జ్ఞాపకాల పందిరి-16

105
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

అది అమ్ముకోవద్దు!!

తల్లిదండ్రులు తాతయ్య, వెంకమ్మలు

[dropcap]పు[/dropcap]ట్టిన ఊరంటే ఎవరికైనా మక్కువ ఎక్కువే! ఏ సందర్భం వచ్చినా జన్మభూమిని ఉదహరించకుండా ఉండలేరు. పుట్టిన ఊరంటే కన్నతల్లితో సమానం. అందుకనే ఏ వూరు వెళ్లినా, ఏ విదేశం వెళ్లినా పుట్టిన ఊరిని మరచిపోవడం చాలా కష్టం. అలా అని అందరూ అలా ఉంటారని కూడా అనలేము! విదేశాలకు పోయి అక్కడ బాగా డబ్బు సంపాదించుకుని హాయిగా స్థిరపడిపోయి, కనీ పెంచిన తల్లిదండ్రుల్ని, జన్మభూమిని శాశ్వతంగా మరచిపోయిన వారూ వున్నారు. అలాంటి వాళ్ళను గురించి విస్తృతంగా ఇక్కడ చర్చించలేము. చర్చించాల్సిన సందర్భం కూడా కాదు!

విదేశాలకు వెళ్ళకున్నా, రాష్ట్రంలో – దేశంలో వుండి కూడా జన్మభూమిని తలుచుకోని వాళ్ళూ వున్నారు. స్వదేశంలో, స్వరాష్టంలో వుండి, అప్పుడప్పుడూ పుట్టి పెరిగిన ఊరిని దర్శించి (ముఖ్యంగా కలిసొస్తే వేసవికాలం సెలవులకు) తృప్తిగా, మానసికంగా ఆనందాన్ని పొందేవారూ వున్నారు. పుట్టిన వూరిలోనే (స్వగ్రామం) వుండి, ఉద్యోగం చేసుకుంటూనో, వ్యవసాయం చేసుకుంటూనో, వ్యవసాయ కూలీలుగా పని చేసుకుంటూనో, కుటుంబం అంతా ఒకే చోట వుండి ఆనందమయ జీవితాన్ని గడుపుతారు.

తల్లిదండ్రులు కష్టపడి వూరిలో సంపాదించిన కొద్దిపాటి ఆస్తినైనా, తమ పిల్లలు అమ్ముకోకుండా, దానికి తోడు మరికొంత సంపాదించుకుని బాగు పడాలని ఎలాంటి తల్లిదండ్రులైనా కోరుకుంటారు, ఆశిస్తారు. వూర్లో తమ అస్తిత్వం కొనసాగాలని కోరుకుంటారు. అతి తక్కువ మంది ఈ ఫార్ములాను సద్వినియోగం చేసుకుంటారు. చాలామంది పంపకాల దగ్గర సయోధ్య కుదరక, అనవసర పేచీలు తెచ్చుకుని, ఘర్షణలకు లోనై, కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఉన్న కొద్దీ ఆస్తిని దానికోసం కరిగించేస్తారు. ముఖ్యంగా బాగా చదువుకున్న కుటుంబాలలో, పిల్లలు ఉన్నత విద్యల్లో పట్టాలు పొంది, ఉద్యోగాల దృష్ట్యా వివిధ ప్రాంతాలకు (దేశ -విదేశ) వలస వెళ్లిన పిల్లలతోనే ఎక్కువగా సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి.

స్వగ్రామంలో వుండే తల్లిదండ్రులను పట్టించుకొనక పోగా, వారి బాగోగులు చూడకపోగా, ఉన్న కొద్దీ ఆస్తి గురించి కుమ్ములాడుకుని, ఆస్తి పంపకాల గురించి కొట్లాడుకుని, స్వప్రయోజనాలకు ఆస్తిని అమ్ముకుని, వూళ్ళో క్రమంగా తమ అస్తిత్వాన్ని కోల్పోవడమే కాకుండా, అంతులేని మనఃస్పర్ధలతో రక్త సంబంధాలను సైతం దూరం చేసుకుంటున్న దౌర్భాగ్యపు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ నేపథ్యంలో పెద్దవాళ్ళ చికాకు పనులకు పిల్లలు ఘోరంగా బలైపోతున్నారు. క్రమంగా బంధుత్వాలకు దూరం అవుతున్నారు. ఇలాంటి ఉదంతాల కోసం ఎక్కడో వెతుక్కోవలసిన పని లేదు. నా అనుభవాన్ని మీ ముందు వుంచుతాను, ఒకసారి పరిశీలించండి.

