పగబట్టాడు

0
3

[dropcap]”ఒ[/dropcap]రేయ్ శుక్రాచార్యుడా ఇటురా” గట్టిగా అరిచాడు లెక్కల పంతులు.

క్లాసులో పిల్లలు అందరూ గొల్లున నవ్వారు. శుక్రాచార్యుడుగా పిలవబడే కేశవదాసు బిక్కచచ్చి నిలబడ్డాడు. అతడికి ఈ అవమానం కొత్తేమి కాదు. దుఃఖం వచ్చింది.

చెట్టు కింద పదవతరగతి క్లాస్ నడుస్తోంది. మొదటి పిరియడ్లోనే పరీక్ష పేపర్లు దిద్ది పిల్లలకు మార్కులు చెబుతున్నాడంటే క్లాస్ టీచర్ కూడా లెక్కల పంతులే. ఆయన చాలా ముదురు. యూనియన్ లీడర్ కూడా.

పక్కనే వరండాలో కూర్చుని ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు తయారు చేస్తున్నారు ఇద్దరు టీచర్లు.

అందులో ఒకామె “అదేంటి శుక్రాచార్యుడు అని పిలుస్తారు. నిజంగా ఆ పేరుతో విద్యార్థి ఉన్నాడా” అన్నది. ఆమె కొత్తగా వచ్చిన వసంత టీచర్.

“అవును వాడికి ఒక కన్ను కనిపించదు కదా, అందుకోసం అన్నమాట” హిందీ టీచర్ సమాధానం చెప్పింది.

“అయినా పిల్లలకు అటువంటి నిక్ నేమ్స్ పెట్టకూడదు కదా”

“ఔను, అవసరం ఉన్నా లేకున్నా కూడని పనులే ఎక్కువ జరుగుతాయి. తరగతి గదిలో, పాఠశాలల్లో, కుటుంబాల్లో, సమాజంలో ప్రతిచోట”

“సరే మిగిలినవి అంటే మన చేతిలో లేనివి. మనం టీచర్లం కదా, రేపటి తరానికి మార్గదర్శకులం. రేపటి తరాన్ని తీర్చిదిద్దే వాళ్ళం” అన్నది వసంత.

“ఎవరూ మనమా? తరగతి గదిలో నిద్రపోతూ, స్టాఫ్ రూముల్లో క్యారం బోర్డు ఆడుతూ, గంట మోగకముందే పదినిమిషాలు ఉండగానే బయటకు వచ్చి సిగరెట్ కాల్చి, ఆడపిల్లల శరీరాలని తాకుతూ కొందరు. తాకాలని కోరిక ఉండి ధైర్యం చాలక ఏదో వంకతో వారి వీపుల మీద చరుస్తూ కసి తీర్చుకునే మనం టీచర్లం. రేపటి తరానికి మార్గదర్శకులం. వద్దండి బాబు ఈ చర్చ కడుపు మసిలి పోతుంది” హిందీ టీచర్ ఆవేశపడింది.

“కూల్ కూల్. మీరన్నవేవి నేను చెయ్యను. ఇంతగా ఆవేదన పడుతున్న మీరూ చేయరనే నమ్ముతున్నా. అంటే అందరూ టీచర్లు అట్లా లేరు అనే కదా?” వసంత టీచర్ ప్రశ్న.

“మనం చెయ్యం సరే చేసే వాళ్ళను ఆపలేము కదా?”

“అదంత నాకు తెలియదు ఆ విద్యార్థిని అలా పిలవకూడదని నేను చెప్తాను” అన్నది నిశ్చయంగా వసంత టీచర్

“ఎవరికి చెప్తారు”

“అదే రామకృష్ణ సార్‌కు చెప్తాను, దివ్యాంగులను అవమానపరిచే హక్కు మనకు లేదు”

“ఆయనకు ఇరవై ఏళ్ల సర్వీసు పూర్తయింది, అందరికంటే సీనియర్. ఆయనకు మీరు చెప్తే బాగుంటుందా”

“బాగుంటుందో లేదో నాకు తెలీదు. ఆ విద్యార్థిని అలా పిలవడం బాగాలేదు. నాకు నచ్చలేదని చెప్తా”

ఇంతలో గంట మోగింది. పేపర్ల కట్ట పట్టుకొని రామకృష్ణ సారు బయటకు వస్తున్నారు.

