? కరోనా కష్టాలు తప్పించుకోవాలంటే ఇలాంటి చిన్నచిన్న ఇబ్బందులు తప్పవు మరి” అంది సుబ్బు, సుబ్రావ్ నడుంమీద చేత్తో రాస్తూ.
అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు “అవునూ… అదేదీ?” అడిగింది సుబ్బు.
“ఏదీ?” అన్నాడు సుబ్రావ్.
“ఆవు పంచితం… అది ఇంట్లో చిలకరిస్తే కరోనా భయం వుండదు” అంది సుబ్బు.
“కరోనా సంగతేమోకాని, రోడ్డుమీదకి వెళ్తే, ముందు నేను పోయేలాగున్నాను” అన్నాడు సుబ్రావ్ .
“ఛ… అవేం మాటలు? అయినా ఆల్రెడీ ఒకసారి కొట్టాడుగా… అది చూపించండి. అసలు ఒక పని చేయాల్సింది. ఇందాక కొట్టినప్పుడు, ఓ సర్టిఫికెట్ అడిగి తీసుకోవాల్సింది. అది చూపిస్తే ఇంకెవ్వరూ మిమ్మల్ని కొట్టరు” అంది సుబ్బు.
“నీ బొంద, అలా చేస్తే… ఒకటి కాదు, ఇంకో నాలుగు తగిలిస్తారు” అన్నాడు సుబ్రావ్.
మొత్తానికి ఎలాగైతేనేం.. ఆవు పంచితం తెమ్మని సుబ్రావ్‌ని మళ్ళీ పంపింది సుబ్బు.
***
పాపం సుబ్రావ్ మళ్ళీ పోలీసులకు దొరికిపోయాడు.
“ఒరేయ్ పిడకలూ! మళ్ళీ వచ్చావేంట్రా? ఇందాక ఇచ్చిన కోటింగు చాల్లేదా?” ఎస్సయి లాఠీ ఎత్తాడు.
అప్పటికే అక్కడ ఓ పది మంది చేత గుంజిళ్ళు తీయిస్తున్నారు.
“ఇందాక కొట్టారు కద సార్! బాగా నొప్పిగా వుంది. మందులషాపుకి వెళ్తున్నాను, ‘మూవ్’ ఆయింట్‌మెంటు కొందామని” అన్నాడు సుబ్రావ్ దణ్ణంపెట్టి.
“నిజమేనా, నమ్మమంటావా? సరే పో… మందుకొన్నాక, తిరిగొచ్చేటప్పుడు నాకు చూపించి పో… తప్పించుకుపోయావో…” అన్నాడు ఎస్సయి.
“ఇదిగోండి సార్. మూవ్ ఆయింటుమెంటు కొన్నాను” తిరిగొస్తూ చూపించాడు సుబ్రావ్.
“మరి అదేంట్రా?” …స్కూటర్ హుక్కుకి వ్రేలాడుతున్న బాటిల్ చూపిస్తూ అడిగాడు ఎస్సయి.
“శానిటైజర్ సార్ …” అన్నాడు సుబ్రావ్ బెక్కుతూ.
“ఏదీ, రెండు చుక్కలు మా కానిస్టేబుల్ చేతిలో వెయ్యి.”
“వద్దు సార్… అది హ్యాండ్ వాష్‌కి కాదు. ఇంట్లో చల్లుకునేది. గో మూత్రం సార్. అది జల్లితే కరోనా వైరస్ గుమ్మం బయటనుంచే తొంగి చూసి… భయపడి పారిపోతుంది” చెప్పాడు సుబ్రావ్.
“ఒరేయ్ పిడకలూ… నీ బుర్ర బ్రిటిష్ మ్యూజియంలో పెట్టాల్రా. నీ తెలివితేటలు చైనావోడికి ఉండుంటే, ఈ కరోనా మనదాక వచ్చేదే కాదు” అన్నాడు ఎస్సయి.
“నా బుర్ర కాదు సార్. మా అత్తగారి బుర్ర” అన్నాడు సుబ్రావ్.