మాది తూర్పుగోదావరి జిల్లా, పూర్వపు రాజోలు తాలూకా ,ప్రస్తుత మల్కీపురం మండలంలోని, ‘దిండి’ అనే గ్రామము. ఒకప్పుడు కమ్యునిష్టులకు, కమ్యూనిష్టు ఉద్యమాలకు కంచుకోట అది. మన దేశ మొదటి పార్లమెంటు ఎన్నికలప్పుడు, మా గ్రామం రాజమండ్రి పార్లమెంటరీ నియోజక వర్గంలో వుంది. ఆ నియోజకవర్గం నుండి ఎన్నికైన మొదటి కమ్యూనిస్ట్ పార్లమెంట్ సభ్యుడు (ఎం.పి) స్వర్గీయ కానేటి మోహన రావు గారు మా అన్నయ్య (కజిన్) కావడం మాకు గర్వకారణం. ఆయన దిండి గ్రామవాసి. మా నాయన ఆయనకే చిన్నాన్న అవుతారు. అక్కడ జరిగిన అనేక రకాల ఉద్యమాలలో మా నాయన స్వర్గీయ కానేటి తాతయ్య మంచి మార్గదర్శి గాను, ముందువరుస కార్యకర్తగాను ఉండేవారట! మా అమ్మ స్వర్గీయ కానేటి వెంకమ్మ, చొప్పల వారి ఆడపడుచు (రామ రాజు లంక).

అమ్మ క్రైస్తవ జీవన నేపథ్యం నుండి వచ్చింది. నాయనలో మార్క్సిస్టు భావజాలం ఉండడం వల్ల నాస్తికత్వం మా ఇంట్లో రాజ్యమేలుతుండేది. అందుకే మా చిన్నతనంలో ఇంట్లో ఎప్పుడూ ‘దేవుడు’ అనే పదం విన పడేది కాదు. ఆ.. నేపథ్యంలో మా అమ్మ మా అందరిని పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులవైపు మళ్లించడం, నిరక్షరాస్యులైనప్పటికీ, ఆవిడ సాధించిన ఘన విజయం.

మా అమ్మ నాన్నలకు మేము మొత్తం అయిదు మంది సంతానం. అందులో ఇద్దరు ఆడపిల్లలు (నాకు అక్కలు) – స్వర్గీయ కుమారి కానేటి మహానీయమ్మ (నాగార్జున సాగర్ ), స్వర్గీయ మట్టా భారతీ దేవి (భర్త స్వామీ రావు) ముగ్గురం మగపిల్లలం. పెద్దన్నయ్య స్వర్గీయ కె.కె.మీనన్ (రచయిత,నవలా కారుడు,హైదరాబాద్; భార్య శిరోరత్నమ్మ); రెండవ అన్నయ్య బ్రహ్మచారి – డా. మధుసూదన్ కానేటి (ఆకాశవాణి -విశాఖపట్నం); నేను కనిష్ఠుడిని. ఉద్యోగ రీత్యా హనుమకొండలో స్థిరపడిపోయాను. నా శ్రీమతి అరుణ కానేటి (విజయవాడ). ఇక్కడ ఒక వింత లేదా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మా పెద్దన్నయ్య మీనన్ (బులి కృష్ణ మూర్తి) మా తల్లిదండ్రులకు ప్రథమ సంతానం అయినప్పటికీ, కారణం తెలీదు కానీ మా పెద్దమ్మ – పెదనాన్న దంపతులకు (గొనమండ జేమ్స్, గోనమండ సత్తెమ్మ – రామరాజులంక) దత్తత ఇచ్చారు. అయితే అధికారికంగా ఇంటి మార్పిడి వగైరా తంతులు జరిగినట్టు లేదు. అలాగే మా మధ్య ఎలాంటి భేదమూ ఉండేది కాదు. పెద్దన్నయ్య మీనన్ మా అందరినీ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. మేము పెద్దవాళ్ళం అయ్యేవరకూ ఆయన పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడో అర్థం అయ్యేది కాదు. నిజానికి నాకు పునర్జన్మ నిచ్చి నాకు ఈ జీవితాన్ని అందించినవాడు మా పెద్దన్నయ్య మీనన్.