హిందీ టీచర్ ఆపుతున్న వినకుండా వసంత టీచర్ ముందుకు నడిచింది.

“సార్ నమస్కారం. మీ క్లాస్‌లో పిల్లలకు మార్కులు ఇచ్చినట్టున్నారు కదా?”

“అవునండి. యాబై మంది ఉన్న క్లాస్‌లో పది మంది పాసయ్యారు”

“మీ కోపం మాకు కూడా వినిపించింది. అందుకే మీకో విషయం చెబుదామనిపించింది సార్” అన్నది వసంత.

“ఏంటి లెక్కలు ఎలా చెప్పాలో నాకు చెప్తారా ఏంటి కొంపతీసి” అంటూ పగలబడి నవ్వాడు రామకృష్ణ.

“నేను కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన దానిని. మీకు నేను ఎలా చెప్పగలను. కానీ ఒక సలహా ఇద్దామని, మీకు తెలియని విషయం కాదూ. వాడి పేరేంటి కేశవదాసు, ఒక కన్ను గాజుకన్ను ఉంటుంది కదా, ఆ పిల్లవాడిని శుక్రాచార్యుడు అని పిలవడం బాగాలేదు. పాపం మిగిలిన పిల్లలంతా గొల్లున నవ్వారు మీ ముందే. వాడిని ఎంత వెక్కిరిస్తారు. టీచర్లం మనమే పిలిస్తే  వాడికెంత అవమానం బాధ కలుగుతుందో ఆలోచించండి సార్” అన్నది వసంత నిలదీస్తున్నట్టు.

“చూడమ్మా, నీకు ఉద్యోగం వచ్చింది పిల్లలకు పాఠాలు చెప్పడానికి. పంతుళ్ళకు పాఠాలు చెప్పడానికి కాదు. మీ పని మీరు చూసుకోండి” అంటూ విసవిస వెళ్ళిపోయాడు.

ముందేమో ఎంతో ప్రేమగా అభిమానంగా మాట్లాడాడు. తనంతట తాను వచ్చి ఒక కొత్త పంతులమ్మ పలకరించినందుకు గర్వంగా ఛాతి విరుచుకున్నాడు కూడా ఆ పంతులు.

తర్వాత కోపంగా వెళ్ళిపోయాడు.

ఇదంతా చూస్తున్న హిందీ టీచర్ వసంత టీచర్ దగ్గరకొచ్చి, “వద్దు వసంతా లేనిపోని గొడవల్లో తలదూర్చకు. కొత్త సమస్యలు వస్తాయి” అన్నది.

మౌనంగా ఉండి పోయింది, ఏ సమాధానం చెప్పలేదు వసంత.

***

“ఏమయిందమ్మా ఎట్లా జరిగింది?”

“ఏమి చెప్పుదును పంతులమ్మా! భగవంతుడు పగబట్టిండు. పుట్టిన సంది సతాయిస్తాండు”

“ఎవరు సతాయిస్తాన్రు”

“ఇంకెవరు వాళ్ళ నాయిన. దేవుడు పగబట్టిండు”

“అమ్మా సరిగ చెప్పనిది నాకు ఎట్ల అర్థమవుతది”

“ఏం చెప్పను తల్లి. మగపిల్లగాడు కావాలని, నలుగురు ఆడపిల్లలను కన్నడు ఆడి అయ్య. చివరాకరికి పుట్టిన ఈ మొగనలుసుకు పురిట్లనే కంట్లె ఒక నర్స్ చేతుల కత్తెర తగిలి, కన్ను కారిపోయింది. గుడ్డి నాకొడుకు నాకొద్దని తల్లిని కొట్టి అమ్మగారింటికి తరిమి, మల్ల పెల్లి చేసుకుండు వాడి తండ్రి”