“నువ్వు అత్తకి తగ్గ అల్లుడివి రా. ఇలా ఒకసారి పిడకలకని, ఇంకోసారి గో మూత్రానికని వంకపెట్టుకుని ‘లాక్‌డౌన్’ సమయంలో బయట తిరిగేస్తున్నావ్. నిన్నిలాగే వదిలేస్తే మళ్ళీ వచ్చి ఏకంగా ఆవునే తోలుకెళ్ళే లాగున్నావ్… దా, నీకు పనిష్మెంటిస్తా” అని సుబ్రావ్ భజంమీద లాఠీ పెట్టాడు ఎస్సయి.
“కొట్టకండి సార్, అసలే నడుం నొప్పిగా వుంది” అన్నాడు సుబ్రావ్ .
“సరే, నిన్ను కొట్టకుండా ఉండాలంటే… మన జాతీయ గీతం… ‘జనగణమన’ పాడి వినిపించరా” అన్నాడు ఎస్సయి.
“జనగణమన అధినాయక జయహే… జయహే… జయహే… ” అంతే ఆ తర్వాత గుర్తొచ్చి చావట్లేదు, సుబ్రావ్‌కి.
“ఇక చాలుకాని, …ఏదీ ఓ పాతిక గుంజిళ్ళు తీసిపో” అన్నాడు ఎస్సయి.
సుబ్రావ్ ఏడుస్తూ గుంజిళ్ళు తీస్తుంటే, …’మత్ రోనా’ అని లాఠీ చూపించాడు.
***
రెండు రోజుల తర్వాత,
ఆ రాత్రి బాగా వర్షం పడింది. డాబామీద ఎండబెట్టిన పిడకలు తడిసి ముద్ధయ్యాయి.
సుబ్బు బలవంతం మీద సుబ్రావ్ అత్తారింటికి బయల్దేరాడు, ఎండు పిడకలు తేవటానికి.
షరా ముమూలే. రామాలయం సెంటర్లో పోలీసులు పట్టేశారు. ఆ ప్రక్కనే వున్న ఖాళీస్ధలంలో, మండుటెండలో నుంచోబెట్టారు. అప్పటికే అక్కడ పాతికమంది దాక నుంచుని వున్నారు.
ఓ గంట గడిచాక వచ్చాడు ఎస్సయి.
“కరోనా వేగంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో, ఇంట్లోనే ఉండమంటే వినకుండా, బయట తిరిగేస్తున్నారు. మీ ఫ్యామిలీతో ఆనందంగా గడిపే సమయం వస్తే సద్వినియోగం చేసుకోవటం చేతకావటం లేదు మీకు.”
“ఈ లాక్‌డౌన్ సమయంలో మీ మీ ఉద్యోగ వ్యాపకాలనుండి ‘అన్‌లాక్’ అవ్వండి. నిజానికి ‘యూవార్ నాట్ స్టక్ ఎట్ హోం.. యూవార్ సేఫ్ ఎట్ హోం’. ఇదే లాస్టు వార్నింగ్ మీ అందరికీ. మళ్ళీ దొరికితే ‘క్వారంటైన్’ సెంటరుకి పంపేస్తాను మిమ్మల్ని. తప్పనిసరై బయటకువస్తే మాస్కు ధరించండి. ద్విచక్ర వాహనచోదకులు హెల్మెట్ ధరించండి. భౌతికదూరం పాటించండి. ఇక పోండి” అని క్లాసు పీకాడు ఎస్సయి.
పిల్లిలా నెమ్మదిగా జారుకుంటున్న సుబ్రావ్ ఎస్సయి దగ్గరకొచ్చి “సార్ జనగణమన పాడి చూపించమంటారా” అన్నాడు.
“ఈసారి దొరికినప్పుడు పాడుదువుగానిలే… ఇక కరోనాయణంలో పిడకలవేట చాలించు” అని లాఠీ చూపించాడు ఎస్సయి.