[dropcap]ప్రా[/dropcap]థమిక హక్కులు రెండు రకాలు – భావ వ్యక్తీకరణ, సభలు నిర్వహించుకునే స్వాతంత్ర్యం.
ఇవి పౌరులకు నేరుగా రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు. ఎట్టి పరిస్థితులలోనూ ప్రభుత్వం అవరోధాలకు గురి కాకుండా ఈ హక్కులు పౌరులకు రక్షణ కల్పిస్తున్నాయి. ప్రభుత్వం ఈ హక్కులను గౌరవిస్తే చాలు. భారత రాజ్యాంగంలో 12 నుండి 35వ అధికరణ వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి.
సమానత్వం, విద్యాహక్కు వంటివి అమలయ్యేలా చూసే బాధ్యత ప్రభుత్వానిది. ఈ హక్కులను అమలయ్యేలా చూడగలగడానికై ప్రభుత్వానికి రాజ్యాంగంలోని 16,4, 4d క్లాజులు అధికారాన్ని కల్పిస్తున్నాయి. పై రెండు హక్కులు సక్రమంగా అమలుకాగల వాతావరణం (సామాజిక/ఆర్థిక) సృష్టించడం కాని నెలకొల్పడం గాని ప్రభుత్వం విధి.
ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించడంలో శాసనాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, నిరసన వ్యక్తం చేయడం వంటివి కూడా వస్తాయి. ఈ విధానాలు శాసనాలలోని లొసుగులనుగాని, అసంబద్ధతలను గాని సరిదిద్దుకొనేటందుకు దారిచూపిస్తాయి. ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యానికి వన్నె తేగల ప్రక్రియలు. జస్టిస్ వై.వి. చంద్రచూడ్ అభిప్రాయంలో భావవ్యక్తీకరణ హక్కు ప్రజాస్వామ్య పరిరక్షణకు సేఫ్టీవాల్వ్ లాంటిది.
ఆర్టికల్ 29 తమ ప్రత్యేకమైన భాష, లిపి, సంస్కృతులను రక్షించుకొనే ఆధికారాన్ని అల్పసంఖ్యాక వర్గాలకు కల్పిస్తోంది. తమ సంస్కృతిని, భాషను కాపాడుకొనే ప్రక్రియలో భాగంగా విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేసుకోవటం, వాటిని నిర్వహించుకోవటం, అందులకై స్థిరచరాస్థులను సంపాదించుకోవడం వంటి హక్కును ఆర్టికల్ 30 ప్రసాదిస్తోంది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రాథమిక పరిరక్షణ కర్త. వీటికి సంబంధించిన ప్రత్యేక, ప్రధాన, ప్రాథమిక విచారణలన్నీ సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంటాయి. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలను జారీ చేసే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది. అలా జారీ చేయబడిన ఆదేశాల ప్రకారం లభించే హక్కులను ‘రెమెడియల్ రైట్స్’ గా పేర్కొంటారు. రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల పరిరక్షణలో హైకోర్టుకూ అధికారం ఉంటుంది. కాని సర్వోన్నత న్యాయస్థానం వలె ప్రత్యేక అధికారాలు ఉండవు. సర్వోన్నత, ఉన్నత న్యాయ స్థానాలు రెండింటికీ ప్రాథమిక హక్కుల పరిరక్షణలో ఉమ్మడి పరిధి ఉంటుంది.
అయితే ఏ సమజంలోనైనా పౌరులకు కొన్ని బాధ్యతలు సైతం ఉంటాయి. మరొకరి స్వేచ్ఛకు గాని, ప్రయోజనాలకు గాని భంగం కలిగించనంత వరకు మాత్రమే ఏ హక్కులకైనా మన్నన. ఎదుటివారి హక్కులను సైతం మన్నించడం ద్వారానే ఏ హక్కుకైనా మన్నన, లేదా గౌరవం లభిస్తుంది. విశేషించి పౌర సమాజాలలో పౌరుల బాధ్యాతాయుతమైన నడవడి ద్వారానే ఆ సంతులనం సాధ్యం.