చదువు సంధ్యలు పూర్తి చేసుకుని, ఉద్యోగ రీత్యా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలో చోట స్థిరపడిపోయాం. తల్లిదండ్రులు మాత్రం వంటరిగా ఇంటివద్ద మిగిలిపోయారు. అన్నయ్య మీనన్ ఏ.జి. ఆఫీసులో ఉద్యోగం తెచ్చుకుని హైదరాబాద్ (కాకతీయ నగర్)లో స్థిరపడ్డాడు. పెద్దక్క నాగార్జున సాగర్‌‍లో విద్యాశాఖలో వివిధ హోదాల్లో పని చేస్తూ నాగార్జున సాగర్ (దక్షిణ విజయపురి) లో స్థిరపడింది. చిన్నన్నయ్య డా. మధుసూదన్ కానేటి (పి. హెచ్.డి) ఆకాశవాణిలో, అనౌన్సర్ ఉద్యోగం సంపాదించుకుని, విశాఖపట్నంలో స్థిరపడ్డాడు. చిన్నక్క భారతీ దేవి, రైల్వే శాఖలో ఉద్యోగం సంపాదించుకుని సికింద్రాబాద్ (సఫిల్ గూడ)లో స్థిరపడింది. నేను దంత వైద్యుడిగా మహబూబాబాద్ (ఇప్పుడు జిల్లా, అప్పుడు తాలూకా), జనగాం (అప్పుడు తాలూకా, ఇప్పుడు జిల్లా) కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పనిచేసి, హనుమకొండ (రామకృష్ణా కాలనీ)లో స్థిరపడ్డాను.

దిండి గ్రామంలో, స్వగృహంతో పాటు కొద్దీ సెంట్లు భూమి, తాతలనాటి భూమి కొద్దిగా ఉండేది. మా అమ్మ నాయన, ప్రభుత్వ బంజరు భూమి కొంత సంపాదించి, సాగు చేసి అవసరాలకు సరిపడ వరి ధాన్యం పండించేవారు. ఆ బంజరు భూమికి ప్రభుత్వ పట్టా వచ్చేసరికి మా నాయన, అమ్మ కూడా లేరు. అప్పుడు తెలివిగా కొందరు పెద్దలు బ్రతికి వున్న మా పెద్దమ్మ పేరు మీద ఆ పట్టా రాయించారు.

మా అమ్మ ఎప్పుడూ ‘వున్న భూమి అమ్ముకోకూడదు.. ఓపిక ఉంటే ఇంకా స్వస్థలంలోనే భూమి కొనుక్కోవాల’ని చెబుతుండేది. నేను మహబూబాబాద్‌లో పని చేస్తున్న సమయంలోనే మా అమ్మ వెంకమ్మ చనిపోయింది. నాయన ఎక్కడ ఉండాలన్నది ప్రశ్నార్థకమైంది. ఈ ఆధునిక సమాజంలో వృద్ధాప్యం వచ్చిన వారిని ఎవరు చూడగలరు? పైగా అందరూ వివిధ ప్రాంతాల్లో ఉద్యోగస్తులు మరి!

మా అమ్మ ఆఖరి లాంఛనాలు అన్నీ పూర్తి అయ్యాక పెద్దలందరూ కూర్చుని, నాయన గురించిన భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చించడం మొదలుపెట్టారు. అందులో కుటుంబ సభ్యులతో పాటు, అన్నయ్యలు అక్కయ్యలు, వారితో పాటు మా పెద్దన్నయ్య (మా పెదనాయన సత్తెయ్య గారి కుమారుడు, కానేటి కృష్ణమూర్తి -రాజమండ్రి ); చిన్నన్నయ్య (మా చిన్నాన్న కొడుకు అప్పారావు -దిండి); భగవాన్ దాస్ అన్న (మరో చిన్నాన్న కొడుకు -దిండి) తదితరులు వున్నారు. విషయం తేలడం లేదు.

మా నాయనను ఎవరు తీసుకెళ్లాలన్న విషయం ఓ పట్టాన ముగింపుకు రావడం లేదు. అందరూ ఆలోచనలో పడ్డారు, అంటే.. నా అన్నలు,అక్కలూనూ! ఎవరూ ఆయనను తీసుకువెళ్లి ఎక్కువ రోజులు ఉంచుకునే ఆలోచనలో లేరు. అప్పుడు ఇక నేను నోరు విప్పక తప్పలేదు.