“మీరెవరు చెప్పలేదా? అట్ల చెయ్యొద్దని”

“మాబాగ చెప్పినం, అందరం చెప్పినం. ఇంటాడు వాడు మొగోడు కదా కంత్రి నాకొడుకు”

“పంచాయతీ కూసోపెట్టి కేశవదాసు అమ్మమ్మ తాత మేనమామ కలిసి తల్లి నలుగురు ఆడపిల్లలని పంపిన్రు వానయ్యకాడికి. కేశవదాసు నెలెల్లని పసికూన వాళ్ళమ్మమ్మ దగ్గర్నే ఉంచుకుంది. ఆ పాపాష్టి తండ్రి అట్ల షరతు పెట్టిండు” ముసలమ్మ చెప్పింది.

“ఇంతకు ఏమయితడు నీకతను” వసంతకు విచిత్రంగా ఉంది అంతా.

“కేశవదాసు నా అక్క మనవడు” అన్నది ముసలమ్మ.

“మరి నీ దగ్గరెందుకున్నడు, వాళ్ళమ్మమ్మ దగ్గరుండాలె కదా” హిందీ టీచర్ సందేహం.

“మొగడు మల్ల పెళ్ళి చేసుకున్నా, కొడుకును తల్లి దగ్గర వదలి, తల్లి నలుగురు ఆడపోర్లు ఆడికి పోయిన్రు అని చెప్పిన్నా. వంటండుకునే సుట్టుగుడిసెల పండుకునేదట. కొత్త పెండ్లతోటి వాడు కంపెనీ ఇచ్చిన క్వార్టర్ల పండేదట. వారం దిరగకుండనే సుట్టుగుడెసెకు అద్దం రేత్రి నిప్పంటుకున్నది. అండ్ల పండిన తల్లి పిల్లలు అందరు కాలి సచ్చిన్రు” ముసలమ్మ దయ్యం కథ చెప్పినట్టు చెప్తోంది.

“అయ్యో ఎట్ల కాలింది గుడిసె” చిన్నపిల్లలా అడిగింది వసంత.

“మాయ జరుగుతదట్ల. మొగోడు ఎట్ల తలుసుకుంటే దేవుడట్ల చేస్తడు. బయట తలుపు గడిపెట్టి నిప్పంటించిండు, వదిలిచ్చుకోను” కోపంతో బుసకొడతాంది జీవన తత్వం చెప్తూ ముసలమ్మ.

“తర్వాత ఏమి జరిగింది” వసంత టీచరు భయంగా అడిగింది.

“వీనయ్యను నాయినమ్మను జైల్ల పెట్టిన్రు పోలీసోళ్ళు. వాల్లమ్మ కాళ్ళు పట్టుకొని బతింలాడిండట. మారిపోయినమ్మా కొడుకును సక్కగ సూసుకుంటనని ఒట్టేసిండట వీనయ్య. నీ వల్లనే నా పెండ్లం పిల్లలు సచ్చిన్రని ఒప్పుకుంటే. లాయర్ నన్నిడిపిస్తడటని ఏడ్చిండట. మా అక్క కుక్క పేగుల్ది కొడుకును నమ్మింది. మనవనికన్నా మంచి జరుగుద్దనుకుంది. కేసు మీదేసుకొని జైల్ల కూసుంది. తల్లులం కదా నమ్ముతం కొడుకుల్ని” ముసలమ్మ గొంతులో నిరసన.

“మరి వీళ్ళ నాన్న” ఆసక్తి ఆత్రుత కలిసిన గొంతుతో వసంత.