“నాయనను నేను తీసుకు వెళతాను, నేను చూసుకుంటాను” అని చెప్పాను. నేను ఆ నిర్ణయం తీసుకుంటానని, నాకంటే పెద్దవాళ్ళు ఊహించలేదు. దానికి ప్రత్యేక కారణం ఏమిటంటే, అప్పుడు నా శ్రీమతి 8 నెలల గర్భవతి. నా నిర్ణయానికి అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు అక్కడవున్న పెద్దలందరూ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ఇంటికి ఆనుకుని వున్న స్థలంలో వున్న కొబ్బరి చెట్ల ద్వారా నెల నెలా వచ్చే ఆదాయం నాకే చెందాలని. దానికి ఎవరూ అడ్డు చెప్పలేదు. అలా అక్కడ వున్న కొద్దిపాటి ఆస్తి నా చేతుల్లోకి వచ్చింది. అంటే ఆ భూమి బాధ్యతలు కూడా నాకే అప్పగించారు. అక్కడ సాంబయ్య అనే వ్యక్తికి కౌలుకి ఇవ్వడం జరిగింది.

పెద్దన్నయ్య కె.కె.మీనన్ కుటుంబం

ఇక అక్కడి నుండి సమస్యలు ప్రారంభమైనాయి. అమ్మ, నాయన చనిపోయాక, పెద్దక్క, పెద్దన్న, చిన్నక్క వివిధ సమస్యలతో చనిపోవడం జరిగింది. ఇక చిన్నన్నయ్య మధు, నేను మిగిలాము. మా వదినగారు ఆస్తి పంపకం గురించి వివిధ మార్గాల్లో అల్లరి చేయడం, ఒత్తిడి తేవడం మొదలు పెట్టింది. నిజానికి అన్నయ్యకు ఆస్తిలో భాగం రాదు, కానీ మేము అసలు ఆ ఆలోచనే చేయలేదు. మేము ముగ్గురము అది అనుభవించాలనే అనుకున్నాము. మాలో లేని ఆలోచనకు ఆవిడ శ్రీకారం చుట్టింది. ఈ విషయం అవగాహన లేని పిల్లలకు అసలు విషయాలు చెప్పకుండా, మా పై చిలవలు పలవలు అల్లి, అప్పటివరకు వున్న వాళ్ళ మంచి మనసును కలుషితం చేసింది. తనకు రావలసిన భూమి తీసుకుని దానిని సొమ్ము చేసుకోవాలని ఆమె ఆలోచన. రకరకాల మార్గాలతో నన్ను మానసికంగా హింసించేసింది. నాకు, బి.పి, డయాబెటిస్ మొదలయ్యాయి, మానసికంగా క్రుంగిపోయాను. మా అన్నయ్యను దృష్టిలో ఉంచుకుని అన్నీ అనుభవించాను. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆ కొద్దీ భూమీ అమ్మడం నాకు ఇష్టం లేదు. అమ్మ మాటలు ప్రతి క్షణం చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అందుచేత, వాళ్ళు చెప్పిన ఎక్కువ ధర తోనే, వాళ్ళ భూమిని నేను కష్టపడి కొనుక్కోవలసి వచ్చింది. నేను పుట్టి పెరిగిన చోట నా కుటుంభం ఉనికి లేకుండా పోవడం నేను అసలు తట్టుకోలేను. చిన్నన్న సహకారంతో అనుకున్నది సాధించగలిగాను.

చిన్నన్నయ్య డా. కానేటి మధుసూదన్, విశాఖపట్నం

ఇదంతా ఎందుకంటే, మనం పుట్టి పెరిగి బ్రతికిన చోట మన ఉనికిని కోల్పోయే పరిస్థితిని మనమే కొని తెచ్చుకుంటున్నాం. మన జన్మ భూమిని మనం మరిచిపోతున్నాం. పల్లెలకు దూరమై పోతున్నాం.

ఇంతవరకూ ఇది నా ఆలోచన. నా తర్వాత నా పిల్లలు ఏమి చేస్తారనేది నేను రూఢిగా చెప్పలేను. కానీ నా పిల్లల పైన వాళ్ళ ఆలోచనలపైనా నాకు అపారమైన నమ్మకమూ – గౌరవమును.

ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి, కోటిపల్లి రైల్వే లైన్ పునద్ధరణలో భాగంగా, నా భూమిలో నుండి రైల్వే బ్రిడ్జి పోతున్నది. ఆ కొద్దిపాటి భూమిలో సగం పోయినట్టే! ఏమి చేస్తాం, మిగిలిందే మనది అనుకోవాలి మరి!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here