“కుక్క తోక వంకర బుద్ది బాడ్కావుది. బయటికొచ్చి కొడుకును పట్టిచ్చుకోలే, ఇన్నొద్దులు ఆడి అమ్మమ్మ దగ్గర పెరిగిండు. కారిపోయిన కన్నుకు సీసం గుడ్డును కూడా వాళ్ళమ్మమ్మ వేయించింది కూరగాయలు అమ్ముకుంట. నా కంటే మా అక్క కంటే పెద్దీడు ముసల్ది. ఈ మద్దెనే రెణ్ణెల్లయింది చచ్చిపోయింది. హాస్టల్ బందుచేసిన్రని మేనమామ కాడికి పోయిండట కేశవదాసు. ఆడు మంచోడే ఆడి పెళ్ళాం వద్దన్నదట. కరోనా కా‌లంల వీడెందుకు గుదిబండ అంటాంటే ఇని నా దగ్గరికొచ్చిండు” మంచి చెడులను బేరీజు వేస్తూ చెప్పింది ముసలమ్మ.

“ఎక్కడుంటరు వాళ్ళంతా, కరోనా లాక్‌డౌన్ కదా ఎట్ల పోయిండు వాళ్ళ దగ్గరికీ” వసంతకన్నీ సందేహాలే.

“తండ్రి కొత్తగూడెం, మేనమామ గొల్లగూడెం పది, పదిహేను మైళ్ళు నడిచే పోయొచ్చిండు” ముసలమ్మ నీరసంగా చెప్పింది.

“మరేం జరిగింది” మళ్ళీ అసలు విషయానికి వచ్చింది వసంత.

“వీడికి లెక్కలు చెప్పే పంతులు వీణ్ణి ఎక్కరిచ్చేదట గుడ్డోడని అందుకని ఆయన కలాసు ఎగ్గొట్టేదట. ఆయన ఆజరెయ్యలేదట” తెలిసింది చెప్పింది ముసలమ్మ.

“అయితేమయింది హాజరు సమస్యే లేదు కదా బళ్ళల్ల” వసంత గొంతు పెరిగింది.

“అట్లంటవేందమ్మా మోడీ సారు జిల్లాల్ల పరిచ్చలు పెట్టున్రి, హైదరాబాద్ల వద్దు క‌రోనా ఎక్కువ ఉన్నదన్నడట. మన సి.ఎమ్. సార్ అట్ల కుదరది పరీచ్చలే లేవు, బళ్ళేసిన మార్కులబట్టి అందరు పాసన్నడట. లెక్కల పంతులు చేతుల కేశవదాసు బతుకు పటం మిగిలింది” ముసలమ్మ కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది ఏడుస్తూ.

ఆమె దుఃఖం ఆపుకోలేక ఆగి మళ్ళీ “మొన్ననే తండ్రిని చూడనీకి పొయ్యిండు. సవితి తల్లి తీస్తన్నా పాపిష్టోడు తలుపే తియ్యనియ్య లేదట. కిటికిలకెల్లి సూస్తన్న ఇనిపిచ్చుకోలేదట. ఇంటికొచ్చి గొల్లునేడ్చిండు. శాన సేపు సముదాయించిన. బువ్వ తినలే. తినబుద్ది కాట్లేదన్నడు” చెప్పలేక ఆగిపోయింది.

ఎవరో నడివయసామె చెంబుతో మంచినీళ్ళు తెచ్చి ఆమెకు చేతికందే దూరంల పెట్టి పోయింది. ఆమె మూతికున్న మాస్క్ కొద్దిగా జరిపి, దూరం నిలబడి “నీళ్ళు తాగే. కన్న తండ్రికే పట్టిలేదు. నీకెందుకే అవ్వ ‘ఎవనికి పుట్టిన బిడ్డ ఎక్కెక్కి పడి ఏడ్వా’ అన్నట్టు” అన్నది.

“ఊకో బిడ్డా అట్లనకు, మనం తల్లులం కదా కనకుంటేంది మన బిడ్డే కదా” అన్నది ముసలమ్మ.

“ఆం ఆం మన బిడ్డే వాని మీద నాకేం కోపం. వానయ్య చెయ్యబట్టి తల్లీ, నలుగురు పిల్లలు సచ్చిరి, వాని తల్లిని నమ్మిచ్చి జైలు పాలు జేసే. కొడుకు సావుకు వాడే కారణం. ఈ మాయదారి రోగం కాలంల పోరనికి ధైర్యం చెప్పెటోడే లేకపాయే” అన్నది నడివయసామె.

“నా బిడ్డె పంతులమ్మా. కేశవదాసంటే దానికి పావురమే. ఇగో ఈ జామచెట్టు కిందనే కూసునెటోడు. దానికే ఏలాడ బడ్డడు. ఎప్పుడు పొయిందో ఉసురు. కుక్క మొరుగుతాంటే లేసి చూసినం. వాడి నాయనొక్కడేనా వాడి పంతులు కూడ అసుంటోడే దొరికె అందుకే దేవుడు పగపట్టిండంటన్న నా మనవని మీద” అన్నది ఏడుస్తూ ముసలిది.

“బడుంటే దోస్తులు ధైర్యం చెప్పెటోళ్ళు, మిగిలిన పంతుళ్ళు కూడా ఏదో ఒక మంచి మాట చెపుదురు. మాయదారి రోగం చెయ్యబట్టి నా మనవడిలాంటోళ్ళు ఎందరు గుండె పగుల్తాన్రో” అని ముక్కు తూడ్చుకుంది.

వసంత వచ్చిందే అందుకు. ముసలమ్మ మనవడి చావుకు లెక్కల పంతులు పేరుపెడుతుందాని, కనుక్కుని ఆయనను బయట పడేసే ప్రయత్నం చేసేందుకు. ఉపాధ్యాయ సంఘం మేల్కొని హెచ్చెమ్‌తో పావు కదిపారు. హెచ్చెమ్‌తో వసంతకు చెప్పించి పంపారు. వసంత టీచర్‌కు ఈ మతలబులన్నీ తెలవవు. హక్కుల అవగాహన కలిగించడమే తప్ప.

“కొత్తగా ఉద్యోగంలోకొచ్చారు. మీరయితే చక్కగా మాట్లాడుతారు. ఒకసారి వెళ్ళిరండి, మీకు అనుభవం వస్తది. మీరు కొత్తగా వచ్చినా విద్యార్థులకు మీరంటే చాలా ప్రేమ కూడా” అన్నాడు ఫోన్లో హెచ్చెమ్.

వసంత హిందీ టీచర్‌ను తోడు తీసుకొని వచ్చింది. ఆమె ఉత్తమ శ్రోత వలె ఒక్కమాట మాట్లాడకుండా నిశ్శబ్దంగా అంతా వింటూ ఉన్నది.

వసంత ధైర్యం చేసి “రేపు పోలీసులు కాని మరెవరన్నా వచ్చి నీ మనమడు ఎట్లా చనిపోయాడని అడుగుతే ఏమి చెప్తావు” అన్నది కుతూహలంగా. రామకృష్ణ వంటి పంతుళ్ళకు శిక్షపడితే పాఠం నేర్చుకుంటారని ఆమె ఆశ.

“ఏం చెప్పమంటరు” అన్నది ముసలమ్మ బిడ్డ.

ఉలిక్కిపడ్డది వసంత. ఇబ్బందిగా కదిలింది.

“ఏమున్నదమ్మా, మాయదారి కరోనాకు బయపడి, గుండెపగిలి ఉరేసుకున్నడు. ఎవరినో బద్నాం చేసుడెందుకు? భగంతుడే పగపట్టిండు” అన్నది ముసలమ్మ జీవనతత్వం బోధిస్తున్నట్టు.

అన్ని నిందలు మోసేందుకు భగవంతుడున్నాడు. అందరి స్వార్దాలు నేరాలు పాపాలు భగవంతుని ఖాతాలో పడతాయి. కొత్త వాటికి తెరలు లేస్తాయి. భగవంతుడొక వ్యాపార వస్తువు, ఒక ముసుగు, ఒక బ్రహ్మ పదార్థం. కరోనా వలె సర్వాంతర్యామి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here